నల్గొండ

మైనార్టీ మంత్రం ఫలించేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 16: ముందస్తు ఎన్నికల పోరులో నెగ్గేందుకు రాజకీయ పార్టీలన్ని గెలుపు సాధనకు వేయాల్సిన అన్ని ఎత్తుగడలను అమలు చేయడంలో పోటీ పడుతున్నాయి. వివిధ సామాజిక వర్గాలను, కులాలను ఆకట్టుకునేందుకు పోటాపోటీ హామీలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఎత్తుకు పై ఎత్తుగా వేస్తున్న రాజకీయ వ్యూహాలు ఎన్నికల పర్వంలో ఆసక్తికరంగా మారాయి.
ముఖ్యంగా నల్లగొండ అసెంబ్లీ నియోజవర్గంలో మైనార్టీ ఓటర్లు గణనీయంగా ఉండటంతో ఇక్కడ వారి మద్దతు సంపాదించేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి మజ్లిస్ పార్టీ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ వెంటనే నల్లగొండలో మైనార్టీల సదస్సు నిర్వహించిన కంచర్ల తన గెలుపునకు మైనార్టీలు కలిసిరావాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో అభ్యర్థింపచేశారు. అయితే ఓవైసీతో భేటీ, మహమూద్ అలీ ప్రచారంతో మైనార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన కంచర్ల ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయో పోలింగ్‌లోనే తేలాల్సివుంది. అటు స్థానిక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం మైనార్టీ ఓటర్లతో తనకున్న సుదీర్ఘ పరిచయాలతో వారి మద్దతుకోసం తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మైనార్టీల మద్దతు కోసం తంటాలు పడుతున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పాట్లు ఇలా ఉంటే.. మైనార్టీల జపం చేస్తున్న అభ్యర్థులకు ఇతర వర్గాల నుండి ఏ రకమైన సహకారం లభిస్తుందన్న అంశం చర్చనీయాంశమవుతోంది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, అనుబంధ వర్గాలు సైతం బలంగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేని పక్షంలో బీజేపీ అనుకూల వర్గ ఓటర్లు ప్రధాన పోటీదారులైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఒకరిని ఎంచుకునే క్రమంలో ఆ రెండు పార్టీల అభ్యర్థుల్లో తమ భావజాలానికి దగ్గర ఉండే అభ్యర్థినే ఎంచుకునే దిశగా సాగితే గెలుపు ఓటముల్లో వారి పాత్ర కూడా కీలకం కానుంది.
నిజానికి టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ పార్టీ మిత్రపక్షంగా ఉండటంతో మైనార్టీలంతా ఎన్నికల్లో తమను బలపరుస్తారన్న ధీమా టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఉంది. అటు కాంగ్రెస్ నాయకులు మైనార్టీలను తమవైపు ఆకర్షించేందుకు మైనార్టీలంటే మజ్లిస్ ఒక్కటే కాదని, టీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్‌తో బహిరంగ బంధం, బీజేపీతో రహస్య బంధం సాగిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు గట్టి ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఆకర్షించే క్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇదే వాదాన్ని వినిపిస్తున్నారు. అయితే ముస్లిం మైనార్టీలకు కేసీఆర్ బడ్జెట్‌లో దేశంలో ఏ ప్రభుత్వం కేటాయించని రీతిలో 2వేల కోట్లు కేటాయించిందని, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసిందని, రంజాన్‌కు కానులు అందించిందని, మత గురువులకు గౌరవ వేతనం చెల్లించిందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీతో నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రచారం సాగిస్తోంది. పైగా మజ్లిస్ మద్దతునిస్తున్నందునా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మైనార్టీలు మద్దతుగా నిలువాలని ఆ పార్టీ ప్రచారం సాగిస్తోంది. మొత్తంగా ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మైనార్టీ ఓట్ల సాధనలో పోటాపోటీ యత్నాలు సాగిస్తున్న ఎన్నికల రంగాన్ని రక్తికట్టిస్తుండగా, తామేమి ఇందులో తక్కువ తినలేదంటు బీఎల్‌ఎఫ్ బహుజన తెలంగాణ వాదంతో మైనార్టీలు తమవెంట సాగాలని కోరుతుంది.

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
* సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా
మునుగోడు, అక్టోబర్ 16: తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి అభ్యర్ధిని ఆశీర్వదించాలని కోరుతూ సీపీఐ ఆద్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన బైక్ ర్యాలీ మునుగోడు మీదుగా చండూరు వెళ్లింది. ఈ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు. రైతుబంధు పథకంతో భూస్వాములే లబ్ధిపొందారు.. తప్ప పేదవారికి ఓరిగిందేమి లేదన్నారు. మహాకూటమిలో సీట్ల కేటాయింపులు జరుగక ముందే కాంగ్రెస్ నాయకులు తమకే టికెట్ వచ్చినట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధిక శాతం ఓటు బ్యాంకు ఉన్న ఆలేరు, మునుగోడు, దేవరకొండ స్థానాలను కోరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహరెడ్డి, సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కార్యదర్శి సురిగి చలపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిర్పారి వెంకన్న, నాయకులు బొల్గురి నర్సింహ, బి.లాలు, చాపల శ్రీను, వనం వెంకన్న, దుబ్బ వెంకన్న, మందుల పాండు, కంపె దుర్గయ్య, కట్కూరి లింగస్వామి పాల్గొన్నారు.