నల్గొండ

న్యాయం కోసం ఓ యువతి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, ఫిబ్రవరి 24: ప్రేమించిన యువకుడు పెళ్లి నిరాకరించడంతో ప్రియుని ఇంటిముందు యువతి నిరసన చేపట్టిన సంఘటన మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వీరమల్ల ప్రసన్న అదే గ్రామానికి చెందిన యువకుడు రేపాక గణేష్‌ల మధ్య నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ క్రమంలో యువతికి పలుమార్లు పెళ్లిసంబంధాలు వచ్చిన నిరాకరించింది. గత ఆరునెలలుగా ప్రసన్న కుటుంబ సభ్యులు కూడ ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకపోవడం వల్ల ప్రియుడు గణేష్ తనను దూరం పెట్టడంతో పాటు మరోయువతితో వివాహం నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ప్రసన్న తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ గణేష్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రసన్న తనకు ప్రియురాలు కాదని సోదరితో సమానమని పెళ్లికి నిరాకరించి మొండికేయడంతో ఆదివారం ఉదయం నుండి యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు మహిళలు గణేష్ ఇంటిముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తనను ప్రేమించి మోసం చేసిన యువకునితో తనకు పెళ్లి జరిపించాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సైదులు తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని ప్రసన్నకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రసన్న పట్టుబట్టి బైఠాయించడంతో పోలీసులు గణేష్‌ను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హరిత హారానికి
వన నర్సరీలు..!
* గ్రామపంచాయతీలకు బాధ్యతలు

నల్లగొండ, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన హరిత హారం విజయవంతం దిశగా గ్రామాల్లో వన నర్సరీల ఏర్పాటుతో కోట్లాది మొక్కలు ఏటా ప్రజలకు అందించేందుకు సిద్ధం చేసే బాధ్యతలను నూతన పంచాయతీరాజ్ చట్టం మేరకు గ్రామ పంచాయతీలకు అప్పగించగా గ్రామాల్లో వన నర్సరీల ఏర్పాటు వేగవంతంగా సాగుతుంది. తెలంగాణలో అటవీ విస్తీర్ణత శాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోంటుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడవుల పరిరక్షణకు చట్టాలను పటిష్టం చేయడం, చట్టపరంగా కలప రవాణపై కఠిన వైఖరి అనుసరించడంతో పాటు హరిత హారం లక్ష్యాల సాధనకు గ్రామ నర్సరీలను ప్రొత్సహిస్తుంది. ఏటా ఒక్కో మేజర్ పంచాయతీ పరిధిలో స్థానిక నర్సరీ ద్వారా 40వేల మొక్కలు పెంచి పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ పాలక వర్గాలపై పెట్టింది. గతంలో హరిత హారం నర్సరీలు, మొక్కలు పెంపకం గ్రామీణాభివృద్ధిశాఖ, సామాజిక, అటవీ శాఖల ఆధ్వర్యంలో రెండు మూడు గ్రామాలకు ఒక నర్సరీ ఏర్పాటు చేసి పంచాయతీలకు అవసరమైన మొక్కలు సరఫరా చేశారు. వాటి పెంపకం బాధ్యతలను వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పంచాయతీలు పర్యవేక్షించేవి. నూతన పంచాయతీరాజ్ చట్టం మేరకు హరిత హారం కార్యక్రమాల బాధ్యతలను ప్రభుత్వం గ్రామ పంచయతీలకు అప్పగించింది.
నల్లగొండ జిల్లాలో ఐదో విడత హరిత హారం దిశగా 563గ్రామ పంచాయతీ నర్సరీలను గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20రకాల 4.5కోట్ల మొక్కలను పెంచే పనులు గ్రామ నర్సరీల్లో ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా పరిధిలో 475గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేపట్టారు. ఈ జిల్లాలో 2కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో కోటిన్నర మొక్కల పెంపకం దిశగా 375నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లోని ఒక్కో పంచాయతీ నర్సరీలో ఏటా 40వేల నుండి లక్ష మొక్కలను పెంచేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించారు. దీంతో కొత్త పాలక వర్గాలు రానున్న వర్షాకాలంలో తమకు ఎదురయ్యే హరిత హారం లక్ష్యాల సవాళ్లను ఎదుర్కోనేందుకు ముందస్తు కసరత్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు అవసరమయ్యే పండ్ల మొక్కలతో పాటు రోడ్లు, ఖాళీ స్థలాల్లో నాటేందుకు నీడనిచ్చే భారీ వృక్ష జాతుల మొక్కలను సైతం నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే చిన్న పంచాయతీల్లో, తండాల పంచాయతీల్లో వన నర్సరీల నిర్వాహణ, మొక్కల పెంపకం ఆశించిన స్థాయిలో సాగడం ప్రశ్నాకర్ధకంగా కనిపిస్తుంది.
