నల్గొండ

కారెక్కనున్న ఉమా, సందీప్‌రెడ్డి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 23: టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డిలు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మంచి ముహుర్తం చూసుకుని సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కేందుకు ఉమా, సందీప్‌లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే వారు సీఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనుండగా తక్షణం ఆమెకు రాష్ట్ర స్థాయిలో నామినేట్ పదవి కట్టబెట్టనున్నట్లుగా తెలుస్తోంది. దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 1985లో ఎన్‌టిఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరి తొలిసారి భువనగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడి నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. నక్సల్స్ మాధవరెడ్డిని హత్య చేయడంతో 2000 సంవత్సరం ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తదుపరి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా 20014 ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ గాలిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుతో పాటు పెద్ద దిక్కుగా కొనసాగారు. అయితే మోత్కుపల్లితో మొదటి నుండి విభేదిస్తున్న ఉమా ఇటీవల రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లాలని భావించినప్పటికి ఆ పార్టీ నుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడం, ఇదే సమయంలో టీఆర్‌ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆమె గులాబీ గూటికి చేరేందుకు మొగ్గుచూపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కెసిఆర్‌ను సైతం ఆమె కలిశారు.
స్పష్టమైన హామీతోనే గులాబీ గూటికి..!
వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన కుమారుడికి భువనగిరి అసెంబ్లీ సీటు టికెట్ కేటాయించే హామీతో ఉమా, సందీప్‌లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఉమావర్గీయుల్లో ప్రచార సాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆమె కుటుంబ రాజకీయ చరిత్రను గౌరవిస్తు రాష్ట్ర స్థాయి కార్పొరేట్ పదవి కట్టబెట్టేందుకు సీఎం కెసిఆర్ సుముఖత తెలిపారని తెలుస్తోంది. కాగా దివంగత మాధవరెడ్డికి అన్న, ఉమామాధవరెడ్డికి బావయైన ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తొలి నుండి కూడా కృష్ణారెడ్డికి ఉమా మాధవరెడ్డికి మధ్య స్థానికంగా సయోధ్య లేదు. అయనప్పటికి సీఎం కెసిఆర్ సూచనలతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి ఉమామాధవరెడ్డిని కారెక్కించేందుకు ఒప్పించినట్లుగా టీఆర్‌ఎస్ వర్గాల భోగట్టా. అదిగాక టీడీపీలో కేసీఆర్ కొనసాగిన కాలంలో దివంగత మాధవరెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కూడా ఉమాను టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్ ఆహ్వానించడానికి బాటలువేసింది. కాగా టీఆర్‌ఎస్‌లోకి ఉమా, సందీప్‌ల చేరికతో భువనగిరి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో శేఖర్‌రెడ్డిని ఆలేరుకు పంపించి ఉమా, సందీప్‌రెడ్డిలలో ఒకరిని భువనగిరి నుండి ఎన్నికల బరిలోకి దించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆలోచనగా సమాచారం. మరోవైపు ఉమా, సందీప్‌లను కారెక్కించే విషయంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిలు అభ్యంతరపెట్టకుండా వారితో మంత్రి జగదీశ్‌రెడ్డి మంతనాలు పూర్తి చేశారు. అయితే నియోజకవర్గం మార్పు విషయంలో శేఖర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నప్పటికి సీఎం కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అనుసరించక తప్పదు.
ఇది ఇలా ఉండగా ఉమామాధవరెడ్డి టీడీపీతో 33 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లోకి వెలుతున్న నేపధ్యంలో వారి వెంట టీడీపీ మండలాల నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా ఆపేందుకు మోత్కుపల్లి నరసింహులు వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి వెళ్లాకా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను భుజానికెత్తుకున్న మోత్కుపల్లి ముందుగా సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో వలసలను అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు, భువనగిరిల నుండి మోత్కుపల్లి, బండ్రు శోభారాణిలు పోటీ చేస్తారని ఎన్నికల్లో టీడీపీ గెలుపు తధ్యమని ఎవరూ పార్టీని వీడి వెళ్లవద్దని క్యాడర్‌కు ఉద్బోధిస్తుండటం గమనార్హం.

అనుమానాస్పద స్థితిలో
మహిళ ఆత్మహత్యాయత్నం
చండూరు, నవంబర్ 23: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని బోడన్‌పర్తి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇదే గ్రామానికి చెందిన పగిళ్ల అరుణ(26) భర్త గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అరుణ స్థానిక మంచికంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే మంచికంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పని చేస్తూ తన పిల్లలతో జీవనం కొనసాగిస్తుంది. పాఠశాల ఎదురుగా ఉన్న ఓ పూరి గుడిసెలో ఆమె నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గుడిసె వెనుక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 12 గంటల సమయంలో ఇంట్లో అరుపులు వస్తుండటంతో చుట్టుప్రక్కల వారు గమనించి తలుపులు తీసేలోపే ఆమె శరీర భాగం కాలిపోయింది. దీంతో వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఏఎస్‌ఐ శంకరయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న అరుణ ఇంట్లో బైక్ తాళం చెవితో పాటు స్వెటర్ లభించింది. ఇంటికి దూరంలో పార్క్ చేసిన ఒక బైక్‌ను పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఇంట్లోకి చొరబడినట్లు తెలిసింది. తలుపు తీయకపోవడంతో ఇంటి వెనుకభాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. బలత్కారం చేసే క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. తనకు దక్కడం లేదని దుండగుడే కిరోసిన్ పోశాడా..లేక తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆ మహిళే కిరోసిన్ పోసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంట్లో దొరికిన తాళం చెవి, స్వెట్టర్ ఇదే గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిదిగా గుర్తించారు. పోలీసులు ముందస్తుగా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.