నల్గొండ

కోమటిరెడ్డి సమక్షంలో ఐఎన్‌టియుసిలో చేరిన పాపయ్యగౌడ్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 29: ఐఎన్‌టియుసి జిల్లా వ్యవస్థాపకుడిగా వ్యవహరించిన దేశగాని పాపయ్యగౌడ్ టిఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ ఐఎన్‌టియుసిలో చేరారు. శుక్రవారం డిఎంహెచ్‌వో కార్యాలయంలో జరిగిన ఐఎన్‌టియుసి క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా వచ్చిన సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్లి సమక్షంలో పాపయ్యగౌడ్ ఐఎన్‌టియుసిలో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి కండువా కప్పి తిరిగి ఐఎన్‌టియుసిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాపయ్యగౌడ్ మాట్లాడుతూ తాను గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సందర్భంలో జిల్లాలో ఐఎన్‌టియుసి స్థాపనకు, బలోపేతానికి ఎంతో కృషి చేశానన్నారు. అయితే తన సొంత అల్లుడు ఎంపి బూర నర్సయ్యగౌడ్‌కు టిఆర్‌ఎస్ టికెట్ దక్కడంతో గత ఎన్నికల్లో నైతిక విలువలు పాటించి కాంగ్రెస్‌ను వీడి అల్లుడి గెలుపు కోసం టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. అయితే టిఆర్‌ఎస్‌లో తాను కొనసాగలేక తిరిగి సొంత గూటికి చేరడం జరిగిందన్నారు.
సాగర్ ఆసుపత్రికి నూతన భవనం
నాగార్జునసాగర్, జనవరి 29: నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రు ఏరియా ఆసుపత్రి ఆవరణలో నూతన భవన నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభమయింది. దీనికై గురువారం రాత్రి బోరు వేయించగా అది విజయవంతమయింది. ఈసందర్భంగా వైద్యారోగ్య శాఖ ఇఇ హజీజ్ మాట్లాడుతూ నాబార్డ్ నిధులతో కమలానెహ్రు ఏరియా ఆసుపత్రిలో నూతన ఆసుపత్రి నిర్మాణానికి రూ.18కోట్ల నిధులు మంజూరయినట్లు తెలిపారు. వీటిలో రూ.13కోట్లు ఆసుపత్రి నిర్మాణానికి, రూ.5కోట్లు ఆసుపత్రి సామాగ్రి కొనుగోలుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి 2సంవత్సరాలలో పూర్తిచేస్తామన్నారు. దీనికి సంబంధించిన నిర్మాణాల కోసం పాత కట్టడాలను కూల్చి వేసి కొత్త భవనాల నిర్మాణానికి వారం రోజుల లోపల భూమి పూజ చేస్తామని ఆయన తెలిపారు.

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు
శ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి డిమాండ్
కట్టంగూర్, జనవరి 29: మండలంలోని కురుమర్తి గ్రామంలో చెర్వులో మోటార్‌లు వేశారని రైతులను వేధిస్తున్న అధికారపార్టీ నాయకులు, అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుమర్తి గ్రామానికి చెందిన కొందరు రైతులు గతకొనే్నళ్లుగా విద్యుత్‌శాఖ నుండి అనుమతిపొంది మోటార్‌లు ఏర్పాటు చేసుకున్నారని, అయితే అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోకుండా పార్టీ మారేందుకు నిరాకరించిన రైతుల మోటార్‌లను రెవెన్యూ, పోలీస్ అధికారులచేత బలవంతంగా తొలగింపజేస్తున్నారని, అడ్డుకున్న రైతులపై స్థానిక ఎస్‌ఐ దాడిచేసి గాయపర్చారని, అదేవిధంగా ఎస్‌ఐ సమక్షంలోనే అధికారపార్టీకి చెందిన నాయకులు రైతులపై దాడులుచేసిన పట్టించుకోలేదన్నారు. రైతులపై దాడిచేసిన ఎస్‌ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మండల అధికారులు ఇప్పటికైన తమ పద్దతిని మార్చకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూ రైతులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. రైతులపై అధికారులు వేధింపుల ఆపనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ జడ్పిటిసి సుంకరబోయిన నర్సింహాయాదవ్, కాంగ్రెస్ నాయకులు వల్లపు శ్రీనివాస్‌రెడ్డి, బీరెల్లి ప్రసాద్, పెద్ది చుక్కయ్య, గంగదేవి అంజనేయులు, దుగినెల్లి సర్పంచ్ చిత్రం శంకర్, కట్టంగూర్ ఉప సర్పంచ్ నర్సింగ్ శ్రీనివాస్, డిసిసిబి మాజీ డైరెక్టర్ గద్దపాటి రాములు, ముక్కాముల శేఖర్, ఊట్కూరి శంకర్, దాసరి ఎల్లయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముందు బైండ్ల కులస్థుల ధర్నా
