నల్గొండ

విద్యుత్ కనెక్షన్ల కోసం రైతన్నల ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 20: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఏడాదిగా ఎదురుచూపులు పడుతున్నారు. స్వరాష్ట్రంలో విద్యుత్ లోటును అధిగమించి రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందించడంలో సఫలీకృతమైన ప్రభుత్వం రైతులకు సకాలంలో కొత్త విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను అందించడంలో మాత్రం అపసోపలు పడుతుంది. జిల్లాలో 2016-17సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు 22,900మంది ఉండగా వాటిలో 17,113మందికి కనెక్షన్లు మంజూరు చేశారు. మరో 5,787మంది కనెక్షన్ల కోసం ఎదురుచూపులు పడుతున్నారు. ముగ్గురు రైతులు కలిసి డిడిలు కడితే 25కెవి ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేస్తుండగా గత ఏడాది 6024ఏర్పాటు చేయగా ఈ ఏడాది 3575మాత్రమే మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బావులకు సంబంధించి 1300కనెక్షన్లకు రావాల్సిన 149లక్షలు సైతం మంజూరు కావాల్సివుంది.
భయపెడుతున్న రోలింగ్ స్టాక్ లోటు !
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు మూడు జిల్లాల విద్యుత్ శాఖ పరిధిలో 21కేంద్రాలు పనిచేస్తున్నాయి. 75,609త్రిఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో 3,94,771వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను రైతులు ఈ కేంద్రాలకు తీసుకవచ్చిన సందర్భంలో వారికి మరో ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చి వెంటనే పంపించేందుకు నిబంధనల మేరకు 4.15శాతం 3,000ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాక్ ఉండాల్సివుంది.
అయితే ప్రస్తుతం 3శాతం కంటే తక్కువగా 2057మాత్రమే రోలింగ్ స్టాక్ ఉండటంతో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను తీసుకొచ్చిన రైతులకు కనిష్టంగా రెండు రోజుల కంటే అధికంగానే నిరీక్షణ తప్పడం లేదు. ఈ వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యమైనా తమ పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే రోలింగ్ స్టాక్ కొరత ఉంటే రానున్న వేసవిలో తీవ్రమయ్యే విద్యుత్ సమస్యల నేపధ్యంలో ట్రాన్స్‌ఫార్మర్ల డిమాండ్ పెరిగిపోయే సందర్భాల్లో తమకు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఆందోళన రైతుల్లో వినిపిస్తుంది. రోలింగ్ స్టాక్ లోటుపై ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి దృష్టికి జడ్పీటీసిలు, ఎంపిపిలు, ఎమ్మెల్యేలు ఏకరవు పెట్టారు. వెంటనే తగినంతా రోలింగ్ స్టాక్‌ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి విద్యుత్ అధికారులను ఆదేశించినా ఈ దిశగా అడుగుముందుకు పడలేదు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
* ప్రాంతీయ రవాణా కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్
సూర్యాపేట, జనవరి 20: ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించి ప్రమాదాలు నివారించాలని ప్రాంతీయ రవాణాశాఖ కమీషనర్ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చేసే ప్రయాణం ప్రానాంతకం అన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనాలు నడిపే వారితో పాటు సైకిల్ తొక్కే వారు, నడిచి వెళ్లే వారు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్లే ఇటీవల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డుప్రమాదాలు పూర్తిస్థాయిలో నివారించేందుకు విద్యార్ధులు వారి కుటుంబసభ్యులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో మార్పు తెచ్చేందుకే వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. జరిమానాలు విధించినంత మాత్రన రవాణా, పోలీస్‌శాఖల అధికారులపై చెడుభావన పెంచుకోవద్దని కోరారు. ప్రజల్లో రోడ్డుప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకే ప్రతి ఏడాది రోడ్డ్భుద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ పరిమళ హనానూతన్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్‌ను ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణపాయం తప్పుతుందని, అందువల్లే ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరి చేసిందన్నారు. వాహనదారులంతా విధిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్‌లేని వారు వాహనాలను నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని కోరారు. జాతీయ రహదారులపై రోడ్లు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో డి ఎస్పి సునీతామోహన్, ఎంవీ ఐలు ఇమ్రాన్, భాస్కర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సృజన, ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల కమలాకర్, యువజన అధ్యక్షులు లక్ష్మికాంత్, మహిళా అధ్యక్షురాలు పబ్బా గీతాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణ కోసం వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు.