నల్గొండ

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పోటీతత్వంతో అభివృద్ధిలో రాణించాలి
* యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 22: గ్రామాలను అభివృద్ధి చేసి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలపాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ నూతన సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద గ్రామీణ సంస్థలో నూతన సర్పంచ్‌లకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేసి మంచిపేరు తెచ్చుకోవాలని పోటీతత్వంతో అభివృద్ధిలో రాణించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో క్షేత్ర స్థాయిలో సర్పంచ్‌లు కీలక పాత్ర వహించాలన్నారు. గ్రామాభివృద్ధికి కావాల్సిన వనరుల గుర్తింపు చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే పాలన సులభతరంగా ఉంటుందన్నారు. గ్రామాలను హరితహారంగా తీర్చిదిద్దేందుకు ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా సర్పంచ్‌లు కృషి చేయాలని ఆమె కోరారు. గ్రామంలో వౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి, సంక్షేమ పతకాలు అర్హులందరికి అందేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో భిక్షం, రామానంద సంస్థ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, ఎంపీడీవోలు నాగిరెడ్డి, ఉమాదేవి, సరిత, ఈవోఆర్‌డీ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా నారసింహుని నిత్యారాధనలు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అర్చించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవోత్సవం నిర్వహించారు.

కామ్రేడ్ రంగన్న ఆశయాలు సాధిద్దాం
సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి

చౌటుప్పల్, ఫిబ్రవరి 22: కామ్రేడ్ కందాల రంగారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో కందాల రంగారెడ్డి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగన్న స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ముఖ్య అతిథిగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఈ ప్రాం తంలో కులవృత్తులు, పేదల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలను నిర్మించిన మహావ్యక్తి రంగారెడ్డి అని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ఏకం చేసి ప్రజల కోసం పని చేసే వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అదేవిధంగా చౌటుప్పల్‌లో పార్టీ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి వర్ధింతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమాలలో మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, నాయకులు చింతల భూపాల్‌రెడ్డి, సుర్కంటి వెంకట్‌రెడ్డి, ఎం.డీ.పాషా, కీసరి నర్సిరెడ్డి, జక్కిడి రాంరెడ్డి, కందాల రవీందర్‌రెడ్డి, గంగదేవి సైదులు, జక్కిడి గోపాల్‌రెడ్డి, ఆనగంటి వెంకటేశం, బండారు నరసింహా, జక్కిడి రాంరెడ్డి, గోశిక కరుణాకర్, బత్తుల దాసు, పర్నె ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం.. సాగుబాటల మేళవింపు.. బడ్జెట్
ప్రగతిదాయకమన్న టీఆర్‌ఎస్
కేటాయింపుల గారడీగా అభివర్ణించిన విపక్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 22: సీఎం కేసీఆర్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2019-20ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ సంక్షేమం, సాగు రంగాల మేళవింపుగా సాగడంతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో, ఆశావహుల్లో బడ్జెట్ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తమవుతుంది. అయితే కేసీఆర్ బడ్జెట్ ప్రతిపాదనలన్ని కాగితాలపై కేటాయింపుల లెక్కలేనని, గతంలో చేసిన హామీలతో పాటు ఇటీవల ఎన్నికల్లో చేసిన హామీల అమలు దిశగా నిధుల సమీకరణపై స్పష్టత లేదన్న విమర్శలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆసరా పింఛన్ల రెట్టింపు, వయసు 57ఏళ్లకు కుదింపు చేయడం పట్ల లబ్ధిదారులకు ఆనందం కల్గించింది. తద్వారా జిల్లాలోని పాత లబ్దిదారులతో పాటు కొత్తగా అర్హత ఉన్న వారితో కలిపి 4లక్షల మంది వరకు మేలు జరుగనుంది. వృద్ధులు, వితంతు, బీడీ కార్మికుల వేయి రూపాయల పింఛన్‌ను 2016రూపాయలకు, దివ్యాంగుల పింఛన్‌ను 1500నుండి 3016కు పెంచుతు బడ్జెట్‌లో 12067కోట్ల నిధుల కేటాయింపు చేయడం పట్ల వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సబ్సిడీ బియ్యం పథకానికి 2,744కోట్లు, కల్యాణలక్ష్మికి 1450కోట్లు ప్రతిపాదనతో లబ్ధిదారులకు పథకాల కొనసాగింపుపై ప్రభుత్వం ధీమానిచ్చింది. నిరుద్యోగులకు ప్రతినెల 3016 భృతి అందించేందుకు ఈ బడ్జెట్‌లో 1,810కోట్లు కేటాయించడంపై నిరుద్యోగుల్లో సానుకూలత ఉన్నా మార్గదర్శకాలు ప్రకటించకపోవడంతో వారిలో ఆయోమయానికి కారణమైంది. విద్యారంగానికి సంబంధించి 119కొత్త బీసీ రెసిడెన్షియల్స్ ప్రకటన మినహా డీఎస్పీ ప్రకటన, లక్ష ఉద్యోగాల భర్తీ ఊసు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. ఎస్సీల సంక్షేమానికి 16,581కోట్లు, ఎస్టీలకు 9,827కోట్లు, మైనార్టీలకు 2,004కోట్లు కేటాయించడం బాగానే ఉన్న గతంలో మాదిరిగా కేటాయింపులపై పరిమితమైతే ప్రయోజనం లేదన్న విమర్శలు విపక్షాల నుండి వినిపించాయి.
