నల్గొండ

టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 16: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలను పక్కనబెట్టి టీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తామని కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రకటించారు. సోమవారం భువనగిరి కేంద్రంలో నిర్వహించిన పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, జనగాం నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమన్వయ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ విచ్చేయగా నాయకులు, కార్యకర్తలు పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశ స్థలికి బ్యాండుబాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా సమావేశంలో నాయకులు, కార్యకర్తల నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో సలీం అహ్మద్ మాట్లాడుతూ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జోష్ తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో యువత కాంగ్రెస్ పార్టీలో చరిత్ర సృష్టించబోతున్నారని ఉర్దూలో షాహిరి పాడి వినిపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాలను గద్దె దించేందుకు నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు సాగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకొని ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం గద్దెనెక్కడం ఖాయమని జోస్యం చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు బలోపేతం చేసేందుకే రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇన్‌చార్జిలను నియమించడం జరిగిందన్నారు. త్వరలోనే పార్టీ నాయకులను సమన్వయపరుస్తామని అహ్మద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, స్యొలర్ సిద్ధాంతాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో సమావేశం ముగిసిన అనంతరం గాంధీ భవన్‌లో వంద రోజుల పాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తనను సంప్రదించి పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలతో పాటు తమ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేడీలు ఇద్దరు కలిసి మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రజల ఖాతాలో వేస్తానన్న మోదీ, రాష్ట్రంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తామని హామీలిచ్చి నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అధిష్ఠానం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎవరికి టిక్కెట్లు ఇచ్చిన గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు. గ్రూపు తగాదాలను పరస్పర విభేదాలను పక్కనబెట్టి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి కానుకగా సమర్పించాలని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ సమన్వయ సమావేశంలో పాల్గొన్న నాయకుల ఉత్సాహం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడానికి సంకేతమన్నారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చెల్లనున్నాయన్నారు. భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీల నాయకత్వాన్ని బలపరిచి పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తల బాహాబాహీ
ఇలా ఉండగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వచ్చిన సలీం అహ్మద్, మల్లు రవి, బూడిద భిక్షమయ్యగౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని వేదికపై ప్రకటించిన నిమిషాల్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గీయుల మధ్య బాహాబాహీకి దిగారు. దీంతో సమన్వయ సమావేశం కాస్త రణరంగంగా మారింది. జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గీయులైన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నేటి వరకు బూత్ కమిటీలు కూడా వేయకుండా పార్టీని నిర్వీర్యం చేశారని బీబీనగర్‌కు చెందిన శ్యామ్‌గౌడ్, భువనగిరి పట్టణానికి చెందిన సయ్యద్ ముల్తానీషా సలీం అహ్మద్‌కు ఫిర్యాదు చేస్తుండగా చెరుకు అచ్చయ్యగౌడ్ అడ్డుకోగ వాదోపవాదం నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్యన ఘర్షణ వాతవరణం చోటు చేసుకుంది. అదేవిధంగా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చిరుమర్తి లింగయ్య, ప్రసన్నకుమార్‌ల వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో సమన్వయ సమావేశం కాస్త రసాభాసగా ముగిసింది. అనంతరం ఏఐసీసీ ఇన్‌చార్జి సలీం అహ్మద్ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలను పిలుపించుకొని ఆయా నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పార్టీ పరిస్థితులపై సమీక్షించారు. అంతేగాక వారి వారి నుండి నివేదికలను స్వీకరించి పరిశీలిస్తామని అన్నారు. ముందస్తు ఎన్నికల ముందు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు వర్గ విభేధాలు విడనాడీ పార్టీ పటిష్టత కోసం అంతేగాక పార్టీ సూచించే అభ్యర్థుల విజయాల కోసం కృషి చేయాలని కోరారు.

కాంగ్రెసోళ్లవి పగటి కలలు..!
- కాంగ్రెస్ నాయకత్వమంతా కుటుంబాల మయమే - కుటుంబ పాలనపై వారివి గురవింద విమర్శలు
- అనైక్యతలో ఐక్యతారాగంతో క్యాడర్‌ను మోసం చేస్తున్నారు - రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా ధ్వజం

