నల్గొండ

గులాబీ దిగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 16: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంకా తమకు నామినేటెడ్ పదవుల భాగ్యం దక్కకపోతుండటం గులాబీ నేతల్లో తీవ్ర నైరాశ్యాన్ని రగిలిస్తోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడేళ్లయినా సగం మార్కెట్ చైర్మన్లు, దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేయకపోవడం వారిలో అసహానాన్ని రేపుతుంది. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అనేక వ్యయప్రయాసాలను భరించి రాష్ట్ర సాధన ఉద్యమాలతో పాటు ఎదురైన ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన జిల్లా, నియోజకవర్గ, మండల పార్టీ నాయకత్వాలకు కనీసం మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నామినేటెడ్ పదవులనైన ఇవ్వకుండా మూడేళ్లుగా ఎదురుచూపులు మిగిలిస్తున్న అధిష్టానం తీరుపై పార్టీ శ్రేణులు అంతర్మథనం చెందుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నందునా నోరెత్తలేక పోతున్నామని తమ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రయత్నించాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇదిగో అదిగో అంటు రోజులు వెళ్లదీస్తుండటం మరింత అన్యాయంగా ఉందంటు ఆశవాహులు వాపోతున్నారు. ఒకరికి పదవి ఇస్తే ఇంకొకరితో అసమ్మతి అంటు మూడేళ్ల కాలయాపన చేయడం రాజకీయ విజ్ఞత కాదని ఇప్పటికే కొంతమంది పదవి కాలం పూర్తయి మరికొంత మందికి కొత్తగా పదవులు వచ్చేవంటు గులాబీ తమ్ముళ్లు వాదిస్తున్నారు.
19 మార్కెట్‌లకు తొమ్మిది ఖాళీనే..!
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 19వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా వాటిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో పది మార్కెట్ కమిటీలకు మాత్రమే పాలక మండళ్లను నియమించింది. నేటికి తొమ్మిది మార్కెట్ కమిటీలు పాలక మండళ్ల భర్తీ కోసం గులాబీ శ్రేణులు ఎదురుచూపులు పడుతు ఎమ్మెల్యేల ద్వారా తమవంతు ప్రయత్నం సాగిస్తున్నారు. జిల్లాలో పెద్ద మార్కెట్లయినా మిర్యాలగూడ, నల్లగొండ, హాలియా, దేవరకొండ, చండూర్, మాల్, హుజూర్‌నగర్, నేరడుచర్ల, చౌటుప్పల్ మార్కెట్ కమిటీలను మూడేళ్లుగా భర్తీ చేయకపోవడం గమనార్హం. మూడేళ్లలో కేవలం నిడమనూర్, చిట్యాల, నకిరేకల్, వలిగొండ, భువనగిరి, ఆలేరు, మోత్కూర్, సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ మార్కెట్ కమిటీలను భర్తీ చేశారు. వీటిలో ఈ నెలాఖరుకల్లా నకిరేకల్, తిరుమలగిరి మార్కెట్ కమిటీల పదవీ కాలం ముగిసిపోనుంది. వాటి పదవి కాలం పొడగిస్తారా లేక కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేస్తారా అన్నదీ మరింత ఆసక్తికరంగా మారింది.
దేవాలయాల కమిటీల భర్తీలోనూ ఎదురుచూపులే..!
మూడు జిల్లాల్లో 63దేవాలయాల పాలక మండళ్లలో సైతం మూడేళ్లలో సగం కూడా భర్తీ చేయలేదు. ప్రధాన దేవాలయాలు యాదగిరిగుట్ట, చెర్వుగట్టు, మేళ్లచెర్వు శుంభులింగేశ్వర ఆలయం, వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర, లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు, మఠంపల్లి లక్ష్మినరసింహా ఆలయాలకు సైతం టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలక మండళ్ల నియామకం సాగలేదు. ఆలయాల పాలక మండళ్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసిన గులాబీ నేతలు మూడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. కనీసం తమకు మార్కెట్, ఆలయా పాలక మండళ్ల చైర్మన్, డైరక్టర్‌ల పదవులైనా దక్కకపోతాయా? అన్న ఆశతో తమ నాయకులకు జేజేలు కొడుతు కాలం వెళ్లదీస్తున్న తమగోడును అధిష్టానం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందంటు జిల్లా, నియోజకవర్గ, మండల పార్టీ నాయకత్వాలు లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నాయి.
పార్టీ కమిటీల్లో చాన్స్ ఎవరికో..!
నామినేటెడ్ పదవుల భర్తీలో టిఆర్‌ఎస్ అధిష్ఠానం జాప్యం కొనసాగుతుండగా మరోవైపు పార్టీ జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీల నియామకాల్లో సైతం అదే జాప్యం సాగుతుండటం ఆ పార్టీ శ్రేణులకు ఎదురుచూపులు పెడుతుంది. ఇదిగో అదిగో అంటు జిల్లా కన్వీనర్, నియోకవర్గ అధ్యక్షులు, కమిటీల నియామకాలను వరంగల్ పార్టీ ప్లీనరీ సభ జరిగి రెండు నెలలైనా భర్తీ చేయకపోవడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో నియోజకవర్గ కమిటీలకు వారే అధ్యక్షులుగా ఉండనుండగా ఎమ్మెల్యేలు లేనిచోట అధ్యక్షుల నియామకంపై ఆసక్తి నెలకొంది. అసలే కేంద్రం జమిలి ఎన్నికలకు వెలుతామంటున్న క్రమంలో తమ ప్రభుత్వం అటు నామినేటెడ్, ఇటు పార్టీ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తుందోనంటు పదవుల కోసం సాగిస్తున్న తమ నిరీక్షణ పర్వానికి ఎప్పుడు తెరపడుతుందోనంటు గులాబీ శ్రేణులు అంతర్గత అసహనంతో రోజులు వెళ్లదీస్తున్నాయి.