వ్యవసాయ రంగానికి సంబంధించి 20,107 కోట్ల కేటాయింపులు చేసిన సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మేరకు 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి ఇందుకు ఈ బడ్జెట్‌లో 6వేల కోట్లు ప్రతిపాదించడంతో రుణమాఫీపై రైతుల్లో ప్రభుత్వం నమ్మకం కల్పించినట్లయ్యింది. రుణమాఫీ పరిధిలోని 4లక్షల మంది రైతులకు లబ్ధి కల్గనుంది. అలాగే రైతుబంధు పథకం సహాయం ఎకరాకు పంటకు 4వేల నుండి 5వేలకు పెంచుతూ ఈ బడ్జెట్‌లో 12వేల కోట్లు కేటాయించడం ఉమ్మడి జిల్లా పరిధిలోని 6.10లక్షల మంది రైతులకు మరింత లబ్ధి చేకూర్చనుంది. రైతుబీమా కొనసాగింపు ఈ ఏడాది ప్రీమీయం కూడా 650కోట్లు కేటాయించడం ఉమ్మడి జిల్లా రైతులకు మేలు చేయనుంది. ధరణి వెబ్‌సైట్ సేవల ప్రారంభం, పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనల నేపధ్యంలో జిల్లా రైతాంగానికి భారీగా ప్రయోజనం చేకూరనుంది. మిషన్ కాకతీయకు, కాల్వలు, చెరువుల పునరుద్ధరణకు ఈ బడ్జెట్‌లో సైతం 22,500కోట్ల నిధులు కేటాయించడంతో మూడు, నాల్గో విడతల్లో అసంపూర్తిగా ఉన్న జిల్లాలోని చెరువుల పనుల్లో ముందడుగు పడనుంది. అయితే కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యానికి అనుగుణంగా కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకాలతో పాటు అన్ని ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల వారిగా కేటాయింపులను బడ్జెట్‌లో ప్రకటించకపోవడంతో నిధుల మంజూరుపై స్పష్టత కొరవడింది. అలాగే సబ్సిడీ గొర్రెలు, చేప పిల్లల పంపిణీకి సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూపకపోవడం గందరగోళానికి తావిచ్చింది. చేనేతకు కొత్తగా ఎలాంటి పథకాలు లేకపోవడం లోటుగా కనిపించగా, ఎంబీసీ కార్పొరేషన్‌కు వెయ్య కోట్లు ఆ వర్గాలకు ఊరటగా ఉంది. విద్యుత్ రంగానికి కేటాయింపులపై స్పష్టత లేకపోవడంతో జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని 16,800 ఇళ్ల నిర్మాణం నిధుల మంజూరుపై లబ్ధిదారులను నిరాశ కల్గించింది. కేసీఆర్ కిట్, కంటి వెలుగుకు తోడుగా ఈఎన్‌టీ-దంత పరీక్షలు చేపడుతామని చెబుతు ప్రజారోగ్యానికి 5,536కోట్లు ప్రకటించడం జిల్లాలోని పేదలకు మేలు చేయనుంది. పంచాయతీలకు కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం నిధులివ్వాలని బడ్జెట్‌లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పంచాయతీల పాలనను బలోపేతం చేసేదిగా కనిపించింది.
సంక్షేమ బడ్జెట్: టీఆర్‌ఎస్ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు పాశం రాంరెడ్డి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దేశంలోనే తెలంగాణను సంక్షేమ రంగంలో నెంబర్‌వన్‌గా మరోసారి చాటిందని టీఆర్‌ఎస్ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు పాశం రాంరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు రైతుబంధు పథకం ఎకరాకు ఐదువేలకు పెంచుతు, ఆసరా పింఛన్‌లను రెట్టింపు చేస్తు, నిరుద్యోగులకు 3016్భృతి ప్రకటిస్తు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత భరోసా పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం 17.17శాతం పెరిగి దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం, జీఎన్‌డీపీ వృద్ధి రేటు 4.2శాతం నుండి 14.3శాతానికి చేరిన తీరు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి నిదర్శనమన్నారు.