నల్లగొండ టౌన్, జనవరి 29: బైండ్ల కుల వృత్తిదారులకు పెన్షన్, మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చిలక మిన్నయ్య మాట్లాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేస్తున్న తమను గుడి పూజారులుగా నియమించాలని, ఎస్సీ కార్పొరేషన్‌నుండి ప్రత్యేకంగా బైండ్ల కులస్తులకు రుణ సౌకర్యాలు కల్పించాలని, జిల్లా కేంద్రంలో బైండ్ల సంక్షేమ భవనం నిర్మించాలన్నారు. బైండ్ల కులస్తులను తహశీల్దార్ కార్యాలయాలలో ఎస్సీలుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ ప్రదర్శన వేషధారణలతో జేసికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కారంపొడి నాగయ్య, రామలింగయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకన్న, జనార్ధన్, వెంకటేశ్వర్లు, ఆశయ్య, సోమయ్య, శ్రీను, , లక్ష్మీనారాయణ, నగేష్, భిక్షం పాల్గొన్నారు.

మహిళలపై అఘాయిత్యాలకు చరమగీతం పాడాలి
ౄ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన
నల్లగొండ టౌన్, జనవరి 29: సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు చరమ గీతం పాడాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం టిటిడిసి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణపై ఎన్నో చట్టాలు వచ్చినా ఇంకా ఆచరణలో నూరు శాతం అమలు కాకపోవడం ఆందోళనకు గురిచేస్తున్న, ఆలోచించాల్సిన అంశమన్నారు. మహిళా సంఘ సభ్యుల నుండి బాలికల విక్రయాలు, బాల్య వివాహాలు నిర్మూలనపై వారి అభిప్రాయలతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేవరకొండలాంటి ఆర్ధికంగా వెనకబడిన ప్రాంతాలలో ఇప్పటికీ శిశు విక్రయాలు జరగడం, ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావాలు చేయడాలు తమను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకై గ్రామ స్థాయిలో మహిళలను చైతన్యపరిచి వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. కుల, మత ఆచారాలంటూ ఇప్పటికీ బాల్య వివాహాలు చేయడం సరికాదన్నారు. వెనుకబాటుతనం నుండి బయట పడాలని, అందుకు మహిళా సంస్థలు కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాల నిరోధక చట్టం నామమాత్రంగానే ఉందని ప్రతి 1000మంది పురుషులకు 834మంది మహిళల నిష్పత్తి మాత్రమే ఉన్నందున భవిష్యత్తులో రాబోవు తరానికి మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గమనించాలన్నారు. ఇప్పటి వరకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు పర్యటించి చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. మహిళా కమిషన్ ఆధ్వర్యలోని మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పేదరికం, అమాయకత్వం విద్యలేని చోట ఏజెంట్ల మాయమాటలతో మహిళలు మోసాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె గర్భం ద్వారా ఏజెంట్ల మోసాలకు పాల్పడకుండా కట్టుదిట్టమయిన చర్యలు చేపడతామన్నారు. ఇందులో దళిత గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారికి అర్దమయ్యే విధంగా తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్తరకమైన హింసలకు పాల్పడకుండా అన్ని వర్గాల వారు మహిళలకు సహకరించి మహిళలకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి అంజయ్య, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ పిడి మోతి, సిడిపివో కృష్ణవేణి పాల్గొన్నారు.
