క్రైమ్/లీగల్

పోలీస్‌స్టేషన్ ఎదుట.. గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండమల్లేపల్లి, ఆగస్టు 11: దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధి లోని కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట వాలి అనే గిరిజన మహిళ శుక్రవారం సాయంత్రం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామపంచాయతీ పరిధి లోని చింతచెట్టుతండాకు చెందిన వాలి కుమారునికి, అదే తండాకు చెందిన మరో యువకునికి డబ్బుల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో వాలి కుమారుని తో గొడవ పడ్డ మరో యువకుడు వాలి కుమారునిపై కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో తండాపెద్ద మనుషుల సమక్షంలో శుక్రవారం పోలీస్‌స్టేషన్ సమీపంలో పంచాయతీ నిర్వహించి వాలి కుమారునికి జరిమానా విధించారు. దీంతో మనస్ధాపం చెందిన వాలి తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మం దును పోలీస్‌స్టేషన్ ఎదుట సేవించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలించాలనడంతో హైద్రాబాద్‌కు వెళ్ళలేని వాలి కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం దేవరకొండ పట్టణం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యాయత్నం చేసింది వాస్తవమే : ఎస్ ఐ
కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామపంచాయతీ పరిధి లోని చింతచెట్టుతండాకు చెందిన వాలి అనే గిరిజన మహిళ శుక్రవారం రోజు కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం వాస్తవమేనని ఎస్ ఐ శంకర్‌రెడ్డి చెప్పారు. తండాలో జరిగిన గొడవ విషయమై వాలి కుమారునిపై అతని ప్రత్యర్ధులు కేసు పెట్టారని ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో చర్చలు జరిగిన అనంతరం వాలి పోలీస్‌స్టేషన్ ఎదుట క్రిమిసంహారక మందు సేవించిందన్నారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని శంకర్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
నల్లగొండ రూరల్, ఆగస్టు 11: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం జిల్లాకేంద్రంలోని సాగర్ రహదారిలో చోటు చేసుకుంది. నల్లగొండ ఒకటవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇస్లాంపుర కాలనీకి చెందిన మహ్మద్ ఫెరోజ్ (19) రోజువారీగా శ్రీరామానందతీర్థ ఇంజనీరింగ్ కళాశాలకు బైకుపై వెళ్తుండగా ఇందిరారెడ్డి ఫంక్షన్‌హాల్ వద్ద నల్లగొండకు వస్తున్న లారీ ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఫెరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
చింతపల్లి, ఆగస్టు 11: మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన పెద్దపల్లి విజయేందర్ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుని తండ్రి ఈదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గతకొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడని, నొప్పి తీవ్రం కావడంతో భరించలేక శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగభూషణ్‌రావు తెలిపారు.

కల్వర్టును ఢీకొన్న కారు
* రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
* మృతుల్లో రిటైర్డ్ డీఎంహెచ్‌వో
సూర్యాపేట, ఆగస్టు 11: హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండకు చెందిన నిమిషకవి బిక్షపతి (59) పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆతర్వాత విజయవాడలోని ఓప్రైవేట్ వైద్యవిద్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారు వ్యాపారి తిరువీధుల వాసు (45)తో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు గుంజలూరు సమీపంలో అదుపుతప్పి రోడ్డు ప్రక్కన కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో బంగారు వ్యాపారి వాసు అక్కడికక్కడే మృతిచెందగా రిటైర్డ్ డీఎంహెచ్‌వో బిక్షపతి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కారు డ్రైవర్ వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన రెడ్డిపల్లి రామ్మూర్తి కారులో చిక్కుకోగా పోలీసులు స్థానికుల సాయంతో రెండుగంటల పాటు శ్రమించి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ సందర్శించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.