నల్గొండ

ఉత్తమ్‌ను విమర్శించే స్థాయి గుత్తాకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ్‌ను విమర్శించే స్థాయి గుత్తాకు లేదు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 20: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కుంభం కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్‌యస్ పార్టీలో చేరిన ఎంపీ గుత్తా ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 21న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ఇందిరమ్మ రైతుబాట సదస్సుకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు చింతపల్లి బాలకృష్ణ, జె.శివాజీ, సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

* టిడిపి జిల్లా అధ్యక్షుడు రమేష్‌రెడ్డి

మునగాల, సెప్టెంబర్ 20: మండలంలో టిడిపి బలోపేతానికి ప్రతికార్యకర్త సైనికుడిలా కృషిచేయాలని జిల్లా టిడిపి అధ్యక్షులు పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎన్‌టి ఆర్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ మండలానికి చెందిన టిడిపి నాయకులు అధికార పార్టీలోకి వలస వెళ్లినప్పటికి పార్టీకి ఇబ్బందిలేదన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిడిపి అధికస్ధానాలు కైవసం చేసుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్. ఇంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి గౌణి శ్రీను, గ్రామశాఖ అధ్యక్షుడు చీకూరి శ్రీనివాస్, తెలుగు యువత మండల అధ్యక్షులు వసంతకుమార్‌లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
సమాన అవకాశాలు కల్పించాలి

* రజకసంఘం రాష్ట్ర నేత నర్సింహ

చిట్యాల, సెప్టెంబర్ 20: ఎన్నో విధాలుగా వెనుకబడిపోయిన రజకులకు ఎస్‌సి-ఎస్‌టిల మాదిరిగా సమాన అవకాశాలను కల్పించాలని రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఐతరాజు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రజకసంఘం, సిపిఎం, తెరాస నాయకులతో కలిసి ఐతరాజు నర్సింహ సంఘం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నర్సింహ మాట్లాడుతూ సమాజసేవ చేస్తూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించని రజకులు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం రజకులను ఆదుకోవాలని అన్నారు. కుల, వృత్తి, ఆర్ధిక, విద్యా, వ్యాపార, రాజకీయరంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో వెనుకబడిన రజకులను ఆదుకునేందుకు వారి అభ్యున్నతి కోసం రూ. 300ల కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసి అభివృద్ధిచెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌సి-ఎస్‌టిలకు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నటువంటి సమాన అవకాశాలను రజకులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ఈనెల 25వ తేదీన మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మండల సదస్సును నిర్వహించనున్నామని, సదస్సుకు రజకవృత్తిదారులు, మేధావులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిట్యాల ఎంపిటిసి-2 ఎద్దులపురి కృష్ణ, సంఘం నాయకులు ఐతరాజు యాదయ్య, బొంబాయి నర్సింహ, వడ్డెపల్లి కృష్ణ, గోలి మహేష్, అంజయ్య, మల్లయ్య, రుద్రారపు భానుప్రతాప్, తెరాస, సిపిఎం నాయకులు బెల్లి సత్తయ్య, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, వృత్తిసంఘాల నాయకులు అమరోజు గోవర్ధన్, జానయ్య, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నివారణపై ప్రత్యేక శ్రద్ధ

