విశాఖపట్నం

మబ్బులు వీడిన వేళ (కథానికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ మహానగరం!
శీతాకాలం కావడం వల్ల మంచు అదే పనిగా కురుస్తోంది.
సమయం ఉదయం పదిన్నర అయింది.
సీతారామయ్యగారు చేతిలో బ్యాగుతో పాటు రైల్వేస్టేషన్ ఏరియాలో వేగంగా నడుస్తున్నారు.
ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది.
ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు.
సీతారామయ్యగారు వేగంగా అక్కడున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాన కార్యాలయంలోకి నడిచారు.
సీతారామయ్యగారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆయనకి మరో మూడేళ్లే సర్వీసు ఉంది. అయితే ఆఫీసులో కొంత మంది రాజకీయం చేసి ఆ చివరి సమయంలో ఆయనని ఏకంగా ఉత్తరాంచల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించేశారు. అప్పుడే కాదు ఎక్కడ ఏ తప్పు జరిగినా దానిని ప్రక్షాళన చేయడానికి బాగా పని చేసే సీతారామయ్యగారిని అక్కడికి పంపించడం ఆఫీసర్లకి అలవాటు అయిపోయింది. ఈ కారణంతోనే ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో విధులు నిర్వర్తించవలసి వచ్చింది.
ఒక మంత్రి, ఇద్దరు ఎంపిల సిఫారసు ఉత్తరాలతో ఆయన తన ట్రాన్స్‌ఫర్‌ను ఆపించుకోవడానికి అక్కడికి వచ్చారు.
ఆయన ఆఫీసులోకి వెళ్లేసరికే తన ఫైల్ చూసే గుమస్తా వచ్చేసాడు.
సీతారామయ్యగారు ఆయనకి నమస్కారం చేసి వచ్చిన పని చెప్పి ఫైలు తెరచి ఆయనకి చూపించాడు.
సిఫారసు ఉత్తరాలు ఆయన చేతికి అందించాడు.
అన్నీ చూసి తలపంకించిన ఆయన ‘‘పాపం సత్తెకాలపు మనిషిలా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఈ చివరి సమయంలో ఎక్కడికో ట్రాన్స్‌ఫర్ చేయించారు. నేను మీకు సాయం చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్లిపోండి’’ అన్నాడు.
అతనికి కృతజ్ఞతలు తెలిపి బయటపడ్డారు సీతారామయ్యగారు.
వచ్చిన పని దాదాపు అయిపోవడంతో ఆయన మనసు తేలిక పడింది.
వేగంగా వెళ్లి ఏదో ఒక రైలు అందుకుంటే త్వరగా వెళ్లిపోవచ్చు అనుకుని వేగంగా నడవసాగారు.
సరిగ్గా అప్పుడే...
క్రీచ్ఛ్‌మంటూ టాక్సీ ఒకటి వచ్చి ఎవరినో ఢీకొనడం, ఆ ధాటికి ఒక యువతి అమాంతం వచ్చి సీతారామయ్య గారి కాళ్ల దగ్గర పడిపోవడం జరిగిపోయింది.
‘‘అయ్యో’’ అంటూ సీతారామయ్యగారు కింద పడిపోయిన యువతిని లేవనెత్తారు.
ఆమెకి స్పృహ తప్పింది.
ఎవరో వచ్చి సాయం పట్టారు.
