నల్గొండ

విద్యాసంస్థల బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 23: తెలంగాణ జెఎసి నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా చైర్మన్ కోదండరాంతో పాటు విద్యార్థులను, ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టు చేయాడాన్ని నిరసిస్తూ ఓయు జెఎసి, విద్యార్థి జెఎసి, నిరుద్యోగ జెఎసి గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఎన్‌ఎస్‌యుఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, న్యూడెమోక్రసీ, బిడిఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, టివివి, టియువి, టిజెఎసి భాగస్వామ్యం సంఘాలు విద్యాసంస్థల బంద్ నిర్వాహణలో పాల్గొని తమ నిరసన తెలిపారు. సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మోత్కూర్, వలిగొండ, భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్ తదితర పట్టణాలు, మండలాల్లో విద్యాసంస్థల బంద్, కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ అమరవీరుల స్థూపం వద్ద నిరసనకు దిగిన నిరుద్యోగ జెఎసి, విద్యార్థి జెఎసి నాయకులు పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట, వలిగొండ, భువనగిరిలలో సైతం నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. నిరసనల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా తమ ఆందోళనలు కొనసాగిస్తామంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు సుక్క సైదులు, ఇందూరి సాగర్‌లు ప్రకటించారు. కోదండరాం అరెస్టును, ఓయులో విద్యార్థులపై పోలీసుల అణిచివేత చర్యలను వారు ఖండించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా అర్థం చేసుకున్నారని ఇకనైనా కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పడిపోతున్న కందుల ధర
* నిడమనూరు మార్క్‌ఫెడ్‌లో ఆగిన టోకెన్ల జారీ
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 23: నిడమనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో కందుల టోకెన్ల జారీ ఆగిపోవడంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో పండించిన కందులకు ధర పడిపోయింది. నిడమనూరు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుండి క్వింటాలుకు రూ.5,050ల మద్దతు ధరపై కొనుగోలు చేస్తున్నారు. యార్డులో టోకెన్లు ముందుగా ఇచ్చిన అనంతరమే రైతులను కందులను యార్డుకు తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు టోకెన్లను నిడమనూరు మార్కెట్‌లో జారీ చేశారు. కొత్తగా కందులు అమ్మేందుకు వెళ్లిన రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దీంతో రైతులు మిర్యాలగూడ యార్డులో కందులు విక్రయానికి తీసుకు వస్తున్నారు. గత రెండు రోజులుగా రోజుకు సమారు 10 క్వింటాళ్ల వరకు కందులు వస్తుండగా కొంతమంది కొనుగోలు దారులే వచ్చి రూ.3,500 నుంచి రూ.3,800 వరకే ధర ఇస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ పాత యార్డుకు సుమారు 35 బస్తాల కందులను సుమారు 10 మంది రైతులు తీసుకువచ్చారు. పెద్ద మార్కెట్ అయిన మిర్యాలగూడలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్క్‌ఫెడ్ వారికి సరిపోను సిబ్బంది లేరని అంటున్నారని తాము సిబ్బందిని ఇస్తామని కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి జె.అనంతయ్య అన్నారు.

శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులకు
10లక్షలు అందించిన కలెక్టర్

నల్లగొండ, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసుకున్న కాసోజు శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటారీలకు ప్రభుత్వం మంజూరు చేసిన 10లక్షల రూపాయలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం తన చాంబర్‌లో డిడిగా వారికి అందించారు. ఈ డిడిని పొడిచేడు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను శ్రీకాంత్‌చారి తల్లిదండ్రుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, కలెక్టరేట్ అధికారులు ఉన్నారు.