కేటాయింపులతో మోసం: డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్
సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అమలుల్లో పథకాలకు సంబంధించి కావాల్సిన నిధులకు బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతన లేదని, కేటాయింపులతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత బడ్జెట్‌లోను ఇదే తరహాలో కేటాయింపులు చేసి నిధుల ఖర్చు మాత్రం చేయలేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు, పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపని తీరు ప్రభుత్వ దాటవేత వైఖరికి నిదర్శనమన్నారు. మాటల గారడీతో ప్రజలను బురిడి కొట్టించే కేసీఆర్ ఈ దఫా బడ్జెట్‌లో కేటాయింపుల లెక్కలతో మరోసారి ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేశారన్నారు.
అప్పులు చూపలేదు: సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన లక్ష 82వేల కోట్ల బడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల కోసం చేసిన వేలకోట్ల అప్పులు పేర్కొనకుండా ప్రజలను వృద్ధిరేటు లెక్కల పేరుతో మభ్యపెట్టారని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మెడికల్ కళాశాలలకు, డబుల్ బెడ్‌రూమ్, మిషన్ భగీరథ పథకాలకు నిధులు కేటాయింపులు కనిపించలేదని, లక్ష ఉద్యోగాల భర్తీ, కేజీ టూ పీజి ఉచిత విద్య, డిఎస్సీ భర్తీపై ప్రకటనలు లేకపోవడం విచారకరమన్నారు.
కేంద్ర పథకాల నిధులతోనే గొప్పలు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల
కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో అమలవుతున్న పథకాలకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అరకొర కేటాయింపులను కలిపి సంక్షేమ పథకాల ఘనత తన ప్రభుత్వానిదేనంటు సీఎం కేసీఆర్ బడ్జెట్ లెక్కలతో మరోసారి తన గారడి ప్రదర్శించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి విమర్శించారు. ఆసరా పింఛన్ల రెట్టింపు, కేసీఆర్ కిట్, పంచాయతీలకు నిధులు, వ్యవసాయ కేటాయింపుల పెంపు వంటివన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతోనే సాధ్యంకానున్నాయన్నారు.

మన పథకాలు ప్రపంచానికి ఆదర్శం
* మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మత్స్యశాఖ, వెనుకబడిన అభివృద్ధి శాఖ సమీకృత మత్స్య పథకం ద్వారా లబ్ధిదారులకు ఐఎస్‌బీ సెక్టార్ కింద చెక్కులను, వలలు, వాహనాలను ఆయన పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో కూడిన ఉత్తమ పాలన ఏవిధంగా ఉంటుందో సీఎం కేసీఆర్ ఆచరించి చూపించాడన్నారు. కేసీఆర్ ఆలోచనలు పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మరుగున పడుతున్న గ్రామీణ కులవృత్తులు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. సంచార జాతులు కూడా ఆత్మగౌరవంతో బతికేలా ఎంబీసీ కార్పొరేషన్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
22ఎస్‌యుఆర్ 11: మంత్రి జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మండల నాయకులు
మంత్రికి శుభాకాంక్షలు
నూతనకల్: రెండవసారి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని శుక్రవారం నూతనకల్ మండల నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మండలాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు కందాల దామోదర్‌రెడ్డి, పన్నాల సైదిరెడ్డి, కె.సునీతావెంకన్న, బిక్కి బుచ్చయ్య, కృష్ణప్రసాద్, లింగారెడ్డి, రాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన అందించకపోతే చర్యలు
సంక్షేమ హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 22: సంక్షేమ హాస్టల్స్‌లో వసతుల కల్పనకు సంబంధించి ప్రభుత్వం నుండి అందే అన్ని వసతులు విద్యార్థులకు అందేలా చూడాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల విద్యార్ధి హాస్టల్స్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసి మెనూ మేరకు భోజన వసతి సమకూరుతుందా? లేదా?, ఇతర సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన వసతులన్ని సమకూర్చాలని, క్రీడాసామాగ్రి అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాలికల పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని సందర్శించి ఆహారాన్ని తయారుచేసే సిబ్బందిని మార్చాలని ఆదేశించారు. హాస్టల్‌కు డాక్టర్‌ను, నర్స్‌ను అటాచ్ చేయాలని ఆదేశించారు. మెనూ మేరకు భోజనం నాణ్యతగా అందించకపోతే చర్యలు తప్పవన్నారు. అనంతరం రామగిరిలోని ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. భోజన నాణ్యత రుచి చూశారు. ఆకయితాలతో ఎదురవుతున్న న్యూసెన్స్‌పై చర్యలు చేపట్టాలని, షీటీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ చర్యలు చేపడుతానన్నారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ డీడీ రాజ్‌కుమార్, గిరిజన సంక్షేమ అధికారి నారాయణస్వామి, బీసీ సంక్షేమాధికారి ఎస్.ఎస్.కుమారిలు ఉన్నారు.

