నల్గొండ

నగదు రహిత లావాదేవీలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, డిసెంబర్ 11: నగదురహిత లావాదేవీలను నిర్వహించుకొనేందుకు ప్రజలు, వర్తకులు సిద్దం కావాలని, నగదురహిత లావాదేవీల పట్టణంగా జిల్లాలో మొదటగా కోదాడను మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ పిలుపునిచ్చారు. కోదాడ వాసవిభవన్‌లో ఆదివారం బాలాజీ ఇ సర్వీసెస్ మీసేవ కామన్ సర్వీస్ సెంటర్ నిర్వహించిన నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ సురేంద్రమోహన్ పాల్గొని ప్రసంగించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నోట్ల ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరు నగదురహిత లావాదేవీలను చేయడాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దాని కొరకు డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్, పివోయస్, యుయస్‌యస్‌డి, మొబైల్ బ్యాంకింగ్, మైక్రో ఎటియంలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సూర్యాపేట జిల్లాలోని 19 లక్షలు జనాభా 13 లక్షల కార్డులను వాడుతున్నారని, బ్యాంకు ఖాతాలు లేనివారు లక్షమంది వరకు వున్నారని ఆయన వివరించారు. పెద్దనోట్లు రద్దు అయిన నవంబర్ 8వ, తేది నుండి ఇప్పటివరకు జిల్లాలో ఏడు శాతం నగదురహిత లావాదేవీలు జరిగాయని ఆయన వివరించారు. జిల్లాలో ఖాతాలు లేనివారందరికి బ్యాంకుల ద్వారా ఖాతాలను తెరిపించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన వివరించారు. నగదు రహిత లావాదేవీలకు వర్తకులు తప్పనిసరిగా కరంట్ ఖాతా కలిగివుండాలని, కరంట్ ఖాతాలను జాప్యం లేకుండా వెంటనే ఇప్పించేందుకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఐసిఐసిఐ బ్యాంక్ సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌ను, హెచ్‌డియఫ్‌సి బ్యాంక్ కాసరాబాద్‌ను నగదురహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చి ఆ మేరకు కృషి చేస్తున్నాయని ఆయన వివరించారు. మిగిలిన బ్యాంక్‌లు గ్రామాలను దత్తత తీసుకొనేందుకు ముందుకురావాలని ఆయన సూచించారు. జిల్లాలో కోదాడను మొదటి నగదురహిత పట్టణంగా తయారుచేసేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు

సింగిల్ పర్మిట్ విధానంపై
అసెంబ్లీలో ప్రస్తావిస్తా
* లారీ ఓనర్లకు పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హమీ
కోదాడ, డిసెంబర్ 11: సింగిల్ పర్మిట్ విదానంపై అసెంబ్లీలో ప్రస్తావించి తెలంగాణ లారీ యజమానులకు న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హమీ ఇచ్చారు. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొని ప్రసంగించారు. సింగిల్ పర్మిట్ విదానంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంతృలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. గుంతలమయంగా వున్న లారీ అసోసియేషన్ ఆవరణలో సిమెంట్ రోడ్లను నిర్మించేందుకు కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతిరెడ్డి నియోజకవర్గ నిధులనుండి ఐదు లక్షలు మంజూరుచేయిస్తానని ఉత్తమ్ హమీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ పర్మిట్ విదానం పేరిట జరుగుతున్న వేధింపులను వివరించి వాటినుండి తమను కాపాడాలని లారీ ఓనర్స్ ఉత్తమ్‌ను కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఉత్తమ్ ఈ సందర్భంగా అభినందించారు. ఉత్తమ్‌ను లారీ ఓనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు రామినేని శ్రీనివాసరావు, నాగేశ్వర్‌రావు, కోశాధికారి మిర్యాల వెంకటరెడ్డి, ఆవుల రామారావు, ఓరుగంటి ప్రభాకర్, పెద్ది అంజయ్య, పాపారావు, బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, వంగవేటి రామారావుతదితరులు పాల్గొన్నారు.

