కరీంనగర్

నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 5: జిల్లాలోని శ్రీపాద-ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల పరిధిలోని భూ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయబడవని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పునరావాస కాలనీలలో వౌళిక వసతుల కల్పన, భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీపాద-ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల పరిధిలోని భూనిర్వాసితులకు పునరావాస కాలనీలలో ఇందిరా ఆవాజ్ యోజన పథకం (ఐఎవై) క్రింద ఇదివరకే ఇండ్లు మంజూరు చేశామని, వెంటనే ఇండ్లు నిర్మించుకోవాలని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో మురుమూర్‌కు 1,756, వేమునూర్‌కు 491, కుక్కలగూడూరుకు 192, మద్దిర్యాలకు 427, పొట్యాలకు 732, రాంనూర్‌కు 117, ఉండేడకు 335, తాళ్లకొత్తపేటకు 317, చెగ్యాంకు 857, కోటిలింగాలకు 200, ముక్కట్రావుపేటకు 139 చొప్పున ఐఎవై ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. అలాగే మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిధిలోని భూ నిర్వాసితులకు కొదురుపాక గ్రామానికి 1,187, నీలోజిపల్లికి 549, శాభాష్‌పల్లికి 157, వరదవెల్లికి 725, చీర్లవంచకు 2,017, చింతలఠాణాకు 989 చొప్పున ఐఎవై ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. సంబంధిత ప్రాజెక్టుల భూ నిర్వాసితులు పునరావాస కాలనీలలో వారికి కేటాయించిన ఫ్లాట్లలో వెంటనే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని సూచించారు. రెండు ప్రాజెక్టులలో వచ్చే జూన్‌లో నీటిని నింపుతామని, గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని, వెంటనే కొత్త ఇండ్లు నిర్మించుకొని పునరావాస కాలనీలకు మారాలని సూచించారు. భూ నిర్వాసితులు వెంటనే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసంపూర్తి ప్రభుత్వ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి వసతి కల్పించాలని సూచించారు. భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌజింగ్ పిడి నరసింహారావు, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల ఆర్‌డిఓలు చంద్రశేఖర్, నారాయణ రెడ్డి, భిక్షానాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాను దత్తత కొడుకులే పాలిస్తున్నారు.
* ఉద్యమ స్ఫూర్తితో ప్రాంతేతరులపై సిరిసిల్ల నుండే ఉద్యమం ప్రారంభించాలి
* జిల్లా అభివృద్ధిపై శే్వత పత్రం ఇవ్వాలి
* సిరిసిల్లలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల, ఫిబ్రవరి 5: ఈ ప్రాంతాన్ని దత్తత కొడుకులే పాలిస్తున్నారని, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపిలు ప్రాంతేతరులైనందున సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ ఉద్యమ స్ఫూర్తితో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ గౌరవ ప్రదమైన పోరాటం చేశామో, ఇపుడు అదే ఉద్యమం ప్రారంభం కావాలని, ప్రాంతేతరులైన ఎమ్మెల్యే, ఎంపిలు మనల్ని పాలిస్తున్నారని, వీరిపై స్ఫూర్తిదాయక పోరాటం సిరిసిల్ల నుండే ప్రారంభం కావాలని పొన్నం పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే మనం, మన సామాజిక వర్గాలు, పేద వర్గాలు బాగుపడుతాయని, మంచి ప్రణాళికలు వస్తాయని ఆశించామో అది నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణ 60 వేల కోట్ల అప్పుల నుండి లక్ష కోట్ల అప్పులను తెచ్చుకునే దుస్థితికి వచ్చిందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, బిల్లు పాసయ్యే సందర్భంగా తాను పార్లమెంటులో తన భాగస్వామ్యం అయిన వ్యక్తిగా ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చాలా కాలంగా వెనుకబడి ఉందని, సిఎం