నల్గొండ

మల్లన్నసాగర్ తరహాలో మరో ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, సెప్టెంబర్ 23: చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో భూములను కోల్పోతున్న నిర్వాసిత రైతాంగానికి ఆశించిన మేర నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెడితే మల్లన్న సాగర్ తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ పన్నాల గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో రిలే దీక్షలు చేపడుతున్న నిర్వాసితులకు మద్ద తుగా టిజెఎసి తరపున సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూ నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో తెలియక ప్రజలు మనోవేదనకు గురవుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం బాధితుల్లో భయాందోళనలు తొలగించాలంటే స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. కార్యక్రమంలో టిజెఎసి జిల్లా కో కన్వీనర్ పందుల సైదులు, మునుగోడు కన్వీనర్ తోట నర్సింహచారి, టివివి కో కన్వీనర్ కట్టా శంకర్, బాధిత రైతులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి
- మృతదేహంతో రాస్తారోకో - రెండు గంటలకుపైగా ఆందోళన
గరిడేపల్లి, సెప్టెంబర్ 23: మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన జిడ్డు ఎల్లయ్య (40) అనే రైతు తన పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై శనివారం మృతిచెందాడు. చనిపోయిన ఎల్లయ్యకు భార్య, నలుగురు పిల్లలున్నారు. మృతికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి కటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఎల్లయ్య మృతదేహాన్ని తీసుకుని కోదాడ - మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాయినిగూడెం గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ట్రాక్టర్లు అడ్డంపెట్టి టెంటువేసుకుని మరి రాస్తారోకో చేపట్టారు. ఎల్లయ్య తన పొలం వద్ద 25కెవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వారం క్రితం చెడిపోయింది. దీంతో అధికారులను ఆశ్రయించడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతులు చేయించి పొలం వద్దకు చేర్చారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించేందుకు ఎల్లయ్య రోజు విద్యుత్ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎల్లయ్య పొలం ఎండిపోతుందని ఆందోళన పడటంతో శనివారం ఉదయం స్థానిక జెఎల్‌ఎమ్ ఒక ప్రైవేటు వ్యక్తిని ట్రాన్స్‌ఫార్మర్ బిగించేందుకు పంపినట్లు ఎల్లయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. సదరు ప్రైవేటు వ్యక్తి ఎల్లయ్యను తీసుకుని పొలం వద్దకు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించి ఎల్లయ్యతో ఆన్ చేయించడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ సిబ్బంది బిగించాల్సి వుండగా ప్రైవేటు వ్యక్తిని పంపించడంతో ఈసంఘటన జరిగిందని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే తన భర్త చనిపోయాడని ఎల్లయ్య భార్య సైదమ్మ ఆరోపించింది. గతంలోనూ ఇద్దరు రైతులు గ్రామంలో చనిపోయారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు ఎల్లయ్య మృతదేహంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయశ్రీ, గరిడేపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సిబ్బందితో రాయినిగూడెం గ్రామానికి చేరుకున్నారు. అధికారులు గ్రామస్థులకు ఎంత నచ్చచెప్పినా వినలేదు. బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ ఆర్థిక సాయాన్ని అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో గరిడేపల్లి ట్రాన్స్‌కో ఏఇ పందిరి శ్రీనివాస్ ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ఇన్సురెన్స్ అందిస్తామని, బాధ్యులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. సుమారు రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో మిర్యాలగూడ - కోదాడ ప్రధాన రహదారిపై ఇరువైపుల రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అవినీతి రహితపాలనే లక్ష్యం
* మంత్రి జగదీశ్‌రెడ్డి
పెన్‌పహడ్, సెప్టెంబర్ 23: అవినీతి రహిత పాలనే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం అమలు పరిచి అర్హులైన పేదలకు అందించిన ఘనత కెసి ఆర్‌కే దక్కిందన్నారు. గత 60 ఏండ్ల ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణను అభివృద్ధి చేయకపోగా కమీషన్‌ల కోసమే పాకులాడుతూ పూర్తిగా విఫలమైందన్నారు. టిఆర్‌ఎస్ వచ్చిన మూడేళ్లలోనే రాష్ట్రాన్ని మార్చామన్నారు. అభివృద్ధిని చూసి గ్రామాల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరంథం పడుతున్నారన్నారు. టిఆర్‌ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేసినంత మాత్రాన ప్రజలు వారిని నమ్మేరోజులు పోయాయన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ వేగానికి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. రైతులు సంక్షేమం కోసం నియోజకవర్గంలో 171 ట్రాక్టర్లు అందించామన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రిని మండంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు గజమాలతో సన్మానించారు. మహ్మదాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు అంతటి వెంకన్న, టిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, ఎంపిపి భుక్యా పద్మ, జడ్పీటిసి పినె్నని కోటేశ్వరావు, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, నెమ్మాది బిక్షం, మండాది నగేష్, వెన్నా సీతారాంరెడ్డి, యగ్గడి మురళి తదితరులు పాల్గొన్నారు.

చట్టాల మార్పులపై అవగాహన పెంచుకోవాలి
*జిల్లా జడ్జి తిరుమలరావు

నల్లగొండ లీగల్, సెప్టెంబర్ 23: కాలానికనుగుణంగా మారుతున్న, నూతనంగా వచ్చే చట్టాలపై న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకుని సమర్థవంతంగా విధి నిర్వహించాలని జిల్లా జడ్జి తిరుమలరావు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ నేరాల నిరోధానికి, పరిశోధన, నిరూపణలకు నూతనంగా వచ్చే చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయ, పోలీస్ శాఖ సిబ్బందికి అవగాహన అవసరమన్నారు. ఈ దిశగా అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వై.జయంతి ఆదేశాల మేరకు న్యాయపరమైన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. చట్టాల మార్పులు, చేర్పులు, నూతన పరిజ్ఞానంపై పోలీసులు విధిగా అవగాహన పెంచుకుని, పబ్లిక్ ప్యాసిక్యుటర్ల సహకారంతో కేసుల దర్యాప్తు, నిరూపణలో విజయవంతం కావాలన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రవిందర్ ఈ సదస్సులో చట్టాల మార్పులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఓఎస్‌డి డి.శ్రీనివాసరావు, డిఎస్పీ, సిఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

సబ్‌ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే కేటాయించాలి
* జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు
సూర్యాపేట, సెప్టెంబర్ 23: దళితులు, గిరిజనులు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే కేటాయించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు అన్నారు. దళితవాడల సందర్శనలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని 12వ వార్డు చింతచెర్వులో పర్యటించి నిరుపేద దళిత కుటుంబమైన మెడిగ కృష్ణ ఇంటికి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలను వినియోగించుకోవాలన్నారు. కాలనీలో నివసిస్తున్న దళిత కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ ప్రాంతంలో వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సామాజిక సమరసత - సంఘ సంస్కర్తలు అనే సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో నేటికి సమాజంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నది దళితులేనన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు అవుతున్నా నేటికి దళితులు అభివృద్ధికి నోచుకోక పోవడం దారుణమన్నారు. సమాజంలో దళితుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలుగన్న దళిత సమాజం ఆవిర్భవించాలనే లక్ష్యంతో ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దళిత వాడలు సందర్శిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో దళితవాడల అభివృద్ధికి పనులు కేటాయిస్తున్నట్లు చూపి మరోచోట పనులు చేపడుతున్నట్లు తెలిసిందన్నారు. అన్ని రాష్ట్రాల నివేదికలను కేంద్రానికి అందించేందుకే పర్యటన చేపట్టామన్నారు. కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ దళితుల పట్ల వివక్ష చూపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్, జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి దయానందరాణి, సమరసతా రాష్ట్ర అధ్యక్షుడు అప్పల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్, నాయకులు గుద్దేటి యల్లయ్య, చింతపాటి చినశ్రీరాములు, యాతాకుల రాజయ్య, వంగూరి రమేష్, చల్లమల్ల నర్సింహ, చందాదాస్, దాసరి దేవయ్య, బోడ శ్రీరామలు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా సంక్షేమ పథకాలు
*ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం *ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి
ఆలేరు, సెప్టెంబర్ 23: నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునితారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం, ఆలేరులో సంచార పశువైద్యశాల, శ్రీనివాసపురం గ్రామంలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం, పటేల్‌గూడెంలో గోపాలమిత్ర భవనం, గొర్రెల పంపిణీ, మందనపల్లి గ్రామంలో బతుకమ్మ ఉత్సవాలు, మంతపురి గ్రామంలో జరిగిన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే గొల్ల కురుమలకు గొర్రెలు, పాడి రైతులకు గేదెలు, వివిధ మతాల పండుగలకు దుస్తులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతీ సంక్షేమ పథకాన్ని అవినీతి అక్రమాలకు, రాజకీయాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలుచేస్తున్నామన్నారు. గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపని భూ రికార్డుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలుచేసి రికార్డులను శుద్ధీకరణ చేస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగితే గ్రామాల్లో 90 శాతం భూ సమస్యలు పరిష్కారమైనట్లేనని అన్నారు. మండల రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం, పెట్టుబడులు అందేలా ప్రభుత్వం ఇప్పటికే కార్యక్రమాన్ని రూపొందించిందని, వచ్చే ఖరీఫ్ ప్రారంభం నాటికి వ్యవసాయం చేస్తున్న ప్రతీ రైతుకు రూ.8 వేల పెట్టుబడిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించి రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఎంపిపి అనసూర్య, జడ్పిటిసి పరమేశ్వర్, ఎంపిడివో శ్రీనివాస్, తహశీల్దార్ విజయకుమారి, వైస్ ఎంపిపి కిష్టయ్య, సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట

