నల్గొండ

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 21: తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీనేనని, వచ్చిన తెలంగాణలో మోసకారి కెసిఆర్ పరిపాలన సాగిస్తు ప్రజలను మభ్యపెడుతున్నాడని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా విమర్శించారు. గురువారం రాత్రి జిలా లకేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించిన సదస్సుకు పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సతీష్, ఎఐసిసి ఎస్సీ సెల్ ఇంచార్జీ కొప్పుల రాజు, సిఎల్పీనేత కుందూరు జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ఆలీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలు హజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానాలనే తెలంగాణ సిఎం కెసిఆర్ అనుసరిస్తున్నారని ఆరోపించారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో లాక్కోంటుందని ఆరోపించారు. తెలంగాణ తానే తెచ్చానని చెబుతున్న కెసిఆర్ మరి తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి ఎందుకు కృతజ్ఞతలు చెప్పారని ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి సోనియా తెలంగాణనిస్తే దానిని మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం పొంది కెసిఆర్ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తన మాయమాటాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇన్నాళ్లు రైతులను పట్టించుకోకుండా నేడు ఎన్నికల కోసమే ఎకరాకు 4వేల పథకాన్ని ప్రకటించారని విమర్శించారు. తాము ఈ పథకానికి వ్యతిరేకం కాదని, పట్టాదారులతో పాటు కౌలురైతులకు కూడ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌చేశారు. గ్రామాల్లో నిర్వహించే భూరికార్డుల ప్రక్షాళనలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తేవాలన్నారు. సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలు పట్టించుకొని టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. భూప్రక్షాళన పేరుతో ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని, ఎవ్వరూ చేయని కార్యక్రమాన్ని తామే చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పే కెసిఆర్‌కు తమ హయాంలో ప్రారంభించిన పథకాలను తీసివేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ దేశంలో పేదలు, దళితులు, గిరిజనులకు భూమిని పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కుతుందన్నారు.
మూడేళ్లలో 300మంది దళితులకు కూడ కెసిఆర్ భూపంపిణీ చేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోజుకో పథకం పేరుతో హంగామా సృష్టిస్తున్నాడన్నారు. ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ నాయకులు దాసొజు శ్రవణ్, అద్దంకి దయాకర్, పాల్వాయి స్రవంతి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన పత్తిసాగు
దిగుబడుల కొనుగోలుకు ముందస్తు కసరత్తు

నల్లగొండ, సెప్టెంబర్ 21: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ దఫా పత్తి సాగు భారీగా పెరిగిన నేపధ్యంలో పెరిగే దిగుబడులను అనుసరించి కొనుగోలు సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు కసరత్తు సాగిస్తుంది. పత్తి రైతుల వివరాలు, వారు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుందన్న వివరాల సేకరణకు వ్యవసాయ, మార్కెటింగ్, పంచాయతీ సిబ్బందిని పత్తి చేనుల బాట పట్టారు. నిర్ధిష్టమైన ప్రొఫార్మాతో సదరు వివరాలను సేకరించి రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. గత ఏడాది ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3లక్షల 17వేల హెక్టార్లలో పత్తి సాగు చేపట్టారు. ఈ ఏడాది కేవలం నూతన నల్లగొండ జిల్లాలోనే 2లక్షల 24,954ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, 4లక్షల 62వేల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని ప్రాథమికంగా అంఛనా వేసింది. గత ఏడాది కంటే 20శాతం అధికంగా పత్తి పెరుగడంతో పాటు ఈ దఫా పత్తికి అనుకూలంగా వర్షాలు కూడా పడటంతో దిగుబడులు భారీగా రావచ్చని అంచనా వేస్తు అందుకు తగ్గట్లుగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తు చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1లక్ష 43,818ఎకరాల్లో పత్తి సాగు చేయగా, సూర్యాపేట జిల్లాలో 54,953హెకార్లలో పత్తి సాగు చేశారు. గత ఏడాది పత్తి కొనుగోలులో నెలకొన్న సమస్యలతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ తెలంగాణ వ్యాప్తంగా సిసిఐ కొనుగోలు కేంద్రాలను 84నుండి 143కు పెంచింది. నల్లగొండ జిల్లాలో ఐదు కేంద్రాలను పదికి పెంచింది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సైతం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. ఆక్టోబర్ 3వ తేది నుండి కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐ, మార్కెటింగ్ శాఖలు నిర్ణయించాయి. దళారీలు పత్తి దిగుబడుల కొనుగోలు ప్రారంభించేకల్లా సిసిఐ కొనుగోలు కేంద్రాలు తెరుస్తుండటంతో ఈ దఫా ఎక్కువగా సిసిఐ కేంద్రాలకే పత్తి వచ్చే అవకాశముంది.
చెల్లింపులపై దృష్టి
గత ఏడాది పత్తి రైతులకు ఇవ్వాల్సిన పత్తి డబ్బుల చెల్లింపుల్లో ఎదురైన జాప్యం నేపధ్యంలో ఈ దఫా చెల్లింపులు సత్వరమే సాగేలా ముందస్తుగా రైతుల పేర్లు, బ్యాంకు అకౌంట్లు, ఐఎఫ్‌ఎస్‌ఎల్ కోడ్‌లు సేకరిస్తు వారికి ఆన్‌లైన్ చెల్లింపులు చేసేందుకు మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తేమ శాతంపై ముందస్తు ప్రచారం సాగిస్తు 8శాతం తేమ దాటకుండా చూసుకోవాలంటు ప్రచారం సాగిస్తున్నారు.
రెండోవారం నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సైతం ముందస్తు కసరత్తు చేపట్టిన నల్లగొండ జిల్లా యంత్రాంగం 26 డిఆర్‌డిఏ మహిళా సంఘాల కొనుగోలు కేంద్రాలు, 29 పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలను మొత్తం 55 కొనుగోలు కేంద్రాలను ఆక్టోబర్ రెండో వారం నుండి ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇందుకు జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇప్పటికే పౌరసరాఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, సహకార, డిఆర్‌డిఏ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలిచ్చారు. గ్రేడ్-1రకం 1590, సాధారణ రకం 1550 రూపాయలు క్వింటాల్‌కు చెల్లించి కొనుగోలు జరుపాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లా 4,4034హెక్టార్లలో వరి సాగు జరిగిందని 2.6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 1లక్షల టన్నులు 1010రకం 1.6లక్షల టన్నులు బిపిటి రకం ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు.