‘‘వదిలేయండి... ఈ పిల్ల ఇక్కడే బిచ్చమెత్తుకుంటూ ఉంటుంది’’ అక్కడికి దగ్గరలో చింకి గుడ్డ పరుచుకుని అడుక్కుంటున్న ముసలి బిచ్చగాడు చెప్పాడు.
అయితే అప్పటికే మోచేతులు, కాళ్ల నుండి రక్తమోడుతున్న ఆ యువతిని అలా వదిలేసి వెళ్లలేకపోయారు సీతారామయ్యగారు.
ఒక ఆటో పిలిచి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాడు.
పది నిముషాల్లో ఆటో ఒక డిస్పెన్సరీ దగ్గరాగింది. అక్కడ ఆమెకి వైద్యం చేయించి, మందులు కొని ఆమెకి ఇవ్వడానికి సిద్ధంగా పట్టుకున్నాడు.
అరగంట తర్వాత ఆమెకి తెలివి వచ్చింది.
తాను ఎక్కడున్నానో చుట్టూ చూసింది. తర్వాత గుర్తుకు వచ్చినట్లు చేతులు, కాళ్లను చూసుకుంది.
తర్వాత సీతారామయ్యగారి వైపు చూసింది.
అంతే...
ఆమె కళ్లలో ఏదో మెరుపు.
‘‘అతనే నిన్ను ఆసుపత్రిలో చేర్చారు’’ ఆసుపత్రిలోని కాంపౌండర్ చెప్పాడు.
దానికామె ఏమాత్రం స్పందించలేదు.
అలాగే సీతారామయ్యగారిని చూస్తూ సడన్‌గా ‘‘నాన్న...’’ అంటూ సుడిగాలిలా వచ్చి ఆయన్ని చుట్టుకుపోయి వెక్కివెక్కి ఏడ్వసాగింది.
ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన సీతారామయ్యగారు ఆమెని దూరంగా నెట్టెయ్యలేదు. ఆమె దు:ఖం తీరేవరకు అలా ఉండనీ అనుకున్నారు.
చాలా సేపు ఏడ్చిన తర్వాత ‘‘నాన్నా నాన్నా నేను నాన్న మీ మంజూని’’ అంటూ అతన్ని అల్లుకుపోయింది.
అంతే... షాక్ తగిలినట్లు వణికిపోయారు సీతారామయ్యగారు.
ఆమెని తేరిపార చూసారు.
ఎప్పుడో ఆమెకి పది పనె్నండేళ్ల వయస్సప్పుడు తప్పిపోవడం వల్ల అస్సలు గుర్తు పట్టలేకపోయారు.
అది జరిగి దాదాపు పదిహేనేళ్లవుతోంది.
వెంటనే ఆయనకి ఒక విషయం గుర్తుకొచ్చింది.
మంజూకి మూడేళ్ల వయస్సప్పుడు తన తల్లి ఆమె తల్లి పేరులోని మహతిలో మొదటి అక్షరమైన మ అనే అక్షరాన్ని కుడికాలి అడుగు భాగంలో పచ్చబొట్టు పొడిపించింది.
అది గుర్తుకొచ్చి మంజూ పాదాన్ని తిప్పి చూసాడు.
అక్కడ పెద్దగా కనిపించింది ‘మ’ అనే అక్షరం.
అంతే సీతారామయ్యగారిలో దు:ఖం కట్టలు తెంచుకుంది.
‘‘అమ్మా మంజూ... ఇన్నాళ్లూ ఏమైపోయావమ్మా? నిన్ను పోగొట్టుకుని జీవచ్ఛవంలా అయిపోయాను’’ అంటూ ఏడ్వసాగారు.
చుట్టూ గుమిగూడిన వారంతా ఆశ్చర్యంగా ఇదంతా చూస్తున్నారు.
సీతారామయ్యగారు ఒక ఆటో పిలిచి దగ్గరలోని మంచి హోటల్‌కి తీసుకెళ్లమన్నారు.
వెళుతూ వెళుతూ ఒక దుకాణంలో మంచి చీరలు, బ్లౌజులు గట్రా తీసుకున్నారు.
హోటల్‌కి వెళ్లి తలారా స్నానం చేసింది మంజూ.
కడుపుకింత తిని ఎన్నాళ్లయిందో గానీ హోటల్లో ఆవురావురుమంటూ తింటున్న కూతుర్ని చూసి సీతారామయ్యగారి కడుపు తరుక్కుపోయింది.
