రాజమండ్రి

జాబిల్లి పిలిచింది (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండు చంద్రుడు వెలిగిపోతున్నాడు. ధవళ వస్త్రం ధరించినట్టు ధరణి సొగసులు పోతుంది. చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తున్న చంద్రుణ్ణి చూసి చాలా కాలమైంది. నగరానికి వచ్చి ఐదేళ్లు అయిపోయింది. ఇప్పుడే చూస్తున్నంత కొత్తగా గమ్మత్తుగా ఉంది చంద్రుడ్ణి చూడటం. అలాగని పెట్టెలు పేర్చినట్టుండే అపార్ట్‌మెంటెం కాదు. సిటీని ఆనుకుని ఇప్పుడిప్పుడే వెలుస్తున్న సొంతింటి కలల కాలనీ. దానికి ఎడంగా సిటీ శివారుకి ఓరగా ఉన్న డాబా ఇల్లు తమది. ఆ కాలనీకి కాపలా గార్డుగా ఉన్నట్టు ఉంటుంది మా ఇల్లు.
చిన్నప్పటి నుంచి చందమామను చూస్తూ వెనె్నల్లో ఆరుబయట మంచాల మీద పడుకోవడం అలవాటు. ప్రధాన వీధికి అవతల ఉండటం వల్ల మా వీధిలోని వారి సైకిళ్లు తప్ప ట్రాఫిక్ ఏమీ లేకపోవడం వల్ల మాకదో నిశ్చింత. వర్షాకాలం మూడు నెలలూ తప్పితే పున్నమి రాత్రుల్లో నా పక్క ఆరుబయట తప్పనిసరి. చలికాలం డిసెంబరు నెల మినహా వాకిలిలో కొనసాగటం నా అదృష్టం, దానిక్కారణం నానమ్మ. నిజం చెప్పాలంటే వెనె్నలను శరీరానికి పరిచయం చేసిందీ, చందమామను మనసుకు హత్తుకునేలా చేసిందీ నానమ్మే. చదువుకోడానికి బడికెళ్లినపుడు తప్పితే, నా వెన్నంటే ఉండేది నానమ్మ. ఆటలకు వెళ్లినా నాతో రావాల్సిందే. ఇంటికి దగ్గరగా ఖాళీస్థలం ఉండటంతో మా చుట్టుపక్కల పిల్లలకు అదే ఆటస్థలం అయింది. ఆటకు ఆ స్థలం దగ్గరైనా ‘నాని’ లేకుండా అడుగు వేయడం నా వల్ల కాదు, నా కూడా ఉండాల్సిందే. చదువుకు మాత్రమే అమ్మా నాన్నల మార్గదర్శకం. ఆటలకు, అల్లరికి లోక విషయాలు అన్నీ ప్రేరణ ఇచ్చింది ‘నాని’యే. చిన్నప్పుడు తేలిగ్గా పిల్చుకున్న పదం అది. నాని అసలు పేరేంటో నేను కాలేజీకి వెళ్లేవరకు తెలియదు.
మా కుటుంబం ఎంత చిన్నదో నానితో అనుబంధం అంత పెద్దది. నాన్న, అమ్మ, నేను, నాని ఇదే మా కుటుంబం. కాని మాతో భాగ్యం బాప్ప, వాళ్ల కొడుకు శేఖరు బావ ఉంటారు. మిలట్రీలో పనిచేస్తూ యుద్ధంలో వీరమరణం పొందాడు వెంకట్రావు మావయ్య. భాగ్యం బాప్ప తర్వాత నాన్న సుబ్బారావు రాయుడు పుట్టాక చిన బాప్ప వీరమణి పదేళ్ల తర్వాత పుట్టి, పదేళ్ల వయసులో మలేరియా జ్వరం వచ్చి చనిపోయిందని, నాని కబుర్ల మధ్య కథనాపి చెప్పిన సంగతి. చిన బాప్పంటే నానికి బాగా ప్రేమ. ఆమె చిన్న వయసులోనే తాతయ్య చనిపోవడం వల్ల తండ్రి లేని లోటును పూడ్చటానికి ఏ కొరత లేకుండా చూచేదట. చిన బాప్పను ‘వేణి’ అని పిల్చేవారట. ఆమె పేరే నాకు పెట్టారు వేణుశ్రీ. వేణి స్మృతినే కాదు తాతయ్య పేరులోని వేణు మాధవుడు కూడా నాలో కొలువయ్యారు.
నాని మాత్రం నన్ను వెనె్నలనే పిలిచేది. అదే మా ఇంట్లో నా ముద్దు పేరు. నాని ఎన్ని కథలు చెప్పి నిద్రపుచ్చినా వెనె్నల రోజుల్లో చందమామను చూడకుండా నిద్రపోవడం జరిగేది కాదు. చంద్రుడు రాక కోసం నిద్రపోకుండా కాపు కాసేదాన్ని. పున్నమి రోజులంటే అంత పిచ్చి.