తనయుడిగా భావించి ఇక్కడి ప్రజలు 2009, 2010, 2014లలో కెటిఆర్‌ను గెలిపిస్తే బీమవరం నుండి పోటీ చేస్తానని ప్రకటించడం ఇక్కడ ప్రజలను అవమానించడే అన్నారు. అలాగే సిరిసిల్లకు ఎన్ని రోజులుగా రావడం లేదని ప్రశ్నిస్తూ, ఇక్కడి ప్రజల సమస్యలు గాలికి వదిలేశాడని ఆరోపించాడు. నిన్ను గెలిపిస్తే ఇక్కడ నీ స్థానంలో డూప్లికేట్ ఎమ్మెల్యేలుగా పలువురు చలామణి అవుతున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో ఇక్కడ ప్రజలకు అంతుచిక్కడం లేదన్నారు. టిఆర్‌ఎస్‌లో 2001 నుండి పని చేసిన కార్యకర్తలను విస్మరించి, తమ పార్టీ నుండి వచ్చిన వారితో పార్టీని నింపుకోవడంతో పాత, కొత్త శ్రేణుల మద్య పోట్లాటలు మొదలయ్యాయని, ఏ ఉద్యమం చేయని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఈ పదవి ఇచ్చారన్నారు. 20 నెలలుగా కొత్త అభివృద్ది పనులు లేవని, వంద శాతం మరుగుదొడ్లు అన్నావని, వాటిని చూడడానికి వెళ్ళినవారిపై దౌర్జన్యం చేయడం ఏమిటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 80 వేల మరమగ్గాలుండగా, అందులో 40 వేల మగ్గాలున్న సిరిసిల్లను విస్మరించి, వరంగల్‌కు టెక్స్‌టైల్ జోన్ తెస్తున్నారన్నారు. దీనిలో ఎంపి అక్కడి ప్రాంతీయుడని, ఇక్కడి ఎమ్మెల్యే ప్రాంతేతరుడైనందున దానిపై నోరుమెదపడం లేదన్నారు. అలాగే వరంగల్‌కు 35 వేల ఇండ్లు ఇస్తే, జిల్లాలోని 12 మంది తెరాస ఎమ్మెల్యేలలో ఒక్కరూ నోరు విప్పడం లేదని, ఇందులో ఎంపి జన్మభూమి రుణం తీర్చుకున్నాడన్నారు. ప్రకటనలకే తప్ప తెరాస పాలనలో అభివృద్ది శూన్యమన్నారు. ఇక్కడి ఇసుక అక్రమ రవాణాకు బాధ్యులు టిఆర్‌ఎస్ పార్టీవారేనని, అక్రమ ఇసుక నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విజిలెన్సుచే విచారణ జరిపి నివేదిక తెప్పిచ్చుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్దిపై శే్వతపత్రం ఇవ్వాలని, డ్రైవింగ్ స్కూలు మినహా అన్ని పాత మంజూరులేనని అన్నారు. గతంలో తాము ప్రజల పక్షాన నిలబడి ఇక్కడి నేతన్నలను ఆదుకున్నామన్నారు. పదవి ఉన్నా లేకున్నా వారి పక్షాన ఉండి పోరాడుతామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ,

‘గ్రేటర్’లో గులాబీ గుబాలింపు...
* ఫలించిన ‘తారక’ మంత్రం
* జిల్లాలో తెరాస సంబురాలు

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో గులాబీ గుబాలించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కెటిఆర్ గ్రేటర్ గెలుపు బాధ్యతలు తన భుజస్కందాలపై మోసి ఓంటిచేత్తో పార్టీ విజయాన్ని నమోదు చేసుకుని తన తండ్రి కెసిఆర్‌కు గ్రేటర్ గెలుపును అందించారు. ఓట్ల లెక్కింపులో తెరాస విజయదుందుభి మ్రోగించడం పట్ల శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గులాబీ శ్రేణుల సంబురాలు హోరెత్తాయి. బాణాసంచా కాల్చుతూ..స్వీట్లు పంచుతూ..కేరింతలు కొడుతూ.. నృత్యాలు చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందడోలికల్లో తేలియాడారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు హుజురాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల తదితర పట్టణాల్లో టిఆర్‌ఎస్‌తోపాటు దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యంగా కెటిఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో సంబురాలు మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ, నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు డప్పు కొడుతూ, ఈల వేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ రమేష్‌తోపాటు కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా సంబురాలు జరిగాయి. మొత్తం మీద గ్రేటర్‌లో తెరాస విజయదుందుంబి మోగించడం పట్ల గులాబీ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి.