* యస్‌పి ప్రకాష్ జాదవ్

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 20: సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న ట్రాఫిక్ సమస్య, గ్రామాలలో మహిళలపై దాడుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరిస్తామని యస్‌పి ప్రకాష్ జాదవ్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ సర్కిల్‌లోని మఠంపల్లి, పాలకీడు, నేరడిచర్ల, గరిడేపల్లి పోలీసుస్టేషన్‌లను ఆయన సందర్శించిన అనంతరం స్థానిక పోలీసుస్టేషన్‌లో పత్రికల వారితో మాట్లాడారు. ప్రజల వద్దకు పోలీసు పాలన తీసుకెళ్లుతామని, 24 గంటలు సేవలు అందిస్తామని సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. ప్రజల న్యాయమైన సమస్యలు పరిష్కరించటానికే పోలీసు శాఖ ఉన్నదని రోడ్‌లపై చిన్న చిన్న దుకాణల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్నదని అన్నారు. రోడ్ మీద వ్యాపారాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని గ్రామానికి 1 కానిస్టేబుల్‌ను తిరిగి పాలన కొరకు నియమిస్తున్నామని అన్నారు. ఒక్కొక్క గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఉండటం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, గ్రామంపై అవగాహన ఉంటుందని అన్నారు. జిల్లాను నేర రహితంగా ఉంచటాకిని కృషి చేస్తానని కృష్ణా నది అవతలి నుండి గంజాయి, బెల్లం, ఇవతల నుండి రేషన్ బియ్యం తరలించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో 3 సార్లు పట్టుబడితే పిడి యాక్టు అమలు చేయవలసి ఉం టుందని, ఇటీవల లారీలలో అక్రమ రవాణా చేస్తున్నారని యస్‌పి అన్నారు. సమావేశంలో కోదాడ డియస్‌పి రమణారెడ్డి, సిఐ వి.నర్సింహారెడ్డి, యస్‌ఐ ఏ. రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎకరాకు 8 లక్షలు ఇవ్వాల్సిందే
** ఆర్డీవో ఎదుట చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా
మర్రిగూడ, సెప్టెంబర్ 20: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులు పూర్తి స్ధాయి పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్వహిస్తున్న నిరవధిక ధర్నా బుధవారం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవరకొండ ఆర్డీవో లింగ్యానాయక్ ప్రభుత్వం తరపున భూ నిర్వాసితులతో చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా నిర్వాసితులు ఎకరాకు 8 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం, పునరావాసం కల్పిస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని తెగేసి చెప్పారు. బదులుగా ఆర్డీవో మాట్లాడుతూ ఎకరాకు 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇటు భూ నిర్వాసితుల డిమాండ్, అటువైపు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారానికి పొంతన లేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో బాధితుల ధర్నా మళ్లీ కొనసాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ ఇచ్చిన హామీలను అమలుపర్చాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని రైతులు ఆర్డీవో ఎదుట మొరపెట్టుకున్నారు. ఇళ్లతో పాటు విలువైన భూములు నష్టపోతుంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తుందంటూ బాధితులు విచారం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఆర్డీవోకు విన్నవించారు. భూ నిర్వాసితుల పక్షాన ఎంపిపి అనంతరాజుగౌడ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ పాశం సురేందర్‌రెడ్డి తమ వాదనలను ఆర్డీవో ఎదుట విన్నవించారు.
రెవెన్యూ అధికారులు, భూ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.
టగ్ ఆఫ్ వార్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 20: యాదగిరిగుట్టలో టగ్‌ఆఫ్‌వార్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రీడలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని జిల్లా అధ్యక్షుడు కైరంకొండ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో టగ్‌ఆఫ్‌వార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల ప్రారంభోత్సవంలో వినోద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, పోటీ తత్యం, మంచి శరీర దారుఢ్యం కోసం క్రీడల్లో పాల్గొనాలని,క్రీడలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. టగ్ ఆఫ్ వార్ ఆధ్వర్యంలో అండర్ 17 మంది విద్యార్థుల ఎంపికలో ఉమ్మడి జిల్లాల నుండి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో నైపుణ్యం ప్రదర్శించిన 18 మంది విద్యార్ధులను ఎంపిక చేసినట్లు వినోద్ తెలిపారు. కార్యక్రమంలో పైల నాగయ్య,కోచ్ అచ్చిన సురేందర్,పూల చంద్రకుమార్, గందమల్ల కుమార్, గోపాల్, వెంకట్‌రెడ్డి, యాదయ్య, జి.మధుసూదన్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్టస్థ్రాయి టగ్ ఆఫ్‌వార్ పోటీలకు శ్రీ గౌతమి హైస్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ మిర్యాల దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా టగ్ ఆఫ్ వార్ క్రీడల ఎంపికకు శ్రీ గౌతమి హైస్కూల్ విద్యార్ధులు ఎంపిక పట్ల తము విద్యార్ధులకు ఇచ్చిన కోచ్చింగ్ వల్లే సాధ్యమైందన్నారు. అనతి కాలంలోనే క్రీడల్లో పిఈటి ఎ. సురేందర్ కృషితో ఎంతో మంది విద్యార్ధులు మండల,జిల్లా, రాష్ట్ర స్థాయిలకు ఎంపిక అవుతున్నారన్నారు. రాష్టస్థ్రాయికి ఎంపికైన విద్యార్థులు నవ్యసింధు, అఖిల, శివాని, పావని, స్వప్న, భానుప్రకాష్,జుతీష్‌ను, కోచ్ పిఈటి సురేందర్‌ను అభినందించారు.