పాఠశాల చదువు పూర్తయి పది కిలోమీటర్ల దూరంలోని హైస్కూలు చదువుకి కోటికేశవరం వెళ్లినా ‘నాని’తో వెనె్నలతో అనుబంధం తగ్గలేదు. నా దినచర్యలో సైకిల్ వచ్చి చేరింది. సరదాగా నేర్చుకున్న నాన్న సైకిల్‌పై ఫెడల్ మీద తొక్కిన ఆట, చదువు అంతరాయం కాకుండా చేసింది. లేకపోతే పక్కింటి మంగలాగ బడి మానేయాల్సి వచ్చేది. అమ్మ బలవంతం కూడా బడి జరుగుదలకు బాగానే పనిచేసింది. పది గ్రామాల మొత్తానికి హైస్కూలు అదొక్కటే. అందుకే పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ నే కొట్టేయడం వల్ల జూనియర్ కాలేజీ చదువుకి అది సులభం అయ్యింది. లేకపోతే వరలక్ష్మిలా ఫెయిల్ అయితే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టి ఎవడితోనో ముడిపెట్టేసే వారు.
కార్పొరేట్ కాలేజీల మాయాజాలంలోకి పోకుండా దగ్గర్లో ఉన్న కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోకి నాన్న చేర్పించడంతో విద్య రుచి మరీ వంటపట్టేసింది. అరగ తోముతడేమి లేకుండా లెక్చరర్స్ చెప్పింది శ్రద్ధగా వింటే చాలు ప్రథమ శ్రేణికి పగ్గాల్లేకుండా దూకేయవచ్చు. స్నేహలత తల్లిదండ్రుల బలవంతం మీద కార్పొరేటు కాలేజీకి లక్షలాది రూపాయలు వెచ్చించి దాని ఉసురు తీశారు. ఇంగ్లీషు మీడియం అర్థం కాక పగలు, రాత్రి తేడా లేకుండా మగ్గపెట్టి ఉడికించేయడంతో వత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకొని ప్రాణాలు వదిలింది. ఎంత కలుపుగోలుదంటే తన లంచ్ బాక్స్ విప్పి మా నలుగురు ఆడపిల్లలకు కూర సర్దేసి మేం తెచ్చిన కూరలు లాక్కొని మరీ తినేది. కాలేజీ జాయిన్ అయ్యి క్లాసులో బిక్కుబిక్కుమని చూస్తుంటే స్నేహహస్తం చాచి బెరుకుతనం పోగొట్టింది తనే. బలవంతపు చావును చూడటం అదే మొదలు. అన్నం తింటుంటే అదే గుర్తొచ్చేది. దాని నవ్వు మరపు రావటానికి నాకు చాలా కాలం పట్టింది. నా చదువుకు ఢోకా లేకుండా నానే్న రాజమండ్రి రాజ్యలక్ష్మి స్ర్తిల కళాశాలలో డిగ్రీ జాయిన్ చేయడం ఓ నూతన మార్పు. చదువులో నా ప్రగతిని చూసి బ్యాంక్ కోచింగ్ ఇప్పించడం కోసం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా ఊరు శరభవరం నుంచి ఐదేళ్లు చదువుకోసం బయటకు వచ్చినా ‘నాని’తో ఆటలు మిస్ అయ్యానే కాని ‘వెనె్నల’ను వదులుకోలేదు. ఓ గంట పుస్తకాలు తిరగేసి నాని పక్క వెనె్నల విహారం చేసేదాన్ని.
వెన్నముద్దలు జుర్రుకుంటున్న గొంతులోకి అన్నం ముద్ద అడ్డం పడ్డట్టు పిన్ని సుభాషిణి పెళ్లి సంబంధం పట్టుకొచ్చింది. చాలా ఏళ్ల తర్వాత పెళ్లి ప్రస్తావన రావడం మా ఇంట్లో అదే మొదలు. ఒక్కసారిగా ఇంట్లో అందరి తలంపులు మారిపోయాయి.
‘మన ప్రయత్నం లేకుండానే సంబంధం వచ్చింది, కాదనకుండా ఒకసారి పోయిరండని’ నాని హుంకరింపు బానే పనిచేసింది.