భోజనం చేసిన తర్వాత ‘‘అసలేం జరిగిందమ్మా?’’ అంటూ కూతుర్ని అడిగారు.
‘‘నన్ను మామయ్య బయటికి తీసుకెళతానని చెప్పి ఎవరో లావుపాటి ఆవిడ ఇంటికి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ ఆ రాక్షసి నన్ను రోజూ కొట్టేది. ఎవరెవరో వచ్చేవారు నన్ను బట్టలు విప్పమనేవారు’’ మంజూ ఇంకా ఏదో చెప్పబోయింది.
‘‘చాలమ్మా చాలు’’ వినలేనట్లు వారించారు సీతారామయ్యగారు.
‘‘అక్కడ చాలాకాలం నరకం అనుభవించాను. ఇంటికి రావడానికి ఎన్నిసార్లో ప్రయత్నించాను. అయితే ఆ లావుపాటి రాక్షసి దగ్గరుండే రౌడీలు నన్ను చాలాసార్లు బంధించి తిరిగి దానికి అప్పగించేసేవారు. బయటికి పారిపోవడానికి ప్రయత్నించి దొరికిన ప్రతిసారీ నాకు నరకం చూపించేది ఆ రాక్షసి. దాంతో కొన్నాళ్లకు ఆ ప్రయత్నాలు మానేసాను. దాని దగ్గరే పెట్టింది తిని రాయిలా బ్రతికేసాను. అయిదేళ్ల క్రితం అది చచ్చిపోయింది. దాని దగ్గరున్న రౌడీలు వాళ్లలో వాళ్లే గొడవలు పడి రోడ్డుకెక్కారు. ఒకడు నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చాడు. సంవత్సరం పాటు ఇక్కడే ఉండిపోయాను. ఆ మధ్య వాడు చచ్చాడు. దాంతో రోడ్డున పడ్డాను. బిచ్చమెత్తుకుని బతుకుతున్నా మునుపటి జీవితం కంటే ఇదే బాగుంది. అందుకే ఇక్కడే ఇలాగే గడిపేయడం మొదలుపెట్టాను’’ కళ్లనీళ్లతో చెప్పింది మంజూ.
‘‘మరి నీకు ఈ నాన్న గుర్తుకు రాలేదా తల్లీ? ఒక్కసారైనా రావాలనిపించలేదా?’’ దు:ఖం ఆపుకుని అడిగారు సీతారామయ్యగారు.
‘‘ఎంతో కష్టపడి ఒకసారి వచ్చాను నాన్నా. కానీ మీరు, అమ్మ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు. ఇక ఎక్కడికి వెళ్లడానికి దారి లేక మళ్లీ ఇక్కడికే వచ్చేసాను. ఇక్కడున్న వాళ్లంతా బిచ్చగాళ్లే కావచ్చు. కానీ అందరూ ఒకరికి ఒకరుగా ఉంటాం. ఒకరికి కష్టమొస్తే ఇంకొకరు సాయం చేస్తారు. ఒకరికి దొరికింది అందరూ పంచుకుని తింటారు. అందుకే ఇక్కడికి తిరిగి వచ్చేసాను’’ చెప్పింది మంజూ.
‘‘మీ మామయ్య శేషుగాడు ఇంత నయవంచకుడని ఊహించలేకపోయాను. నువ్వు స్కూలుకు వెళ్లి ఎక్కడో తప్పిపోయావని అబద్ధం చెప్పాడు. మనుషుల్ని పెట్టి నిన్ను వెతికించాలని నా దగ్గర వేలకు వేలు డబ్బు కాజేసాడు.
బాధగా చెప్పారు సీతారామయ్యగారు.
సాయంత్రం తత్కాల్‌లో బుక్ చేసుకుని బయలుదేరిపోయారు.
* * *
ఆటోలో నుండి దిగుతున్న భర్త సీతారామయ్యని, ఎవరో యువతిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది రత్నాంబ.
