నల్గొండ

పంద్రాగస్టు వేళ.. పథకాల పండుగ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో రెండు ప్రతిష్టాత్మక పథకాలు కంటి వెలుగు, రైతుబీమా పథకాలను ప్రారంభించనుండగా లబ్ధిదారుల్లో సంబురాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజలను కంటి సమస్యల నుండి దూరం చేసేందుకు, ఆరోగ్య తెలంగాణ సాధనకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3గంటలకు జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కంటి వెలుగులో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 540 రెవెన్యూ గ్రామాల్లోని 16 లక్షల 17వేల 895 మందికి 4,603 క్యాంపుల ద్వారా 37 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించనున్నాయి. ఆరు నెలల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 3లక్షల 30వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో 11లక్షల మందికి 23 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించనున్నారు. 70,311 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7లక్షల 39వేల 99 మందికి 17 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించనుండగా 70,417 మందికి కంటి అద్దాలు పంపిణీ, 32,990 మంది మందులు అందచేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
మరో ప్రతిష్టాత్మక పథకం రైతుబీమాలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగ సంక్షేమం కోసం 23 లక్షల 81,276 మందికి రైతుబీమా నేడు స్వాతంత్ర దినోత్సం నుండి అమల్లోకి రానుంది. నల్లగొండ జిల్లాలో 543 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే జరిగిన రైతుబీమా బాండ్ల పంపిణీ మేరకు లక్ష 73,410 మందికి నేటి నుండి రైతుబీమా పథకం ఐదు లక్షల ఇన్స్యూరెన్స్ అమల్లోకి రానుంది. అలాగే సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలకు చెందిన 97,451 మంది రైతులకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 301 గ్రామాలకు చెందిన 74,973 మంది రైతులకు రైతుబీమా పథకం నేటి నుండి వర్తించనుంది.
అలాగే స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా భారీ ఎత్తున బీసీ రుణాల పంపిణీకి జిల్లాల యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో అర్హులైన పేదలు, చిరు వ్యాపారులు 15,793 మందికి బీసీ రుణ యూనిట్లు మంజూరుకాగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో రుణ పంపిణీ ప్రారంభించనున్నారు. అటు బీసీ ఫెడరేషన్ ద్వారా రజక, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లుగీత, వడ్డెర, పూసల తదితర కుల వృత్తుల వారు 20,201 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకోగా గ్రామసభల ద్వారా అర్హులైన వారి జాబితాను అనుసరించి జిల్లా ఎంపిక కమిటీ రుణ పంపిణీకి కసరత్తు సాగిస్తుంది.
మరోవైపు ఈనెల 18నుండి తెలంగాణ ప్రభుత్వం పాడి రైతులకు పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనుంది. తొలి విడతగా జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు 14,600 మందికి పాడి గేదెల పంపిణీ చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మదర్ డెయిరీ పరిధిలో 18,670 మందికి, విజయాడెయిరీ పరిదిలో 1400 మందికి పాడి గేదెల పంపిణీ చేపట్టనున్నారు.
అలాగే ఈ ఏడాది నీలి విప్లవం కింద ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఈనెల 18 నుండి నల్లగొండ జిల్లాలో 5కోట్ల 30లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది.

సంబురానికి సన్నద్ధం..!
జాతీయ పతాకావిష్కరణ చేయనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, నేతి, సునీతలు

నల్లగొండ, ఆగస్టు 14: దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 వేడుకలకు జిల్లాల అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే పరేడ్ మైదానాలను అందంగా అలంకరించారు. పోలీసు బలగాలు సన్నాహా కవాతులను నిర్వహించాయ. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల రిహార్సల్స్‌తో సందడి చేశారు. నల్లగొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చేయగా నేడు ఉదయం 9 గంటలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డిలు జాతీయ పతాకావిష్కరణలు చేసి సందేశాలు ఇవ్వనున్నారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాల ప్రగతి శకటాల ప్రదర్శనలు, ఆస్తుల పంపిణీ, అవార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ దఫా వేడుకల్లో బీసీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
సంక్షేమంలో తెలంగాణ ముందంజ
* శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్

కేతేపల్లి, ఆగస్టు 14: సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చెర్కుపల్లిలో రైతుబంధు బీమా బాండ్లను రైతులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల కోసం ప్రవేశపెడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామంలో 464 మంది రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో మరికొంత మంది రైతులకు బాండ్లను అందిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా మంజులారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ కంచర్ల మహేందర్‌రెడ్డి, గ్రామాభివృద్ధి చైర్మన్ బంటు మహేందర్, నాయకులు పెదబొక్క యల్లయ్య, అంజద్, నాగరాజు, సైదులు, వెంకన్న, టీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ సుందర్, చిమట వెంకన్నయాదవ్, ఏవో కళ్యాణచక్రవర్తి, ఏఈవోలు ముత్తయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.