నేను వేసుకున్న అన్ని ప్రణాళికలు ఒక్కసారే మారిపోయాయి.
‘అబ్బాయి బాగున్నాడు. ఒక్కడే కొడుకు. సొంతూర్లో పొలం. బ్యాంక్ ఉద్యోగి’ నాన్న నానితో చెబుతుంటే నీరుగారిపోయాను.
నా ప్రతిభకు తగ్గ ఉద్యోగం సాధిద్దామనుకున్న ఆశ అడుగంటింది.
పెళ్లి ఎంత ప్రాముఖ్యమయిందో పెద్దగా చదువులేని వాళ్ల మధ్య, వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన మ ఊర్లో నా పెళ్లి ప్రముఖమైపోయింది. పెళ్లికొడుకు ప్రభాకర్ బాగానే ఉన్నాడు. ఇష్టపడకపోయే కారణాలేమి లేవు. రూపలావణ్యం ఉట్టిపడుతుంది. తాంబూలాలు మార్చుకున్న రోజు అందరూ ఒక్కటే మాట ‘చక్కని జంట’ అని కితాబునిస్తుంటే ఒకటే పులకింత. నిజం చెప్పాలంటే మది ఆనంద తాండవం ఆడింది.
అత్తామావల ఆదరణతో కాపురం సుజావుగానే సాగిపోతుంది. చంటోడు కిండర్ గార్డెన్‌లో చదువు. వారంలో రెండ్రోజులు ప్రభు క్యాంపు పనిమీద బయట ప్రాంతాలకు వెళ్తాడు. పని అయితే పెద్దగా ఏమి ఉండదు. తీరిక లేనితనం మనసులో గూడుకట్టుకున్న భావాల్ని అధిగమించడం లేదు మనిషి. అదీ నా పరిస్థితి. అపుడే ఆరేళ్లు. ఇట్టే గడిచిపోయినట్టు ఉంది. భర్త అనురాగం కొరత అయితే ఏమీ లేదు.
ప్రభూ ఊరెళ్లాడు. అత్తమామలకు భోజనాలు పెట్టాక ఎందుకో డాబా మీదకు వెళ్లాలనిపించింది. పైకెళ్లాక చూస్తే దిగులు మొఖాల్లోకి వెలుగులు కుమ్మరించటానికి అప్పుడే ఆకాశం పైకి వస్తున్న శశాంకుడు నవ్వులు చిమ్ముకుంటూ కన్పించాడు. చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా కుడిచేయి చూపుడు వేలు బుగ్గన పెట్టుకొని వయ్యారాలు ఒలకపోస్తూ ఎడమ చేతిని నడుం మీద వేసుకొని కులికిన నవ్వుతో చంద్రుడి వైపు చూసింది. తన అభినయం తనకు వింతగా తోచినా మనసు తేలిగ్గా ఉంది. హాయి అనే పదానికి అర్ధం దొరికినట్టు అన్పించింది. ఈ హాయిని ఈ రేయిని వృథా చేయకూడదనిపించింది. చిన్నప్పుడు తాను అనుభవించిన ఆత్మానుబంధ విషయాలు తన తనయుడికి అందించాలని నిశ్చయించుకుంది. ప్రభు కేంపు నుంచి రేపు వచ్చేస్తాడు. ఎల్లుండి శని, ఆదివారాలు బ్యాంకుకు సెలవు. అమ్మ వాళ్లింటికి ప్రయాణం స్థిరపరిచేసుకుంది. ఈమధ్యకాలంలో తాము బయటకు వెళ్లిన సందర్భం లేదు.
జీవితం గానుగాటలా మారిపోయింది. తన ‘నాని’తో తాను పొందిన మధురిమలు అమ్మమ్మతో తన కొడుకు పొందాలి. పల్లెలు పట్నాలుగా, పట్టణాలు నగరాలుగా మారిపోకముందే పల్లె సౌందర్యం వెనె్నల ఆనందం రుచిచూపించాలి. మజ్జిగ చిలికినపుడు వచ్చే వెన్నను ముద్దగా చేసి తినిపించిన అనుభూతులు, శశాంకుడు పెట్టే వెనె్నల ముద్దలు తన బాబుకి తినిపించాలి.
మాధుర్యాలు దాచుకోగలిగితేనే మధురిమలు పంచడం సులువవుతుంది. పల్లె అందాలు గ్రామీణ మర్యాదలు తిలకించటానికే కాదు ప్రభూకి తినిపించటానికి అనువైన సమయం. సరస సమ్మోహనరాగంలో తామిద్దరం తనివితీరా వెనె్నల స్నానం చేయాలి.

