అదిలాబాద్

నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, ఫిబ్రవరి 19: జిల్లాస్థాయిలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. శుక్రవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో సైతం నేరాల అదుపునకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కేసుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న వారెంట్లు, కేసుల పురోగతి, కేసుల ముగింపు, ఛార్జిషీట్ల వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో డిఎస్పీ అందె రామలు, రూరల్ సిఐ వినోద్, ఎస్సై రవిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

భార్య హంతకునికి జీవిత ఖైదు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యనే హతమార్చిన నెనె్నల మండలం కోనంపేట గ్రామానికి చెందిన కె.మల్లయ్య అనే వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు రూ. 2వేలు జరిమానా విధిస్తూ జిల్లా మూడవ అదనపు జడ్జి కుంచాల సునీత శుక్రవారం తీర్పు నిచ్చారు. ఎపిపి సత్యశ్రీలత కథనం ప్రకారం మల్లయ్య, భార్య వెంకమ్మల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో 2014 అగస్టు 8న రాత్రి గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో మల్లయ్య తన భార్య వెంకమ్మను గొడ్డలితో విచక్షణా రహితంగా నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వెంకమ్మ మృతి చెందింది. ఈమేరకు సర్పంచ్ డోలె చిన్నక్క మరుసటి రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో ఇప్పటివరకు 14మందిని విచారించిన న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించడంతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

ఆస్తి పన్ను విషయంలో తగాదా...
* అధికారులపై ఇంటి యజమాని దాడి
* టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 19: బల్దియా అధికారులు ఆస్తి పన్ను చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో ఓ ఇంటి యజమాని దాడి చేసి గాయపర్చిన సంఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే పట్టణంలో రిక్షా కాలనీకి చెందిన బహాదూర్ సింగ్ రాథోడ్ 2012 నుండి ఆస్తి పన్ను చెల్లించడంలేదు. ఈ విషయమై అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు పన్ను చెల్లించమని కోరగా.. కోపోద్రోక్తుడైన ఇంటి యజమాని ఆసిస్టెంట్ కమిషనర్ రవిబాబు, సిబ్బందిపై దాడిచేసి డిమాండ్ నోటీసులను చించివేశాడు. ఈ విషయమై కమిషనర్‌కు ఫోన్‌ద్వారా తెలుపగా కమిషనర్, ఆర్‌వోలు సంఘటన స్థలానికి చేరుకొని పన్ను చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించగా.. ఆ ఇంటి యజమాని వెంటనే పన్ను చెల్లించాడు. అనంతరం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బహాదూర్‌సింగ్‌పై ఫిర్యాదు చేయగా, టూటౌన్ సిఐ వెంకటస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీకూతుళ్ల ఆత్మహత్య
మందమర్రి, ఫిబ్రవరి 19: మందమర్రి మండలంలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదం నింపింది. మంచిర్యాల రైల్వే ఎస్సై మునీరుల్లా కథనం ప్రకారం తాండూర్ మండలానికి చెందిన దోమల లావణ్య (30), కరిష్మాశ్రీ (5) తల్లీకూతుళ్లు శుక్రవారం ఉదయం బెల్లంపల్లి వద్ద ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహాలు ఇంజిన్‌తో పాటు రవీంద్రఖని వరకు రావడం జరిగింది. విషయాన్ని గమనించిన ట్రైన్ ఫైలట్ ట్రైన్ నిలిపివేసి మంచిర్యాల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని మంచిర్యాలకు పంపించారు. లావణ్య కూతురు కరిష్మాశ్రీ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోందని, మానసిక వికలాంగురాలైన కూతురును చూడలేక మనోవేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. మృతురాలి భర్త భగవంతుడు వండ్రంగి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
* సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19: వేసవిలో తలెత్తే నీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు మందుస్తు చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. శుక్రవారం సబ్‌కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వేసవిలో తలెత్తే నీటి ఎద్దడి గురించి అధికారులు, ప్రజాప్రతినిధులతో డివిజన్ స్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరైడ్ సమస్యపై ఆరా తీశారు. వేసవిలో బోర్లు, బావులు అడుగంటి పోయే ప్రమాదం ఉన్నందున అధికారులు నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరాచేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడి నివారించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఎల్పీవో శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల తహశీల్దార్, ఎంపిడిఓ, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇలు, ఎఇలు, ఎంపిపి, జెడ్పీటిసిలు పాల్గొన్నారు.

