నల్గొండ

రె‘బెల్స్’ గుబులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 13: సుదీర్ఘ కసరత్తు సాగించి కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థుల ఎంపికపైన టికెట్ దక్కని ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రెబల్స్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, పెండింగ్ స్థానాల్లో టికెట్ ఎవరికి కేటాయిస్తారోనన్న టెన్షన్ ఆశావహులను కలవర పెడుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో తొమ్మిది స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, నాగార్జున సాగర్ నుండి కే.జానారెడ్డికి, హుజూర్‌నగర్ నుండి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి, ఆలేరు నుండి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు రెబెల్స్ సమస్య లేదు. అయితే మునుగోడు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కినుక వహించిన నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి రెబెల్‌గా మరోసారి పోటీకి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ కోసం మంగళవారం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేసిన స్రవంతిరెడ్డి నామినేషన్ల ఘట్టం ఆఖరికల్లా టికెట్‌పై అధిష్టానం పునారాలోచన చేయకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాల్సిందిగా అనుచరుల నుండి ఒత్తిడి మొదలైంది. అసలే మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ ఈ స్థానం నుండి అభ్యర్థిని ప్రకటించడంతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు సొంత పార్టీ నుండి రెబెల్ పోటీ మరింత ఇబ్బందిపెట్టనుంది.
ఇక సూర్యాపేట కాంగ్రెస్ టికెట్‌ను మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డికి కేటాయించడాన్ని రేవంత్‌రెడ్డి వర్గీయుడైన పటేల్ రమేశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్వేలన్ని తనకు అనుకూలంగా ఉన్నా, కొందరు నాయకులు అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో టికెట్ దామోదర్‌రెడ్డికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాహుల్‌గాంధీతో పాటు ఇతర పార్టీ పెద్దలకు తన వాదన వినిపించిన రమేశ్‌రెడ్డి నామినేషన్ల ఆఖరుకల్లా కాంగ్రెస్ బీ-్ఫమ్ తనకే దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గా బరిలోకి దిగాలా వద్దా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానని మంగళవారం రమేష్‌రెడ్డి సూర్యాపేటలో తన అనుచరుల సమావేశంలో ప్రకటించారు.
నకిరేకల్ (ఎస్సీ) టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకు కేటాయించగా ఈ స్థానాన్ని ఆశించిన ప్రసన్నరాజ్ రెబెల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు కోదాడ సీటును టీడీపీకి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండి పద్మావతి ఉత్తమ్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లం మల్లయ్యయాదవ్ తాను ఈ సీటు నుండి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించి దుమారం రేపారు.
అటు కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన దేవరకొండ నుండి టికెట్ రేసులో ఉన్న జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్, కేతావత్ బిల్యానాయక్, ఇన్‌చార్జి జగన్‌లాల్‌నాయక్‌లలో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. వారంతా ఢిల్లీలో మకాం వేసి టికెట్ సాధనలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే తుంగతుర్తి (ఎస్సీ) నియోజకవర్గం నుండి అద్దంకి దయాకర్, డాక్టర్ వీ.రవిలు పోటీ పడుతున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్‌ను జానారెడ్డి తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి ఇవ్వాలని రాహుల్‌ను కోరారు. అయితే మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా మిర్యాలగూడ సీటును టీజేఎస్‌కు కేటాయించడంపై అధిష్ఠానం యోచనగా ఉందని కాంగ్రెస్ వర్గాల వినికిడి.
హుజూర్‌నగర్, కోదాడ అభ్యర్థుల
ఖరారుపై కేసీఆర్ కసరత్తు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పనె్నండు స్థానాల్లో తొలి దఫా 10స్థానాలు ప్రకటించినప్పటికి పెండింగ్‌లో పెట్టిన హుజూర్‌నగర్, కోదాడ స్థానాల అభ్యర్థుల ఎంపికపై తాజాగా దృష్టి పెట్టారు. నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభమవ్వడంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను త్వరగా తేల్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ల నుండి వివరాలు సేకరిస్తున్న కేసీఆర్ నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కోదాడ నుండి కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి, చందర్‌రావులు, హుజూర్‌నగర్ నుండి ఎన్నారైలు సైదిరెడ్డి, అప్పిరెడ్డి, ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ, సాముల శివారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారి పేర్లతో పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
బీజేపీ, సీపీఎం, బీఎల్‌ఎఫ్ పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ బెడద లేకపోవడంతో వారు జనంలో ప్రశాంతంగా తమ ప్రచారంతో ముందుకెళ్తూ విజయ సాధనకు తమ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖయం
*టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ రూరల్, నవంబర్ 13: నల్లగొండలో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం 28వ రోజు 30వ వార్డు మునుగోడు రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆయన ఇంటింటికి ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మహిళలు, టీఆర్‌ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కంచర్లకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, మహాకూటమి ఓటమి తధ్యమన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో యావత్ తెలంగాణ ప్రజానీకం లబ్ధి పొందిందన్నారు. నల్లగొండలో నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అదేవిధంగా తన భర్త భూపాల్ రెడ్డిని గెలిపించాలని కంచర్ల సతీమణి రమాదేవి ఆయా కాలనీలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఎన్నికలలో నల్లగొండ ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని కంచర్ల గెలవడం తధ్యమని తెలిపారు. కార్యక్రమంలో అబ్బగోని రమేష్, మల్లేష్ గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, ఆలకుంట్ల మోహన్ బాబు, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్ ఉన్నారు.