- అమృత్, సెల్: 9494842274

మినీ కథలు

బాబా ‘వెలుతురు తెర’ చూడండి!

ప్రతులకు:
బొల్లోజు బాబా
30-7-31,
సూర్యనారాయణపురం
కాకినాడ, తూ.గో.జిల్లా
సెల్: 9849320443
పేజీలు: 95, వెల: 100/-

జీవించిన కాలాన్ని కవి లిఖిస్తే చరిత్రకారుడవుతాడు. సమకాలీన పరిస్థితుల్ని గుర్తిస్తే అతడు సామాజిక చరిత్రకారుడవుతాడు. అలా తనకు తానుగా తన ఊరు ‘యానాం’ చరిత్రను రాసి చరిత్రకారుడయ్యాడు. కవిత్వ సొగసులతో సమాజాన్ని అంతర్మథనం చేసి కొత్త చరిత్రకు నాంది పలకటానికి సామాజిక చరిత్ర కారుడయ్యాడు ఈ కవి. ఆయనే బొల్లోజు బాబా. సాహితీ లోకానికి కొత్తగా పరిచయం కానవసరం లేని కవిత్వ సమీక్షకుడు. వృత్తి రీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. ఆయన రాసిన రెండో కవితా సంపుటి ‘వెలుతురు తెర’.పిల్లలకు చదువు చెప్పటానికి ఏవిధానం అనుసరిస్తున్నారో కాని కవిత్వాన్ని ఎలా చుంబించాలో చూపించారు. కవిత్వాన్ని ఎంత దృశ్యమానం చెయ్యవచ్చో అలా ఎంత ధ్వనిమానం చేయవచ్చో కవి బాబా కవిత్వం చదివితే తెలుస్తుంది.
బ్రతుకు చిత్రంలో చాలామంది సాదాసీదాగా బతికేస్తుంటారు. అయితే జీవిత చిత్రణ అంటే ఏమిటో తెలియకుండా గడిపేస్తుంటారు. అసలు జీవితం ఏదో తెలీని మనిషిని జీవితం ఇదని చెప్పే కవిత ‘జీవితం’. ఒక తొమ్మిది ఫంక్తుల్లో చెప్పిన విధానం చూస్తే ప్రశ్నార్థకపు బ్రతుకు కళ్లకు కనబడుతుంది.
ఎలా బతకాలో, ఏది బతుకో తెలియదు చాలా మందికి. మరి దేహం గురించి ఏం తెలుస్తుంది? అలౌకికతను ఆధ్యాత్మికతను ఎత్తిచూపే ప్రయత్నం ‘దేహం-నీడ’ కవితలో ప్రస్ఫుటమవుతుంది. లోకరీతిని చెబుతూనే దాగిన తాత్వికతను ఎలుగెత్తి చాటే కవి ఇది. ఆలోచనాత్మకతను తెలివిగా ప్రకటించే క్రమం. అందులో దాగిన సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం కన్పిస్తుంది. ‘దేహం కన్నా / నీడ తెలివిగా ఉంది / ఈ బూడిద లోకాన్ని / నిత్యం సందేహిస్తుంది’ ఎవరు ఎక్కడ ఎప్పుడు మనసు నిత్యయపరుచుకుంటారో తెలిసాక నీడ చెప్పే సత్యం సందేశాత్మకం కాదు. ‘దేహాన్ని నీడ ఎత్తుకుపోయి / మృతుల దేహంలో దించేసింది’ అని చెప్తు ‘ఆ తరువాత...’ అని ముగించడం గొప్ప మార్శికత.
సాంద్రత కల కవిత్వాన్ని కొలవటానికి సాధన సంపత్తులు ఏ విశ్వ విద్యాలయం రూపొందించలేదు. ఒక చిక్కని భావుకతను కొలవటానికి అనకూడదు కాని చదవటానికి మాత్రం కాస్త మనసుంటే చాలు అవగతమవుతుంది. పదాల పేర్పుతో అక్షర ఫంక్తులు పేజీలో నింపేస్తే కవిత్వమనే భ్రమను పటాపంచలు చేయడం, భావాన్ని పలికించడంలో వైయక్తికంగా చెప్పడమే కవిత్వం. కవిత్వాన్ని రాసుకోడానికి, కవిత్వాన్ని వేసుకోడానికి ఎక్కడా పరిమితులు లేవు. అలాగని ఎక్కడా వాటిని అమ్మే పరిస్థితులు లేవు. ఎవరు తీసుకుంటారు ఈ పుస్తకంలో కవిత్వాంశ లేదు అనే సాహసం. అయితే మంచి కవిత్వం ఎక్కువ కాలం మన్నికతో మన్నగలుగుతుంది అది నిజం.
