నల్గొండ

మత సామరస్యానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 23: జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరుగనున్న జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఈనెల 26నుండి 28వరకు నిర్వహించే దర్గా ఉర్సు ఉత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తు తెలుగు రాష్ట్రాల్లో ఈదర్గా ప్రసిద్ధి చెందిందన్నారు. ఉత్సవాలకు భారీసంఖ్యలో హజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రూ.11లక్షలను మంజూరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జాన్‌పహాడ్‌లో శాశ్వత వసతుల నిర్మాణాలకు రూ.23లక్షల నిథుల మంజూరీ కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఉత్సవాలకు నిథుల కొరత లేదని, అయితే మంజూరైన నిథులను సక్రమంగా ఖర్చుచేయాలని, దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉర్సుకు తరలివచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు 16ట్యాంకర్‌లను ఏర్పాటుచేసి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తులు స్నానాలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న 15 స్నానాల గదులకు అదనంగా తాత్కాలికంగా మరో 15గదులను ఏర్పాటుచేయాలన్నారు. దర్గా చుట్టుపక్కల పారిశుద్ద్య పనులు చేపట్టేందుకు సిబ్బందిని నియమించాలని కోరారు. 400మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో మోహన్‌రావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎల్.శ్రీనివాస్, వక్ప్‌బోర్డు ఇన్స్‌స్పెక్టర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

పదవులకై గులాబీ నేతల నిరీక్షణ!

నల్లగొండ, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భావం నుండి ఉద్యమించి ఎదురైన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ గెలుపుకు వ్యయప్రయాసలు పడిన గులాబీ తమ్ముళ్లకు నామినేటెడ్, పార్టీ కమిటీల పదవుల భర్తీ కోసం పడుతున్న నిరీక్షణ కొనసాగుతుంది. ప్రస్తుతమున్న జిల్లా పార్టీల అధ్యక్షుల పదవి కాలం ముగిసిపోగా వాటితో పాటు కొత్త జిల్లాలకు సైతం పార్టీ జిల్లా అధ్యక్షులను, కార్యవర్గాలను నియమించాల్సివుంది. ఈ నెల 27పిదప పార్టీ జిల్లా సారధుల నియామకం చేపడుతారన్న పార్టీ వర్గాల ప్రచారం గులాబీ తమ్ముళ్లలో కొత్త ఆశలు రేపుతుంది. అయితే సీఎం కెసిఆర్ స్వయంగా జిల్లా పార్టీల అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేసి జాబితా సైతం సిద్ధం చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా జిల్లా అధ్యక్షుల నియామకంలో తాత్సార్యం సాగుతుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించి ఇప్పటిదాకా కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు మినహా ఇతర పార్టీలన్ని కూడా ఇప్పటికే తమ పార్టీల జిల్లా సారధులను నియమించుకుని పార్టీల బలోపేతానికి పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయి. టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో సీఎం కెసిఆర్‌దే కీలక నిర్ణయం కావడంతో ఆయన ఏవరిని నియమించనున్నారన్నదానిపై ఉత్కంఠత కొనసాగుతుంది. పార్టీ జిల్లా సారధులుగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీను సైతం నియమించే అవకాశం లేకపోలేదని తెలుస్తుండటంతో ఆశావాహులు బహుళ సంఖ్యలో ఉన్నారు. జిల్లా పార్టీ పదవులను ఆశించిన వారిలో కొందరికి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించేందుకు పార్టీ పరంగా కసరత్తు సాగిస్తున్నారు.
పాలక మండళ్ల భర్తీలోనూ ఎదురుచూపులే !
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలోని ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీల పాలక మండళ్ల భర్తీలో సైతం రెండున్నర ఏళ్లగా పైగా జాప్యం సాగుతుండటం గులాబీ తమ్ముళ్లకు ఎదురుచూపులు మిగిలిస్తుంది. గత ఆగస్టులో యాదాద్రి, మత్స్యాద్రి, చెర్వుగట్టు, ధర్వేశిపురం, మీనాక్షి అగస్తేశ్వర, మఠంపల్లి వంటి 6ఏ పరిధిలోని ప్రముఖ దేవాలయాలతో పాటు సి, బి విభాగంలోని 33దేవాలయాల పాలక మండళ్ల భర్తీకి నోటిఫికేషన్ సైతం ఇచ్చి భర్తీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం గులాబీ నేతల్లో అసహనం రేపుతుంది. అలాగే మూడు జిల్లాల పరిధిలోని 19వ్యవసాయ మార్కెట్‌లకు గాను ఇంకా 11మార్కెట్‌ల పాలక మండళ్లను భర్తీ చేయాల్సివుంది. వాటిలో నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, చండూర్, దేవరకొండ, హాలియా, మాల్ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను భర్తీ చేయాల్సివుంది. సూర్యాపేట జిల్లా పరిధిలో హుజూర్‌నగర్, నేరడుచర్ల, సూర్యాపేట మార్కెట్‌లు, యాదాద్రి జిల్లా పరిధిలో చౌటుప్పల్, భువనగిరి మార్కెట్‌ల పాలక వర్గాలను భర్తీ చేయాల్సివుంది. దేవాలయ, మార్కెట్‌ల పాలక మండళ్ల భర్తీ కోసం దరఖాస్తులు సైతం స్వీకరించి భర్తీ చేయడంలో మాత్రం నిరీక్షణ పెట్టిస్తున్న పార్టీ నాయకత్వం తీరుపై గులాబీ తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పదవీ కాలం సగానికి పైగా పూర్తయ్యినందున నామినేటెడ్ పదవుల భర్తీకి అధిష్టానం చర్యలు తీసుకుని పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సామాజిక సేవాకేంద్రాలుగా జైళ్లు

