నల్గొండ

బాబు మోసాలకు నోబెల్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదన్న భయంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాజకీయ అక్కసుతో నిత్యం లేనిపోని విమర్శల జపం చేస్తున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఏపి ఎన్నికల్లో ఓటమిని తప్పించుకునేందుకు చంద్రబాబు కేసీఆర్‌ను బూచీగా చూపి ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్ రాజేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఏపీ సీఎంగా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం ప్రధాని మోదీ, వైఎస్.జగన్, సీఎం కేసీఆర్‌లు ఒక్కటేనంటు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా ఏపీ అభివృద్ధి ముందుకు నడిపించలేని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు బందర్ పోర్టుకు, కాకినాడ ఉక్కు ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తూ, దిక్కు దివానం లేని ప్రాజెక్టుకులకు కొబ్బరికాయలు కొడుతు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారం కోసం చంద్రబాబు తన జీవితంలో చేసిన చేస్తున్న మోసాలకు, కుట్రలకు ఆయనకు నోబెల్ ఇవ్వాలంటు గుత్తా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తమ ఫెడరల్ ఫ్రంట్‌ను బీజేపీ-కాంగ్రెస్‌లకు సమానదూరంగా కేంద్రంలో గుణాత్మక రాజకీయ, పాలన మార్పులకు, రాష్టల్ర హక్కుల సాధన లక్ష్యంతో ఏర్పాటు చేశారని చెప్పినప్పటికి చంద్రబాబు మాత్రం మోదీ, జగన్, కేసీఆర్‌లంతా ఒక్కటేనంటు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ముందుకుతీసుకెళ్లే క్రమంలో వైఎస్.జగన్‌తో టీఆర్‌ఎస్ చర్చలు జరిపినంతమాత్రన అంతా ఒక్కటేనంటు ప్రచారం సాగించడం, చేయని అభివృద్ధిని తన ప్రచార సాధనాల్లో వందలకోట్లు వెదజల్లి గొప్పగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లిన రాజకీయమన్నారు. తెలంగాణకు వచ్చింది..కేసీఆర్‌ను గిచ్చింది చంద్రబాబేనని అందుకు ఆయనకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తోడపాశం వంటి గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో మహాకూటమికి పట్టిన గతే ఏపీలో టీడీపీకి పడుతుందన్నారు. ఏపీ అభివృద్ధిలో విఫలమైన చంద్రబాబు తెలంగాణ కంటే అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుందని, పథకాలు మెరుగ్గా ఉన్నాయంటు పోల్చుకుంటు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దేశంలోనే అవినీతిలో ఏపి అన్ని రాష్ట్రాలకంటే ముందుండటమే చంద్రబాబు చేసిన అభివృద్ది అంటు గుత్తా చురకలేశారు. తెలంగాణ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రైతుబంధు పథకం కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. పీఎం కిసాన్ పథకం కంటే రైతుబంధు ఎన్నో రెట్లు మెరుగైందన్నారు. పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు అధికారికంగా రాష్ట్రానికి అందాకనే ఈ పథకం విధివిధానాలపైన, రైతుబంధు మార్పులపైన సీఎం కేసీఆర్ స్పందిస్తారన్నారు. మంత్రివర్గం విస్తరణ పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిధిలోని అంశమని తనకు మంత్రిపదవి వస్తుందో లేదో తనకు ఎంతమాత్రం తెలియదని దీనిపై నిర్ణయం సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మహిళా కోఆర్డీనేటర్ మాలే శరణ్యారెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అబ్బగాని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులు క్రీడల్లో రాణించాలి
ఎంజీ వర్సిటీ వీసీ అల్త్ఫా హుస్సేన్, కలెక్టర్, ఎస్పీలు
అట్టహాసంగా గురుకుల కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 8: గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, మహాత్మగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజాఅల్త్ఫా హుస్సేన్, ఎస్పీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం చర్లపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురుకుల మహిళా కళాశాలల మూడో రాష్టస్థ్రాయి క్రీడాపోటీలను వారు ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్ఫాస్ట్ అనంతరం వారు పోటీల్లో జట్టల సభ్యులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈసందర్భంగా వైస్ చాన్స్‌లర్ అల్త్ఫా హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో పోత్సహం అందిస్తుందన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా లభించే అవకాశాలు అందుకునేందుకు విద్యార్థినులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని 31 గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం హర్షణీయమన్నారు.
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు నల్లగొండలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థినులు చదువులతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా మానసిక, శారీరక వికాసంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందుకోవచ్చన్నారు. బలహీన వర్గాల నుండి వచ్చిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు జీవితంలో తాము ఎదుగడం ద్వారా ఇతరులకు మార్గదర్శకంగా నిలిచి మరింత మంది గురుకులాల్లో చదివేలా చూడాలన్నారు. బాలికల విద్య, అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ ఏ.వీ.రంగనాథ్ మాట్లాడుతూ విద్యార్థినులు క్రీడల్లో రాణించడం ద్వారా కానిస్టేబుల్స్, ఎస్‌ఐ వంటి దేహధారుడ్య పోటీలు అవసరమున్న ఉద్యోగాలతో పాటు క్రీడల ద్వారా ఉన్నత విద్యలో, ఉద్యోగాల సాధనలో మంచి ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల కార్యదర్శి రామలక్ష్మణ్, ప్రిన్సిపల్ జనార్దన్, ఉన్నత విద్య కార్యదర్శి మామిడాల శ్రవణ్‌కుమార్, మారుతిరావు, నరేందర్‌రెడ్డి, అరుణకుమారి, రాజరత్నంలు పాల్గొన్నారు.