పరిశ్రమల బలోపేతంతోనే యవతకు ఉద్యోగ అవకాశాలు

* రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 5: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి, బిజినేస్ ప్రాసెసింగ్ ఔట్ సోర్సింగ్ రంగాలలో పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కోన్నారు. మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ప్రభుత్వ డిగ్రి కళాశాలలో ఐటి, బిపివోలపై శుక్రవారం వివిధ రాష్ట్రాల ప్రొఫెసర్స్, సైంటిస్టులు, విద్యావెత్తలతో రెండు రోజుల జాతీయ స్థాయి సెమీనర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వివిధ రంగాలలో గల పరిశోధకులకు తగిన ప్రోత్సహం కల్పించాలని అభిప్రాయపడ్డారు. సమాచార,, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలు, వాటి అభివృద్ధిపై ఆయన సుధీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ సంస్థల స్థాపన, అభవృద్ధిపై తగిన ప్రోత్సహం కల్పిస్తే దేశ అభివృద్ధికి వెన్నముకగా నిలుస్తాయని ఆయన పేర్కోన్నారు. అలాగే నూతన పరిశోధనలు చేపట్టే వారికి, నూతన వ్తువులు కనుగొనే వారికి తగిన ప్రోత్సహం కల్పించాలని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినయోగించుకొని, ఇప్పుడున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రామిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించి యువత ఉపాధికి బాటలు వేయడానికి కృషి చేయాలన్నారు. అలాగే ఈ సెమినార్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పరిశోధకులు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాతావాహన యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ ఎక్బాల్ అలీ, కాకాతీయ యూనివర్శిటి డైరెక్టర్ కృష్ణామాచార్యులు, స్థానికి కళాశాల ప్రిన్సిపాల్, సెమినార్ చైర్మన్ ప్రొపెసర్ సి.రాజలింగం, కన్వీనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో హుజూరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
* హుజూరాబాద్‌లో విషాదం
* ఆత్మహత్యపై అనుమానాలు
హుజూరాబాద్, ఫిబ్రవరి 5: హైదరాబాద్‌లో హుజూరాబాద్‌కు చెందిన విద్యార్థి శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక పట్టణంలోని పాత సూపర్‌బజార్ రోడ్డులో నివసముండే గోలి రవిందర్ - శోభలకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు గోలి సాయి కృష్ణ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు సాయి ధనుష్ మంథనిలో ఏడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడంటూ, వెంటనే రావాలంటూ కళాశాల నుండి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. ఇదిలా ఉంటే శ్రీ గాయత్రి కళాశాల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమ కుమారుని మృతదేహాన్ని హుటాహుటిన మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించి వెంటనే కళాశాల హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరిని ఇళ్లకు పంపించారని ఆరోపించారు. తాము వచ్చేదాకా మృతదేహాన్ని ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే ఎందుకు ఉండనివ్వలేదని ప్రశ్నించారు. కుర్చీలో కూర్చుని ఉరివేసుకున్నాడని కళాశాల యాజమాన్యం చెబుతున్నారని, అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కళాశాల లెక్చరర్ల ఒత్తిడితోనే తమ కుమారుడు మరణించాడా? లేక మరేమైనా జరిగిందా? అనేది విచారణ చేసి వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, అతను చిన్నతనం నుండి హాస్టల్‌లోనే ఉన్నాడని, పదోతరగతి వరకు చదువులో కూడా ఉన్నతంగా ఉండేవాడని తెలిపారు. సూసైడ్ నోట్‌ను కూడా కళాశాల యాజమాన్యమే సృష్టించిందని చెప్తున్నారు.
సాయికృష్ణ మృతితో సూపర్‌బజార్‌లో విషాదం అలుముకుంది. పలువురు వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇలా చదువుకోసం హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థి ఇలా శవమవుతాడని ఊహించలేదని బంధువులు వాపోయారు. సాయికృష్ణ మృతదేహం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం ఇక్కడకు రానుంది.