పట్టు సాగుకు ప్రోత్సహం
* తెలంగాణలో అనుకూల వాతావరణం
* కేంద్ర పట్టుమండలి చైర్మన్ హనుమంత రాయప్ప
సూర్యాపేట, ఫిబ్రవరి 23: పట్టు సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర పట్టు మండలి అనేక రాయితీలను కల్పిస్తుందని వీటిని రైతులు సద్వినియోగం చేసుకొని లాభాల బాట పట్టాలని కేంద్ర పట్టుమండలి చైర్మన్ కె ఎం. హనుమంత రాయప్ప అన్నారు. తెలంగాణ ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పట్టు పురుగుల పెంపకంపై గురువారం జిల్లాకేంద్రంలోని జె ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల పట్టు రైతుల సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. రైతులకు సెరి కల్చర్ సాగువిధానంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పట్టుగుళ్ల పెంపకం షెడ్లు నిర్మించుకునేందుకు రూ. 2.60లక్షల సబ్సిడిని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద నూతనంగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాకు 5యూనిట్లను మంజూరీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 460 ఎకరాల్లో పట్టుసాగు అవుతుందని రాబోయే రోజుల్లో సాగు విస్తీర్ణనాన్ని వెయ్యి ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కిలో పట్టుగూళ్ల ధర గతంలో రూ. 300లు ఉండేదని ప్రస్తుతం రూ.400లకు పైగానే ధర పలుకుతున్నట్లు చెప్పారు. ఒక ఎకరం భూమిలో మల్బరి ఆకు సాగుచేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 5వేలు మంజూరీచేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకంగా కిలో పట్టుగూళ్లకు రూ. 75చెల్లిస్తుందని, ప్రోత్సాహక చెల్లింపులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని పంటల కంటే పట్టు పంట సాగులో అధిక దిగుబడులు వస్తాయని అందువల్ల రైతులు ఈ సాగుపై ఆసక్తిని పెంచుకోవాలని కోరారు. పట్టుసాగుకు తెలంగాణ రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఆసక్తి చూపడం లేదని అందువల్ల గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ఇతర పంటల సాగు వల్ల రైతులు నష్టపోయి అప్పుల పాలు అవుతున్నారని పట్టును సాగుచేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవన్నారు. పట్టుసాగు చేయడం వల్ల ఏడాదికి 8నుండి 10వరకు దిగుబడులు వస్తాయన్నారు. ఈ పంటలకు సేంద్రియ ఎరువులనే వినియోగించాలని, రసాయన ఎరువులు వినియోగించేస్తే ఆశించిన మేర దిగుబడులు రావాన్నారు. ఉద్యానవన శాఖ సంచాలకులు డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో 3500 ఎకరాల్లో మాత్రమే సెరి కల్చర్ సాగుచేయబడేదని రాష్ట్ర ఏర్పాటు తర్వాత 7వేల ఎకరాలకు సాగు పెరిగినట్లు తెలిపారు. గతంలో పట్టు విక్రయానికి రాష్ట్రంలో ఒకే కొనుగోలు కేంద్రం ఉండగా ప్రస్తుతం 5కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పంటలు సాగుచేసే రైతులకు సబ్సిడిపై యంత్రాలను అందజేస్తామన్నారు. సెరి కల్చర్‌ను సాగుచేసే రైతులకు ఉపాధి హామీ పనులను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, జాయింట్ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి, డిప్యూటి సెక్రటరి విజయ్‌కుమార్, ఉద్యానవన శాఖ జెడి అరుణ, సంగీతలక్ష్మి, శాస్తవ్రేత్తలు మొగిలి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్, షరీఫ్, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.

గోవులను రక్షించుకుందాం
* ఆధ్యాత్మిక క్షేత్రం గోశాలలో గోవులకు రక్షణ కరువు
* విహెచ్‌పి దక్షిణ భారత గోరక్షా ప్రముఖ్ యాదగిరిరావు

యాదగరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 23: యాదాద్రి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, ఆధ్యాత్మిక క్షేత్రంలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోశాలలో గోవుల రక్షణ, వాటి పోషణలో కరువైందని విహెచ్‌పి దక్షిణ భారత గోరక్షా ప్రముఖ్ టి యాదగిరి రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని గోశాలను సందర్శించి గోవుల పట్ల అధికారుల నిర్లక్ష్యంపై యాదగిరి తీవ్ర కలత చెందారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి వందల కోట్లు కేటాయించి ఆలయ పునఃనిర్మాణం చేయటం అభినందవనీయమన్నారు. నిత్యం శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి అభిశేకానికి, ఆరగింపుకైకర్యాలకు గోశాలలోని గోవుల పాలును ఉపయోగిస్తారని, భక్తులు తమ మొక్కులలో భాగంగా దేవస్థానానికి గోవులను సమరించుకుంటారని, అలాంటి గోవులను రక్షించాల్సిన అధికారులు తమ విధులను సరిగా నిర్వర్తించక పోవడంతో నెల రోజుల్లోనే 22 గోవులు మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో గోవుల పర్యవేక్షణ లోపించడం ఇక్కడ గోవులకు వైద్య సదుపాయాలు లేక పోవటం, గోవుల దాన సక్రమంగా లేకపోవడం, కోత గడ్డికి బదులు యంత్రాల ద్వారా వచ్చిన గడ్డిని అరకొరగా వెయ్యటంతో గోవులు బక్క చిక్కి మృతి చెందుతున్నాయని ఇది మహా పాపమన్నారు. ఇలాంటి సంఘటనలు పునావృతం అవుతే పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో గోశాలలోని గోవులు సరియైన సదుపాయాలు లేక గడ్డి దాన సక్రమంగా లేక అధికారుల నిర్లక్ష్యంతో గోవులు చనిపోతున్నాయని అనేక మార్లు ఫిర్యాదులు చేశామని అధికారులలో మార్పు రావడం లేదని అన్నారు. నెల రోజుల్లో 22 గోవులు చనిపోయాయని గత రెందు రోజుల క్రితం గోవు బక్క చిక్కి మరణించిందని వైద్యాధికారిని, అధికారులను అడిగిన పెద్దగా పటించుకోక పోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు చొరవతీసుకుని గోవుల రక్షణ కోసం చొరవ తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విహెచ్‌పి జిల్లా అధ్యక్షుడు పోల శ్రీనివాస్, కార్యదర్శి తోట భానుప్రసాద్, భజరంగదళ్ జిల్లా సంయోజక్ పాదరాజు మనోజ్‌కుమార్, శరత్, ప్రభాకర్, కర్రె ప్రవీణ్, నవీన్, నరేష్ పాల్గొన్నారు.