చదువరుల కొరత, సాహిత్య మనుగడ చింత తెలుగులో వ్యక్తీకరణ చేసే వారి సంఖ్య పడిపోవడం వంటి మాటలు తరచూ వింటుంటాం. అదీ తెలుగు మాట్లాడే వారి కోసం చెప్పుకొనే సంగతులు. తమ మాతృభాషలో 30 శాతం మించి మాట్లాడకపోతే అది మాతృభాష కింద లెక్క. అలా మనమూ చెడిపోయే అవకాశం కొద్ది దూరంలో ఉంది. ఇదీ మన తెలుగు వారికి దాపురించిన పరిస్థితి. మరి ఈ లెక్కల్ని మించిపోయి తెలుగు సాహిత్యానికి పట్టం కట్టే పరిస్థితి ఉందా? నిందా పూర్వకంగా మాట్లాడే హక్కులో యిమిడిపోగలమా? మంచి కవిత్వానికి ఆదరణ కల్పిస్తేనే అది సాధ్యమవుతుంది. కవిత్వ విమర్శనాత్మకతకు నోచుకుంటేనే ఉత్తమం కాగలదు. ఆ కోవలోకి వచ్చే మంచి కవిత్వం వెలుతురు తెరలో చూడొచ్చు.
వౌనం నుంచి మేల్కొల్పిన మాటను సుతారంగా వదిలారు. పదాల్ని నలిపేసి అక్షరాల్ని ఏ బండ కింద మెలిపెడితే పెగిలించుకొని చించుకొని ఉబికి కాసిన్ని మాటలు వెలుతురును ఎలా చీల్చుకొస్తాయో చెప్పారు. వెలుతురై ప్రతిబింబించాల్సిన ముఖాలు కాంతిలో తచ్చాడటం విద్యార్థి జిజ్ఞాసను కాదు దుర్ధిశను ‘వెలుతురు తెర’పై చూస్తాం.
పంట వేయడానికి సిద్ధం చేసిన వరి మడిలోకి ఆకాశాన్ని దించిన కవి బాబా అభినందనీయుడు. ‘ఊడుపు’ కవితలో ‘ఒంగున్న స్ర్తిలు / వరి మొలకల్ని / అనంత నీలిమలో / గుచ్చుతున్నారు’ అంటారు. ఆశాజనకమైన ఊహతో మహిళలచే బీజం వేయించా ఆహారోత్పత్తికి. చాలా చిన్న కవిత ఇది. అయితే పెద్ద ఆశయాన్ని తెలిపింది. తనను తాను స్కానింగ్ చేసుకొని రాసిన కవిత ‘సమతుల్యత’ తన వృత్తిని ప్రతిబింబింప చేస్తూనే బోధితత్వాన్ని బయలుపరచారు. విద్యార్థులతో ఎంత మమేకపోయుంటారో కనుకనే సమాజంతో సామాజీకరణ చెందారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేయటం వల్ల కాబోలు మనుషుల్ని సంఘాన్ని బాగా చదవగలిగారు. జవాబు పత్రాన్ని చూడగానే తెలిసిపోతుంది విద్యార్థి జీవితం. రోగినాడి పట్టుకొన్న వైద్యుడిలా వాడి బతుకు లక్షణాన్ని ఇట్టే గుర్తుపట్టేస్తారన్న మాట. ‘మూల్యాంకనం’ కవిత నిజంగా పిండేస్తాది ‘జవాబు పత్రాన్ని మెదడు తూకం వేస్తే / హృదయం మూల్యాంకనం చేస్తుంది’ అంటారు. ‘పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి / పత్రికల్లో పతాక శీర్షికలవడం కూడా / ఆత్మహత్యగానో, అత్యుత్తమ ర్యాంక్ అనో చాలా నిర్ధారించి చెప్పిన మాట ఇది.
ప్రతి కవిత ముగింపు చాలా అర్ధవంతంగాను ఆలోచనాహితంగాను ఉపసంహరించడం కవి బాబా ప్రత్యేకత. పుస్తకంలో ఏ కవిత చదివినా మది పులకిస్తుంది అదే క్షణంలో మనసూ చమరస్తుంది. ప్రకృతి అంటే ఆహ్లాద భరితం ఆనందపూరితం అనుకుంటారు. అవును మరి లొట్టలేసుకొని ఆరగించే మానవుడు మనిషిని తినడం మొదలు పెట్టాక ‘పాపం! జగమేలే పరమాత్మ / ఎవరితో మొరపెట్టుకొంటుంది?’ పర్యావరణ సమతుల్యాన్ని తేల్చి చెప్పిన ‘ప్రకృతి’ కవిత ఇది.కవిలోని ఆర్థ్రత ప్రతి కవితలో మనకు కన్పిస్తుంది. దాన్ని అందిపుచ్చుకోగలిగితే కవి ప్రయత్నం సార్థకమయినట్లే.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