జడ్పీ చైర్మన్‌కు బాలుకు ఎదురుదెబ్బ
*జడ్పీ వర్గీయుడు దేవరకొండ ఎంపిపి శ్రీనివాస్‌యాదవ్ ఎమ్మెల్యే వర్గంలో చేరిక
*రసవత్తరంగా నియోజకవర్గ రాజకీయాలు

దేవరకొండ, సెప్టెంబర్ 21: అధికార టిఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలతో దేవరకొండ దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రైతు సమన్వయ సమితుల నియామకంలో జిల్లా పరిషత్ చైర్మన్ వర్గీయులకు ఎవరికీ స్థానం దక్కకపోవడం ఎమ్మెల్యే వర్గీయులకే రైతు సమన్వయ సమితుల్లో పదవులు దక్కడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ వర్గీయునిగా ఆయనకు ప్రధాన అనుచరునిగా ఉన్న దేవరకొండ ఎంపిపి మేకల శ్రీనివాస్‌యాదవ్ అనూహ్యంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వర్గంలోకి చేరిపోయారు. దీంతో బాలునాయక్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సిపిఐ పార్టీని వీడి టిఆర్‌ఎస్ లో చేరేంత వరకు నియోజకవర్గంలో బాలునాయక్ పార్టీని అంతా తానై నడిపించారు. అనూహ్యంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సిపిఐని వీడి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా ఇద్దరు ముఖ్య నాయకులు పార్టీలో పట్టు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వర్గీయునిగా పేరున్న బాలునాయక్ మంత్రి ఆశీస్సులతో కూడా తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేక పోతున్నాడన్న ఆందోళనతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఎమ్మెల్యే తన వెంట పార్టీలో చేరిన నాయకులకు పదవుల ఇప్పించుకుంటుండడం, ఆర్థికంగా బలపడేందుకు కాంట్రాక్ట్ పనులను అప్పగిస్తుండడంతో జడ్పీ చైర్మన్ వర్గీయులు తమ భవిష్యత్తును చక్కబెట్టుకునేందుకు ఎమ్మెల్యే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దేవరకొండ ఎంపిపి మేకల శ్రీనివాస్‌యాదవ్, చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి ఎంపిటిసి మహాలక్ష్మయ్యలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వర్గంలో చేరినట్లు తెలుస్తోంది. తాను నమ్మిన వ్యక్తులే తనను మోసం చేసి ప్రత్యర్థి వర్గంలో చేరడం పట్ల బాలునాయక్ ముఖ్య అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార పార్టీకి చెందిన వారే అయినా ఆధిపత్యం కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తుండడంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దేవరకొండ నియోజకవర్గంలోని టిఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలను నివారించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.