నల్గొండ

కరవుపై కమల దళం పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 2: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవుతో రైతులు, కూలీలు, ప్రజలు కష్టనష్టాలకు గురవుతున్న ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తు, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలతో హోరెత్తించారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, మోత్కూర్, తిప్పర్తి, చిట్యాల, వలిగొండ, రామన్నపేట, భూదాన్‌పోచంపల్లి తదితర మండలాల్లో బిజెపి మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో తహశీల్ధార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం నల్లగొండలో జరిగిన ధర్నాలో బిజెపి రాష్ట్ర పార్టీ ఫ్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతు కరవు సహాయక చర్యల అమలులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటు దుయ్యబట్టారు. భూగర్భజలాలు అడుగంటి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వట్టిపోయి పంటలు ఎండిపోయి రైతాంగం కష్టనష్టాల పాలైందన్నారు. పశుగ్రాసం కొరతతో రైతులు తమ పశువులను తక్కువ ధరలకు కబేళాలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పంట రుణాల మాఫీ రైతులకు నష్టదాయకంగా పరిణమించిందన్నారు. కేంద్రానికి కరవు నివేదికలు సైతం సకాలంలో ఇవ్వకుండా కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కరవుపై స్పందించి కేంద్రం అందించిన 791కోట్లతో సహాయక చర్యలను కూడా సక్రమంగా చేపట్టడం లేదన్నారు. ఎండిన పంటలు, పండ్ల తోటలకు పరిహారం చెల్లించడం లేదన్నారు. వెంటనే పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసి, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి మండలానికి పది కోట్లతో కరవు సహాయక చర్యలు అమలు చేయాలన్నారు. ఎండిన పంటలు, పండ్ల తోటలకు పరిహారం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి వలసలు నివారించి వేతన బకాయిలు చెల్లించి ఆదుకోవాలన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఖరీఫ్ పంటలకు సబ్సిడీ విత్తనాలు, గడ్డి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు రామోజీ షణ్ముఖ, ఓరుగంటి రాములు, చింత ముత్యాల్‌రావు, పొతెపాక సాంబయ్య, బండారు ప్రసాద్, పి.శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈదురు గాలుల బీభత్సం
* భారీగా నిమ్మ, మామిడి తోటలకు నష్టం

కట్టంగూర్, మే 2: మండలంలో ఆదివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలుల దాటికి నిమ్మ, మామిడి తోటలకు ఆపార నష్టం వాటిల్లింది. మండలకేంద్రంతో పాటు మండలపరిధిలోని కలిమేర, మునుకుంట్ల, అయిటిపాముల, గ్రామాల్లో భారీగా వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. అసలే కరవు పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి తోటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులకు గురవుతున్న రైతులకు బలమైన ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం వాటిళ్లింది. ఈదురు గాలులు భారీగా వీయడంతో నిమ్మ, మామిడి తోటలకు కాయలు నేలరాలిపోవడంతో పాటు పలు చెట్లు వేర్లతో సహా నేలకూలిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలవ్యాప్తంగా 100 ఎకరాల్లో నిమ్మ, 50 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ఇబ్బందులు పడ్డ జనం
రామన్నపేట: మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులతో ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలులు బలంగా వీయడంతో నిధాన్‌పల్లి, లక్ష్మాపురం గ్రామాలలో తీవ్ర నష్టం వాటిల్లింది. నిధాన్‌పల్లిలో మజీద్‌మియాకు చెందిన కోళ్లఫారం పై కప్పురేకులు ఎగిరిపోయాయి. అదేగ్రామానికి చెందిన బాషమల్ల మల్లయ్య చెందిన ఇంటిపై కప్పు ఎగిరిపోయింది. నిధాన్‌పల్లి, లక్ష్మాపురం గ్రామాలలో సుమారు పదిస్తంభాలువరకు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారే వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుగ్రామాలలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. లక్ష్మాపురం, శోభనాద్రిపురం, సిరిపురం, దుబ్బాక గ్రామాలలోని తోటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలేరులో భారీ వర్షం
ఆలేరు,: మండల కేంద్రం ఆలేరు పట్టణంలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపుల తీవ్రతకు ఆలేరు కంపించింది. కొలనుపాక రహదారిపై మర్రిచెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామిడి తోటల్లో ఈదురుగాలులతో కాయలు రాలిపోయాయి.
పడిపోయిన విద్యుత్ స్తంభాలు
తిప్పర్తి: మండలంలోని చిన్నసూరారం గ్రామంలో ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షంతో ఎనిమిది స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొరిగాయి. స్తంభాలు విరిగిపడటంతో గ్రామంలో వ్యవసాయ బావులకు, ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే విద్యుత్ అధికారులు విద్యుత్ కొత్త స్తంభాలను అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పిడుగుపడి రెండు పశువులు మృతి
పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని పేర్వాల గ్రామంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిన సందర్భంగా పిడుగు పడి రెండు పశువులు మృతి చెందగా, పశువుల కొట్టం, గడ్డివాము దగ్ధమయ్యాయి. టేకులపల్లి రుక్కయ్య పశువుల కొట్టంపై పిడుగుపడటంతో కొట్టం దగ్ధం కావడంతో అందులోని ఎద్దు, ఆవు సజీవంగా దగ్ధమై చనిపోయాయి. మంటల్లో పశువుల కొట్టం, గడ్డివాము కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు లక్ష యభై వేల వేరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలి బాధిత రైతు రుక్కయ్య మొరపెట్టుకున్నారు.