తాగునీటి ఎద్దడి నివారణలో సర్కార్ విఫలం
* జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చండి
* ప్రతి గ్రామానికి 10నుంచి 15లక్షలు కేటాయించాలి
* సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యం
* కరవు జిల్లాగా ప్రకటించలేని అసమర్ధ ప్రభుత్వం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు -
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 5: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. గతంలో కన్నా ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం కానున్నదని, అయినప్పటికీ త్రాగునీటి ఎద్దడిని నివారించే దిశగా చర్యలు చేపట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 1200పైచిలుకు గ్రామాలుంటే, అన్ని గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని, వెంటనే గ్రామాన్ని బట్టి ప్రతి గ్రామానికి రూ.10 నుంచి రూ.15లక్షలు కేటాయించి త్రాగునీటి సమస్యను తీర్చాలని అన్నారు. త్రాగునీటి ఎద్దడి నివారణపై ఇప్పటివరకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉంటే జిల్లాలో కొత్త బోర్లు వేయవద్దని, బావులు తవ్వవద్దని నిబంధనలు పెట్టడం సరికాదని, భేషరతుగా కొత్తగా బోర్లు, బావులు తవ్వడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల బావుల నుంచి నీళ్లు తీసుకోవాలని అధికారులు చూస్తున్నారని, గతేడాదిలో 6వేల రూపాయలకే రైతుల బావిలో నుంచి నీరు తీసుకెళ్లారని, ఆ డబ్బులు కూడా మొన్నమొన్న రైతులకు ఇచ్చారని, ఈ సారి రైతులు బావులను లీజ్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, బావిలో ఉన్న నీటితో పంటలు వేసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. అటు సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఈ జాతరపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన టిఆర్‌ఎస్ పాలకులు ఇప్పుడు పట్టించుకోవటం లేదని విమర్శించారు. జిల్లాలో 50చోట్లకుపైగా జాతర జరిగే అవకాశాలున్నాయని, కొన్నిచోట్ల పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎస్సారెస్పీ నుంచి ఒక టిఎంసి నీరు విడుదల చేస్తే సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు కొంతమేర తాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉందని, ఆ దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నికలు రావాలే..ఆ ప్రాంతాల్లో ఆచరణ సాధ్యంకాని హామీలిస్తూ ప్రజల్ని మాయమాటలతో ఆకర్షించి ఓట్లు వేయించుకోవాలనే ద్యాస తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టింపులేదని దుయ్యబట్టారు. జిల్లా అంతటా కరువు విలయతాండవం చేస్తుంటే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించలేని అసమర్ధ ప్రభుత్వమని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కళ్యాడపు ఆగయ్య, పుట్ట నరేందర్, గంట రాములుయాదవ్, నాగుల బాలాగౌడ్, దామెర సత్యం, చెల్లోజి రాజు, దూలం రాధిక, ఆడెపు కమలాకర్, హయాగ్రీవచారి పాల్గొన్నారు.

చేనేత వస్త్రాలతోనే శరీరానికి రక్షణ
* కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 5: వేసవిలో చేనేత వస్త్రాల ధారణతోనే శరీరానికి రక్షణ కల్పించుకోవచ్చని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం నగరంలోని రెవెన్యూగార్డెన్‌లో తమిళనాడు హైండ్లూమ్ వీవర్స్‌కో ఆపరేటివ్ సొసైట లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కో ఆప్టెక్స్ చేనేత వస్త్రప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, చేతితో నేయబడిన కో ఆప్టెక్స్ వస్త్ర ప్రదర్శన శుక్రవారం నుంచి ఫిబ్రవరి 9వరకు రెవెన్యూగార్డెన్లో అందుబాటులో ఉంచటం అభినందనీయమన్నారు. ఈచేనేత వస్త్రప్రదర్శన, అమ్మకాల్లో కొత్తకొత్త డిజైన్లతో నేచిన కాంచీపురం సిల్కు చీరెలు, ఆరణి సిల్కు చీరెలు, సాఫ్ట్ సిల్కు చీరెలు, ఆర్గానిక్ కాటన్ చీరెలు, చెట్టినాడు కాటన్ చీరెలు, పొన్నాయ్ కాటన్ చీరెలు, మధురై కాటన్‌చీరెలు, బెడ్‌సీట్లు, లుంగీలు, టవల్స్,కుర్తీలు, డ్రెస్ మెటీరియల్స్ తదితర అన్నిరకాల చేనేత వస్త్రాలు ఒకేచోట లభిస్తాయన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులు కొనుగోలు చేసి చేనేత వృత్తికార్మికులను ఆదుకొనేందుకు నగరప్రజలు అధికసంఖ్యలో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కో ఆప్టెక్స్ చేనేత షోరూంను త్వరలోనే నగరంలో ప్రారంభించాలని కో ఆప్టెక్స్ ఎండికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. అంతకుముందు కలెక్టర్ చేనేత వస్త్ర ప్రదర్శనలో గల చీరెలను ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో కో ఆప్టెక్స్ సీనియర్ రీజనల్ మేజర్ కె.యువరాజ్, వస్త్ర ఉత్పత్తి మేనేజర్ డి.రమణి,షోరూం మేనేజర్లు జి.కృష్ణమూర్తి, ఎ.క్రాంతికుమార్,తదితరులు పాల్గొన్నారు.