* జైళ్ల శాఖ డిజి వినయ్‌కుమార్ సింగ్
భువనగిరి, జనవరి 23: జైళ్లను సంస్కరణలు చేపట్టి సామాజిక సేవాకేంద్రాలుగా మారుస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. సోమవారం భువనగిరి సబ్‌జైల్‌ను సందర్శించిన అనంతరం వినయ్‌కుమార్‌సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే జైళ్ల శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణలతో నేరస్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2014లో 90వేల మంది నేరస్థులు జైళ్లలో ఉండగా ఆ సంఖ్య 2015లో 79వేలు, 2016లో 62వేలకు తగ్గిందన్నారు. జైళ్లశాఖను అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జైలు శిక్ష పూర్తయి విడుదల అయిన వారిలో 2000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
కొత్త జిల్లాల్లో కొత్త జైళ్లు..
నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో కొత్త జైళ్లను నిర్మిస్తామని అందుకు గాను భూమిని కేటాయించేందుకు రెవెన్యూ అధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలుశాఖ అధికారి అర్జునరావు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు మాదాసు శంకర్‌గౌడ్, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
* పోలీస్ గ్రీవెన్స్‌లో
ఎస్పీకి వినతుల వెల్లువ
నల్లగొండ టౌన్, జనవరి 23: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి బాధితుల నుండి ఆర్జీలు స్వీకరించారు. నల్లగొండ సబ్ డివిజన్ నుండి 12, మిర్యాలగూడ సబ్ డివిజన్ నుండి 3, దేవరకొండ డివిజన్ నుండి ఒక దరఖాస్తును ఎస్పీ స్వీకరించి వాటి పరిష్కార నిమిత్తం అధికారులకు పంపించారు. డయల్ యువర్ ఎస్పీలో ఫోన్‌కాల్స్ ఫిర్యాదులపై సైతం ఎస్పీ అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు.

మూల్యాంకనంపై అవగాహన
నూతనకల్, జనవరి 23: విద్యార్ధులు నిర్మాణాత్మక మూల్యాకనంపై అవగాహన కలిగి ఉండాలని సమగ్ర నిరంతర మూల్యాకన కమిటీ ప్రత్యేక అధికారి వీరారెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాల, నారాయణ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు తయారుచేయాలని సగ్రనాత్మక మూల్యాకనంపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్ధులను నూతన సమస్యలు రూపొందించేలా తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు స్వయంగా గాని, గ్రూపుగా గాని తయారు చేయవచ్చునని సూచించారు. సిసి ఈ పద్దతి ప్రకారం విద్యార్ధులు గ్రంథాలయాలలోని పుస్తకాల ఆధారంగా మ్యాగజెన్లు, వార్తపత్రికలు, మాస పత్రికల ఆధారంగా ఒక అంశాన్ని ఎంపికచేసుకొని సమీక్ష తయారుచేయాల్సి ఉంటుందన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడులకు..
ముందస్తుగా హాజరుకావాలి
* కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్
సూర్యాపేట, జనవరి 23: ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం 8గంటలకు కలెక్టరేట్‌కు రావాలని అధికారులను జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో మాట్లాడుతూ ఉదయం 8.30 నిమిషాలకు కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు. అనంతరం 9గంటలకు పోలీస్ ఫరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఫరేడ్ గ్రౌండ్‌లో స్టాల్స్ ఏర్పాటు, శకటాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే ఎస్సి, ఎస్టీ రుణమేళాకు కనీసం 200యూనిట్లను గ్రౌండింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఇన్‌చార్జి జడ్జిగా సునీత
నల్లగొండ లీగల్, జనవరి 23: నల్లగొండ జిల్లా కోర్టు ఇన్‌చార్జి జడ్జీగా ఎంఆర్.సునీతను నియమిస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్లగొండ మొదటి అదనపు జిల్లా జడ్జీగా పనిచేస్తున్నారు. గతంలో జిల్లా జడ్జీగా పనిచేసిన జి.రాధారాణి నాంపల్లి కోర్టుకు బదిలీ చేయడంతో ఆమె స్థానంలో సునీత ఇన్‌చార్జి జడ్జిగా నియమితులయ్యారు.