నల్గొండ

టిఎస్ ఐపాస్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 12: పరిశ్రమల స్థాపనకు వీలుగా సింగిల్ విండో సిస్టమ్‌లో ఔత్సాహిక పరిశ్రమలదారులకు అన్ని అనుమతులనిచ్చే టిఎస్ ఐపాస్ కింద జిల్లాలో 151పరిశ్రమలకు అనుమతులివ్వడం పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేదిగా కనిపిస్తుంది. నల్లగొండ జిల్లా పరిధిలో పరిశ్రమల స్థాపనకు 175దరఖాస్తులు రాగా ఏనిమిది ప్రభుత్వ శాఖల పరిధిలో 151దరఖాస్తులకు అన్ని అనుమతిలిచ్చేశారు. మరో ఆరు దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. 14దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దరఖాస్తుల పెండింగ్, తిరస్కరణలపై కారణాలను సైతం దరఖాస్తుదారులకు నివేధించారు. ఉమ్మడి జిల్లాలో 440దరాఖాస్తులకు 401దరఖాస్తులకు అనుమతించారు. విభజన పిదప నల్లగొండ జిల్లాలో ఎస్సీ పరిశ్రమలదారులకు 88.47లక్షలు, ఎస్టీ పరిశ్రమలదారులకు 56.41లక్షల సబ్సిడీ సైతం ఈ ఏడాది మంజూరు చేయడం విశేషం.
కొత్తగా జిల్లాలో ఏనిమిది ఇండస్ట్రియల్ పార్క్‌లను, ఆరు క్లస్టర్‌లను, ఒక డ్రైపోర్టు ఏర్పాటు కోరుతు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో దామరచర్ల వద్ధ 1500ఎకరాల్లో డ్రైపోర్టు ఏర్పాటును ప్రతిపాదించారు. జాతీయ, రాష్ట్ర రహదారిలకు అనుసంధానంగా ఉండటం, సిమెంట్, డ్రగ్ పరిశ్రమలు, మిల్లులు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఇక్కడే ఉండటం, మచిలిపట్నం ఓడ రేవుకు దగ్గర ఉండటంతో ఇక్కడ డ్రైపోర్టును ప్రతిపాదించారు. ఇండస్ట్రీయల్ పార్కుల కోసం చిట్యా-నార్కట్‌పల్లి మధ్య జాతీయ రహదారి వెంట 500ఎకరాల్లో ఫార్మా పార్క్, కొండమల్లెపల్లిలో 50ఎకరాల్లో ఆటోమొబైల్ యూనిట్, నల్లగొండ టౌన్‌లో 100ఎకరాల్లో , నల్లగొండ-మిర్యాలగూడల మధ్యలో, నార్కట్‌పల్లి-నకిరేకల్ మధ్యలో ఇండస్ట్రియల్ పార్క్‌లు, నాగార్జున సాగర్-హైద్రాబాద్ మార్గంలో 100ఎకరాల్లో కాటన్ మిల్స్ పార్క్‌ను ప్రతిపాదించారు.
యాద్గార్‌పల్లి-శెట్టిపాలెంలో రైస్ మిల్ క్లస్టర్, దామరచర్ల, అడవిదేవులపల్లిలో లైమ్‌స్టోన్, పాలిషింగ్ క్లస్టర్, ఇర్కిగూడెంలో ఫౌల్ట్రీ గ్రిట్ చిప్స్ క్లస్టర్, చండూర్‌లో అలంకారణ ఉత్పత్తులు, దేవరకొండలో ట్రైబల్ జ్యూవెలరి, ఎంబ్రాయిడరీ వర్క్ క్లస్టర్‌ల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల శాఖ ప్రభుత్వానికి పంపించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. పరిశ్రమలు, పార్క్‌లు, క్టస్టర్‌ల ఏర్పాటుకు ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేస్తుండగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయగా విభజన పిదప నల్లగొండ జిల్లాలో 1211ఎకరాల ల్యాండ్ బ్యాంకు పరిశ్రమలు, పార్క్‌ల ఏర్పాటుకు సిద్ధం చేసుకున్నారు.

