రాష్ట్రీయం

వెనక్కి తగ్గిన దానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌పై అలిగాను..అంతే
టిఆర్‌ఎస్‌లో చేరడం లేదు
పిలుపు వచ్చింది వాస్తవమే
కాంగ్రెస్ నేత నాగేందర్ స్పష్టీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలనుకున్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వెనక్కి తగ్గారు. టిఆర్‌ఎస్‌లో చేరడం లేదని తేల్చి చెప్పారు. ‘మా పార్టీపై అలిగాను అంతే..’ అని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే దానం టిఆర్‌ఎస్ ‘కారు’ ఎక్కనున్నారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (7న) ఆయన టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా సోమవారం ఉదయం ఆయన టిఆర్‌ఎస్‌లో చేరడం లేదని ఖండితంగా చెప్పారు. ఉదయం ఒక టివీ చర్చలో దానం టిఆర్‌ఎస్‌లో చేరిక అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ సదరు టివీ వార్తల పట్ల అభ్యంతరం తెలిపారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఎక్కడా ప్రకటించకపోయినా, మీరే ఆ విధమైన ప్రచారం కల్పించారని ఆయన చెప్పారు. అయితే టిఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా తనకు పిలుపు వచ్చింది వాస్తవమేనని ఆయన తెలిపారు. కానీ టిఆర్‌ఎస్‌లో చేరాలన్న ఆలోచన చేయలేదని అన్నారు. కాంగ్రెస్ తనకు తల్లిలాంటిదని, తల్లిపై అలకబూని మారాం చేయడం సహజమేనని దానం ఆ తర్వాత తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన అలుక గురించి పార్టీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ ఇతర ముఖ్య నాయకులకూ తెలుసునని అన్నారు. ఇకమీదట పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కష్టపడతానని ఆయన తెలిపారు.
విభిన్న కథనాలు..
టిఆర్‌ఎస్‌లో చేరాలన్న ఆలోచనను దానం ఉపసంహరించుకోవడంపై విభిన్న కథనాలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ టిఆర్‌ఎస్‌లో చేరడానికి విధించిన కొన్ని షరతులకు ఆ పార్టీ అంగీకరించలేదన్న ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతానని దానం చెప్పగా, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమక్షంలో పార్టీలో చేరాలన్న పార్టీ చేసిన సూచనకు దానం ససేమిరా అన్నారని, జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో తన ప్రమేయం ఉండాలని, తన ముఖ్య అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని, తనకూ మేయర్ పదవి ఇవ్వాలని అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా దానం అనుచరులు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరాలన్న ఆలోచనే చేయనప్పుడు మేయర్ పదవి, టిక్కెట్ల వరకూ చర్చ వచ్చేందుకు అవకాశమే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆయన చేరిక పట్ల తమ పార్టీ ఆసక్తి కనబరచలేదని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
నేను చెప్పిందే నిజమైంది: షబ్బీర్ అలీ
ఇలాఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ దానం నాగేందర్ టిఆర్‌ఎస్‌లో చేరరని తాను చెప్పిందే నిజమైందని అన్నారు. తాను జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా దానం నాగేందర్ పార్టీ నగర నాయకులందరినీ కలుపుకుని పోతారని, పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడుతుందని చెప్పారు. ఏవైనా చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకుని సరి చేసుకుంటామని షబ్బీర్ అలీ తెలిపారు. రెండు రోజుల క్రితం షబ్బీర్ అలీ దానం నాగేందర్ నివాసానికి వెళ్ళి మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షబ్బీర్ అలీ దానం నాగేందర్‌తో ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. తొందరపడి పార్టీ మారవద్దని వారు దానంకు హితవు చెప్పారు. ఎట్టకేలకు దానం తన పార్టీ మారడం లేదని తెలియడంతో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు దానం పార్టీ మారితే పార్టీ శ్రేణులు కకావికలమయ్యేవని ముఖ్య నాయకులు అంటున్నారు.