ఉత్తరాయణం

నిధుల దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయానికి, క్రియాశీలక పాత్రకోసం నిర్దేశించబడిన ఎం.పి. లాడ్స్ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయన్న కాగ్ తాజా నివేదిక క్షేత్రస్థాయిలో ఈ పథకం వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ విధమైన ఎంపీ స్థానిక ప్రాంత పథకం మన దేశంలో తప్ప ఎక్కడా అమలులో లేదన్నది స్పష్టం. 1993లో ఏడాదికి అయిదు లక్షలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం అయిదు కోట్లకు విస్తరించింది. కాగా ఈ పథకం అమలు లొసుగులతో కూడుకున్నదని లక్షల రూపాయలు అవినీతి బాట పడుతున్నాయని, ప్రజలకు ఉపయోగపడేలా నిధులు ఖర్చుకాకపోవడం, ఎంపీల నిరాసక్తత కారణంగా అధిక శాతం నిధులు వినియోగం కావడం లేదని, వ్యాపార సంబంధాలు, స్వంత అభివృద్ధికోసం నిధులు పక్కదారి పడుతున్నాయన్న కాగ్ నివేదికపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. మార్గదర్శక సూత్రాలను తుంగలో తొక్కి, పర్యవేక్షణ గాలికొదిలేసి నిధులను స్వాహా చేసిన అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎక్కువైన వలసలు
బెల్లం చుట్టూ చీమలు చేరును, నీళ్లుండే చెరువులోనే కప్పల చేరును అన్న సూక్తులకు ఆధునిక భాష్యం అధికారంలోవున్న పార్టీలోనికే జారిపోయినవారు చేరును అని చెప్పవచ్చు. అధికార పార్టీ ఇనుమును ఆకర్షించే అయస్కాంతం వంటిది. అధినేతలు పదవులనే చేపలను ఎరచూపి ఓడిపోయినవారు, పదవుల్లేక అల్లల్లాడుతున్న వారిని తమ పార్టీలోనికి ఆహ్వానించి రంగు కండువాలను కప్పి ఆహ్వానిస్తుంటారు. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ప్రజలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా కార్యకర్తల మనోభావాలను అనుసరించి అధికార పార్టీలోనికి వలసలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. దశాబ్దాలపాటు పదవులు,. అధికారం అనుభవించి, తీరా ఓడిపోయాక, నియోజకవర్గం సం క్షేమం, కార్యకర్తల మనోగతం, అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యాం అంటూ అరిగిపోయిన పాత డైలాగులు వల్లించి రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించేస్తున్నారు కొంత మంది ప్రజాసేవకులు. ప్రజాసేవ ఏ పార్టీలో వున్నా చేసుకోవచ్చు కదా అని తిరిగి ప్రశ్నిస్తే జవాబు వుండదు.
- ఎం.కనకదుర్గ, తెనాలి
నేరం గెలిచింది
2012, డిసెంబర్ 16వ తేదీన యావత్ సభ్యసమాజం సిగ్గుతో తల వంచుకునే రోజుగా గుర్తుండిపోయింది. భారతదేశ చరిత్రలో అభం శుభం తెలియని ఒక అమ్మాయిపై పాశవికంగా, కిరాతకంగా అత్యాచారం జరిపి చంపేసిన దుర్దినంగా నిలిచిపోయింది. కాగా ఈ అత్యాచారకాండలో అత్యంత ఉత్సాహంగా పాలుపంచుకున్న ఒక బాల నేరస్థుడు జువైనల్ చట్టం లొసుగులవలన డిసెంబర్ 20వ తేదీని నిర్భయంగా బయటకు వచ్చేసాడు. ఎంత హేయమైన నేరం చేసినా గరిష్ఠంగా మూడేళ్లు మాత్రమే శిక్ష విధించగల వీలునే మన కాలం చెల్లిన చట్టాల లొసుగులవలన శిక్ష నుండి తప్పించుకున్న వైనం చూసి నిర్భయ తల్లిదండ్రులేకాక మొత్తం సభ్యసమాజం నిర్భయ అత్యాచారం కన్నా ఎక్కువగా బాధపడింది. 18 సంవత్సరాల వయస్సులో అంతటి ఉన్మాదం పోగుచేసుకున్న ఆ బాలుడిని చట్టాల పరిధిలో, పరిమితులకు లోబడి నామమాత్రపు శిక్ష విధించి, తర్వాత వదిలెయ్యడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక యువతిపై కిరాతకంగా దాడిచేసి నిర్దయగా వ్యవహరించిన బాల ఉన్మాదిని బాల నేరస్థుడి పేరిట సమాజంలో తిరిగే అవకాశం యివ్వద్దని మొత్తం భారత జాతి ఘోషించినా ఫలితం లేకపోయింది. ధర్మం దారుణంగా ఓడిపోయి నేరం గెలిచింది. ఇటువంటి తీర్పులు సమాజంలో మరింత కిరాతక నేరాలు చేసేందుకు ఉన్మాదులకు ప్రేరణ యిస్తాయి. ఇటువంటి పరిస్థితిని ముందే గ్రహించి, జువైనెల్ చట్టాన్ని సవరించకుండా కబుర్లతో కాలం వెళ్లబుచ్చిన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి కూడా ఇందులో సమానమైన బాధ్యత వుంది.
- సి.సాయిమనస్విత, విజయవాడ
అమలుకాని ధూమపాన చట్టం
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం తెచ్చి పది సంవత్సరాలు దాటిపోతోంది. అయినా ఆ చట్టం సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవు. సంబంధిత నిబంధనలను అతిక్రమించే వారిపై కేసులు నమోదుచేసే అధికారాన్ని ఆ చట్టం పోలీసులకు దాఖలు పరచింది. విద్యాసంస్థలకు వంద గజాల దూరంలోపల ఎలాంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని, 18 ఏళ్ళలోపు వయసుగల పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని సదరు చట్టం పేర్కొంటోంది. బహిరంగంగా పొగ తాగుతూ మొదటిసారి పట్టుబడిన వారికి వంద రూపాయలు, రెండోసారి పట్టుబడిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడానికి అది వీలు కల్పిస్తోంది. ఆ చట్టం వచ్చి ఇనే్నళ్ళు గడిచినా అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం విచారకరం. గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగేవారు పెద్దసంఖ్యలో కనిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి పొగ రాయుళ్ళపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదు.
- గోదూరు అశోక్, కరీంనగర్
పద్మనాభం గొప్పనటుడు
అలనాటి హాస్య నటులు రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, పద్మనాభం, రాజబాబు పండించిన హాస్య భరిత చిత్రాలు ఈనాటికి సజీవం. పద్మనాభం గొప్ప హాస్యనటుడు, దర్శకుడు. ఎన్నో అద్భుత సంగీత భరిత చిత్రాలు నిర్మించి అవార్డులు అందుకున్నారు. వాటిలో దేవత, శ్రీరామకథ, కథానాయిక మొల్ల, పొట్టి ప్లీడర్ వంటివి కొన్ని. అటువంటి హాస్య నటుడు పద్మనాభం గారికి పద్మశ్రీ ఎందుకు రాలేదు?
- టి.ప్రసాదరావు, అచ్చంపేట, గుంటూరు జిల్లా