ఎమ్మెల్సీ ‘మార్నింగ్ వాక్కు’!

నల్లగొండ, మే 2: తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న నల్లగొండ పట్టణ వాసుల మథ్య అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వారితో కలిసి వాకింగ్ చేస్తూ పట్టణ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌జి కళాశాల మైదానంలో వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాక్ చేసిన కోమటిరెడ్డి వారితో చర్చించి పట్టణంలో సమస్యలపై ఆరా తీశారు. కళాశాలలో వాకింగ్ ట్రాక్ పూర్తికి తనవంతు నిధుల సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. వాకర్స్ అసొసియేషన్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఎన్‌జి కళాశాల ఆవరణలో వాకర్స్‌తో పాటు కళాశాలకు వచ్చే విద్యార్థులకు, క్రీడాకారులకు, ఇతరులకు మంచినీటి వసతి కోసం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్ ఫిల్టర్ ఫ్లాంట్ ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం పట్టణంలో మోటార్ బైక్‌పై తిరుగుతు వివిధ వార్డుల్లోని సమస్యలు పరిశీలించారు. స్థానికులతో కలిసి రోడ్డు పక్కన హోటల్‌లో టీ తాగుతు వారు చెప్పిన సమస్యలు విని పరిష్కారంపై హామీ ఇచ్చారు. ఆయన వెంట వాకర్స్ అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారు ప్రసాద్, పసల శౌర్యయ్య, ఉపాధ్యక్షులు ఎన్. భీమార్జున్‌రెడ్డి, కినె్నర శ్రీనివాస్, జి.లింగయ్య, బజ్జీ తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలో వసతులు కల్పిస్తా : రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మోమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను పూర్తి స్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆయన కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ఫర్నిచర్, ఆట స్థలాలను పరిశీలించారు. ఆయా వసతుల కల్పనలో జరుగుతున్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించిన విషయాన్ని తెలుసుకున్న రాజగోపాల్‌రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్స్ ఏ.ఆదిరెడ్డి, జి.అశోక్‌రెడ్డిలను, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబ్బక అశోక్‌సుందర్, కె.వేణుగోపాల్‌రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్, తమి, సుభాష్, బండారు ప్రసాద్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి బాలాలయంలోకి వర్షపు నీరు
*తడిసి ముద్దయిన భక్తజనం
యాదగిరిగుట్ట, మే 2:ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానం కొండపైన ఇటీవల నూతనంగా నిర్మించిన బాలాలయం చిన్నపాటి వర్షానికే వనికి పోయింది.బాలాలయ ప్రధాణ మండపంలోకి వర్షపు నీరు చేరిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 3కోట్ల వ్యయంతో ప్రధాణ ఆలయ సహజసిద్ద గుహ మాదిరిగా బాలాలయాన్ని నిర్మిస్తున్నారు.ప్రముఖ ఆర్కిటెక్టు ఆనందసాయి దీనికి రూపకల్పన చేశారు. ఆనందసాయి విడుదల చేసిన నమూనాకు ఏ మాత్రం పొంతన లేకండా జరిగిన నిర్మాణం ఇది.శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి కవచమూర్తులను గత నెల 21వ.తేదిన ప్రతిష్టించారు.స్వామి వారి నిత్యకళ్యాణం నిర్వహించేందుకు గర్బాలయం ముందు 100మంది భక్తులు కూర్చునే విదంగా మండపం నిర్మించారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి సైతం ఆలయంలోకి నీరు చేరింది.సోమవారం సాయంత్రం గాలి,ఉరుములు,మెరుపులు దుమారంతో సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురిసింది.చిన్నపాటి వర్షానికే ఆలయంలోకి నీరు చేరితే రాబోయే వర్షాకాలంలో పరిస్ధితేంటని భక్తులు స్ధానికులు వాపోతున్నారు.నెల రోజులు దాటితే వర్షాకాలం రానుంది. అధికార్లు సంవత్సరంలోపే ప్రదాణ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియపర్చినప్పటికి సుమారు మూడు సంవత్సరాలు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
గుర్రంపోడు, మే 2: వరకట్న వేధింపులు తాళలేక తన ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాధ ఘటన మండలంలోని జునూంతల గ్రామంలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బొమ్ము వెంకటయ్యకు మహాబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల మంగమ్మల కూతురు ఆవుల యాదమ్మ(30)తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారిద్ధరికి శే్వత(7), ప్రణిత్(5)లు అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే వివాహా సమయంలో మూడు లక్షల కట్నం తీసుకున్న వెంకటయ్య గత కొంత కాలం అదనపు కట్నం పేరుతో వేధించసాగాడు. భర్త, అత్తమామాలు నిత్యం తనను వేధిస్తుండటంతో తరుచు గొడవ పడుతుండటంతో జీవితంపై విరక్తి చెందిన యాదమ్మ ఆదివారం అర్ధరాత్రి తన ఇద్దరు పిల్లలు శే్వత, ప్రణిత్‌లతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో దూకడటంతో నీట మునిగి చనిపోయారు. మృతురాలి తండ్రి ఆవుల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ వీసన్నలు తెలిపారు. బొమ్ము యాదమ్మ భర్త బొమ్ము వెంకటయ్య, అత్తమామాలు బొమ్ము నరసింహ, సత్తమ్మలను అరెస్టు చేశామన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను బావి నుండి వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కరవు పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వ విఫలం:బిజెపి
దేవరకొండ, మే 2: కరవు సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామోజి ఆరోపించారు. కరవు సమస్యపై రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా సోమవారం స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగూరావు నామోజి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కరవు సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో కనీసం తాగునీరు కూడా లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పశుగ్రాసం లేక రైతులు విధి లేని పరిస్ధితుల్లో తమ పశువులను కబేళాలకు తరలించాల్సిన దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరవు సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కరవు మండలాలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కరవు మండలాల్లో పశుసంపదను కాపాడేందుకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని నామోజి డిమాండ్ చేశారు. కరవు సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం తహశీల్దార్ గణేశ్‌కు వినతీపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్టక్రార్యవర్గ సభ్యుడు బెజవాడ శేఖర్, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ నక్క వెంకటేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