ఆటో ఫేర్ చెల్లించి ‘‘మన మంజూ’’ చెప్పారు సీతారామయ్యగారు.
‘‘మన మంజూనా? ఇన్నాళ్లు ఏమైపోయావు తల్లీ’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది రత్నాంబ.
కూతుర్ని కౌగలించుకుని బోరుమంది.
ఇరుగుపొరుగు చేరారు.
అంతా సానుభూతి వచనాలు పలికారు.
స్నానాలు చేసి భోజనాలు చేశారు రాత్రి అంతా.
మంజూ ఇంటికి తిరిగి వచ్చిన ఆనందంలో ప్రశాంతంగా నిద్రపోతోంది.
సీతారామయ్యగారు నిద్ర రాకపోయినా కళ్లు మూసుకుని పడుకుని ఉన్నారు.
పక్క గదిలో నుండి గుసగుసగా మాటలు వినిపిస్తున్నాయి.
సీతారామయ్యగారి మనసు కీడు శంకించింది.
లేచి సడి చేయకుండా చీకట్లో నక్కి వినసాగారు.
‘‘తమ్ముడూ! మీ బావ వచ్చాడు. నువ్వు ఎప్పుడో అమ్మేసిన మంజూ తిరిగి వచ్చింది. మీ బావకి ఎక్కడ కనిపించిందో ఏమిటో వెంటబెట్టుకుని వచ్చాడు. బహుశా దానిని నువ్వే అమ్మేసావని చెప్పే ఉంటుంది. ఇక నువ్వు ఇప్పట్లో రాకు. వీలు చూసుకుని నేనే నీ దగ్గరకి వస్తాను’’ అని ఫోనులో చెబుతోంది రత్నాంబ తన తమ్ముడికి.
‘ఎంత కుట్ర? దీనంతటికీ కారకురాలు రత్నాంబే అన్నమాట. మంజూ పుట్టగానే తాను పోగొట్టుకున్న తన మొదటి భార్య శాంతి స్థానంలో దీనిని పెళ్లాడితే ఇదింత నీచానికి ఒడిగడుతుందా? నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని వేశ్యావాటికకు అమ్మిస్తుందా? దీని పని చెబుతాను. తగిన శాస్తి చేస్తాను’ అనుకుని ఏమీ తెలియనట్లు వెళ్లి మళ్లీ మంచం మీద పడుకున్నారు.
మర్నాడు సామాన్లు సర్దుకుని కూతుర్ని తీసుకుని బయలుదేరారు.
‘‘ఎక్కడికండి?’’ భర్తని ప్రశ్నించింది రత్నాంబ.
‘‘మంజూని ఏదైనా ఆడవాళ్ల హాస్టల్‌లో పెడతాను’’ అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా బయటికి నడిచారు. అప్పటికే ఆటోలో కూర్చున్న మంజూ తండ్రి చేతిలోని లగేజీ అందుకుంది.
సీతారామయ్యగారు కూర్చోగానే ఆటో రివ్వున దూసుకుపోయింది.
పోస్ట్ఫాసు దగ్గర ఆటో ఆపించి హెడ్డ్ఫాసుకి టెలిగ్రామ్ పంపించారు సీతారామయ్యగారు.
‘దయతో నా ట్రాన్స్‌ఫర్‌ను క్యాన్సిల్ చేయకండి. నేను ఉత్తరాంచల్‌లో పని చేయడానికి సమ్మతిస్తున్నాను. రేపే ఉద్యోగంలో చేరగలను’ అన్నది ఆ టెలిగ్రామ్ సారాంశం.
దుష్టులకు దూరంగా తన కూతుర్ని తీసుకుని ఆయనెక్కిన ఉత్తరాంచల్ రైలు వేగంగా గమ్యం వైపు సాగిపోతుండగా ఎన్నో కష్టాలు పడి రాటుదేలినట్లున్న కూతురిలో తల్లిని చూసుకుంటూ తృప్తిగా నిట్టూర్చారు సీతారామయ్యగారు.