కలుషిత నీరు తాగి విద్యార్థులకు అస్వస్థత
* బాధిత విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
భైంసా రూరల్, ఫిబ్రవరి 19: పట్టణంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థినీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉద యం అల్పాహారం అనంతరం పాఠశాలకు స్వచ్ఛమైన నీరు రాకపోవడంతో బోరుబావి నీళ్లు తాగారు. దీంతో పలువురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ వాణి విద్యార్థులను హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రి కి తరలించారు. 9వ తరగతికి చెందిన ఉమా, జయశ్రీ, ప్రవళిక, శిరీష, అనురాధ, 8వ తరగతికి చెందిన అస్మిత, 6వ తరగతికి చెందిన రాజమణిలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. కాగా, గతరాత్రి నిర్వహించిన పెర్‌వల్ పార్టీలో నృత్యం చేసిన విద్యార్థినులు ఉదయం పూట గత రాత్రికి చెందిన అల్పహారం భుజించినట్లు తెలుస్తోంది. పాఠశాల యజమాన్యం మాత్రం కలుషిత నీరు తాగి విద్యార్థినులు అస్వస్థతకు గురైన్నట్లు చెబుతున్నారు. ఏరియా ఆస్పత్రిలో అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ విద్యార్థినులకు వైద్యసేవలను అందించారు. అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఘటన జరిగిన వివరాలను కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ వాణి ద్వారా తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.

సమన్వయంతో పనిచేయాలి
* ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం
మంచిర్యాల, ఫిబ్రవరి 19: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పేదలకు అందేలాచూడాలని ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం అన్నారు. శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండవ విడత చేపట్టనున్న పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతల పథకాన్ని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా చూడాలని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మంచిర్యాల, చెన్నూర్ ఎంపిపిలు బేర సత్యనారాయణ, మైదం కళావతి, జడ్పీటీసీ రాచకొండ ఆశలత, డివిజన్‌లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు
* పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, ఫిబ్రవరి 19: ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిపై అవగాహన పెంచుకొని లబ్దిపొందాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఫిల్డ్ పబ్లిసిటి శాఖ అధ్వర్యంలో విద్యార్థులచే పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పివో, ఆర్డీవోతో పాటు పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పివో కర్ణన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం దేశంలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి చిన్నారిని మొదలుకొని వృద్దుల వరకు ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా బేటి బచావో.. బేటి పడావో, స్వఛ్చ్భారత్, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, జన్‌ధన్ యోజన, అటల్ ఫింఛన్ యోజన, ముద్రలోన్లు, పి ఎం జెజెబివై తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటి ద్వారా నిరుపేదలను ఆదుకునే ఆలోచనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాలపై అవగాహన కల్పించుకొని అర్హులు లబ్దిపొందాలని అన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల కోసం కోట్లాది నిధులు కేటాయించారని, వాటి ద్వారా లబ్దిపొందాలని సూచించారు. అనంతరం ఫిల్డ్ పబ్లిసిటి అధికారి పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ప్రియాంక, ఆర్డీవో ఐలయ్య, ఎంపిపి విమలబాయి, జడ్పీటీసీ జగజీవన్, సర్పంచ్ బొంత అశారెడ్డి, ఎంపిడీవో లక్ష్మణ్, తహసీల్దార్ రమేష్ రాథోడ్, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

