నల్గొండ

ఘనంగా యాదాద్రీశుని నిత్య కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిగుట్ట, జూన్ 19: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ్మస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్య ఆరాధనలు, అర్జితసేవలు, సేవ ఉత్సవాలు, యజ్ఞం, నిత్య కల్యాణం, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఉదయం సుప్రభాతం, బిందెతీర్థం, స్వామివారికి బాలభోగం, పంచామృతాభిషేకం, తులసీపత్ర పూజ నిర్వహించారు. వివిధ రకాల సుగంధ పరిమళాల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్ది కవచమూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి అర్చించారు. కల్యాణ మండపంలో అర్చకులు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీస్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణ మహోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం జరిపారు.
కల్యాణానికి ముందు శ్రీసుదర్శన నారసింహ్మ హోమం నిర్వహించారు. తొలుత శ్రీస్వామి, అమ్మవార్లను అలంకరించిన గజవాహనంపై అధిష్టింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అష్టోత్తరం, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయం త్రం వెండి జోడి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు.
శ్రీ ఆంజనేయుడికి ‘ఆకు పూజ’
యాదగిరి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి వారి కొండపై ఉన్న, స్వామివారు వెలిసేందుకు ముఖ్య కారకుడైన రామభక్తుడు ఆంజనేయునికి మంగళవారం 14 మన్యుసూక్తం, పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. చందనలేపం అద్ది వివిధ రకాల పూలమాలలతో స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుల మాలలతో అలంకరించారు. తమలపాకులతో క్షేత్రపాలకుడైన ఆంజనేయుడికి సహస్రనామార్చన జరిపారు. అనంతరం పలు రకాల పండ్లతో నివేదన చేసి మంత్రపుష్పం, నీరాజన కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రపాలకుని ఆకుపూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఆదాయం రూ.9లక్షల 37వేల 227
యాదగిరి లక్ష్మీనరసింహ్ముని ఆలయ ఆదాయం మంగళవారం 9లక్షల 37వేల 227 రూపాయలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా 4 లక్షల 13,310, ప్రధాన బుకింగ్‌ల ద్వారా 45 వేల 136, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 18 వేల 235, వ్రతాల టికెట్ల ద్వారా 43 వేలు, కల్యాణకట్ట ద్వారా 22 వేలు, విచారణ ద్వారా 53 వేల 160, టోల్‌గేటు ద్వారా 16 వందలు, వాహన పూజల ద్వారా 6 వేలు, అన్నదానం ద్వారా ఒక లక్షా 21వేల 465 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.