నల్లగొండ, సెప్టెంబర్ 23: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించిన తెలంగాణ టిడిపి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు పెద్దపీట దక్కింది. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులును, ఎలిమినేటి ఉమామాధవరెడ్డిని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు కొనసాగించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన వంగాల స్వామిగౌడ్, పాల్వాయి రజనీకుమారిలను నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బండ్రు శోభారాణి, బొల్లం మల్లయ్యయాదవ్‌లను నియమించారు. 11మంది పార్టీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధుల్లో జిల్లా నుండి నన్నూరి నర్సిరెడ్డి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్, సిలివేరు కాశీనాథ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జక్కుల ఐలయ్య యాదవ్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఎండి.యూసఫ్, సాధునేని శ్రీనివాస్‌రావు, చావ్లా కిరణ్మయి, రౌతు వెంకటేశ్వర్‌రావు, కడారి అంజయ్య యాదవ్, పెద్దిరెడ్డి రాజా, కంచర్ల కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా వల్లంశెట్టి రమేష్‌బాబు, మువ్వ అరుణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లును నియమించారు.

అన్ని వర్గాల అభ్యున్నతే బిజెపి లక్ష్యం
*పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 23: అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో సయ్యద్ రఫీక్ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం యువకులు బిజెపిలో చేరారు. ఈసందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నూకల మాట్లాడుతూ బిజెపి మైనార్టీలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు ప్రచారం చేసినా.. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మైనార్టీలందరూ బిజెపికి అండగా ఉండి అధికారంలోకి తీసుకవచ్చారని అన్నారు. దీంతో బిజెపిపై ఉన్న అపోహలు తొలగిపోయాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, బిజెవైయం నాయకులు పోతెపాక లింగస్వామి, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బషీర్, గడ్డం మహేష్, నాగిరెడ్డి, అనిల్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనను పకడ్బందీగా నిర్వహించాలి
- కలెక్టర్ అనితా రామచంద్రన్
భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబర్ 23: భూ రికార్డుల ప్రక్షాళనను పకడ్బంధీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని జలాల్‌పురం గ్రామంలో రికార్డుల తనిఖీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాధ్యమైనంత వరకు భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతులు రికార్డుల శుద్ధీకరణకు అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఐ రాజేంద్రప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, సర్వేయర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బిక్షపతి, రైతులు పాల్గొన్నారు.

సిపిఎస్ రద్దు చేయాలి
*టిజీవోస్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 23: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రావు కోరారు. శనివారం పట్టణంలో జరిగిన అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిటీని నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను తిరిగి ప్రారంభించాలని కోరారు. అనంతరం పదోన్నతులు పొందిన గెజిటెడ్ అధికారులు రావిల శ్రీనివాసమూర్తి, రాజేందర్‌రెడ్డి, రఘునాధరావు, నాగలింగాచారి, శ్రీనివాస్, యాదయ్య, అశోక్‌రెడ్డిలను సన్మానించారు. సమావేశంలో సంఘం నాయకులు లక్ష్మినారాయణ, ముజీబొద్దీన్, యాదన్‌కుమార్, పి.వెంకటేశ్వర్లు, సూర్యదత్, గూడ వెంకటేశ్వర్లు, ప్రమేకరణ్‌రెడ్డి, గోపి, వెంకటేశ్వర్లు, వెంకటనర్సు, వెంకటేశ్వరమూర్తి, వెంకట్రామ్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్
*ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
మర్రిగూడ, సెప్టెంబర్ 23: అర్హులైన ప్రతీ ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇందుర్తి గ్రామంలో ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అర్హులైన వారి నుండి పెన్షన్లకు సంబంధించి అర్జీలు స్వీకరించి ఎంపిడివో కార్యాలయానికి పంపించారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుందని, అందులో భాగంగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు, ఆపైన పింఛన్ అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దంతు జగదీశ్వర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పాశం సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు బచ్చు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 23: పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్‌కు చెందిన పి భవాని డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల కరెస్పాండెంట్,ప్రిన్సిపాల్ రాంరెడ్డి తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ రాంరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్నామని దాని కోసం ఆటల్లో నైపుణ్యం ఉన్న పిఈటిలను నియమించి శిక్షణ ఇస్తున్నామని, విద్యార్థులు ఎన్నో విజయాలు సాధించారని అన్నారు. ఎంపికైన భవానీని వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.