నల్గొండ

కారును గుద్దేసిన ట్రక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 13: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్, హుజూర్‌నగర్ అభ్యర్థుల ఓటమికి ట్రక్కు గుర్తు కారణం కావడంతో జిల్లాలో మరో రెండు సీట్లు టీఆర్‌ఎస్‌కు దూరమైనట్లయ్యింది. ప్రధానంగా నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపైన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ నుండి పోటీ చేసిన దుబ్బ రవికుమార్‌కు చెందిన ట్రక్కు గుర్తుకు 10,383ఓట్లు పోలయ్యాయి. ట్రక్కు గుర్తు టీఆర్‌ఎస్ కారుగుర్తును పోలి ఉండటంతో వృద్ధులు, గ్రామీణులు, నిరక్షరాస్యులు కారు గుర్తుకు బదులుగా ట్రక్కుకు వేయడం వీరేశం ఓటమికి దారితీసిందని రాజకీయ వర్గాలతోపాటు ఆయన కూడా విశే్లషిస్తున్నాయి. పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నకిరేకల్‌లోనే ట్రక్కు గుర్తుకు అధిక ఓట్లు పడటం గమనార్హం.
అలాగే హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపుకు, టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటమికి కూడా ట్రక్కు గుర్తు బాటలు వేసిందని భావిస్తున్నారు. సైదిరెడ్డిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7,466 ఓటర్ల మెజార్టీతో గెలుపొందగా ఇక్కడ ట్రక్కు గుర్తుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి మేకల రఘుమారెడ్డికి 4,944 ఓట్లు పోలవ్వడం గమనార్హం.
అలాగే తుంగతుర్తిలో ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థి అనిల్ ట్రక్కు గుర్తుకు 3,769 ఓట్లు పడగా, ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ 1847 ఓట్లతో గెలుపొందడం గమనార్హం. తృటిలో ట్రక్కు కిషోర్‌ను కూడా ఓటమి పాలు చేసే ప్రమాదం ఇక్కడ తప్పిపోయినట్లయింది. సాగర్ నియోజకవర్గంలో ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థి ట్రక్కు గుర్తుకు 9,819ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య మెజార్టీ తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ కే.జానారెడ్డిపై నోముల 7,771ఓట్లతో గెలుపొందగా ట్రక్కు గుర్తుకు పడ్డ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మరింత మెజార్టీ నోములకు దక్కేది. మునుగోడులో సిలివేరు నాగరాజుకు ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థి ట్రక్కు గుర్తుకు 2279ఓట్లు పోలవ్వగా, భువనగిరిలో ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థి పి.రమణారావు ట్రక్కు గుర్తుకు 3,613ఓట్లు పోలవ్వడంతో ఈ మేరకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓట్లు తగ్గిపోవడం గమనార్హం.

బుద్ధవనాన్ని సందర్శించిన ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు
నాగార్జునసాగర్, డిసెంబర్ 13: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన సాగర్‌లో నిర్మాణమవుతున్న బుద్ధవనం ప్రాజెక్ట్‌ను గురువారం ప్రపంచదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు, బౌద్ధగురువులు సందర్శించారు. ఉదయం 11గంటలకు బుద్ధవనం చేరుకున్న ఈ బృందానికి మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, టూరిజం జనరల్ మేనేజర్ జోయల్, జిల్లా పర్యటక శాఖ అధికారి శివాజీ, సాగర్ సీఐ వేణుగోపాల్ ఘనంగా స్వాగతం పలికారు. మలేషియా బౌద్ధమత సంస్థకు చెందిన గురువు షిన్ సింగ్ టింగ్ ఆధ్వర్యంలో 215మంది బౌద్ధబిక్షువులు, బౌద్ధగురువులు 10దేశాల నుండి సాగర్ సందర్శనకు వచ్చారు. తైవాన్, మలేషియా, హంకాంగ్, యూఎస్‌ఏ, ఇండోనేషియా, తాయిలాండ్, ఇంగ్లాండ్, సింగపూర్, చైనా, భారతదేశంలోని ప్రముఖ బౌద్ధ ప్రాంతాల నుండి బౌద్ధ ప్రతినిధులు సాగర్ సందర్శనకు వచ్చారు. తెలంగాణ టూరిజయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు బౌద్ధ ప్రాంతాలను వీరు సందర్శిస్తున్నారు. సాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్ట్‌లో బౌద్ధమత గ్రంథాలపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తైవాన్, మలేషియా దేశాల నుండి బౌద్ధమత గురువులు గతంలోనే బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధవనంలో వారు దేశాల తరుపున రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సముఖతను వ్యక్తం చేశారు. దానిలో భాగంగా ప్రపంచ బౌద్ధదేశాలు వారి వారి బౌద్ధ సంప్రదాయాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడానికి సందర్శనకు వచ్చారు. బుద్ధవనం చేరుకున్న ఈ బృందం మొదటగా బుద్ధవనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. అనంతరం బుద్ధచరితవనం, మహాస్థూపం, స్థూపవనం, జాతకవనం, ధ్యానవనాన్ని సందర్శించారు. అనంతరం వీరు విజయవిహార్ అతిథి గృహంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏర్పాటు చేసిన డాక్యూమెంటరీ చిత్రాన్ని వీక్షించారు. ఆపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూరిజం లాంచీలలో నాగార్జునకొండను చేరుకోని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ భద్రపరిచిన బుద్ధుని పాలరాతి శిల్పాలు, శిల్పఖండాలను ఆసక్తితో చూశారు. అనంతరం ప్రత్యేకంగా చూపించబడే బుద్ధుని దాతువుని పది ప్రపంచ దేశాల నుండి వచ్చిన బౌద్ధబిక్షువులు చూసి తమ జీవితం ధన్యమైందని అభిప్రాయపడ్డారు. అనంతరం నాగార్జునకొండపై ఉన్నటువంటి మహాస్థూపం, సింహాలవిహరాన్ని సందర్శించారు. వీరితో పాటు బుద్ధవనం డీఈ జగదీశ్, బుద్ధవనం డిజైన్ ఇన్‌చార్జి శ్యాంసుందర్, స్థానిక ఎస్‌ఐ శీనయ్య, గైడ్ సత్యనారాయణలు ఉన్నారు.