రబీ సీజన్ నుండి ఆన్‌లైన్ విధానంతో
ధాన్యం కొనుగోలు : ఇన్‌చార్జి కలెక్టర్
కలెక్టరేట్(నల్లగొండ), జనవరి 29: వచ్చే రబీ, ఖరీఫ్ సీజన్‌ల నుండి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడుతున్నట్లుగా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, డిఆర్‌డిఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానంలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ధ ఉండే ఇన్‌చార్జికి ట్యాబ్ అందచేసి కొనుగోలు ఆన్‌లైన్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. ఈ విషయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ వారు సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో వస్తున్న సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా పరిష్కరం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జిల్లా స్థాయి కమిటీ జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఈ విధానాన్ని పరిశీలిస్తుందని, రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిఎం రమాదేవి, డిఎస్‌వో అమృతారెడ్డి, రాజేందర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
స్థలాలు, ఇళ్లను
క్రమబద్ధీకరించుకోండి
- ప్రజలకు మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత సూచన
కోదాడ, జనవరి 29: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అనధికార లేఅవుట్లలో స్ధలాలు కొనుగోలు చేసినవారు, భవనాలను నిర్మించుకొన్నవారు ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు క్రమబద్ధీకరించుకొనేందుకు ముందుకు రావాలని కోదాడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వంటిపులి అనిత కోరారు. కోదాడ మన్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్ధలాల, నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణపై టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన తరువాత ఛైర్‌పర్సన్ అనిత విలేఖరులతో మాట్లాడారు. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఈనెల 31వ, తేదివరకు మాత్రమే అనుమతి ఇచ్చినందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కమిషనర్, మున్సిపాలిటీ, కోదాడ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్‌ను తీసి క్రమబద్దీకరణ దరఖాస్తుకు జతచేసి టౌన్‌ప్లానింగ్ కార్యాలయంలో అందచేయాలని ఆమె సూచించారు. అనధికార లేఅవుట్లలోని స్ధలాలు, భవనాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ముందుకు రాకపోతే గడువు ముగిసిన తరువాత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొంటారని ఆమె వివరించారు. ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకొని లబ్దిపొందాలని ఛైర్‌పర్సన్ అనిత కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, టౌన్ ప్లానింగ్ ఇన్సిపెక్టర్ సోమయ్య, సిబ్బంది రామారావు, రంగాచారి పాల్గొన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
* డిఈఓ విశ్వనాధరావ్
భువనగిరి, జనవరి 29: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధిచర్యలు చేపడుతున్నట్లుగా జిల్లావిద్యాధికారి విశ్వనాధరావ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని అనాజిపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవిద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు తీసిపోకుండా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం, నీటివసతి, సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్నభోజనం, యూనిఫాంలు, పుస్తకాలు, పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేసారు. డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవం అనంతరం పాఠశాలలో మరుగుదొడ్లను, తరగతిగదులను, నీటి వసతిని పరిశీలించారు. అదేవిదంగా ఉపాధ్యాయుల బోధనాపద్ధతులను పరీక్షించి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ ఉపవిద్యాధికారి మదన్‌మోహన్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏళ్ల దశరథరెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ కోఆప్టెడ్ సభ్యుడు ఎదునూరి మల్లేషం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి ఆరోగ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అర్హులైన రైతులందరికీ
రుణ అర్హత కార్డులు
కలెక్టరేట్(నల్లగొండ), జనవరి 29: అర్హులైన రైతులందరికీ రుణ అర్హత కార్డులు జారీకి అన్ని చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ కోరారు. శుక్రవారం మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మార్గదర్శకాల మేరకు వెంటనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారి నుండి దరఖాస్తులు తీసుకుని కార్డులు జారీ చేయాలన్నారు. మీసేవ ద్వారా పెండింగ్ ముటేషన్లు తక్షణమే పరిష్కరించాలని కోరారు. తహశీల్దార్లు, విఆర్‌వో గ్రామాల్లో నివాసం ఉండేలా చూసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1నుండి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటున్నట్లుగా ధృవీకరించాలని అన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూ పంపిణీకి ప్రాధాన్యతనిచ్చి ప్రతి మండలంలో 50ఎకరాలకు తగ్గకుండా భూములు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేయాలని అన్నారు. రబీ పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సేత్వార్ టేడా నమోదుతో పాటు రెవెన్యూ సేవలను కంప్యూటరీకరించి తక్షణమే పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. 58, 59జీవో కింద స్థలాల క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీ్ధర్, ఎన్‌ఐసి అధికారి గణపతిరావు పాల్గొన్నారు.
కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి
మిర్యాలగూడ, జనవరి 29: దామరచర్ల మండలం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన ఆరు కుటుంబాలకు శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి సుమారు 74.97 లక్షల రూపాయల మేర పరిహారాన్ని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాలకు చెందిన ఆరుగురికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు. త్వరలో మరో 90 కోట్ల రూపాయలు భూములు కోల్పోయిన కుటుంబాలకు అందిస్తామని ఆర్డీఓ బి.కిషన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి శంకర్‌నాయక్, ఎంపిపి మంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, పాశం రాంరెడ్డి, ఇంజం నర్సిరెడ్డి, పర్శానాయక్, పోకల వెంకటేశ్వర్లు, కొట్యానాయక్‌లు పాల్గొన్నారు.
30కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణ పనులు
* గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్‌ఇ రమణ
నేరేడుచర్ల, జనవరి 29: నల్లగొండ జిల్లాలో ప్రస్తుత వేసవికాలంలో సుమారు రూ.30కోట్లతో నీటి ఎద్దడి నివారణ పనులు చేస్తున్నట్లు గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్‌ఇ బట్టు రమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి రవాణా, బోర్ల మరమ్మతులకు రూ.10.67కోట్లు, తాగునీటి పనులు మరమ్మత్తులకు రూ.19.28కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 265అద్దె బోర్లు, 19చోట్ల తాగునీటి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. భూగర్భజలాలు అడుగంటినందున కొత్తబోర్లు వేయవద్దన్నారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో 2నుండి 3మీటర్ల వరకు నీటి జలాలు పడిపోయాయన్నారు. తాగునీటి పథకాలకు నీరందించే చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 20వేల తాగునీటి బోర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామపంచాయితీలలో మంచినీటి పథకాలకు వేసవిలో ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో పదిరోజుల చొప్పున బోర్లను క్లీన్ చేయాలన్నారు. నీరందని మంచినీటి బోర్లకు అదనంగా పైపులను వేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయితీలో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రస్తుత వేసవిలో ప్రతి వ్యక్తికి 20లీటర్ల నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అన్ని గ్రామపంచాయితీల సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఆయా గ్రామాల్లో నెలకొని ఉన్న తాగునీటి సమస్యలను సమీక్షించారు. ఈసమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ వెంకట్‌రెడ్డి, ఎఇ పాండు, ఎంఇఓ నాగపద్మజ, ఇఓఆర్‌డి జ్యోతిలక్ష్మీలు పాల్గొన్నారు.

