నెల్లూరు

‘శిక్ష’ణ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలారం 4 గంటలకు మ్రోగగానే ప్రసాద్ ఆ సౌండ్‌ని వెంటనే ఆపి పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు.
ఒకప్రక్క చదువుతూనే నేలమీద దీనంగా పడుకున్న తల్లిదండ్రుల వైపు చూశాడు.
అరిగిపోయిన కాళ్లు, వాచిపోయిన చేతులు చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ‘నేను బాగా చదవాలి.. నేను బాగా చదవాలి’ అని పాజిటివ్‌గా అనుకుంటూ బ్యాంకు ఉద్యోగం సంపాదించి మా వాళ్లకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని అనుకున్నాడు.
ఈపాటికి పక్కింట్లో పేపర్ వచ్చేసి ఉంటుంది. ఉద్యోగ నియామకాలు ఏమైనా పడ్డాయేమో చూడాలి అని అనుకుని మెల్లగా తలుపు తీశాడు. ఎందుకంటే శబ్దం వస్తే రోజంతా కష్టపడి కూలిపనిచేసి విశ్రాంతి తీసుకునే శరీరానికి అదొక చిరాకుగా అన్పిస్తుందని ప్రసాద్ అలా ఆలోచించేవాడు.
ప్రసాద్ పక్కింటి ముందు వేసిన పేపర్‌ను తీసి చూశాడు. ఏ ఉద్యోగ నియామక ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందాడు. పేపర్‌లో అక్కడక్కడ వేసిన నాలెడ్జి బిట్స్ చదివాడు. ఆతర్వాత అక్కడున్న చిన్న వార్తను చూసి పెద్ద సంతోషం పడ్డాడు. ఆ వార్త సారాంశం ఏమిటంటే...
పేద యువతకు బ్యాంక్ కోచింగ్‌లో ఉచిత శిక్షణ, ఎంపికైన వారికి పుస్తకాలు ఉచితంతో పాటు భోజనం కూడా సదుపాయం చేయబడును. అని ఉండడంతో ప్రసాద్ మరోసారి అడ్రస్ చదివి పేపర్ నలగకుండా అక్కడే పెట్టేసి ఇంటికి వెళ్లాడు.
అప్పటికే ప్రసాద్ తల్లి జయమ్మ లేచి ఉండడంతో ‘అమ్మా నువ్వు బ్యాంక్ పరీక్ష కోసం నాకోసం పుస్తకాలు కొననవసరం లేదు. ఓ స్వచ్ఛంద సంస్థవారు నాలాంటి పేద విద్యార్థులు ఎందరికో ఉచితంగా శిక్షణతోపాటు పుస్తకాలు కూడా ఇస్తారంటా, భోజనం కూడా పెడతారంటా’
‘తెల్లారే ఎంత తియ్యటి వార్త చెప్పావు. భగవంతుడు మనలాంటి వారి బాధలు అర్థంచేసుకొని ఆ సంస్థను ఏర్పాటుచేయించినట్లున్నాడు’
‘అవునమ్మా’ అంటూ స్నానానికి బయలుదేరాడు. ఆతర్వాత సర్ట్ఫికెట్లు అన్నీ బ్యాగ్‌లో పెట్టుకొని ఆ సంస్థ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడికి చాలామంది యువత చేరుకోవడంతో ఆప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. అధికారులు వెంటనే స్పందించి ఎక్కువ మార్కులు వచ్చిన వారికే ప్రాధాన్యత అని చెప్పగానే సగంపైగా జనం వెనక్కితిరిగి వెళ్లిపోయారు. ప్రసాద్ ధైర్యంగా ఉన్నాడు. అన్నింట్లోనూ డెబ్బై శాతం పైగా మార్కులు ఉండడంతో నాకు తప్పకుండా శిక్షణ ఉచితం అవుతుంది అని ఊహించాడు.
ఓ గంట తర్వాత ఆ అధికారులకు ప్రసాద్ తన ఫైల్స్ చూపించాడు. మార్క్స్ చాలా బాగా వచ్చాయి ‘కానీ’...
కానీ ఏంటో అర్థంకాలేదు ప్రసాద్‌కి
ఈ సంస్థ కేవలం పేదింటి, వెనుకబడిన తరగతి కులస్థులకే తప్ప మీలాంటి పెద్దింటి కులస్థులకు కాదు అని చెప్పడంతో ప్రసాద్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
‘సార్ మేము చాలా నిరుపేదవాళ్లము’ అని చెప్పినా అధికారులు వినలేదు. చేసేదిలేక ‘కులాలు చూసి పేద, ధనిక ఎలా భావిస్తారు అని మనస్సులో అనుకుని ఇది శిక్షణ సంస్థ కాదు.. మా బతుకులపై ‘శిక్ష’ వేసే సంస్థ అని భావించి అక్కడినుండి నిష్క్రమించాడు కాళ్లు ఈడ్చుకుంటూ ఇంటికి కన్నీళ్లతో..!