- పుష్ప గుర్రాల, ఇస్మాయిల్‌కాలనీ, రాజ్యలక్ష్మీ థియేటర్ దగ్గర, విజయనగరం-2.
సెల్ : 9491762638.

బిచ్చగత్తె!

విశాఖపట్నంలో నిత్యం రద్దీగా ఉండేది ఆశీలమెట్ట కూడలి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు చాలా వరకు అక్కడే ఉండడం వల్ల ఆ ప్రాంతం ఏ సమయంలో చూసినా జనసంచారం, వాహన రద్దీతో రణగొణధ్వనులతో నిండి ఉంటుంది.
‘‘ప్లీజ్ హెల్ప్‌మీ. ఐయామ్ ఇన్ డిఫికల్టీస్’’ ఓ పదిహేనేళ్ల అమ్మాయి సిగ్నల్ పాయింట్ వద్ద వాహనాలు ఆగగానే అందులోని యజమానులను అడుక్కుంటోంది.
గోపాలం ఆ అమ్మాయి ఇంగ్లీష్‌లో బిచ్చమెత్తడాన్ని వారం రోజుల నుండి చూస్తున్నాడు. సాధారణంగా బిచ్చగాళ్లు ‘అమ్మా ధర్మం చేయండి’ అంటూ అడుక్కుంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఇంగ్లీషులో అడుక్కోవడం గోపాలానికి వింతగా అనిపించింది.
వయసు వస్తున్న అమ్మాయి మాసిన దుస్తుల్లో అలా ఉంది కానీ మంచి దుస్తులు ధరిస్తే ఆధునికంగా ఉండే ఏ యువతీకి తీసిపోదన్నట్లు ఉంది. ఇచ్చిన వాళ్లకి థ్యాంక్స్ చెబుతుంది. లేకపోతే మరొకళ్ల దగ్గరకి వెళ్లి అడుక్కుంటోంది. గడుగ్గాయిలు పరాచికాలు ఆడితే వారికి రిటార్ట్ ఇస్తోంది.
కాలేజీ కుర్రాళ్లు ‘దీని సంగతి చూడాలి’ అంటుంటే ‘‘నా సంగతి కాదు మీ సంగతి చూసుకోండి. అసలే ఆ ముందర పోలీసులు ఉన్నారు’’ అనగానే వాళ్ల ముఖాలు జేవురిస్తున్నాయి.
ఆ అమ్మాయి సాయంత్రం అయిదు గంటలకు వచ్చి ఏడు గంటల వరకు ఒకే మార్గంలో అడుక్కుంటుంది. గోపాలం వారం నుండి ఆ అమ్మాయిని గమనిస్తున్నాడు. ఏడు కాగానే ఆ అమ్మాయి మద్దిలపాలెం వెళ్లే బస్సు ఎక్కడం కూడా చూస్తున్నాడు.
గోపాలం ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఆఫీసు నుండి ఆ సమయంలో అక్కడికి రావడం, అదే సమయంలో ఆ అమ్మాయి రావడం జరుగుతుంది. అతని హృదయం ఆ అమ్మాయి పట్ల జాలిలో నిండిపోయేది.
ఎప్పటిలానే ఆరోజు ఆగిన కారులో ఉన్న ఒక మహిళ ముందు చేయి చాపి అడిగింది ఆ అమ్మాయి.
‘‘ఏమిటి నీ ప్రాబ్లం?’’ ప్రశ్నించింది ఆ మహిళ.
‘‘ఎస్‌ఎస్‌సి ఎగ్జామ్‌కి ఫీజు కట్టాలి. రెండు రోజులే టైముంది’’ చెప్పిందా ఆ అమ్మాయి. వెంటనే ఆ మహిళ పర్సు తీసి ఏభై రూపాయల నోటు ఇచ్చింది. ‘‘్థ్యంక్స్ మేడం’’ అంది ఆ అమ్మాయి. కారు ముందుకు దూసుకుపోయింది.
అంతా గమనిస్తున్న గోపాలం ‘బీదరికం మనిషిని ఏ స్థితికి నెడుతుందో కదా’ అనుకున్నాడు. అటువంటి స్థితి అతనికి అనుభవమే. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన గోపాలాన్ని పెంచి పోషించింది సమాజమే. అప్పటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి అతనికి.