ఫ్లోరైడ్ నివారణ కార్యక్రమాలకు
ప్రణాళికలు సిద్ధం చేయాలి
వర్క్‌షాప్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఫిబ్రవరి 23: జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రం డైఇన్ హోటల్‌లో యూనిసెఫ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సంయుక్తంగా నిర్వహించిన మండల అధికారుల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతు జిల్లాలో 19మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉందన్నారు. ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు తగిన శిక్షణా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉందని మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులతో భూగర్భ జలాలు పెంపొందించి ఫ్లోరిన్ శాతాన్ని తగ్గించవచ్చన్నారు. ఇందుకు మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేయాలన్నారు. భూగర్భంలోని నీటి మట్టం తగ్గుతున్న మేరకు ఫ్లోరైడ్ పెరుగుతుందన్నారు. వర్షాలు తక్కువ కురవడం వలన భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికమవుతుందన్నారు. అలాగే సమతుల్య పోషకాహారంతో ఫ్లోరైడ్‌ను నివారించవచ్చని, ప్రజలకు పోషకాహార వినియోగంపై ప్రచారం కల్పించాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహాన కల్పించే మాన్యువల్ రూపొందించాలన్నారు. ఇప్పటికే వందలాది గ్రామాలకు కృష్ణా మంచినీటీ సరఫరా జరుగుతుందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి రక్షిత కృష్ణా జలాలు అందించే కార్యక్రమం సాగుతుందన్నారు. రక్షిత జలాల వినియోగం, పోషకాహారం వంటి జాగ్రత్తలతో ఫ్లోరైడ్‌కు దూరంగా ఉండవచ్చన్నారు. జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ కమిటీ, యూనిసెఫ్‌లకు నిర్ధేశించిన కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణ సాగించాలన్నారు. డిఎఫ్‌ఎంసి లక్ష్యాల సాధనకు సంబంధిత శాఖల అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపారావు, ఎన్‌ఐఎన్ అర్జున్ కందారే, సిపార్ట్ వాటర్ క్వాలీటీ డాక్టర్ నాగేశ్వర్‌రావు, యూనిసెఫ్ కోఆర్డీనేటర్ టి.శ్రీహరి, ఆర్డీవో వెంకటాచారి, జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణలు స్ఫూర్తి, శంకర్, సౌజన్యకుమార్, ప్రసాద్, ట్రైనర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయమే లక్ష్యం
పాదయాత్రకు చక్కని స్పందన * సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మునగాల, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం అందించడమే మహాజన పాదయాత్ర లక్ష్యమని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండలకేంద్రంతో పాటు మండల పరిధిలోని నారాయణగూడెం, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, ఆకుపాముల గ్రామాల్లో పాదయాత్ర రెండవ రోజు కొనసాగింది. మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఆదివాసి వర్గాల ప్రజలకు ధనికుల వలే ఆస్తి, భూమి, రాజకీయ గౌరవం దక్కాలన్నారు. పాదయాత్ర నేటితో 25 జిల్లాల్లో పూర్తవుతుందని పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. పాదయాత్ర వల్ల గ్రామ గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో ప్రజలకు ఎర్రజెండాపై విశ్వాసం పెరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ తుగ్లక్ పాలనను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయనుకున్న ప్రజలకు కెసిఆర్ మాటల గారడితో మాయచేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో నేటి వరకు ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. కుటుంబ కూటమి పాలనతో అసంఘటిత కార్మికులను, ఉపాధి హామీ కూలీలను, రైతులను, ఒప్పంద అధ్యాపకులను మోసంచేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాల కాలంలో 2400 రైతుల ఆత్మహత్యలతో దేశంలో రాష్ట్రం కెసిఆర్ పాలనలో గొప్పస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యులు వెంకటేశ్వర్‌రావు, మల్లు నాగార్జున్‌రెడ్డి, కె.రమణ, పార్టీ నాయకులు గడ్డం వెంకన్న, లిప్టు వెంకట్‌రెడ్డి, స్టాలిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ్లోరైడ్ నివారణకు ప్రణాళికలు సిద్ధం
* వర్క్‌షాప్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఫిబ్రవరి 23: జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రం డైఇన్ హోటల్‌లో యూనిసెఫ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సంయుక్తంగా నిర్వహించిన మండల అధికారుల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 19మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉందన్నారు. ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు తగిన శిక్షణా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉందని మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులతో భూగర్భ జలాలు పెంపొందించి ఫ్లోరిన్ శాతాన్ని తగ్గించవచ్చన్నారు. ఇందుకు మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేయాలన్నారు. భూగర్భంలోని నీటి మట్టం తగ్గుతున్న మేరకు ఫ్లోరైడ్ పెరుగుతుందన్నారు. అలాగే సమతుల్య పోషకాహారంతో ఫ్లోరైడ్‌ను నివారించవచ్చని, ప్రజలకు పోషకాహార వినియోగంపై ప్రచారం కల్పించాలన్నారు. ఈవిషయాలపై ప్రజలకు అవగాహన కల్పించే మాన్యువల్ రూపొందించాలన్నారు. ఇప్పటికే వందలాది గ్రామాలకు కృష్ణా మంచినీటీ సరఫరా జరుగుతుందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి రక్షిత కృష్ణా జలాలు అందిస్తామన్నారు. రక్షిత జలాల వినియోగం, పోషకాహారం వంటి జాగ్రత్తలతో ఫ్లోరైడ్‌కు దూరంగా ఉండవచ్చన్నారు. జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ కమిటీ, యూనిసెఫ్‌లకు నిర్ధేశించిన కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణ సాగించాలన్నారు. వర్క్‌షాప్‌లో ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపారావు, ఎన్‌ఐఎన్ అర్జున్ కందారే, సిపార్ట్ వాటర్ క్వాలీటీ డాక్టర్ నాగేశ్వర్‌రావు, యూనిసెఫ్ కోఆర్డినేటర్ శ్రీహరి, ఆర్డీవో వెంకటాచారి, ఫ్లోరైడ్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణలు స్ఫూర్తి, శంకర్ పాల్గొన్నారు.