పూడ్చిన మృతదేహం వెలికితీత
* భూ తగాదాలతో పది రోజుల క్రితం హత్య
గుండాల, సెప్టెంబర్ 20: భూతగాదాలలో కొండబోయిన రాములు(42)అనే వ్యక్తిని హత్య చేసి మండలంలోని సుద్ధాల గ్రామ వాగులో గత పది రోజుల క్రితం నిందితులు పాతిపెట్టగా, వారు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని బయటకు తీసి, తహశీల్దార్ స్వప్న పంచనామా నిర్వహించిన అనంతరం వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ సిఐ ఉమామహేశ్వర్‌రావుతెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా జీడికల్ గ్రామానికి చెందిన వికలాంగుడైన కొండబోయిన రాములుకు అదే గ్రామానికి చెందిన కొండబోయిన రాజయ్యల మధ్య తగాదాలు ఉండగా, 8 సంవత్సరాల క్రితం భూమి విషయంలో కోర్టులో కేసు వేయగా, నాలుగు నెలల క్రితం కొండబోయిన రాములుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో రాములుపై కక్ష పెంచుకున్న కొండబోయిన రాజయ్య హైద్రాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జీడికల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, నవాబ్‌పేట గ్రామానికి చెందిన బైండ్ల మల్లేష్, పారుపల్లి గ్రామానికి చెందిన దయ్యాల రాములు సహకారంతో కొండబోయిన రాములును పథకం ప్రకారం హత్య చేసి గుండాల మండలంలోని సుద్ధాల వాగులో గత పది రోజుల క్రితం పాతిపెట్టినట్లు తెలిపారు. నిందితులు తమ ఆధీనంలో ఉన్నారని, మృతుడి బావ మామిళ్ల మల్లేష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు డాక్టర్ లక్ష్మణ్, ఎస్‌ఐలు పురేందర్‌భట్, నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.
బెడ జంగాలకు
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* సంఘం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మనె్నం
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 20: బెడ (బుడగ) జంగాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటుపడాలని బెడ (బుడగ) జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిగిరి మనె్నం కోరారు. బుధవారం స్థానిక ఆర్ అండ్‌బి అతిధి గృహంలో సంఘం జిల్లా సమావేశంలో మాట్లాడుతూ జంగాలు కులవృత్తిలో ఉంటున్నారని, వారు సంచార జాతులుగా కూడ ఉన్నారన్నారు.
సంచార జాతుల కోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని కోరారు. ప్రతి జంగాల కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అదే విధంగా సంఘం గ్రామ, మండల, జిల్లా కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి సంఘటిత పోరాటం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె.వెంకటయ్య, జిల్లా కార్యదర్శి టి.చంద్రయ్య, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ముండ్లగిరి కాంత య్య, రాష్ట్ర కార్యదర్శి కె.జానయ్య, కెనర్సింహా, జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, శ్రీను, శంకర్, శ్రీను, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.
చట్ట వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
* సూర్యాపేట ఎస్పీ ప్రకాశ్ జాదవ్
నేరేడుచర్ల, సెప్టెంబర్ 20: జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌జాదవ్ పేర్కొన్నారు. ఆయన జిల్లా ఎస్పీగా పదవి భాద్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి బుధవారం నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. డిఎస్‌పి రమణారెడ్డి, సిఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ నరేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మట్టపల్లి లక్ష్మీనృసింహుని దర్శించుకున్న ఎస్పీ
మఠంపల్లి: మఠంపల్లి లక్ష్మీనృసింహుని సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పాలకమండలి అధికారులు సాదరస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయనకు అర్చకులు ఆశీర్వచనాలను అందచేశారు. ఆలయ చరిత్రను చెన్నూరి మట్టపల్లిరావు ఎస్పీకి వివరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోనే అతిపురాతనమైన లక్ష్మీనృసింహుని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో అసాంఘీక శక్తులు పేట్రేగిపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పౌరుడు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా తమ విధులను నిర్వర్తించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోదాడ డిఎస్‌పి రమణారెడ్డి, హుజూర్‌నగర్ సిఐ నర్సింహారెడ్డి, మఠంపల్లి ఎస్‌ఐ జానయ్య, ఇంచార్జి ఈఓ, మఠంపల్లి తహసీల్దార్ యాదగిరి, శంబిరెడ్డి, లక్ష్మీనర్సింహామూర్తి, తదితరులు ఉన్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పాపం కాంగ్రెస్‌దే
