నల్గొండ

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే తిడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 30: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతూ అధికార అహంకారం తలకెక్కించుకుని కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం..శని అంటూ ఈ దేశం నుండి రాష్ట్రం నుండి కాంగ్రెస్‌ను పారదోలాలంటూ మంత్రి కెటిఆర్ విమర్శించడం ఎంతవరకు సబబని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెటిఆర్ విమర్శలు తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దినట్లుగా ఉన్నాయని దుయ్యబట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో మంత్రులుగా అధికారం పంచుకున్నప్పుడు, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చాకా సోనియా, రాహుల్‌లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కెసిఆర్ కుటుంబమంతా వెళ్లి వంగివంగి దండాలు పెట్టినప్పుడు కాంగ్రెస్ దేశానికి పట్టిన శనిగా, దరిద్రంగా కనిపించలేదా అంటూ కెటిఆర్‌ను ఆయన నిలదీశారు. నాడు సోనియా దేవతన్న మీరే నేడు మీ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రశ్నిస్తే దరిద్రంగా విమర్శించడం కెటిఆర్ అధికార అహంకార వ్యాఖ్యలకు నిదర్శమన్నారు. ఎమ్మెల్యేలు చనిపోయిన చోట ఉపఎన్నికల్లో మానవీయ కోణంలో పోటీ పెట్టకపోవడం తెలంగాణలో సంప్రదాయంగా, సంస్కృతిగా కొనసాగుతోందని, దీనిని టిఆర్‌ఎస్ ఉల్లంఘించి ఆ పార్టీ తెలంగాణ సంస్కృతిని అపహాస్యంగా చేసిందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్‌కు టిడిపి మద్దతునిచ్చిన తీరుతో ఎన్‌టిఆర్ ఆత్మక్షోభిస్తుందని కెటిఆర్ విమర్శించడాన్ని గుత్తా ఎద్దేవా చేశారు. టిడిపిని తెలంగాణలో లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే, టిడిపి ఎమ్మెల్యేలపై, ఎన్‌టిఆర్ అల్లుడు చంద్రబాబుపై టిఆర్‌ఎస్ కేసులు పెడితే ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభించదా అని గుత్తా కెటిఆర్‌కు చురకలంటించారు. గతంలో మంత్రి జగదీష్‌రెడ్డి మహాకూటమి అభ్యర్ధిగా 32వేల ఓట్లతో ఓడిపోయిన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిసే శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మను పోటీకి దింపారన్నారు. శంకరమ్మ పట్ల నిజంగా టిఆర్‌ఎస్ నేతలకు ప్రేమ ఉంటే ఆమెను ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదంటు గుత్తా ప్రశ్నించారు. ఖమ్మం టిఆర్‌ఎస్ ప్లీనరీలో మిషన్ భగీరథకు అప్పులివ్వకుండా కేంద్రానికి తాను లేఖ రాశనంటూ కెటిఆర్ తప్పుడు విమర్శలు చేశారన్నారు. మిషన్ భగీరథ అంచనాలు అతిగా ఉన్నాయని, అక్రమాలు జరిగాయని వాటిని పరిశీలించాకే అప్పులివ్వాలని తాను కోరామన్నారు. లేఖలో మిషన్ భగీరథకు నిధులివ్వొద్దని తాను కోరివుంటే ప్రభుత్వం ఎందుకు తన లేఖను ప్రజలకు విడుదల చేయడం లేదని గుత్తా నిలదీశారు. వైఎస్సార్ పాలనలో జలయజ్ఞం ధనయజ్ఞం అంటు విమర్శిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో ఎందుకు చేర్చుకున్నారన్నారు. జలయజ్ఞం కాంట్రాక్టర్లకే మళ్లీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎందుకు కాంట్రాక్టు పనులు అప్పగిస్తుందంటూ గుత్తా ప్రశ్నించారు. అధికార అహంకారంతో ప్రతిపక్ష నేతలపై కెసిఆర్, కెటిఆర్‌లు విమర్శలు చేయడం మానుకోకపోతే దేవుడు వారి పాపాలకు శిక్ష వేస్తాడన్నారు. ఈ సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డిసిసి నాయకుడు మునాస వెంకన్న తదితరులు పాల్గొన్నారు.