దేశం చూపు తెలంగాణ వైపు
*మోదీకి ఇష్టం ఉన్నా లేకున్నా
తెలంగాణ అభివృద్ధిని అంగీకరించాల్సిందే..
* మంత్రి జగదీశ్‌రెడ్డి రంజాన్ దుస్తుల పంపిణీ

నల్లగొండ, జూన్ 16: నూతన రాష్ట్రం తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా కొనసాగుతుందని, భారత దేశమంతా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గమనిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలో రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన పాత్రికేయులు హైద్రాబాద్‌లో పర్యటించి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కీర్తిస్తూ ప్రధాని మోదీ ఉత్త మాటలు మాని సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో హైదరాబాద్‌ను చూడాలంటూ రాసిన కథనాలు తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని దేశానికి చాటాయన్నారు. మోదీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని అంగీకరించాల్సిందేనన్నారు. కొత్త రాష్ట్రం మరింత వెనుకబడుతుందని, నిధులు లేవని, పరిపాలన రాదంటూ కులమతాల పేరుతో శాంతిభద్రతలు నాశనమవుతాయంటూ తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకులు చేసిన కుట్రలను అధిగమించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని మతాల పండుగలను అధికారికంగా జరుపుతూ గంగా జమున సంస్కృతిని చాటుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామని, మైనార్టీ సోదరులు రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అక్షరాస్యత ముఖ్యమని గ్రహించి మైనార్టీ గురుకుల పాఠశాలలను నెలకొల్పారన్నారు. తెలంగాణ ముస్లింలు ఆదర్శంగా అభివృద్ధి చెందాలని సిఎం కాంక్షిస్తూ బడ్జెట్‌లో వెయ్యి కోట్ల నిధులు కేటాయించారన్నారు. షాదీ ముబారక్ పథకాన్ని వారి కోసం అమలుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రేకల భద్రాద్రి, జిల్లా మహిళా కో-ఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ముస్లిం మైనార్టీ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.