ఉపకార వేతనాల మళ్లింపుపై విచారణ
* ఇద్దరిపై వేటు

నల్లగొండ, ఫిబ్రవరి 23: నల్లగొండ ట్రెజరీ కార్యాలయంలో విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజురీయంబర్స్‌మెంట్ డబ్బులు 73లక్షలను అక్రమంగా ఓ ప్రైవేటు కళాశాల ఖాతాలోకి మళ్లించిన ఉదంతంపై రాష్ట్ర ట్రైజరీ డైరక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. ఈ వ్యహారంలో ప్రమేయమున్నట్లుగా భావిస్తున్న ఎస్‌టివో, టైపిస్టులను సస్పెండ్ చేసి విచారణ సాగిస్తున్నారు. పలు కారణాలతో ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ పొందని కళాశాలలకు చెందిన విద్యార్థుల వివరాలను నల్లగొండ ట్రెజరీ కార్యాలయం నుండి, డైరక్టరేట్ కార్యాయలం నుండి కొన్నింటిని ఆన్‌లైన్ అప్‌లోడ్ చేసి వారికి ఫీజుల చెల్లింపు చేయాలంటు నివేధించారు. ఇందుకు అమోదం లభించడంతో నల్లగొండ ట్రెజరీ పిడి అకౌంట్ నుండి కోదాడలోని ఓ ప్రైవేటు కళాశాలకు అకౌంట్‌కు 73లక్షలు అక్రమంగా బదలాయించారు. ఈ తతంగాన్ని రోజువారి బిల్లుల చెల్లింపుల పరిశీలనలో జిల్లా ట్రెజరీ కార్యాలయం అధికారులు గుర్తించి వెంటనే సదరు డబ్బులను పిడి అకౌంట్ నుండి కళాశాల అకౌంట్‌కు బదిలీ కాకుండా ఆపివేయించారు. దీనిపై జిల్లా ట్రెజరీ ఇన్‌చార్జి కోశాధికారి యాదగిరిరావు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అక్రమాలకు బాధ్యులుగా తేలిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

నేడు గుర్రంపోడ్‌కు జానారెడ్డి రాక
గుర్రంపోడ్, ఫిబ్రవరి 23: సిఎల్పీ నేత కుందూరి జానారెడ్డి నేడు మండల కేంద్రంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్ష కార్యదర్శులు జాల చినసత్తయ్య, జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం పాల్వాయిలో శివలింగాన్ని ప్రారంభిస్తారని, అనంతరం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్‌హాలులో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు అందించాలి
* ఎన్నికల అధికారి నాగిరెడ్డి

నల్లగొండ, ఫిబ్రవరి 23: గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో కొంతమంది ఇంకా తమ ఎన్నికల వ్యయ లెక్కలను అందించలేదని అటువంటి వారికి వెంటనే నోటీస్‌లు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతు పంచాయతీరాజ్ సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లెక్కలు చెప్పనివారికి వెంటనే నోటీస్‌లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లెక్కలు అందించని వారిపై చట్టపర చర్యలు తప్పవన్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు, పార్టీలకు నూతన ఎన్నికల నియమావళిని అందించాలన్నారు. ఎంపిటీసిలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ సీఈవో ఆర్.అంజయ్య, డిపివో గోపాల్‌రావు, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పానగల్ శివాలయాల్లో కలెక్టర్ పూజలు
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 23: పానగల్ చారిత్రాక శివాలయాలు ఛాయ, పచ్ఛల సోమేశ్వర ఆలయాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం సందర్శించి లింగార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కాకతీయుల సామంతులు కుందూరు చోడ రాజుల కాలంలో నిర్మితమైన ఈ చారిత్రాక శివాలయాల విశేషాలు, అద్భుత శిల్ప సంపద, నిర్మాణ కౌశలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా చూడాలని నిర్వాహకులను కోరారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పానగల్ చారిత్రాక సాంస్కృతిక ఉత్సవాల నిర్వాహణకు నిధులు మంజూరు చేయాలని కోరుతు పానగల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండూరు సత్యనారాయణ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, దేవాదాయ శాఖ ఏసి సులోఛన, ఛాయ సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, నాయకులు చాపల లింగయ్య, కొడదల లింగయ్య, కొప్పు కృష్ణ ఉన్నారు.