జిఎంఆర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
చౌటుప్పల్, మే 2: జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తి చేయడంలో జిఎంఆర్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామం నుంచి రెడ్డిబావి వరకు జాతీయ రహదారి వెంట జాతీయ రహదారుల సంస్థ సిజిఎం చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి భానుడి భగభగల్లో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా కాలినడకన అసంపూర్తి పనులను పరిశీలించారు. కైతాపురం, ధర్మాజీగూడెం, పంతంగి, అంకిరెడ్డిగూడెం వద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్లగిరి వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్ పాసింగ్‌వే ఏర్పాటు చేయాలన్నారు. కొయ్యలగూడెం వద్ద మురుగు నీరు సర్వీస్ రోడ్డుపైకి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే డ్రైనేజీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్‌లో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని, డ్రైనేజీలు నిర్మించాలని, పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దర్గా వద్ద పిల్లర్లు వేసి సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలన్నారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ జిఎంఆర్‌కు పనులు పూర్తి చేయడంపై చూపడంలేదని ఆరోపించారు. ప్రత్యేక చర్యలు తీసుకోని అసంపూర్తి పనులు పూర్తి చేయాలన్నారు. నిర్వహణకు కూడా సక్రమంగా లేదని, ఎక్కడ మట్టి, చెత్తా అక్కడే వదిలివేస్తున్నారని ఆరోపించారు. సిజిఎం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను నెల రోజుల్లో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హైవే ఎక్కే వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తామన్నారు. కైతాపురం, ఎల్లగిరి, ధర్మాజీగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి వద్ద సోలార్ బింకర్లను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. బార్‌కోడింగ్ నిర్మిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే పిడి రమేష్‌రెడ్డి, మేనేజర్ శ్రీనివాసులు, ఇండిపెండెంట్ ఇంజనీర్ కృష్ణమూర్తి, జిఎంఆర్ మేనేజర్ చంద్రశేఖర్, శ్రీ్ధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జెడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.