రాజారంలో మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
మేడిపల్లి, ఫిబ్రవరి 5: మండలంలోని రాజారం శివారులో మంత్రాల నెపంతో ఈరవేని నర్సయ్య (60)అనే వృద్ధుడిని అదే గ్రామానికి చెందిన ఇట్యాల నరేష్ అనే వ్యక్తి కత్తితో పొడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా నరేష్ కుటుంబ సభ్యులకు నర్సయ్య మంత్రాలు చేస్తున్నారని కక్ష పెంచుకొని ఊరి చివరలో ఉన్న గొర్రెల మంద వద్ద కత్తితో పొడిచి హత్య చేసి శవం ప్రక్కనే ఉన్న కందకంలో పూడ్చిపెట్టాడు. కుటుంబ సభ్యులకు నర్సయ్య కనిపించకపోవడంతో శవం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోరుట్ల సిఐ రాజశేఖరరాజు, ఎస్సై రవి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరువు మండలాలను ప్రకటించాలి
* పెద్దపల్లి మాజీ ఎంపి వివేకనంద
వెల్గటూరు, ఫిబ్రవరి 5: కరీంనగర్ జిల్లాలోగల అన్ని మండాలలను కరువు మండలాలుగా ప్రకటించాలని పెద్దపల్లి మాజీ ఎంపి వివేకానంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్గటూరు మండల కేంద్రంలో విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో 19 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగతా వాటిని కూడా గుర్తించి అక్కడి రైతులను ఆదుకోవాలని అన్నారు. మండలంలోని ముంపు గ్రామాల్లో చాలా సమస్యలున్నాయని, వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు వేసవి కాలం దృష్ట్యా త్రాగునీరు అందించేలా కృషి చేయాలని వారు కోరారు. అనంతరం మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముంపు గ్రామ సమస్యను పరిష్కరించాలని, పది రోజుల క్రితం రాష్ట్ర రహదారిపై ధర్నా, రాస్తారోకో చేయగా అధికారులు స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి కో-ఆప్షన్ మెంబర్ ఎం.డి.బషీర్, ధర్మారం మండల శాఖ అధ్యక్షులు కాడి సూరి, కాంగ్రెస్ నాయకులు మేరుగు మురళి, సందీప్ రెడ్డి, సతీష్, రాజేశం, శ్రీనివాస్, సంతోష్, తిరుమల్, భద్రి సతీష్, రాంచందర్, రమేష్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి
* పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 5: ఇటుక బట్టీలలో అత్యాచారానికి గురైన బాలికకు చట్ట పరంగా తగిన న్యాయం చేయాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో గల ఎసిబి ఇటుక బట్టీని వారు శుక్రవారం సందర్శించారు. బుధవారం రాత్రి ఇటుక బట్టీలలో పని చేసే కార్మికుల చెందిన 15 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. రాత్రి వేళలో బాలిక ఆరు బయటకు బహిర్భూమికి వెళ్లడం వల్ల ఇటుక బట్టీలో పని చేస్తున్న ధనుంజయ్ అనే యువకుడు అత్యచారానికి ఒడగట్టినట్టు కార్మికులు పౌరహక్కుల సంఘం నేతలకు వివరించారు. అలాగే ఇటుక బట్టీలలో సౌకర్యాలను వారు పరిశీలించి, కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దపల్లిలోని ఐబి అతిథి గృమంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి మాట్లాడుతూ ఇటుక బట్టీలలో మరుగ దొడ్లు లేక పోవడం వల్ల రాత్రి వేళలో బహిర్భూమికి వెళ్లిన బాలిక అత్యాచారానికి గురైందన్నారు. ఇటుక బట్టీలలో సౌకర్యాలు మెరుగు పరచాలని హైకోర్టు ఆదేశించినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల అమలు జరగడం లేదన్నారు. దీనితో వలస కార్మికులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. బాలిక అత్యచార ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటుక బట్టీలలో ఇప్పటికీ కార్మికుల శ్రమ దోపిడీ కొనసాగుతుందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం నాయకులు రాజ్‌గోపాల్, వినోద్, సుచరిత తదితరులు ఉన్నారు.