పత్తి రైతుకు మరోసారి నిరాశే
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 29: సిపిఐ పత్తి కొనుగోలు వ్యవహారం రైతుల కంటే మార్కెటింగ్ శాఖకు..దళారులకు ఎక్కువగా లాభం చేకూర్చేలా ఉండటం విమర్శలకు తావిస్తుంది. తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోలు చేయడం జరిగింది. జిల్లాలో 11పత్తి కొనుగోలు కేంద్రాల్లో 10,63,549క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. తద్వారా మార్కెటింగ్ శాఖకు గరిష్టంగా 4కోట్ల ఆదాయం దక్కింది. అయితే పత్తి పండించిన రైతులకు మాత్రం సిసిఐ పత్తి కొనుగోలు వ్యవహారం ప్రయోజనం చేకూర్చేలా లేక రైతులు తమ దిగుబడులకు ఆశించిన మద్దతు ధర పొందలేక నష్టపోయారు. అధిక శాతం దిగుబడులు గ్రామాలకు వచ్చే దళారులకు విక్రయించాక ఆలస్యంగా సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు తెరువడం రైతులకు నష్టదాయకమైంది. క్వింటాల్‌కు 4100రూపాయల మద్దతు ధర 25శాతం మంది రైతులకు కూడా దక్కలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. సిసిఐ కొనుగోలు చేసిన పత్తిలో ఎక్కువగా దళారులదే ఉంది. రైతుల వద్ధ తక్కువ ధరకు కొనుగోలు చేసి సిసిఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్న దళారులు బాగానే సొమ్ము చేసుకున్నారు. సిసిఐ కేంద్రాల్లో నవంబర్ మాసాంతానికి 30శాతం కొనుగోలు జరుగకపోగా డిసెంబర్ మాసాంతానికి 10లక్షల క్వింటాళ్లకు చేరుకున్న తీరు సిసిఐ కేంద్రాల్లో దళారుల పత్తి విక్రయాలకు నిదర్శనమంటూ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదీగాక ఇటీవల పెరిగిన విదేశీ ఎగుమతుల నేపధ్యంలో క్వింటాల్‌కు 4400్ధర పత్తికి లభిస్తుంది. తాము పత్తిని అంతా అమ్ముకున్నాక ధర పెరిగితే తమకు ఒరిగేదేమిటంటు పత్తి రైతులు వాపోతున్నారు.
ఇది చాలదన్నట్లుగా ప్రోత్సాహక ధర కూడా రైతుల కంటే ఎక్కువగా దళారులకే ప్రయోజనం దక్కించింది. ప్రభుత్వం నిర్ణయించిన తేమ 8శాతం కంటే ఎంత తక్కువ ఉంటే అంత మేరకు ఒక్కో శాతానికి 41రూపాయల ప్రోత్సాహక ధర రైతుకు చెల్లిస్తారు. దీనిపై రైతుల్లో తగిన ప్రచారం లేకపోవడంతో ప్రోత్సాహక ధర కూడా ఎక్కువగా దళారుల పాలైంది. తేమ శాతం ఎక్కువగా ఉంటే మద్దతు ధరలో కోత పెడతామని ప్రచారం నిర్వహించిన సిసిఐ, మార్కెటింగ్ శాఖలు తేమ శాతం తక్కువగా ఉంటే అందించే ప్రోత్సాహక ధరపై రైతులను చైతన్యం చేయకపోవడం పత్తి రైతులను మరింత నష్టపరిచింది.
కొండమల్లేపల్లిలో
అధికంగా కొనుగోలు
జిల్లాలో సిసిఐ 11పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా కొండమల్లెపల్లి కొనుగోలు కేంద్రంలో 2,17,858క్వింటాళ్లు కొనుగోలు చేశారు. చండూర్‌లో 2,09,832, చిట్యాలలో 1,99,683, మాల్‌లో 1,19,896, భువనగిరిలో 1,17,748, నకిరేకల్‌లో 84,347, చౌటుప్పల్‌లో 51,120, తిరుమలగిరిలో 35,480, సూర్యాపేటలో 13,440, ఆలేరులో 9,632క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. గత ఏడాది సిసిఐ జిల్లాలో 23లక్షల క్వింటాళ్ల కొనుగోలు చేసింది. ఈ ఏడాది జిల్లాలో 38లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేయగా అందులో కేవలం 10లక్షల 63,549క్వింటాళ్లు మాత్రమే ఈ ఏడాది కొనుగోలు చేశారు. మిగతా పత్తి అంతా జిన్నింగ్ మిల్లులు, దళారులే కొనుగోలు చేశారు.