నల్లగొండ, జూలై 16: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కే.జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని పగటి కలలు కంటున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేశా చేశారు. సోమవారం నల్లగొండలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డితో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుత్తా కాంగ్రెస్ నల్లగొండ జిల్లా నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగొండ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని ఉత్తమ్, కోమటిరెడ్డిలు చేసిన విమర్శలు గురువింద సామేతలా ఉన్నాయని గుత్తా మండిపడ్డారు. చదువుకోని అజ్ఞాని ఉత్తమ్, చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి, ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానారెడ్డి ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లుగా సీఎం కుర్చీ కోసం పగటి కలలు కంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన భార్య పద్మావతిలు ఎమ్మెల్యేలని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలని, జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీరారెడ్డిలు ఇద్దరు పార్లమెంట్ స్థాయి సమావేశంలో వేదికపై ఉన్నారని, ఆర్.దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు సర్వోత్తంరెడ్డిలు ఏఐసీసీ సభ్యులుగా ఉన్నారని చురకలేశారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకత్వమంతా కుటుంబ పాలనమయమని వీరికి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావులు రాష్ట్ర సాధన ఉద్యమాల్లో పాల్గొని ప్రజాసేవలో కొనసాగుతున్న అంశాన్ని విస్మరించరాదన్నారు. 130ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ ఏనాడో కుటుంబ పార్టీగా మారిందన్నారు. నల్లగొండ పార్లమెంట్‌లో పోలయ్యే ఓట్లు 11లక్షలుంటే కాంగ్రెస్ ఐదు లక్షల మెజార్టీతో ఎట్లా గెలుస్తుందో ఉత్తమ్, కోమటిరెడ్డిలకే తెలియాలని గుత్తా ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వంటి కోతి మూకలతో తిరిగి పలుచనయ్యేకంటే సగౌరవంగా జానారెడ్డి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోటీ చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ నాయకుల్లా పగటి కలలు కనకుండా తాను 2024లో రాజకీయ నుండి వైదొలుగుతానని ప్రకటించారు. అలాగే సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి డిపాజిట్ దక్కకుండా చేస్తామని దామోదర్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఆయనకు మళ్లీ ఓటమి, జగదీశ్‌రెడ్డి గెలుపు తధ్యమన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డిలు కళ్లున్న కబోదుల్లా వ్యవహారిస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు రూ.లక్షా 50వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణాలు, కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిమ్స్‌ను ఏయిమ్స్‌గా మార్చడం, నల్లగొండ, సూర్యాపేటలలో రెండు మెడికల్ కళాశాలల మంజూరు, బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్‌లను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే అన్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతలపై పలుమార్లు మంత్రి హరీష్‌రావును ప్రశంసించిన కోమటిరెడ్డి కాంగ్రెస్ సమావేశాల్లో విమర్శలు చేస్తు తన తిక్కబుద్ధిని చాటుకుంటుర్నడన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యానికి కాంగ్రెస్ తెచ్చిన టీబీఎం మిషనే్ల కారణమని, ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ పాలన కంటే అధికంగా టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసిందన్నారు. ఎస్సారెస్పీ, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి జిల్లా అంతా సాగుతాగునీరందించే పనులు సాగుతున్నాయన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాష్ట్రంలో మూడు లక్షలు మంజూరుకాగా జిల్లాలో 2800 పూర్తవ్వగా, దళితులకు వందకోట్లతో వేయి ఎకరాలను 310మందికి పంపిణీ చేశారన్నారు. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల రాజు, కేవీపీల కనుసన్నుల్లో నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకులు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హతలేదన్నారు. ఇప్పటికే జిల్లాలో 35వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీలు పాశం రాంరెడ్డి, దైద రజిత, మార్కెట్ చైర్మన్ కరీంపాషా, లింగస్వామి ఉన్నారు.

ఇండస్ట్రీయల్ హబ్‌గా దండుమల్కాపురం
- 1200 ఎకరాల్లో 500 కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటు - ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి
- త్వరలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన - మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్, జూలై 16: మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రీయల్ హబ్‌గా మారనుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం 80 మంది రైతుల నుంచి రెండో విడత సేకరించిన 194 ఎకరాల భూమికి రూ.40.35 కోట్ల చెక్కులను సోమవారం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. అదేవిధంగా 21 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దండుమల్కాపురం 500 కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుతో గ్రీన్ హబ్‌గా మారుతుందన్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అందులో 80 శాతం స్థానిక నిరుద్యోగులకే అవకాశం దక్కనుందన్నారు. మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని చెప్పారు. ప్రాథమిక, వౌలిక సదుపాయల కల్పనకు రూ.36 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతున్నామన్నారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు భూములిచ్చి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీవో సూరజ్‌కుమార్ మాట్లాడుతూ 1200 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రంలోనే మొదటిదన్నారు. ఇప్పటికే 372 ఎకరాల భూమిని సేకరించి టీఎస్‌ఐఐసీకి అప్పగించామన్నారు. 194 ఎకరాలకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. మరో 66 మందికి త్వరలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మన్ బొడ్డు నిర్మల రెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు చింతల దామోదర్‌రెడ్డి, మండల కన్వీనర్ కొత్త పర్వతాలు, సర్పంచ్ సోమ అరుణారెడ్డి, గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.