వివేకానంద స్ఫూర్తితో
యువత ముందుకు సాగాలి
జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ టౌన్, జనవరి 12 : దేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా వెలుగెత్తి చాటిన వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన భోదనలు అనుసరించి యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం వీటి కాలనీ వివేకానంద విగ్రహం వద్ద యువజన సంఘాల సమితి, నెహ్రూ యువకేంద్రం, టిపస్ ఉపాధ్యాయ సంఘాల ఆద్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతిలో ఆయన పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద ఆశయాలను అనుసరించి దేశ అభివృద్దిలో సంస్కృతి పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, క్రీడాపోటీలు, వ్యాసరచన, వకృత్వ పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో జేసి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, ఆర్‌డి ఒ వెంకటాచారిలు ఉన్నారు. విటి కాలనీతో పాటు బిజెపి కార్యాలయం, టిపస్ కార్యాలయం, ఏబివిపిల ఆధ్వర్యంలో, టిఆర్‌ఎస్‌వి, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి, గోలి మధుసూధన్‌రెడ్డి, కర్నాటి విజయ్‌కుమార్, మగ్భుల్ అహ్మద్, తహశీల్ధార్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు నూకల వెంకటనారాయణరెడ్డి, బొజ్జ నాగరాజు, నాగేశ్వరరావు, మిర్యాల యాదగిరి, ఆవుల రామన్నయాదవ్,సిరిగిరి సురేష్, ఊట్కూరి వెంకట్‌రెడ్డి, సంపత్, నవీన్, సంతోష్, సందీప్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్,కూతురు లక్ష్మారెడ్డి, పోతెపాక సాంబయ్య, బాకి పాపయ్య, శ్యాంసుందర్, రాములు, బొజ్జ శేఖర్, శ్రీను, తపస్ జిల్లా నాయకులు అలుగుబెల్లి పాపిరెడ్డి, పెంటయ్య, తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మల్లికార్జున్, అశోక్‌రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ రహత్‌ఖాన్, ఉపేందర్, నవీన్‌యాదవ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పశుసంపద అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అనితా రామచంద్రన్
వలిగొండ, జనవరి 12: గొర్రెల, పశువుల అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. గురువారం మండలంలోని పులిగిల్ల గ్రామంలో గొర్రెల పెంపకందార్లకు 19 యూనిట్లకు సంబంధించిన 19 లక్షల రూపాయాల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం కేసిఆర్ పశువుల, గొర్రెల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారని పాల ఉత్పత్తిలో యాదాద్రిభువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని, ఇంకుడు గుంతలను ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని దీనితో భూగర్భ జలాలు పెరుగుతాయని త్రాగునీటి సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. గ్రామంలో పూర్తిస్థాయి పశువైధ్యాధికారిని నియమించేందుకై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బునాదిగాని కాలువ ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో జీవో123తో ఆగిపోయిందని పూర్తిగానే రైతులందరికీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. బునాదిగాని చెరువులోని నీటి ద్వారా పులిగిల్ల గ్రామంలోని చెరువులను నింపేందుకై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. అదేవిధంగా పులిగిల్ల నుండి వీరవెల్లి గ్రామానికి బిటిరోడ్డు నిర్మాణంకై పరిశీలిస్తామని, గ్రామంలో డ్రైనేజీలను 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పనులు చేయించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలను మహేందర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి మదన్‌మోహన్, ఎంపిడివో సరస్వతి, తహాశీల్థార్ బండ అరుణరెడ్డి, పిఆర్‌ఏఇ ఇంద్రసేనారెడ్డి, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా డైరెక్టర్లు దేశబోయిన సూర్యనారాయణ, ఆవుల స్వామి, ఎంపిటిసిలు పైళ్ల ప్రసన్న, దేశబోయిన మల్లికార్జున్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, గ్రామ అధ్యక్షులు నర్సింహ, రాములు, బుగ్గబీరప్ప పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచాలి
సూర్యాపేట, జనవరి 12: నగదు రహిత లావాదేవిల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యావంతులు, విద్యార్ధులు కృషిచేయాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ కోరారు. నగదు రహిత లావాదేవిలపై సూర్యాపేట ఎస్వీ కళాశాల ఎన్‌సిసి విభాగం ఆధ్వర్యంలో మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దునేపధ్యంలో నగదు రహిత లావాదేవిలను ప్రొత్సహించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాను సంపూర్ణ నగదురహిత లావాదేవిల నిర్వహణ జిల్లాగా మార్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎన్‌సిసి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు.

పెద్దగట్టు జాతర ఏర్పాట్లు వేగవంతం
* రూ.1.70కోట్ల నిథుల విడుదల
* కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్
సూర్యాపేట, జనవరి 12: తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా ప్రసిద్ది చెందిన పెద్దగట్టు జాతర గడువు సమీపిస్తున్నందున ఏర్పాట్లను వేగవంతం చేసి పూర్తిచేయాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి వారి పెద్దగట్టను సందర్శించి జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.70కోట్ల నిథులను కేటాయించిందని, అట్టి నిథులు విడుదల అయినట్లు చెప్పారు. ఇట్టి నిథులతో చేపడుతున్న పనులను పూర్తి నాణ్యతప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించారు. వచ్చేనెల 12నుండి ఐదురోజుల పాటు జాతర జరుగనుందని, జాతరకు సుమారు 20లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన విధంగా ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. జాతర రోజుల్లో ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు సరిపడా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
అంతేకాకుండా భక్తులు మంచినీటి కోసం ఇబ్బందులకు గురికాకుండా తగిన విధంగా బోర్‌ల ద్వారా నల్లాలను అమర్చి సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, అదేవిధంగా పార్కింగ్ స్థలాల నుండి గుట్ట వద్దకు భక్తులను చేరవేసేందుకు ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈసారి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 100 శాశ్వత మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరుగుతున్న జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్ల పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డిఎస్పీ సునీతామోహన్, ఆలయ ఈవో కుశలయ్య తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ చట్టాలపై
అవగాహన ఉండాలి
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ టౌన్, జనవరి 12 : రెవెన్యూ చట్టాలు, నియమ నిబంధనలపై పరిపూర్ణ విషయ పరిజ్ఞానాన్ని రెవెన్యూ అధికారులు పెంపొందించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. గురువారం ఉదయాధిత్య భవన్‌లో జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డైరీ, కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ రికార్డులు, సాధా భైనామాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డెట్ చేయాలని సూచించారు. జిల్లాలో 371 మంది వి ఆర్ ఒలు, 240 మంది పంచాయితీ కార్యదర్శులు, 900లకు పైగా గ్రామ రెవెన్యూ సహాయకులు తమ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం తెలంగాణ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ 2017 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసి నారాయణరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, నాగలక్ష్మీ, సలేహా, సింగం సత్తయ్య, గుండెబోయిన సైదులు, మధుసూధన్‌రెడ్డి, రామారావు, రామకృష్ణ, నారాయణరెడ్డి, ప్రకాశ్‌రావు, వెంకటయ్య, ముబీన్, తదితరులు పాల్గొన్నారు.