కార్మికుల పొట్టగొట్టే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించాలి
* బీడీ కట్టపై పుర్రెగుర్తుతో మహిళల ఉపాధికి ఎసరు
* తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ
* నిర్మల్‌లో బీడీ కార్మికుల మహధర్నా, ఆర్డీవో కార్యాలయం ముట్టడి
నిర్మల్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీడీ కార్మికుల పొట్టగొట్టే నిర్ణయాలను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. బీడీ కట్టలపై 85శాతం వరకు పుర్రెగుర్తు బొమ్మను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌లో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా హజరైన కార్మికులు ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ ధర్నాలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బీడీ పరిశ్రమేనన్నారు. ఈ పరిశ్రమలో దాదాపు 7లక్షల మంది కార్మికులు, మూడు లక్షలమంది తునికాకు తెంపే కార్మికులు, ఇతర కార్మికులు ఉన్నారన్నారు. అలాగే దేశవ్యాప్తంగాచూస్తే 60లక్షల మంది బీడీ కార్మికులు మరో 50లక్షల మంది తునికాకు సేకరించే కార్మికులు, 40లక్షల మంది రైతులు, రైతు కూలీలు ఇలా మొత్తం కోటి యాభై లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వివరించారు. ఇంతమందికి ఆధారంగా ఉన్న బీడీ పరిశ్రమ కేంద్రం నిర్ణయం కారణంగా మూతబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు బీడీ కట్టపై ఆరోగ్య హెచ్చరికల బొమ్మను 60శాతం నుండి 40శాతానికి తగ్గించిందన్నారు. కాని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం దానిని 85శాతానికి పెంచుతూ జివో 727( ఇ)ని విడుదలచేయడం శోచనీయమన్నారు. దీనివల్ల బీడీ కట్టపై ఆయా యాజమాన్యాల పేరు, బ్రాండును ముద్రించే అవకాశం లేకుండాపోతోంది. దీంతో యాజమాన్యాలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. కాగా ఇప్పటికే బీడీ అమ్మకాలు తగ్గినందున కార్మికులకు సరైన పనిదొరకడం లేదని, తాజా నిర్ణయంతో పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో పనిలేక ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దారి తీస్తుందన్నారు. బీడీలు చుట్టే కార్మికులైన మహిళలకు ఆర్థికవెసులుబాటు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సమస్య మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే బీడీ కార్మికులకు చేతినిండా పనిలేక సగం రోజుల పనిదినాలతో అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించనంతవరకు ఈ నిబంధనను బీడీ పరిశ్రమపై రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యహెచ్చరిక బొమ్మ 40శాతాన్ని యధావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో శివలింగయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.బక్కన్న, ఉపాధ్యక్షులు రామలక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కె. రాజన్న, నాయకులు గఫూర్, గంగన్న, లక్ష్మీలతో పాటు ఎఐకేఎంస్ జిల్లా అధ్యక్షులు నంది రామయ్య, జిల్లా నాయకులు ఎం.శంకర్, పీడీ ఎస్‌యూ నాయకులు వెంకటేష్, శేఖర్‌లతో పాటు డివిజన్ నలుమూలాల నుండి వచ్చిన వేలాది మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ యోచన
* లక్ష ఉద్యోగాల కల్పనే సర్కారు లక్ష్యం
* జైనథ్, బేల మండలాల్లో మంత్రి రామన్న పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 19: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికి ఏకకాలంలోనే రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టిసారించారని, త్వరలోనే రుణమాఫీ అమలుకు విధాన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర అటవీ,పర్యావరణ,బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం జైనథ్, బేల మండలాల్లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బేల మండల కేంద్రంలో రూ.13లక్షల వ్యయంతో నిర్మించనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి, కస్తూర్భిగాంధీ బాలికల విద్యాలయం ప్రహారిగోడకు శంఖుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సాగునీరందించేందుకు ఎన్నికోట్లు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో 12 లక్షల ఎకరాలకుసాగునీరందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. డ్రిప్ ఇరిగేష్ ద్వారా తక్కువ నీటితో పంట సాగుచేసేలా ప్రభుత్వం అధిక సబ్సిడీపై యూనిట్లు మంజూరి చేస్తుందని, ఎస్సీ,ఎస్టీలకు 12.5 ఎకరాల పరిమితి వరకు 100 శాతం, బిసిలు, ఇతరులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేపట్టని అభివృద్ధి పథకాలు 20 నెలలో తెరాస ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. 150 కోట్లతో 250 మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణం చేపడుతామని, భూగర్భజలాలను ఒడిసిపట్టేందుకు ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చదువుకున్న వారందరికి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయని, తల్లిదండ్రులు పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. ఇప్పటికే 40వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, లక్ష ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా తమ ప్రభుత్వం ఉపాధి కల్పనపై దృష్టిసారించిందని మంత్రి తెలిపారు. అర్హులైన పేదలందరికి రెండు పడకల గదులు నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు. కాకతీయ మిషన్ ద్వారా 45వేల చెరువుల పునరుద్దరణకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని పేర్కొన్నారు. అనంతరం జైనథ్ మండల కేంద్రంలో రూ.13లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి, రూ.9లక్షల వ్యయంతో నిర్మించనున్న జిల్లా పరిషత్ హైస్కూల్ భవనం, ప్రహారి గోడ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. జైనథ్ మండలంలో ఒక దిపాయిగూడలో తప్పా ఎక్కడా ప్రభుత్వ పంచాయతీ భవనాలు లేవని, రూ.కోటి 30లక్షల వ్యయంతో మండలంలోని అన్ని పంచాయతీల్లో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. పాఠశాలలు పిల్లలకు సరిపోని పక్షంలో అదనపు గదులు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కెజిబివి పాఠశాల విద్యార్థులకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం ప్రమిలారెడ్డి, తహసీల్దార్, ఎంపిడీవో తదితరులు పాల్గొన్నారు.