నల్గొండ

విద్యకు అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాదాన్యతనిస్తున్నదని, గురుకుల పాఠశాలల విద్యార్థులకు కార్పోరేట్ పాఠశాలలకు మించి సౌకర్యాలు కల్పించేందుకు 3వేల కోట్లనిధులు మంజూరి చేసినట్లుగా రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సంక్షేమశాఖ గురుకుల పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయి ఒలింపిక్స్ క్రీడోత్సవాలను సోమవారం భువనగిరిలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి తెలంగాణ స్వేరోస్ విద్యార్థులు, ఉపాద్యాయబృందం, క్రీడల ఉపాద్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయపతాకంతోపాటు గురుకుల పాఠశాలల సొసైటి, స్వారొ ఒలింపిపిక్స్ పతాకాలను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. అట్టహాసంగా ప్రారంభమైన క్రీడోత్సవాలలో ముఖ్యఅతిథిగాపాల్గొన్న మంత్రి జగధీశ్వర్‌రెడ్డి విద్యార్థులనుండి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి అత్యంత ప్రాదాన్యత నిస్తుందన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలోనె ఎవ్వరితోనైన పోటీపడాలంటె విద్యతోనెనని గుర్తించిన ముఖ్యమంత్రి దేశంలోనె మొట్టమొదటి సారిగా 3వందల ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టి, ఆదివాసి గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లుగా తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడాస్పూర్తిని బోదించాలన్నారు. కార్పోరేట్ పాఠశాలల విద్యార్థులు విద్యకు మాత్రమె పరిమితమై ఆత్మనూన్యతాభావంతో మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి సమస్యనైన ఎదిరించి పరిష్కరించేదిశగా విద్యతోపాటు ఇతర రంగాలలో రాణించేలా తయారుచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ప్రపంచంలోనె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం మంత్రి గాలిబుడగలను ఆకాశంలోకి వదిలి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫిరమిడ్ విన్యాసాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలోప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, భువనగిరి మున్సిపల్ చైర్మెన్ సుర్విలావణ్య, తెలంగాణ స్వేరోసంఘం కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డిసిపి పాలకుర్తి యాదగిరి, భువనగిరి ఆర్డీవొ భూపాల్‌రెడ్డి, బీబీనగర్ ఎంపిపి గోలి ప్రణితపింగల్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎం.పుల్లయ్య, కె.పార్వతిదేవి, ఇ.లక్ష్మయ్య, ఎం.గీతాలక్ష్మి, బి.సక్రునాయక్, ఎన్.రజని, హెచ్.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. 70మంది ఫిజికల్ డైరెక్టర్లు క్రీడాపోటీలను నిర్వహిస్తుండగా రాష్ట్రంలోని 31జిల్లాలకు చెందిన 35పాఠశాలల విద్యార్థులు 12వందలమంది పాల్గొంటున్నారు.
చెర్వుగట్టు అభివృద్ధికి కృషి
* మండలి డిప్యూటీ చైర్మన్ నేతి
నార్కట్‌పల్లి, నవంబర్ 28: తెలంగాణ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి క్షేత్ర అభివృద్దికి తనవంతు సహకారం ఎల్లవేళల అందిస్తానని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం కార్తీకమాసాన్ని పురస్కరించుకొని పూజలు నిర్వహించిన అనంతరం స్వంత నిధులతో నిర్మించిన కమ్యునిటీ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హైద్రాబాద్ రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రానికి ఆనుకొని జాతీయ రహదారిపై ఉన్న ఈ క్షేత్రం త్వరలోనే మరింత అభివృద్ది సాధిస్తుందని, ఇక్కటికి వచ్చే భక్తులకు వౌళిక సదుపాయాల కల్పనపై దేవాలయ శాఖ అదికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిమాసంలో వచ్చే అమవాస్యకు లక్షలాధిగా భక్తులు తరలివస్తున్నారని అన్నారు. దేవాలయాన్ని మరింత అభివృద్ది పరిచేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు.