ఆరు రుచుల ఉగాది

ప్రకృతిలో చిగురింతల పులకింత...
చిగురించిన ఆశలతో
ప్రణమిల్లుతారు జనమంతా...
చేదు, తీపి, పులుపూ
వగరూ, కారం, ఉప్పూ...
తినే పదార్థాలలోనే కాదు
జీవితంలోనూ ఉంటాయని
చాటి చెప్పే నగ్నసత్యం!
చెట్టుమీద కాయ నుండి
సముద్రాన ఉప్పు వరకూ
ప్రకృతంతా ‘ఉగాది’కి
స్వాగతం పలుకుతుంది...
ప్రతీ జీవి జీవితంలో
ఆరు రుచులున్నప్పుడే
అది సార్ధకమవుతుందని
తెలుపుతోంది...
అందుకోసమే -
కోయిలమ్మ సంగీత కచేరీ చేస్తోంది...
కవులంతా సమ్మేళనం చేస్తారు...
పండితులు పంచాంగ శ్రవణంతో
అలరిస్తారు...
రాజపూజ్యం, అవమానాలను
ఆదాయ వ్యయాలను
తూకమేసి తేల్చి చూపిస్తారు...
అరవై ఏళ్ల వయస్సునూ ఆరు రుచుల ఉగాది
తన చక్రభ్రమణంతో ఊరిస్తుంది, ఊగిస్తుంది

- ఎన్.కె.నాగేశ్వరరావు, పెనుగొండ, సెల్: 9030360988

ప్రకృతి కాంత పుట్టినరోజు

కోయిలకూత వినిపిసే ఉగాది
మావి చిగురు మురిపిస్తే ఉగాది
వేప పూలు వికసిస్తే ఉగాది
షడ్రుచులు సంబరం చేస్తే ఉగాది

తెలుగుదనం పల్లవిసేనే...
అది తియ్యని ఉగాది!
తెలుగు తేజం రేకులు విప్పితేనే
అది తేనెసోనల ఉగాది!

ఉగాది పదచరణాల తాకిడికి
ప్రకృతి ఆకృతే మారిపోతుంది
కోకల చిగురు వేదికపై వెదజల్లిన
కుహుకుహూల సంగీతవౌతుంది

కోకిలమ్మల కోటిరాగాల నడుమ
వేపపూల అక్షింతల మధ్య
వసంతాన్ని వెంట బెట్టుకొని విచ్చేసింది
ఈనాటి ఉగాది ఉదయం

నూతన పంచాంగం చేత పెట్టుకుని
కొత్త కుండను తలపై ఎత్తుకొని
పదహారు అణాల ప్రకృతి కాంత
నట్టింట్లోకి నడచి వచ్చింది
ఆరు రుచుల పచ్చడిని
కొసరి కొసరి తినిపిస్తోంది
కష్టసుఖాల సమానత్వాన్ని
కమ్మగా బోధిస్తోంది