అప్పట్లో ఎవరెవరో సాయం చేశారు అతనికి. వాళ్లెవరూ గుర్తులేదు. ఈ దేశంలో ఇంకా ధర్మం ఉందనడానికి తానే నిలువెత్తు నిదర్శనం అనుకున్నాడు గోపాలం.
అందరి సాయంతో చదువుకుని ఉద్యోగం సంపాదించాడు. తన పరిస్థితి వంటిదే ఆ అమ్మాయిది కూడా అనుకున్నాడు గోపాలం. ఆ అమ్మాయిని ఆదుకోవాలని అనుకున్నాడు.
ఏడుగంటలకల్లా ఆ అమ్మాయి మద్దిలపాలెం వైపు వెళ్లే బస్సెక్కింది. గోపాలం ఆమె గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు.
టిక్కెట్ తీసుకుని ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది ఆ అమ్మాయి. అది గమనించిన ఒకాయన ‘‘ఈ ముష్టిపిల్లకి సీటు కూడా కావలసి వచ్చింది’’ అన్నాడు. తర్వాత కూడా ఇంకా ఏదో అనబోయాడు.
‘‘నోరు మూసుకో. నువ్వు టిక్కెట్టు తీసుకున్నావో లేదో తెలియదు. నేను మాత్రం టిక్కెట్టు తీసుకున్నాను. ఇదిగో టిక్కెట్లు’’ అంటూ చూపించింది. బస్సులోని వారంతా ఫక్కున నవ్వారు.
సిగ్గుతో తల దించుకున్నాడు అతను.
మద్దిలపాలెంలో బస్సు దిగి గబగబా రోడ్డు దాటింది ఆ అమ్మాయి. గోపాలం కూడా ఆ అమ్మాయిని అనుసరించాడు.
‘‘పాపా నెమ్మదిగా రోడ్డు దాటు. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళుతున్నావు?’’ అన్నాడు గోపాలం.
ఆ అమ్మాయి వెనుదిరిగి చూసి ఆకతాయి కాదని తెలుసుకుంది. ‘‘రామాలయానికి. ఇప్పటికే ఆలస్యం అయింది. పూజారిగారు నా కోసం చూస్తూ ఉంటారు’’ అంది.
‘‘నేనూ అక్కడికే. మెల్లగా నడు’’ అన్నాడు గోపాలం.
ఇద్దరూ రామాలయానికి వెళ్లారు.
ఆమెని చూడగానే పూజారిగారు ‘‘ఏమ్మా ఉషా ఈరోజు ఆలస్యం అయిందేమిటి?’’ అన్నారు.
‘‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. ఫ్రెండ్ ఇంటి దగ్గర చదువుకుని రావడంతో ఆలస్యం అయింది’’ అంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి పేరు ఉష అని, ఆమె అవసరానికి అబద్ధం చెప్పిందని అర్ధం చేసుకున్నాడు గోపాలం.
ఆ పూజారిగారు గోపాలానికి ముందే తెలుసు. ఆ ఆలయాన్ని కట్టించింది తను పని చేస్తున్న సంస్థ యజమాని రాఘవయ్యగారే. ఆ పరిచయంతో ఉష వివరాలు సేకరించాడు.
భార్యని, నలుగురు పిల్లలని విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఉష తండ్రి.