* టిఆర్‌యస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 20: నాగార్జునసాగర్ ఆయకట్టును ఎడారిగా మార్చుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పాపం కాంగ్రెస్ నేతలదేనని టీఆర్‌యస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్‌ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మిస్తుంటే అడ్డుకోని కాంగ్రెస్ నేతలు నేడు ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వైయస్‌ఆర్ హయాంలో అడుగులకు మడుగులొత్తిన నాయకులని విమర్శించారు. మహిళలను మభ్యపెట్టి బతుకమ్మ చీరెలను దగ్ధం చేస్తున్న నీచ సంస్కృతి కాంగ్రెస్ నేతలకే దక్కిందన్నారు. అనంతరం సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌యస్ నాయకులు అఫాన్ అలీ, తాజుద్దీన్, నారి నర్సింహా, లతీఫ్, వెంకన్న, దాసరి వెంకన్న, విద్యార్థి సంఘం నాయకులు శ్రవణ్, వెంకటాచారి, వెంకటాద్రి, మల్లేష్, శంకర్, వాసు, సతీష్, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
కాశివారిగూడెంలో ప్రబలిన విష జ్వరాలు
* అప్రమత్తమైన వైద్యాధికారులు, పర్యటించిన డిప్యూటీ డియంహెచ్‌వో
తిప్పర్తి, సెప్టెంబర్ 20: మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాశివారిగూడెం(ఇమామ్‌పేట) గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామంలో అనేక మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రి బాట పడుతున్నారు. దీంతో స్పందించిన డిప్యూటీ డియంహెచ్‌వో బాలనరేంద్ర వైద్యులు స్వర్ణలత, సయ్యద్ ఎక్బాల్, సిబ్బందితో బుధవారం గ్రామంలో పర్యటించి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్థంగా ఉండటంతోనే విష జ్వరాలు వస్తున్నాయని, పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై హైద్రాబాద్‌కు చికిత్స నిమిత్తం వెళ్లగా డెంగ్యూ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు గ్రామంలోని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 35 మందిని పరీక్షించగా 25 మందికి విష జ్వరాలు వచ్చినట్లు గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో పీహెచ్‌వో నర్సింహరావు, ఫార్మసిస్టు మారయ్య, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
50 శాతం రిజర్వేషన్‌పై స్పందించని ప్రభుత్వాలు
* సాధన సమితి కన్వీనర్ డాక్టర్ జె.రాజు
* బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నేత సత్యం
మిర్యాలగూడ, సెప్టెంబర్ 20: చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని సాధన సమితి కన్వీనర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జె.రాజు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు అంకతి సత్యం అన్నారు. చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని కోరుతూ బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో హైద్రాబాద్‌లో నిర్వహించే మహాసభకు బయలుదేరిన వాహనాలకు పట్టణంలోని మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వాతం త్య్రం వచ్చి 71 సంవత్సరాలు కావొస్తున్నా నేటివరకు బిసిలు వెనుకబడే ఉన్నారని అన్నారు. అన్ని రాజకీయపార్టీలు బిసిలను జెండాలు మోసే వారిగానే చూస్తున్నారే తప్పా రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలేదన్నారు. దేశ, రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా బిసిలు ఉన్నప్పటికి రాజకీయాల్లో ఎలాంటి ప్రయోజనం పొందడంలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయరంగాల్లో సమానమైన హక్కులను కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్ధం ఉంటుందని, దేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్లమెంట్‌లోనే కొన్ని కులాలవారు తిష్టవేశారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బిసి బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. రూ.20వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని, బిసి కార్పోరేషన్‌కు రూ.100కోట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు బంటు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మహేశ్‌చారి, నరేశ్, వేణుగోపాల్, రమేశ్, కొండలు, నాగేశ్వర్‌రావు, కోటయ్య, పుల్లారావు, వెంకటేశ్వర్లు, సైదయ్యలు పాల్గొన్నారు.