యాసంగికి ఎదురీత
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 11: ఖరీఫ్ పంట సీజన్‌లో సకాలంలో వర్షాలు కురియక అరకొర దిగుబడులతో నష్టపోయిన రైతాంగం యాసంగి(రబీ) పంటల సాగులో సైతం కష్టానష్టాలకు ఎదురీత సాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో యాసంగి పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు నానాపాట్లు పడుతుండగా పెద్దనోట్ల రద్ధు వారిని మరిన్ని కష్టాల పాలుచేస్తుంది. ఖరీఫ్ సీజన్ ధాన్యం, పత్తి దిగుబడుల విక్రయాలతో వచ్చిన సొమ్మును యాసంగికి పెట్టుబడులుగా ఉపయోగిద్ధామంటే బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. క్యూలైన్లలో నిలుచుంటే పొలం వద్ధ పనులు ఆగిపోతున్నాయని తీరా గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడితే ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లలో 10వేల వరకు ఇతర గ్రామీణ బ్యాంకుల్లో 2నుండి 4వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు 24వేల వరకు చెల్లింపు చేస్తామని చెప్పిన బ్యాంకర్లు కొత్త నోట్ల కొరతతో కోతలు పెడుతున్నారు. దీంతో విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్ ఖర్చులకు, ఎరువులకు పెట్టుబడి కొరత ఎదుర్కోంటున్నారు. గ్రామాల్లో ఎక్కువగా గ్రామీణ వికాస్ బ్యాంకులు, కెనరా బ్యాంకులు, డిసిసిబి బ్యాంకులే ఉండటంతో రైతులకు డబ్బు చెల్లింపుల్లో సదరు బ్యాంకులతో కష్టాలు ఎదురవుతున్నాయి. మరోవైపు రుణమాఫీ డబ్బులివ్వడంలో సైతం బ్యాంకర్లు మొండికేస్తున్నారు. ప్రభుత్వం నుండి పూర్తిగా మూడో విడత రుణమాఫీ డబ్బులు రాలేదంటు బ్యాంకర్లు రైతులకు మాఫీ డబ్బులు చెల్లించకపోగా కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మూడో విడత కింద 582.82కోట్లు రైతులకు రావాల్సివుండగా సగం కూడా వారి ఖాతాల్లో చేరలేదు. ఇక యాసంగి సీజన్‌లో పంట రుణాల పంపిణీ లక్ష్యం 932కోట్లుగా నిర్ధేశించగా ఇప్పటిదాకా కేవలం 257కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. యాసంగి సీజన్ ఆరంభమైనా రుణాల్వివకపోవడంతో రైతులకు సాగు పెట్టుబడుల సమస్య నెలకొంది. మరోవైపు రైతులే ఎక్కువగా ఖాతాదారులుగా ఉండే డిసిసిబి బ్యాంకుల్లో పాతనోట్ల డిపాజిట్ల వసతి లేకపోవడం, కొత్తగా నగదు విత్‌డ్రాలకు మాతృ బ్యాంకుల నుండి డబ్బులు అందకపోవడంతో యాసంగి రైతుల సాగుపెట్టుబడుల కష్టాలు మరింత జఠిలమయ్యాయి. 90వేల మంది రైతులు రుణ పరపతిలో, సొంత డబ్బులు పొందడంలో ఇబ్బందిపడుతున్నారు.
అందని ప్రభుత్వ పెట్టుబడి
రాయితీ సొమ్ము
మూడు జిల్లాల రైతాంగానికి గత ఏడాది ఖరీఫ్‌లో కరవు పంట నష్ట పరిహారం కింద 1లక్ష 59,863మంది రైతులకు 86కోట్ల 68లక్షల పెట్టుబడి రాయితీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఈ ఏడాది ఖరీఫ్ సైతం దాటిపోయినా ఇప్పటికి రైతులకు సదరు పరిహారం పంపిణీ కాలేదు. నల్లగొండ జిల్లాలో 55.46కోట్లు, సూర్యాపేట జిల్లాలో 8.72కోట్లు, యాదాద్రి జిల్లాలో 22.50కోట్ల పెట్టుబడి రాయితీ రైతులకు అందాల్సివుంది. దీనికి తోడు ఈ దఫా ఖరీఫ్ సీజన్‌లోనూ ఈ మూడు జిల్లాల పరిధిలో దెబ్బతిన్న పంటలకు మరో 43కోట్ల పరిహారం కోరుతు ఉమ్మడి జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. అటు ఉద్యాన వన, వ్యవసాయ, యాంత్రీకరణ, మైక్రోఇరిగేషన్ శాఖల ద్వారా అందాల్సిన రాయితీ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉండటం రైతులను మరింత ఇబ్బందుల పాలు చేస్తుంది.