- నల్లపాటి సురేంద్ర
9490792553

స్పందన

చదువు-సంధ్య బాగుంది
గతవారం మెరుపులో కటారి రామయ్య గారు రాసిన కథ చదువు-సంధ్య చాలా బాగుంది. అందరికీ చక్కగా అర్ధమయ్యే విధంగా కథను సూటిగా వివరించారు. బాగా చదువుకున్న అమ్మాయి సంధ్య, పది వరకు చదివిన అబ్బాయిని వివాహం చేసుకోవడం.. అనంతరం చోటుచేసుకున్న పరిస్థితులను చక్కగా వివరించారు. భర్తకు చదువులేకపోయినా పర్వాలేదు కాని మంచి గుణం వుండాలి అనే సందేశంతో కథను మలిచిన విధం బాగుంది. నిజంగా ఈ విషయాన్ని గ్రహించలేక ఎంతోమంది ఆడపిల్లలు తాము బాగా చదువుకున్నామనే భావంతో భర్తలను తక్కువుగా చూడడం మంచిది కాదు. భర్తలోని సద్గుణాలను ప్రేమించి చక్కగా జీవితాన్ని మలచుకోవడం ఉత్తమం.
- పీలేరు శైలజ, తిరుపతి
- అనంతరామయ్య, నెల్లూరు
తోటమాలి, కబోర్డ్స్ కవితలు నచ్చాయి
గతవారం మెరుపులో ప్రచురించిన తోటమాలి, కబోర్డ్స్ రెండు కవితలు చాలా మంచి సందేశాన్ని అందించాయి. తోటమాలి కవితలో తోటమాలిని, విధితో పోల్చిన రచయితకు అభినందనలు. కబోర్డ్స్ కవిత కూడా మంచి అర్థాన్ని ఇచ్చింది. సమాజంలో మనుషులు ఎలా ఉంటారో రెండు ముక్కల్లో చెప్పేశారు రచయిత్రి. చిరుకవితల్లో గొప్ప సందేశాన్ని పొందుపర్చిన రచయిత గంగిశెట్టి శివకుమార్, రేవతి గార్లకు మా అభినందనలు.
- తిప్పావర్జుల దీపిక, నెల్లూరు
దేవతకు ప్రతిరూపం కవిత బాగుంది
గతవారం మెరుపులో ప్రచురించిన దేవతకు ప్రతిరూపం కవిత చాలా బాగుంది. గొప్పకవితను అందించిన రచయిత కాశీవిశ్వనాధం గారికి ధన్యవాదములు. కవితలో వాడిన ప్రతిపదం స్ర్తిమూర్తి గొప్పతనాన్ని చాటింది. ఏమిచ్చినా మనం వారి రుణం తీర్చుకోలేం.
- హేమలత, నాయుడుపేట

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కవితలు

మా ఊరి పెన్నమ్మ తల్లి
ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో
నాకయితే సరిగా తెలియదుగానీ
మా ఊరి ‘శివయ్య’ నెత్తినొచ్చి ఆగింది
మనుషులంతా అహోరాత్రులు శ్రమించి
గొప్ప ఆనకట్ట కట్టారు పనె్నండు ద్వారాలు పెట్టి
శాంతించి..కనికరించి..శివయ్య మాటవిని
ఇక్కడే..కాస్త నవ్వుతూ ఆగింది

నిదానంగా కదుల్తూ రమ్యంగా ఊగుతూ
ప్రవహిస్తూ పోతోంది మా ఊరి ‘పెన్నమ్మతల్లి’
పెన్నానది గుండె ఒడ్డునే మా ఇల్లు
నే తలుపు తెరచి వాకిట్లో నిలబడితే
బండిచక్రమంత బొట్టుబిళ్లతో
కొండలనడుమ నీలిరంగుచీరతో
హాయిగా నవ్వుతూ నిదురలేచి పలకరిస్తుంది
మా ఊరివాళ్లంతా పెన్నమ్మని చూసి మొక్కందే
ఏ పని మొదలు పెట్టరంటే నమ్మండి
పెన్నమ్మంటే మాకు భలే ప్రేమ

