బిజినెస్

పరిశ్రమల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 25: స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణ పనులు జోరందుకున్నాయి. రాజధానికి దగ్గరలో విజయవాడ- హైదరాబాద్ 95వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ప్రభుత్వం-తెలంగాణ రాష్ట్ర వౌలిక సదుపాయల సంస్థ (టిఎస్‌ఐఐసి) ఆధ్వర్యంలో 1,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశలో 373 ఎకరాల భూసేకరణ పూర్తవ్వగా, రెండో దశలో మరో 608.07 గుంటల భూసేకరణ పనులు జరుగుతున్నాయి. గ్రీన్ అండ్ ఆరేంజ్ కేటగిరిలోని అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు ఈ పార్కు వేదిక కాబోతోంది. రాజధానికి, హైవేకి దగ్గరగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల స్థాపనపట్ల ఆసక్తి చూపుతుండడం పార్కు విజయంపై ఆశలు రేపుతోంది. తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య (టిఐఎఫ్) పరిశ్రమల స్థాపన దిశగా టిఎస్‌ఐఐసికి ఇప్పటికే 10 కోట్ల రూపాయలను సైతం చెల్లించింది. ఎకరాకు 11.60 లక్షల చొప్పున జిల్లా యంత్రాంగం నుండి తొలి విడత భూసేకరణ సైతం పూర్తయింది. 43 కోట్ల రూపాయలను కూడా టిఎస్‌ఐఐసి నుండి కేటాయించారు. ఘాట్ కంచే భూములుగా పిలవబడే ఈ భూములను గతంలో పేదలకు ప్రభుత్వమే పంపిణీ చేసినప్పటికీ, భూసేకరణ ప్రక్రియలో భాగంగా మళ్లీ ఇప్పుడు వారి నుండే కొనుగోలు చేస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలి ఇండస్ట్రియల్ పార్కు ఇదే కావడంతో దండుమాల్కపురం ఇండస్ట్రియల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ పార్కుగా ఏర్పాటు చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కా కార్యాచరణ చేపట్టింది. మల్కాపురం చేనేత పార్కు సమీపంలో ఉన్న మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో వచ్చే ఏడాదిలో ఉత్పత్తులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 400 ఎకరాల్లో, భారీ పరిశ్రమలకు 600 ఎకరాల్లో అవకాశం కల్పించనున్నారు. దండుమాల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా వేగంగా అనుమతులు జారీ చేసి పార్కు పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ పరచనుంది. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఆరు పార్కులున్నాయి. వీటికితోడు కొత్తగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో ఆరేసి నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 30 నుండి 60 ఎకరాలలోపు చిన్న పారిశ్రామిక పార్కులను ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు మూడు జిల్లాల్లో 3,599 ఎకరాలతో ల్యాండ్ బ్యాంకు సైతం సిద్ధం చేశారు. చిట్యాలలో ఒకటి, నల్లగొండ, మిర్యాలగూడ, బీబీనగర్, చింతపల్లి, నార్కట్‌పల్లి, హుజూర్‌నగర్, భువనగిరి తదితర ప్రాంతాల్లో కొత్తగా మినీ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.