క్రైమ్/లీగల్

నిరుపేద గిరిజన మహిళా కూలీల నిండు ప్రాణాలు నీటిపాల...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 6: డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇరుకు రోడ్డు వెరసి పడమటితండాకు చెందిన తొమ్మిది మంది నిరుపేద గిరిజన మహిళా కూలీల నిండు ప్రాణాలు నీటిపాలయ్యాయ. పొట్టకూటి కోసం శుక్రవారం తెల్లవారుజామునే కూలి పనికి వెళుతూ మార్గమధ్యలోనే ట్రాక్టర్ ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రధాన కాలువలో పడిపోవడంతో ఈ అత్యంత దయనీయ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ బుచ్చిరెడ్డి సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కాలువ గట్టు వెంట ఇరుకు రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీతో పాటు కాలువలో పడిపోయిందని ప్రమాదం నుంచి బయపడిన ప్రత్యక్షసాక్షి రమావత్ హనుమా వెల్లడించారు. మృతులంతా తమ ఒద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటితండాకు చెందిన వారేనని, తామంతా పెద్దవూరా మండలం పులిచర్లలోని బుచ్చిరెడ్డి ఉల్లిగడ్డ తోటలో కూలీ పనికి తెల్లవారుజామున 6:30కు ట్రాక్టర్‌లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినటు లగా హనుమా వివరించారు. ప్రమాద సమయంలో ట్రాలీలో 25మంది, ఇంజన్‌పై ముగ్గురు ఉన్నామన్నారు. రోజూ ఆటోలో వెళ్లే తాము శుక్రవారం ట్రాక్టర్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యామన్నారు. కాగా కాలువ వెంట రోడ్డు ఇరుకుగా ఉండి ఒక వాహనం మాత్రమే వెళ్లేదిగా ఉండటం, రోడ్డులో ఒకవైపు మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్వి పూడ్చకపోవడం కూడా ప్రమాదానికి కారణమైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు రోడ్డు వెడల్పు కోసం కోరినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆపద్బాంధవుడైన హనుమా..!
పడమటి తండాలో ట్రాక్టర్‌లో తొలుత 40మంది వరకు ఎక్కడంతో ట్రాలీ నిండిపోగా వెనుక మరో ఆటోలో వెళ్లేందుకు అందులో నుంచి 15మంది వరకు దిగిపోయారు. ట్రాలీలో 25మంది, ఇంజన్‌పైన ముగ్గురితో బయలుదేరిన ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో పడగా ఇంజన్‌పై ఉన్న రమావత్ హనుమా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రాలీ కింది ఉన్న కూలీలు జలసమాధి అవ్వగా, గాయాలతో నీటిలో మునిగి కొట్టుకుపోతున్న మరో 12మందిని హనుమా సాహసోపేతంగా రక్షించి ఒడ్డుకు చేర్చాడు. హనుమా సాహసం మరింత మంది చనిపోకుండా కాపాడినట్లయ్యింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పడమటి తండా వాసులు సంఘటన స్థలానికి చేరుకుని నీటిలో ఉన్న వారిని ఒడ్డుకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కాలువ నుండి తొమ్మిది మృతదేహాలను, ట్రాక్టర్‌ను బయటకు తీశారు. అయితే రమావత్ బాజు మృతదేహం మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో కాలువ వెంట గాలింపు చేస్తున్నారు. కాలువలో నీటి ఉద్ధృతి తగ్గించేందుకు ఏఏమ్మార్పీ మోటార్లు బంద్ చేసి, గేట్లు మూసివేశారు. ఈ కాలువ ద్వారా ఎకెబిఆర్ రిజర్వారయ్ నుంచి హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది.

మృతులంతా పడమటి తండా వాసులే
ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా మృతుల్లో పడమటి తండాకు చెందిన జాన్యా ఇద్దరి భార్యలు రమావత్ సోని (55), రమావత్ జీజా (50) ఉన్నారు. అక్కాచెల్లెళ్లు రమావత్ భారతి (30), రమావత్ సునీత (28) లు మృతి చెందగా భారతికి భర్త, ఆరేళ్లలోపున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సునీతకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఏడాదిన్నర వయసున్న చిన్నారి బాలుడున్నాడు. తల్లులను కోల్పోయిన ఆ పిల్లలకు ఆలనా, పాలనా కరువైపోగా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో పడిపోయారు. మృతుల్లోని జోర్పుల ద్వాలి (32)కి భర్త, పనె్నండేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో రమావత్ కంసాలి (48), రమావత్ కేళి (48), రమావత్ ధరి (45), రమావత్ బాజు (55)లు కూడా మృతి చెందారు. ప్రమాద సమయంలో హనుమా 12మందిని కాపడకపోయి ఉండకపోతే మరింత మంది చనిపోయి ఉండేవారని పడమటి తండా వాసులు వాపోయారు. బతుకు దెరువుకని వెళితే తమవారి బతుకులు కాలువలో తెల్లారిపోయాయంటూ వారు పెద్ద పెట్టున తమవారి మృతదేహాలను చూస్త్తూ రోధించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మృతదేహాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా ప్రమాదంలో గాయపడిన సుక్కి, జమున, జోలి, రమావత్ హనుమాన్, సోనీ, లక్ష్మి, కేశిలను దేవరకొండ, హాలియా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
పడమటితండా వద్ధ కాలువలో ట్రాక్టర్ పడిపోయిన ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెసి నారాయణరెడ్డి, ఎస్పీ రంగనాథ్, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ బృందాలు మృతదేహాలను బయటకు తీసి పడమటి తండాకు తరలించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, టిడిపి ఉపాధ్యక్షుడు ముత్యంరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డిలు బాధితులను పరామార్శించారు. మృతదేహాల వద్ధ గ్రామస్తుల రోధనలు మిన్నంటాయి.
బంధువుల ఆందోళన
పడమటి తండా మృతుల కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.బిల్యానాయక్‌లు ఓదార్చి వారి కుటుంబాలను ఆదుకోవాలంటు బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. మృతుల కుటుంబానికి 12లక్షల ఆర్ధిక సహాయం, ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేదాకా మృతదేహాలను పోస్టుమార్టం తరలించబోనివ్వమంటు పట్టుబట్టారు. కలెక్టర్, ఎస్పీలు వారికి సర్ధిచెప్పి మృతదేహాలను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.
సిఎల్పీ నేత పరామర్శ
సిఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదంపై విచారణ జరిపి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి జగదీష్‌రెడ్డి
పడమటితండా మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని తక్షణ సహాయంగా ఒక్కోక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తామని జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చిన జగదీష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతు సీఎం కెసిఆర్ మృతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పిల్లల చదువులతో పాటు ఇతరత్రా అన్ని రకాల సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. అందుబాటులో ఉండే గ్రామంలో మూడెకరాల భూ కేటాయింపు పరిశీలిస్తామన్నారు. కేటాయిస్తామన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఢిల్లీకి వెళ్లేందుకు విమనాశ్రయం వెళ్లి ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఇక్కడి వచ్చి సహాయక చర్యలు పర్యవేక్షించారన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామన్నారు.