ఓసారి...
ఎప్పుడో చానా ఏళ్లనాడు
నేను మా అమ్మకడుపునుండగా
ఆగ్రహించిందంట..
అందరూ తట్టాబుట్టా సర్ది
శివయ్య నెత్తినుండే కొండమీదకి చేరారు
రెండురోజులకి పెన్నమ్మ కోపం తగ్గాక
పోలోమని మళ్లా ఇళ్లకి చేరారు
ఎవరూ ఆయమ్మని నిందించలేదు
మీకు తెలీదా.. తల్లి కోపం ఎంతసేపు
పాలపొంగుమీద నీళ్లు చల్లినట్లు అంతేకదా

ఎన్నో కుటుంబాల్ని అక్కున చేర్చుకుని
మరెన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ ఉంది
ఎక్కడెక్కడి నుంచో పొరుగురాష్ట్రాల నుంచి
చేపలవేటకి వచ్చినోళ్లని అక్కునజేర్చుకుని
ఇంత సంపదని వాళ్ల చేతుల్లో పెట్టి
బతకమని బుజ్జగించి
వాళ్ల కడుపులు నింపి ఆనందపడ్తుంది
అందుకే ఆ తల్లికి గంగపూజని
పెన్నమ్మ పొంగళ్లని పెట్టి
చేటల నిండా గాజులూ పసుపుకుంకుమ పెడ్తుంటాం

లక్షల ఎకరాల దాహర్తిని తీర్చి
నాగలపట్టి దున్నిన ప్రతీరైతు
గుండెనిండా ఆనందాన్నిచ్చి
వాళ్లకంచాల్లో గుప్పెడు మెతుకుల్నిపెట్టి
బతకండర్రా!
నేనున్నంతకాలం మీకేం భయంలేదు
అని ‘మల్లింకొండంత’ భరోసానిచ్చింది

ఇప్పుడెందుకనో ఎండిన పెన్నమ్మతల్లిని చూస్తే
మనసంతా ఏదోలా అయిపోతుంది
దిక్కుతోచని పయనంతో ప్రవహించలేక
అసహాయంగా నడుస్తూ ఉంది
రైతన్నల ఆర్తనాదాల్ని వింటూ కూడా
పలకరించకుండానే పల్లెల్ని మర్చిపోయి
పట్టెడన్నం పంచలేక పలకలేని స్థితిలో
పరిగెట్టడం మర్చిపోయింది

ఇసుక మాఫియాలు కుమ్మక్కై
దేహాన్ని రాబందుల్లా కబళించి
తవ్వుకుపోతున్నా కూడా
తన బిడ్డలే కదా అని
మనసు చంపుకుని బతికిపోతూ ఉంది

మనం బాధ్యతలు మరిచిన బిడ్డలం కదా
తల్లి బాధ మనకెలా తెలుస్తుంది
ఇప్పటికైనా బతుకులోంచి రహస్యంగా
తప్పిపోతున్న ఇలాంటి తల్లుల్ని కాపాడుకుందా..!

- షారోన్ బేగం
సోమశిల,
చరవాణి : 8985963150

కవిత
నీవు నీలో భావకుడితో
భావావేశంలో సమస్య అనే శత్రువుపై
పదాలతో చేసే యుద్ధమే కవిత్వమంటే
అగ్గిపెట్టెలో పెట్టిన పుల్లలా
రగిల్చినప్పుడు వచ్చిన జ్వాల కవిత్వమంటే
నీలో పట్టం కట్టిన పదనిఘంటువును అడిగి అడిగి
మరి మరి కడిగి కడిగి
సానబెట్టి తీసిన వజ్రం మెరుపులా
కాల్చికాల్చి పూసిన కనకపు పుష్పంలా
మొలుస్తుందిలే నీ కవిత
డాలి గొర్రెపిల్లను చూసి మేకపిల్ల
ఫారం కోడి పిల్లను చూసి నాటుకోడి
టెస్ట్‌ట్యూబ్ బేబిని చూసి బెదిరిపోతే ఎలా?
మరయంత్ర మంత్రాలతో అవి
మాంసపు ముద్ద మమకారంతో నీవు
సమాజ శ్రేయస్సుకు శ్రీకారం చుట్టు
నీ కలం
నీ గళం
కవితే నీ బలం
దాహం తీర్చే జలం

- అందే శ్రీనివాసులు, నెల్లూరు
చరవాణి : 9502622577

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర 9490792553