ఇది పండగ కాదు
ప్రకృతి కాంత పుట్టినరోజు

- పంపన సాయిబాబు, తోలేరు, సెల్: 9652801014

మోడరన్ ఉగాది శుభాకాంక్షలు

సూర్యోదయ సుప్రభాత వేళ,
కాలింగ్ బెల్ కోయిల కుహుకుహు అని పిలిచింది,
కంప్యూటర్‌లో ఈమెయిల్స్ వందలకొద్దీ వచ్చి ఉన్నాయి,
సెల్‌ఫోన్‌లో వాట్సప్‌లో వేలకొలదీ మెసేజ్‌లు,
ఫేస్‌బుక్‌లో లక్షల కొలదీ పోస్టులు,
కోట్ల కోలదీ శుభాకాంక్షలు!
జీవితంలో ఎన్నడూ పొందలేనంత ఆనందము,
బాల్కనీలోకి వెళ్లి నిల్చుంటే,
గున్నామామి గుబురులో కోయిలమ్మ కుహు రావాలని
బయట ఫ్యాక్టరీ సైరన్ హారణు, కాంక్రీట్ చప్పుళ్లు
ఆకాశాన్ని అంటే అపార్టుమెంట్‌లు మేడలు!
జీవన వేదంలో ఎన్ని శృతులు -
వాటి సోదాలే వైజ్ఞానికోన్నతి,
నేటి కోయిల గానంలో హైటెక్ కల్చర్ - స్పీడ్ డ్రైవింగ్,
సమతుల్యత నొందిన వాహనాల శుభాకాంక్షలు,
ప్రశాంతత కోసం గుడికి వెళ్లాను -
సెల్‌ఫోన్ మదమే హైటెక్ నినాదమే,
ఉగాది శుభాకాంక్షలు -
ఫోన్‌లోనే క్షణం, క్షణం - టెన్షన్,
ప్రపంచ సమాచారమే -
మన అరచేతిలోనే - నేటి విజ్ఞానం,
వైఫై, వైఫ్ కన్నా ఎక్కువ మన చుట్టూ ఉన్నదీ,
మనసుల్లో మాత్రం సంకుచితతత్వం
అందుకే సెల్‌ఫోన్ క్యారమ్
స్పీడ్ యుగంలో - హైటెక్ సిటీస్‌లో - సర్వాంగ సుందరంగా,
నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్దీపాల అలంకరణ,
భూగోళానికి శాటిలైట్ తోరణాలతో అలంకరించబడిన
నేటి మోడరన్ ఉగాదికి - తెలుగు శుభాకాంక్షలు!

- ఎన్.వాణీప్రభాకరి, పశ్చిమ గోదావరి జిల్లా

నిరీక్షణ
శిశిరంలో
రాలిపోతున్న
ఆఖరి ఎండుటాకునడిగా!
దొరకలేదు
హేమంతంలో-
ఆవిరవుతున్న
చివరి మంచు బిందువులో చూసా
కనబడలేదు!
శరత్తులో-
నిండుకుంటున్న
తుది వెనె్నల్లో వెదికా
లభించలేదు!
వర్షాకాలంలో -
ఇంకిపోతున్న
కడవరి చినుకులోనూ
లేనే లేదు!
గ్రీష్మంలో -
మొహం మాడ్చేసిన
అంతిమ గాడ్పు చెప్పింది
ష/్య కోకిల
అనే్వషణ ఫలించింది
ఆధారం దొరికేసింది
కాళ్లీడ్చుకుంటూ
కోకిలమ్మని చేరి
కూలబడి అడిగా
జ్ఘీజఆ ఒళళ అంది!
ఆశాభంగం చెందినా
అదుపు చేసుకున్నా
చివరికి వచ్చేసింది ‘వసంతం’
పచ్చదనంతో ఆహ్లాదంగా
ఆమని వచ్చేసిందని
అరిచాను ఉద్వేగంగా
కోకిల కదల్లేదు, వౌనం వీడలేదు
అంతలో దూరంగా-
విన్పించిందో కూజితం
వెంటనే చైతన్యమై-
ఎగిరిపోతూ చెప్పింది
‘ప్రేయసిలేని - తన పిలుపురాని
ఈ వసంతమెందుకు?’
నిర్ఘాంతపోయి, నిజం గ్రహించి
వసంతం కోసం కాక
‘వసంత’ కోసం
ఎదురుచూస్తున్నా!!

- కౌలూరి ప్రసాదరావు,
వేళ్లచింతలగూడెం, ప.గో.జిల్లా
సెల్: 7382907677

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

- అమృత్