పెద్దనోట్ల రద్దుపై విపక్షాల నిరసనలు
* జన్ ఆక్రోశ్ నిరసనల్లో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 28: ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్ధు నిర్ణయాన్ని నిరసిస్తు విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్, జన్ ఆక్రోశ్ దివస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ప్రభావం చూపలేదు. విపక్షాలు సైతం బంద్ పై కంటే నిరసనలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో బంద్ విఫలమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ఆర్టీసి బస్సులు, రైళ్లు యధావిధిగా పనిచేశాయి. పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు, సినిమాహాల్స్ మాత్రం మూసివేశారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఆక్రోశ్ దివస్ పేరిట బ్యాంకుల ముందు ధర్నాలు నిర్వహించి నిరసన ప్రదర్శనలు జరిపారు. ప్రధాని మోదీ, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్‌లో వామపక్షాలు ఆక్రోశ్ దివస్ నిరసన ర్యాలీలు నిర్వహించగా, కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రామగిరి ఎస్‌బిహెచ్ బ్యాంకు ముందు ధర్నాతో నిరసన తెలిపారు. సూర్యాపేటలో కాంగ్రెస్ ఆక్రోశ్ దివస్ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల ఆధ్వర్యంలో భారీ నిరసనలు, ప్రధాని దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడ సిపిం నేత జూలకంటి రంగారెడ్డి పెద్ధ నోట్ల రద్దు నిర్ణయంపై, ప్రజలు పడుతున్న కష్టాలపై జరిగిన నిరసనల్లో పాల్గొని ప్రధాని నిర్ణయాన్ని దుయ్యబట్టారు. భువనగిరి, హుజూర్‌నగర్, ఆలేరు, వలిగొండ, పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, హాలియా, నేరడుచర్ల, మఠంపల్లి, తిరుమలగిరి, మోత్కూర్ తదితర ప్రాంతాల్లో విపక్షాలు ఆక్రోశ్ దివస్ నిరసన కార్యక్రమాలను, బ్యాంకుల ముందు ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విపక్షాల ఆక్రోశ్ దివస్ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సిపిఐ కార్యదర్శి విశ్వనాధుల లెనిన్, నాయకులు నారి ఐలయ్య, హషం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సత్తయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరికె వెంకటేశ్వర్లు, చింతల బాలకృష్ణ, చిరుమర్తి శ్రీనివాస్, హరికృష్ణలు పాల్గొన్నారు.
పూలే బాటలో నడవాలి
నల్లగొండ టౌన్, నవంబర్ 28: మహాత్మాజ్యోతిరావు పూలే 126వ వర్థంతి కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. గడియారం సెంటర్‌లోని పూలే విగ్రహానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, వివిధ పార్టీల నేతలు వంగాల స్వామిగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, బిసి సంఘం నేతలు దుడుకు సత్యనారాయణ, చక్రహరి రామరాజు, దుబ్బ అశోక్‌సుందర్‌లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పూలే చూపిన బాటలో సి ఎం కేసి ఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. బలహీనవర్గాల ప్రజలు సంక్షేమ పథకాల అండతో ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పూలే వర్థంతిలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అద్యక్షులు పిల్లి రామరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి, ఎల్‌వి.యాదవ్, సత్యనారాయణ, విజయ్‌కుమార్, గుండు వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పూలే వర్ధంతిలో జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు ఓరుగంటి రాములు, నూకల వెంకటనారాయణరెడ్డి, పోతెపాక సాంబయ్య, చింత ముత్యాల్‌రావు, నాగరాజు, కూతురు లక్ష్మారెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ శేఖర్, దర్శనం వేణు, బీపంగి జగ్జీవన్‌రాం, మునికుమార్, లింగస్వామి, తదితరులు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఆద్వర్యంలో గడియారం సెంటర్‌లో పూలే విగ్రహానికి సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూరెళ్ల విజయ్‌కుమార్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పెద్ద నోట్ల రద్దు
ఉపసంహరించుకోవాలి
మునుగోడు, నవంబర్ 28: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం సిపిఎం రాష్ట్ర కమిటి మేరకు మండల కమిటి ఆద్వర్యంలో మండల కేంద్రంలో చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హజరై మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల రైతులకు, చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లు మార్పిడి కాక చిల్లర ఇవ్వలేక వ్యాపారులు నష్టాలలో కూర్కపోతున్నారని అన్నారు. ప్రజల అవస్థలకు గుర్తించి తక్షణమే నోట్ల రద్దు విదానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముసాయిదాలో ఉన్న గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్య గొడవల కారణంగా గట్టుప్పల్ మండలం ఏర్పాటు నిర్లక్ష్యం వహించిన వెంటనే మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న, నాయకులు చాపల మారయ్య, అవ్వారి వేణు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొట్ట శివకుమార్ పాల్గొన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
* గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
తిప్పర్తి, నవంబర్ 28: తిప్పర్తిలో సోమవారం తహశీల్ధార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్‌లో మూడు ధరఖాస్తులు వచ్చాయి. రేషన్‌కార్డులో పేరు కొత్తగా నమోదు చేయాలని కోరుతూ జెల్ల శ్రీనయ్య, తిప్పర్తి సెంటర్‌లో ప్లెక్సీలు ఇష్టానుసారంగా పెట్టారని వాటిని తొలగించాలని రమేష్, తిప్పర్తిలో స్మశానవాటిక స్ధలాన్ని సర్వే చేయించాలని తిప్పర్తి సర్పంచ్ జాకటి మోష, తేరాస జిల్లా నాయకులు తండు నర్సింహ్మగౌడ్‌లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందజేశారు. అనంతరం కలెక్టర్ పశువైద్యశాలను పరిశీలించారు. వైద్యాధికారి స్వాతితో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రిజిస్ట్రర్లను, మందులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పందిరి వెంకటేశ్వరమూర్తి, ఎంపిడి ఒ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం
పరిశీలించిన ప్రభుత్వ విప్
ఆలేరు, నవంబర్ 28: మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1026లో గల ఇండోర్ స్టేడియాన్ని ప్రభుత్వ విప్ సునితామహేందర్‌రెడ్డిని సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండోర్ స్టేడియాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, గణతంత్ర దినోత్సవాన్ని ఇండోర్ స్టేడియంలో జరిపేలా అదికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియం అందుబాటులోకి రావడం వల్ల క్రీడాకారుల్లో క్రీడానైపుణ్యం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న క్రీడా సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆమె వెంట జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, ఎంపీపీ అనసూర్య, తహశీల్దార్ రాంమూర్తి, ఇంచార్జీ సర్పంచ్ సంతోష్, ఎంపిటిసి మురళీ, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను వీధిన పడేస్తున్న ప్రధాని విధానాలు
* ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
కోదాడ, నవంబర్ 28: ప్రధాని నరేంద్రమోది అనుసరిస్తున్న విదానాలు ప్రజలను రోడ్డున పడేస్తున్నాయని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి ఉత్తమ్‌రెడ్డి ద్వజమెత్తారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆక్రోష్ దినస్‌లో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. తొలుత కాంగ్రెస్ శ్రేణులు పట్టణ వీధుల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ రాజీవ్‌కూడలికి చేరుకొన్న తరువాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. చిన్ననోట్లను ఏర్పాటుచేయకుండా పెద్ద నోట్లను రద్దుచేసి ప్రజలను ప్రధాని వీధిపాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోది దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి రోడ్డుపై కూర్చుని నల్లజెండాను చేతిలో పట్టుకొని కేంద్రానికి నిరసన ప్రకటించారు. నల్లధనం వెలికితీయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని కాని దాని అమలుపరిచే విదానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రకటించారు. నగదుకొరకు బ్యాంక్‌ల వద్ద, ఎటియంల వద్ద క్యూకట్టిన వారిలో 70 మంది దేశంలో మృతి చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారంతా సామాన్య, పేద కుటుంబాలకు చెందినవారని, మోది ముందుచూపులేని విదానాల వలన దేశంలో 70 కుటుంబాల వీధిన పడ్డాయని వారిని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముందుగా చిన్ననోట్లను సరఫరా చేయకుండా మోది ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆమె ద్వజమెత్తారు. నోట్ల మార్పిడి, జమ సమయాన్ని పొడిగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులుగా వర్ణించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. పేద, సామాన్యప్రజలకు కాంగ్రెస్ అండగా వుంటుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రకటించారు.
దామెరలో పూరిల్లు దగ్ధం
నాంపల్లి, నవంబర్ 28: రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబం ఉన్న రెండర్రల పూరిళ్లు ప్రమాదవశాత్తు మంటలు రేగి పూర్తిగా దగ్ధమవడంతో ఆ కుటుంబం పిల్లలు వీధిన పడ్డారు. ఈసంఘటన మండలంలోని దామెర గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బచ్చనబోయిన లచ్చయ్య రోజువారిగా ఇంటికితాళం వేసి వ్యవసాయ భావివద్దకు వెళ్లాడు. భార్య అలివేలు ఆసుపత్రికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదవశాత్తు మంటలు రేగి పూరిళ్లు కాలిపోతుండగా గమనించిన గ్రామస్తులు మంటలు అర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో దేవరకొండ ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలు అర్పారు.

స్విస్ బ్యాంకులోని సొమ్మును ప్రజలకు పంచాలి
* బూడిద బిక్షమయ్యగౌడ్
యాదగిరిగుట్ట రూరల్,నవంబర్ 28: అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దుతో దేశంలోని రైతులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని డీసీసీ ప్రసిడెంట్ బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. కాంగ్రేస్ పార్టీ పిలుపు మేరకు ఆక్రోస్ దివస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించిన అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రేస్ పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలోని ప్రజలకు పంచుతానని చెప్పి ఎన్నికల అనంతరం దేశంలోని 80 శాతం చెలామనిలోని 500,1000 నోట్లను రద్దు చేయటంతో దేశంలోని రైతులు, సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో పెద్ద నోట్ల రద్దుతో 70 మంది మరణించారని ఇంక ఎంతమందిని చంపుతారని అన్నారు.ముఖ్యమంత్రి కేసి ఆర్ డిల్లీకి వెళ్లి నరేంద్ర మోదీతో చేసుకున్న ఒప్పందంను బహిర్గతం చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ జిల్లాలను అశాస్రీయంగా విభజించారని అన్నారు.

ఘనంగా సుంకిశాల శ్రీవారి రథోత్సవం
వలిగొండ, నవంబర్ 28: మండలంలోని సుంకిశాల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీవారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ మాడ వీధుల్లో గుండా ప్రారంభమైన స్వామి వారి రథోత్సవం గ్రామ వీధుల్లో కొనసాగింది. భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పద్మావతి, అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వరుడి రథోత్సవానికి తిలకించి తరించేందుకు దారి పొడవున బారులు తీరారు. స్వామివారికి మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. గ్రామానికి చెందిన ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి నిర్మించిన సుంకిశాల దేవాలయం బ్రహ్మోత్సవాలను తొలిసారిగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. రథోత్సవ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహక సభ్యులు సర్పంచ్ పైళ్ల సంధ్యాఉపేందర్, బొక్క బుచ్చిరెడ్డి, సాయిరెడ్డి, సుధర్మారెడ్డి పాల్గొన్నారు.