రబీకి సాగు నీరివ్వాలి
* కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సిపియం
కోదాడ, డిసెంబర్ 11: సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టులో రబీ సీజన్‌లో వరిపంటను సేద్యం చేసేందుకు పూర్తిస్ధాయిలో సాగునీటిని విడుదల చేయాలని సిపియం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిపియం పట్టణ కార్యదర్శి ప్రసాద్, సహాయకార్యదర్శి ముత్యాలుతో కలిసి కోదాడలో ఆదివారం కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వెంకటేశ్వర్‌రావు వినతిపత్రాన్ని అందచేశారు. కృష్ణానది యాజమాన్యబోర్డుతో నీటి విడుదల కొరకు చర్చలు చేస్తున్నామంటూ నీటి విడుదలను వాయిదా వేయడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన వివరించారు. నీరు విడుదల చేస్తారనే ఆశతో ఆయకట్టులో రైతులు నార్లుపోసుకున్నారని, వెంటనే నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించి పేదలను ఆదుకోవాలని కోరుతూ సిపియం పట్టణ కార్యదర్శి కుక్కడపుప్రసాద్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వం మంజూరుచేస్తుందనే ఆశతో అప్పులు చేసి పేదలు ఇండ్లు కట్టుకొన్నారని ఆయన వివరించారు. వ్యవసాయ పెట్టుబడుల కొరకు రైతులు బంగారు ఆభరణాలపై తీసుకొన్న రుణాల్లో మూడవ విడత రుణమాఫీ నగదును బ్యాంకుల్లో జమచేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కోదాడ మండలం గుడిబండకు చెందిన రైతులు వాచేపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటనారాయణ, వెంకటేశ్వర్‌రావు ఆదివారం కోదాడలో కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రాన్ని అందచేశారు.

పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
* మంత్రి జగదీశ్ రెడ్డి
అర్వపల్లి, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యా, వైద్య రంగంలో పూర్తిస్థాయి సంస్కరణలు తెచ్చినట్లు విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగారం మండలపరిధిలోని ఫణిగిరిలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవానికి స్థానిక శాసనసభ్యుడు గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి ముఖ్యఅతిధులుగా హాజరై మాట్లాడారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా 1959సంవత్సరం నుండి ఫణిగిరిలో చదువుకున్న విద్యార్థులు పూర్వవిద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం, అందరు ఒకదగ్గరికి చేరి వారి అనుభవాలను, అనుభూతులను పంచుకోవడం చాలా సంతోషమన్నారు. కెజిటూపిజి విద్య వచ్చే విద్యాసంవత్సరం నుండి ఖచ్చితంగా అమలుచేస్తామన్నారు. కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటుచేసి ప్రజలకు సమర్దవంతమైన పరిపాలనను అందిస్తున్నట్లు తెలిపారు. వలస పాలకుల వివక్ష వల్లే మన విద్యావ్యవస్థ కుంటుపడిందని ఆరోపించారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గ రైతులకు వేసంగి పంటలకు కూడా శ్రీరాంసాగర్ రెండవ దశ గోదావరి జలాలను అందిస్తామన్నారు. రైతులకు 9గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. 2019నాటికి తుంగతుర్తి నియోజకవర్గానికి పాలేరు నుండి కృష్ణా నీటిని అందించేందుకు మిషన్‌భగీరథ ద్వారా పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల విద్యను సమర్దవంతంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, మంత్రి జగదీశ్‌రెడ్డిలను పూర్వవిద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపిపి కొమ్మినేని సతీష్, జెడ్పిటిసి పేరాల పూలమ్మ, వైస్ ఎంపిపి సుంకరి జనార్దన్, సర్పంచ్ కలెట్లపల్లి యల్లమ్మ, టిఆర్‌ఎస్ నాయకులు శోభన్‌బాబు, ఉప్పలయ్య, రఘునందన్‌రెడ్డి, అంబయ్య, మామిడి సోమయ్య, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
గుండాలను యాదాద్రి జిల్లాలో కలపాలి
* టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి
ఆత్మకూర్(ఎం), డిసెంబర్ 11: మండలాల విభజనలో భాగంగా గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో కలపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నామని, గుండాల మండలాన్ని వెంటనే యాదాద్రి జిల్లాలో కలపాలని, లేనియోడల ప్రాణత్యాగాలకైనా సిద్దమేనని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆదివారం టిడిపి మండల శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న బునాదిగానికాల్వ పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామన్నారు. డబుల్ బెడ్‌రూంలు కట్టిస్తామని చెప్పిన కేసి ఆర్ నీటి మూటలుగానే మిగిలాయన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు స్ధానం లేకపోవడం శోఛనీయమని ఆయన ఎద్దేవ చేశారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆలేరు నియోజకవర్గ ఇంచార్జీ బండ్రు శోభారాణి, మండల పార్టీ అధ్యక్షులు పూర్ణచందర్‌రాజు, కార్యదర్శి మల్లారెడ్డి, పద్మారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీశైలం, గుండాల మండల పార్టీ అధ్యక్షులు బాల్‌రెడ్డి, డాక్టర్ పద్మనాభం, వెంకటేశ్వర్లు, ఎం ఏ.రహీం, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

మాలల మహాధర్నా విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 11: బిజెపి పార్టీకి తెలంగాణలో భంగపాటు తప్పదని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రేకల సైదులు అన్నారు. ఆదివారం స్ధానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు చౌక్ వద్ద జరిగే మాలల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కామన్ స్కూల్ విధానానికి ఉద్యమించాలి
* ప్రొఫెసర్ హరగోపాల్