శివన్నగూడెం నిర్వాసితులకు
ప్యాకేజీ పెంపునకు కృషి

నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 8: డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోతున్న నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు మాననీయ కోణంలో పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపుకు కృషి చేస్తానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో మర్రిగూడ మండలంలో శివన్నగూడెం రిజర్వాయర్ వలన భూములు కోల్పోతున్న రైతులతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పరిహార నర్ణయంపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, దేవరకొండ ఆర్డీవో లింగ్యా నాయక్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ సాయిరాంతో సమావేశమై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని భూపరిహారం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పెంచాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి వివరాలు సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ సూపరిండెంట్ తబిత, ఏఎంఆర్‌పీ యూనిట్-4, సాగునీటి పారుదల అధికారులు పాల్గొన్నారు.

విధుల పట్ల అలసత్వం సహించం
జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ అధికారి పరిపూర్ణచారి
మోత్కూర్, ఫిబ్రవరి 8: వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అధికారి డాక్టర్ పరిపూర్ణ చారి అన్నారు. శుక్రవారం మోత్కూర్ పీహెచ్‌సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. ఆసుపత్రిలో ప్రసవాల పట్ల దృష్టి సారించాలని సాధారణ ప్రసవాలపై దృష్టి కేంద్రీకరించాలని వ్యాధి నిరోదక టీకాల కార్యక్రమం గ్రామ సమగ్ర ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. అనంతరం మోత్కూర్ పీహెచ్‌సీ పరిధిలో 12మంది మహిళలను ట్యూబెక్టమి శస్త్ర చికిత్సలను స్వయంగా ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ పీహెచ్‌సీ వైద్య అధికారులు రేష్మ, జ్యోతి, ఫార్మసిస్ట్ చింతల సత్యనారాయణరెడ్డి, నాగరాజు తదతరులు పాల్గొన్నారు.

