జాతీయ వార్తలు

మోదీజీ.. ఇప్పుడేమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ పాకిస్తాన్ పర్యటన వల్ల ఫలితం శూన్యం పఠాన్‌కోట్ ఘటనపై ప్రధానిని నిలదీసిన కాంగ్రెస్

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 2: పాకిస్తాన్‌లో ఆకస్మిక పర్యటన చేసి నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపి భుజాలు ఎగరవేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడికి ఏం జవాబు చెబుతారని కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా శనివారం విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపినా, పాకిస్తాన్ గూడచార సంస్థ ఐఎస్‌ఐ మాత్రం ఇస్లామిక్ తీవ్రవాదులతో సీమాంతర ఉగ్రవాదం కొనసాగిస్తోందనేది ఇప్పుడు మరోసారి స్పష్టమైందన్నారు. ఉగ్రవాదులు ఐదారు నెలల నుండి పంజాబ్‌పై గురిపట్టినా ఎన్‌డిఏ ప్రభుత్వం మాత్రం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు. బాంబు పేలుళ్లు, తుపాకి మోతలో శాంతి చర్చలు జరపటం సాధ్యం కాదని చెప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడేమంటారని సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపివచ్చిన ఆరేడు రోజుల్లోనే తీవ్రవాదులు దాడిచేయటం ఏమిటని సుర్జేవాలా ప్రశ్నించారు. నరేంద్ర మోదీ లాహోర్ పర్యటన వలన తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదనేది పఠాన్‌కోట్ దాడి స్పష్టం చేస్తోందని అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాదుల క్యాంపులు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. మన గూఢచార సంస్థలు తీవ్రవాదుల దాడి విషయంలో సాధారణ హెచ్చరికలు చేస్తున్నాయే తప్ప స్పష్టమైన దాడి సంకేతాలను ఇవ్వటం లేదని సుర్జేవాలా విమర్శించారు. నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరించటంలో విఫలమవుతున్నందుకే పఠాన్‌కోట్ లాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తీవ్రవాదుల దాడి సంఘటనలు రాజకీయం చేయటం కాంగ్రెస్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు కానీ ప్రమాదకర పరిస్థితులను చూస్తుంటే ఎన్‌డిఏ ప్రభుత్వం అవసరమైన మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవటం లేదనేది స్పష్టమవుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అంతర్గత భద్రతను మరోసారి సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పొరుగు దేశాలతో చర్చలు జరపటం అవసరమే కానీ ఒకవైపు చర్చలు జరుపుతూ మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయటం సాధ్యం కాదనేది గ్రహించాలని సుర్జేవాలా సూచించారు. పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నా శాంతి చర్చలు జరపటం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేసేందుకు నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుండి కొనసాగుతున్న కాల్పుల ఉల్లంఘనపై దేశ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్‌డిఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.