నల్లగొండ, డిసెంబర్ 11: కామన్ స్కూల్ విద్యావిధానంకై ప్రజలు ఉద్యమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని అఖిల భారత విద్యావేదిక సభ్యులు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. డిటిఎఫ్ 4వ రాష్టవ్రిద్యావైజ్ఞానిక మహాసభల్లో రెండో రోజు ఆదివారం ‘కామన్ స్కూల్ విధానం-సామాజిక సమానత్వం’ అంశంపై ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాటారు. ఆర్ధిక అంతరాలు ఉన్న సమాజంలో కోఠారి సూచింఛిన కామన్ స్కూల్ విధానం సాధ్యం కాదన్నారు. విద్యారంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరికి ఒకే విద్య కావాలంటు కామన్ స్కూల్ విద్యావిధానం కోసం ప్రజల నుండే బలమైన ఉద్యమం రావాల్సిన అవసరముందన్నా. విద్య అంటే జ్ఞానమని అన్ని వర్గాల ప్రజలకు జ్ఞానం అందుబాటు లేని సమాజాన్ని నాగరిక సమాజం అనలేమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుత విద్యారంగంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆర్‌టిఈ మేరకు పిల్లలందరికి సమాన, ఉచిత, కులసంబంధం లేని విద్యను అందించాలన్నారు. కూలి కొడుకు, కార్పోరేట్ యాజమాని కొడుకుకు ఒకే విద్య అందించే కామన్ స్కూల్ విధానం అమలైతేనే రాజ్యంగపరమైన సమానత సాధ్యమవుతుందన్నారు. అనంతరం ‘సామాజిక వివక్ష-మహిళా ఉద్యమాలు’ అంశంపై విరసం కార్యదర్శి పి.వరలక్ష్మిలు మాట్లాడారు. ఈ సమావేశాల్లో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టప్ప, మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, గంగాధర్, ఉపాధ్యక్షులు ఎం.సోమయ్య, వెంకట్రామయ్య, శంతన్, పద్మలత, కార్యదర్శులు ఎం.శ్యామూల్, వి.రాజిరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు, భాస్కర్, సత్తయ్య, రామారావులు పాల్గొన్నారు.

కొత్త భూసేకరణ చట్టం నిర్వాసితులకు నష్టం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులకు అన్యాయం చేసేందుకే కొత్త భూసేకరణ చట్టం తెచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు బలవంతపు భూసేకరణ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని, రైతులు, పేదలకు 2013్భసేకరణ చట్టంతోనే మేలు జరుగుతుందని ఇందుకోసం సిపిఎం ఉద్యమిస్తుందన్నారు. సీఎం కెసిఆర్ కేబినెట్ సమావేశాలు, ఉప సంఘాల నియామకాలతో హడావుడి చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని రెండున్నర ఏళ్ల పాలనలో కెసిఆర్ ఇచ్చిన హామీల అమలు పూర్తి వైఫల్యం చెందారన్నారు. రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు జరుగుతుందంటు సుధీర్ కమిటీ నివేధించిన పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా యువతకు రెండేళ్లుగా సబ్సిడీ రుణాలు అందడం లేదన్నారు. గిరిజనులు, మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ అమలు చేయడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం పథకం, కెజి టూ పిజి ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి హామీల అమలులో పూటకోమాటతో కాలయాపన చేస్తున్నారన్నారు. బ్రిజేష్‌కుమార్ కమిటీ, కృష్ణా నది యాజమాన్య బోర్డులు తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తుండగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. సాగర్ ఎడమకాలువకు డిసెంబర్ 1నుండి నీరందిస్తామంటు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటిదాకా నీటి విడుదలకు చర్యలు చేపట్టడంలో విఫలమైందన్నారు. నీటి విడుదల జరుగుతుందో లేదో తెలియక సాగర్ ఆయకట్టు రైతాంగం యాసంగి పంటల సాగులో గందరగోళంలో పడ్డారన్నారు. ప్రభుత్వం వెంటనే సాగర్ రైతులకు యాసంగి పంటల సాగుకునీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ జిల్లా, గట్టుప్పల్ మండలాల సాధన ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్ధు నిర్ణయంతో ప్రజలు కష్టాలు పడుతుండగా నిలదీయాల్సిన సీఎం కెసిఆర్ మోదీకి అంబాసిడర్‌గా మారిపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు తుమ్మల వీరారెడ్డి, మల్లేశం, హషమ్, బండ శ్రీశైలం, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్యలు ఉన్నారు.