ఉష ఇంటికి పెద్ద పిల్ల. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేస్తూ పిల్లలని సాకుతోంది. ఉష తెలివైన పిల్ల. తల్లికి ఇంట్లో సాయం చేస్తూనే చదువుకుంటోంది. అయినా వాళ్ల కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు లేవు. వాళ్లున్న జాగా ప్రభుత్వానిదట. అక్కడేదో కార్యాలయం కట్టడం కోసం ప్రభుత్వం తొందరల్లో స్వాధీనం చేసుకుంటుందట. ఈ కుటుంబానికి నిలువ నీడ కూడా లేకుండా పోతుందని పూజారిగారి మాటల ద్వారా తెలిసింది.
ఇప్పుడు కట్టబోయే భవంతికి రాఘవయ్యగారే కాంట్రాక్టరు. అందుకని తనను వాళ్లింట్లో ఔట్‌హౌస్‌లో ఉంటూ తనని పర్యవేక్షించవలసిందిగా చెప్పారు. కనుక తాను చొరవ తీసుకుని ఉష కుటుంబాన్ని ఇక్కడ ఉంచి, ఆమె చదువుకోవడానికి సాయం చేయవచ్చు.
వెంటనే గోపాలం పూజారిగారితో ఉష కుటుంబాన్ని ఔట్‌హౌస్‌లో ఉండేటట్టు, ఆమె చదువుకు తాను చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఇదంతా ఉషకి కానీ, ఆమె కుటుంబ సభ్యులకు గానీ తెలియకూడదని చెప్పాడు.
పూజారిగారు అలాగే చేశారు.
ఉష టెన్త్ క్లాస్‌లో పాసయింది. దాంతో ఆమె మార్కులు చూసి కార్పొరేట్ కాలేజీలు ఉచితంగా సీటిచ్చేందుకు ముందుకు వచ్చాయి. అందులో ఒక కాలేజీలో చేరింది ఉష.
కాలం వేగంగా గడిచింది.
ఉష ఇంటర్, డిగ్రీ పాసయి సివిల్స్‌కి ప్రిపేర్ అయింది. టాపర్‌గా నిలిచింది. ఆంధ్రా క్యాడర్‌కి ఎంపికై ఇక్కడికే ఆర్డీవోగా నియమింపబడింది.
ప్రభుత్వం ఆమెకి బంగళా, కారు, నౌకర్లను ఇచ్చింది.
ఒకప్పుడు ఆగిన కార్లలోని వ్యక్తులను బిచ్చమెత్తుకున్న ఉష ఇప్పుడు తానే యజమానురాలయింది. ఆమె ఉన్నతిని చూసి గోపాలం సంతోషించాడు. ఒకరోజు ఆశీలమెట్ట కూడలిలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు బస్సులు ఢీకొన్నాయి. చాలా మందికి బలమైన గాయాలయ్యాయి. అందులో ఒక బస్సులో గోపాలం ఉన్నాడు.
సంఘటనా స్థలానికి ఆర్డీవోగా ఉష వచ్చింది. క్షతగాత్రులను యుద్ధప్రాతిపదికన ఆసుపత్రికి తరలింపజేసింది.
విషయం తెలుసుకున్న పూజారిగారు కూడా వచ్చారు.
అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న గోపాలాన్ని చూసారు.
అందరికీ సహాయం అందించే పనిలో ఉన్న ఉషని చూసి పూజారిగారు ఆమె ఉన్నతికి కారణం ఈ గోపాలమే అని నోరు తెరిచి చెప్పాలని అనుకున్నారు.
అయితే గోపాలం కళ్లతోనే వద్దని వారించారు.
అందరితో పాటే గోపాలాన్నీ అంబులెన్స్‌లో ఎక్కించారు ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు.
ఆ సమయంలో గోపాలం చల్లగా చూస్తూ చిరునవ్వుతో చివరి శ్వాస విడిచాడు.
ఆ నవ్వుకు అంతరార్థం ఒక్క పూజారిగారికే తెలుసు.
*