చెర్వుగట్టు దేవాలయానికి పాలక వర్గం
* చైర్మన్‌గా రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 8: తెలంగాణ శైవ క్షత్రంగా ప్రసిద్ధికెక్కిన చెర్వుగట్టు దేవాలయానికి ప్రభుత్వం పాలక వర్గాన్ని నియమించింది. 10వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో హడావిడిగా ప్రభుత్వం పాలక వర్గాన్ని నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయలని అభివృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తుండగా అందులో భాగంగా ముఖ్యమంత్రి దృష్టి సాధించిన చెర్వుగట్టుకు పాలక వర్గాన్ని నియమించాలని సంకల్పించారు. పరిపాలన అనుభావాలు ఉన్న నేతలతో కూడిన 14మంది సభ్యులతో కూడిన నియామక ఉత్తర్వులను శుక్రవారం వెలవరించింది. నార్కట్‌పల్లి ఎంపీపీగా కొనసాగుతున్న రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డితో పాటు 13మంది సభ్యులను నియమించింది. పొల్లోజు శ్రీనివాస్, గౌరికార్ శ్రీను, గడ్డం పశుపతి, నాంపల్లి శ్రీనివాస్, ఎం. పద్మ, వనం శంకర్, యామా దయాకర్, కలుకు సహాని, రాధారపు విజయలక్ష్మి, సీ. యదయ్య, మని నర్సింహ, జీ. సైదులు, పీ. నర్సిరెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక చైర్మన్‌గా రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి ఎన్నిక కావడం లాంచనమే. చెర్వుగట్టు పుణ్యక్షేత్రం శ్రీశైలం తరహాలో అభివృద్ధి అవుతున్న నేపధ్యంలో పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమించడం పట్ల మండల ప్రజల్లో, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ అవినీతి విధానాన్ని ఎండగట్టాలి
డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్
ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 8: టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అండగట్టాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హల్‌లో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీ ఆర్ ఎస్ మద్యానికి ప్రజలకు ప్రలోభపెట్టి గద్దె ఎక్కిందని ఆరోపించారు. టీ ఆర్ ఎస్ చేసిన సంక్షేమ పథకాలు అధికారులతో పనులు అవుతాయని నిరుత్సాహ పడొద్దని ఆయన పేర్కొన్నారు. అనంతరం వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా జే. నగేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్. సిద్దులు, ఎంపీటీసీ నర్సింహాచారి, యాస లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మిర్యాల శేఖర్‌రెడ్డి, గెలుపొందిన సర్పంచ్‌లను సన్మానించారు.

అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా ఒకే విధంగా ఉండాలి
* పైప్‌లైన్లు పగులకొడితే కఠిన చర్యలు తీసుకోవాలి
* మిషన్ భగీరధ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 8: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్చమైన మంచినీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూపొందించిన మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు సరిపడా ఒకేవిధంగా మంచినీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్ అధ్యక్షతన జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ భగీరథ పథకం కింద మొదటి గ్రామానికి, చివరి గ్రామానికి తాగునీటి సరఫరా ఒకే రకంగా ఉండేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 242 ఆవాసాలలో ఈ పథకం పనులు కొనసాగుతుండగా 234 ఆవాసాలకు నీటి సరఫరా చేయనన్నట్లు అధికారులు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్) మండలం దాచారం-కూడలి రోడ్ల విస్తరణలో పైప్‌లైన్ ధ్వంసమైనందున ధరావత్‌తండ, గుండ్లకుంటతండ, శెట్టిగూడెం, ఆస్లాం తండాలలో నీటి సరఫరాలో అంతరాయం కలిగినట్లు అధికారులు వివరించారు. సూర్యాపేట మండల పరిధిలో పనులు తుది దశలో ఉన్నాయని, వెదిరవారిగూడెంలో మాత్రం పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెన్‌పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో వ్యవసాయ భూముల్లో పైప్‌లైన్ ధ్వంసం కావడం వల్ల ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు. కొన్నిచోట్ల భగీరథ పైప్‌లైన్లను కొందరు పగుల గొడుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించిన ఆయన పైప్‌లైన్ పగులకొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని పైప్‌లైన్ల ద్వారా తీసుకవచ్చి ఇంటింటికీ అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఎవరు గండికొట్టిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా కొన్నిచోట్ల ఈ పథకం పనుల్లో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రస్తావించగా ఆయా గ్రామాల్లో విద్యుత్ శాఖ సిబ్బందితోపాటు స్థానిక సర్పంచ్‌లు సమన్వయంతో ముందుకు సాగి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అధికారులు పనులు వేగవంతంచేసి సాధ్యమైనంత త్వరలో అన్ని గ్రామాలకు నీటిని అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రయ్య, మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్‌ఈ సుభాష్‌నందరెడ్డి, ఈఈ వెంకటేశ్వర్లు, ఇంట్రా ఎస్‌ఈ లలిత్, ఈఈ మోహన్‌రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.