నల్గొండ

వాగ్ధానాలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 21: ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రధాన హామీలైన నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ, అర్హులైన పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, కెజి టు పిజి ఉచిత విద్య అమలులో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత 1.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిందని, కాని అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్నా 20వేల ఉద్యోగాలు కూడా భర్తీచేయలేదని విమర్శించారు. అర్హులైన పేదలందరికి సంవత్సరానికి లక్ష డబుల్‌బెడ్‌రూంలు నిర్మిస్తామని మూడు సంవత్సరాల్లో పదివేల ఇండ్లు కూడా నిర్మించలేదని, దళితులకు 9లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామన్నారు. 9వేల ఎకరాలు కూడా పంపిణీ చేయలేదన్నారు. కెజి టు పిజి ఉచిత విద్యను అమలుచేస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కెజి టు పిజి ఉచిత విద్యను విస్మరించారన్నారు. ప్రజల జీవన విధానం మెరుగుపడితే కొనుగోలు శక్తి పెరుగుతుందని అంతేకాని చిల్లర స్కీంలు ఇవ్వడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. తెలంగాణ మహిళలను గౌరవిస్తామని చెబుతున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు ఇవ్వడమేనా గౌరవించడం అని ప్రశ్నించారు. మహిళలకు నాసిరకమైన చీరలు ఇచ్చి ప్రభుత్వం అగౌరవ పరుస్తుందన్నారు. మహిళలను అవమానించి బిచ్చగాళ్లకు ఇచ్చినట్లు రూ.60, 70 విలువైన చీరలు ఇవ్వడం సరికాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 510 అడుగుల నీరు చేరుకునేంతవరకు శ్రీశైలం నుండి నీరు ఆపోద్దని, శ్రీశైలంలోకి ఎగువ నుండి నీరు వచ్చినట్లయితే ఆ తరువాత కూడా సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయాలని అన్నారు. కర్నాటక ప్రభుత్వం జలదోపిడి చేస్తున్నట్లే ఆంధ్రా ప్రభుత్వం కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించి జలదోపిడి చేస్తుందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడమే కాక హైద్రాబాద్ జంట నగరాలకు, నల్లగొండకు తాగునీరు అందిస్తుందన్నారు. కృష్ణానీటిని తరలించకుండా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుపై, ఆంధ్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరెపల్లి వెంకటేశ్వర్లు, మల్లుగౌతంరెడ్డి, నాగునాయక్‌లు పాల్గొన్నారు.

సబ్సిడీ గొర్రెలను విక్రయించిన రైతులు
*అడ్డుకున్న పోలీసులు, వ్యాపారి అరెస్ట్
చండూరు, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమలకు సబ్సిడీపై అందించిన గొర్రెలను లబ్ధిదారులు అమ్మకానికి పెట్టారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం గొర్రెలను కొనుగోలు చేసిన వ్యాపారిని, గొర్రెలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని తాస్కానిగూడెం గ్రామానికి 21 యూనిట్ల గొర్రెలను అధికారులు అందించారు. ఇందులో ముగ్గురు రైతులు ఒక్కో యూనిట్ గొర్రెలను రూ.85 వేల చొప్పున పెద్దవూర మండలానికి చెందిన రామలింగయ్య అనే వ్యాపారికి గొర్రెలను విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యాపారి గొర్రెలను వ్యాన్‌లో తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి గ్రామానికి చేరుకొని గొర్రెలను అదుపులోకి తీసుకున్నారు. పశువైద్యాధికారిని పిలిపించి గొర్రెలకు పరీక్షలు నిర్వహించారు. అమ్మిన గొర్రెలు సబ్సిడీపై ప్రభుత్వం అందించిన గొర్రెలుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ముగ్గురు రైతులకు అవగాహన కల్పించి, ఇక ముందు గొర్రెలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం దుకాణ లాటరీ ఏర్పాట్లు పూర్తి
- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
* టౌన్‌హాల్‌లో లాటరీ విధాన ఏర్పాట్ల పరిశీలన

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 21: మద్యం దుకాణాలకు నేడు పట్టణంలోని టౌన్‌హాల్‌లో జరిగే లాటరీ విధాన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రొహిబిషన్, ఎక్సైజ్ పరిధిలోని గెజిట్ నెంబర్లు 1 నుంచి 83 వరకు సంబంధిత దరఖాస్తుదారులు శుక్రవారం ఉదయం హాజరుకావాలని సూచించారు. అదే విధంగా నకిరేకల్, చండూరు, హాలియా, నాంపల్లి పరిధిలోని గెజిట్ నెంబర్లు 84 నుంచి 138 వరకు దరఖాస్తుదారులు మధ్యాహ్నం హాజరుకావాలన్నారు. మద్యం దుకాణాల లాటరీలో పాల్గొనే వారిని మాత్రమే టౌన్‌హాల్ ప్రాంగణంలోకి అనుమతించాలని, ఇతరులను లోపలికి రానివ్వొద్దన్నారు. దరఖాస్తుదారులు తమ వాహనాలు బాలభవన్, మున్సిపల్ కార్యాలయ రోడ్డులో పార్క్ చేసే విధంగా చూడాలన్నారు. లాటరీలో పాల్గొనే వారు వేచి ఉండేందుకు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవరణలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్‌ను నియంత్రించాలని సూచించారు. తొలుత కలెక్టర్ లాటరీ తీసే పద్ధతిని ట్రయల్ చేసి చూశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డివి.శ్రీనివాస్‌రావు, డిఆర్‌వో ఖిమ్యానాయక్, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శంకరయ్య, ఆర్డీవో వెంకటాచారి, డిఎస్పీ సుధాకర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.