- ఎ. సీతారామారావు,19-3-10, లక్కపందిరివీధి,
విజయనగరం - 535002. ఫోన్ : 08922 237122.

మనోగీతికలు

జీవన స్వరాలు
జాతికన్నా నీతి గొప్పది
మతం కన్నా అభిమతం గొప్పది అని
నా అంతర్వాహిని రొద చేస్తుంటే
ఆనంద వాహిని మనసున
ఉప్పొంగుతుంటే
మదిలో రస జ్వాల ఎగయగా
కవనాభిలాష కమనీయమై
ఆకుల సవ్వడులకూ
సెలయేటి హొయలకూ
పరవశించే నా మది ఓ రస భావ ఝురి
పులకించే నా తనువు ఓ పూవింటి విరి
కమనీయ దృశ్యాలు చూడ
ఎంతటి దోయి ఆ హాయి
నా కవనాభిలాష నా తెలుగు యాస
కావాలి నాకో వరం
నే రాసే ప్రతిమాటా కావాలి
ఓ ముత్యాలసరం
నా జీవితం కావాలి
సాహితీనందనం
ఆస్వాదించాలి మరి
నేనా మధురం

- యలమంచిలి శివాజీ,
పెందుర్తిరోడ్డు, విశాఖ

మినీ కవితలు
ఫెయిల్యూర్
నా ఆశలకు అరవై పాదాలాయె
నా సమర్ధతకు రెండు పాదాలాయె
నా సహనానికి ఒకటే పాదమాయె
నా బుద్ధికి కాళ్లున్నా కుంటిదాయె
నా గమనం అగమ్యమాయె
కోపం
అదరగొట్టేస్తోంది
మంట పెట్టేస్తోంది
స్థిమితం లేకుండా చేస్తోంది
వాడిని కాదు ననే్న

- చావలి శేషాద్రి సోమయాజులు,
సెల్ : 9032496575.

తప్పు కాదు
పోరాటం తప్పు కాదు
అక్రమమార్గం తొక్కడం తప్పు
అందలమెక్కడం తప్పు కాదు
సమర్ధతతో కాకుండా
సిఫారసుతో ఎక్కడం తప్పు
ఎదుటి వారిని ఆదరించడం తప్పు కాదు
మనవారు అనే పక్షపాతం చూపడం తప్పు
గెలవడం తప్పు కాదు
ఆ గెలుపు న్యాయమైనది కాకపోతే తప్పు
తప్పొప్పులు బేరీజు వేయడం తప్పు కాదు
గుడ్డిగా కదనరంగాన దూకడమే తప్పు

- దుర్గాప్రసాద్ సర్కార్,
సెల్ : 9502 937 180.

మినీ
మెనీలు
ఎముకల ఇటుకల
దేహ గోరీల్లో
మనసు లైలా
టైమెంతయింది?
అడిగింది కాలాన్ని
ఆగిపోయిన వాచీ
ఇంట్లోని చెత్తను ఊడ్చేశారు
కన్ను మూసాక
నేనూ చెత్తనే
ఆకాశంలో
వెనె్నలంత అందంగా
చందమామ
నిద్రలో రాని సందేహం
లేచాక వచ్చింది
ఇది కలా? అని
- మాధవీ సనారా,
అనకాపల్లి.
సెల్ : 9440103134.

ప్రవాసి
రెక్కలలోకం నిశ్శబ్ద శతాబ్దం
పొరుగు దేశాల పరిమళం
వెలుగు చీకట్ల ప్రయాణం
నిర్జన శిథిల కుటీరం
దూరతీరాల ఆతిథ్యం
వికసించిన ప్రజాస్వామ్యం
ఉదయించిన ప్రపంచం
రంగు రంగుల వసంతం
స్వార్ధకోరికల విరహం
తుపాను తెచ్చిన సముద్రం
కుమ్మరించిన వర్షం
కానరాని వెలుగు కెరటం
భవిష్యత్తు అంధకారం
శిశిరమైన జీవితం
బ్రతుకు నిశ్శబ్దం
కల్లోల కాల సంగమం
జీర్ణమైన ఆశయం
ఎగసిన విప్లవం
అమ్మ ఒడిలో నివాసి
దిక్కుతోచని ప్రవాసి

- మహేష్ విశ్వనాథ
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- పుష్ప గుర్రాల