సంక్షేమ పథకాలకు పెద్దపీట
* ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఆలేరు, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఎంబీసీ కులాల 44మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చెక్కులను, చేనేత సహకార సంఘం కార్యాలయంలో 154 మంది లబ్ధిదారులకు 58లక్షల రుణమాఫీ చెక్కులను ఆమె అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను పేద లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూర్య, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీటీసీలు రవి, మురళి, కిష్టయ్య, ఆనంద్, ఎంపీడీవో హనుమంత ప్రసాద్, ఈవోపీఆర్‌డీ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి
8 లక్షల మంది వచ్చినా సరిపడా ఏర్పాట్లు
* మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 22: సూర్యాపేట సమీపంలోని చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పెద్దగట్టు వద్ద జాతరకు చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, రోజుకు 8 లక్షల మంది భక్తులు వచ్చినా వారికి సరిపడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ, విద్యుత్, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక విభాగాలను సిద్ధం చేశామన్నారు. సమైక్య రాష్ట్రంలో పెద్దగట్టుకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంతో కనీస సౌకర్యాలు లేక భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నాటి సమైక్య పాలకులు దృష్టికి ఎన్నిసార్లు జాతర అభివృద్ధి గురించి అనేకమార్లు తీసుకెళ్లినా వారి నుంచి కనీస స్పందన లభించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతర ప్రాధాన్యతను గుర్తించి కోట్ల రూపాయలు విడుదలచేసి వౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ జాతరకు కూడా ప్రభుత్వం రూ.1.70 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పించిన వసతులను భక్తులు సద్వినియోగం చేసుకుని జాతరను సంబరంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

గురుకుల పాఠశాలను పరిశీలించిన
ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్
పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 22: మండలంలోని అంగిపేట ఎక్స్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. ఈసందర్భంగా నూతన భవనాన్ని పరిశీలించి పలు వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
స్వచ్ఛ్భారత్-2019 అవార్డు ప్రజలకే అకింతం
* మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక
సూర్యాపేట, ఫిబ్రవరి 22: సూర్యాపేట పురపాలక సంఘం జాతీయ స్థాయిలో స్వచ్ఛ్భారత్ 2019 అవార్డును కైవసం చేసుకున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక తెలిపారు. ఈసందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ సోమవారం న్యూఢిల్లీలో జరిగనే కార్యక్రమంలో స్వచ్ఛ్భారత్-2019 అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పురపాలక సంఘం నిర్వహించిన పారుశుద్ధ్య నిర్వహణ విధానంపై జాతీయ స్థాయిలో జరుగుతున్న స్కోచ్-56 సమీకృత పరిపూర్ణ పారిశుద్ధ్యంపై జరిగిన కార్యక్రమంలో నామినేషన్ దాఖలు పరిచి నియమ నిబంధనలకు లోబడి చేసిన కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణపై ఈ అవార్డును సూర్యాపేట మున్సిపాలిటికి రావడం జరిగిందన్నారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన పట్టణ ప్రజలకు, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారం, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలను ప్రశాంతంగా జరపాలి
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 22: రానున్న లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఉండాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా నోడల్ అధికారులకు, ఆర్డీఓలకు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్‌లకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్‌కు సంబంధించి నియోజకవర్గ అధికారులు పూర్తి సమన్వయ సహకారాలతో బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రణాళికలో అధికారులు తమ అనుభవంతో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో గత ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలపై, లోటు పాట్లపై సూచనలు, సలహాలు అందజేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, వీవీ ప్యాట్‌ల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, కొత్త పోలింగ్ స్టేషన్‌లలో కనీస సౌకర్యాలు కల్పించడం, పోలింగ్ స్టేషన్ పేరు, లోకేషన్ మర్పులు ముందుగానే తెలియజేయాలని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ కోటేశ్వర్, మాస్టర్ నాగార్జున, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా నోడల్ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పౌర సంబంధిత అధికారి శ్రీనివాస్, ఐబీ ఈఈ సత్యశీల్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్ పరమేశ్‌లు సలహాలు, సూచనలు వివరించారు. ఈ సమావేశంలో శిక్షణా నోడల్ అధికారులు గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, జిల్లా విద్యా శాఖాధికారి సరోజినీ, ఆర్‌డీవోలు లింగ్యా నాయక్, జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.