మోగిన గొల్లగట్టు నగారా
సూర్యాపేట, ఫిబ్రవరి 24: తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర ఆదివారం కన్నుల పండువగా ప్రారంభమైంది. గొల్లగట్టు జాతర నగారా మ్రోగడంతో భక్తుల సందడి గంటగంటకు అధికమవుతోంది. భక్తులు లింగా...ఓ...లింగా అంటూ డప్పుల మోతలు, భేరీలు, నృత్యాలతో జాతరకు తరలివచ్చారు. సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామంలోని మోదుగు నర్సింహ్మారెడ్డి ఇంటి నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో గట్టుకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఊరేగింపులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులంతా వివిధ వాహనాల్లో పెద్దగట్టుకు చేరుకున్నారు. దీంతో గట్టవద్ద గంటగంటకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో దేవాలయం వద్ద క్యూలైన్ పెరుగుతోంది. గట్టు ప్రాంతమంత భక్తులతో కిక్కిరిసిపోతోంది. జాతరకు వచ్చిన భక్తులు గుట్టపైన ఉన్న గుండం, గుట్టకింద నూతనంగా నిర్మించిన కోనేరులో స్నానమాచరించారు. లింగన్న మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు గొర్రెపిల్లలు, బోనాలు, గంపలతో తరలివచ్చారు. బలి ఇచ్చే గొర్రెలను ఆలయం చుట్టు తిప్పి సోమవారం తెల్లవారుజామున బలి ఇవ్వనున్నారు. యాదవులు సంప్రదాయ గజ్జెల లాగులు ధరించి కటారులు చేతభూని భక్తి పారవశ్యంతో నృత్యాలు చేసుకుంటూ లింగమంతుల స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గుట్టపై ఉన్న పుట్టకు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై ఉన్న చెట్టుకు ముడుపులు కడుతున్నారు. జాతరకు వచ్చిన మహిళలు పూనకం ఊగుతూ భక్తిని చాటుతున్నారు. గుట్ట పరిసరాల్లో భారీగా దుకాణాలు వెలిశాయి. మహిళలకు గాజులు, చిన్న పిల్లలలకు బొమ్మలు, మిఠాయి దుకాణాలు, హోటళ్లు వెలవడంతో జాతర జరిగే ప్రాంతమంతా సందడిగా మారింది. ఇక జాతరకు వచ్చే భక్తుల ఆహ్లాదం కోసం మూడు జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్‌లు, కొలంబస్‌లు, సర్కస్‌లు సైతం ఏర్పాటయ్యాయి. లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నందున అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ అమయ్‌కుమార్, జెసి సంజీవరెడ్డి గుట్టవద్ద ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 1200మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. గుట్టపైన, కింద భాగంలో పోలీస్ కంట్రోల్‌రూంలను ఏర్పాటుచేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు గుట్ట పరిసరాలను శుభ్రం చేసి బ్లీచింగ్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధులు ప్రబలకుండా భక్తులకు మాస్క్‌లను సైతం అందజేస్తున్నారు. ఐదు ప్రాంతాల్లో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా రెండు అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాన్ని సైతం అందుబాటులో ఉంచారు. సూర్యాపేట నుండి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్‌పల్లి వరకు ఐదునిమిషాలకోకటి చొప్పున ఆర్టీసి బస్సులను ఏర్పాటుచేశారు. జాతీయ రహదారి పక్కనే జాతర జరుగనున్నందున హైవేపై వాహనాల రాకపోకలను మళ్లీంచి ట్రాపిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. జాతర జరిగే దురాజ్‌పల్లి గుట్ట చుట్టూ మూడుచోట్ల భారీ ఎల్‌ఈడీ స్క్రిలను ఏర్పాటుచేసి జాతర దృశ్యాలను ఎప్పటికప్పుడు ప్రజలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రాక అధికమవుతుండటంతో పెద్దగట్టు జనగట్టుగా దర్శనిమిస్తోంది. ఆదివారం రాత్రి లింగమంతుల స్వామిని నాగార్జున్‌సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహామయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మిర్యాలగూడ వాసికి ఉత్తమ
లఘు చిత్ర దర్శక, నిర్మాత అవార్డు
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 24: అస్థిత్వం-2019 రాష్ట్ర స్థాయి అవార్డును మిర్యాలగూడ వాసి ప్రముఖ లఘుచిత్ర నిర్మాత, దర్శకుడు సయ్యద్‌కలీంకు ఆదివారం హైద్రాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అందజేశారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. రోడ్డు ప్రమాదాలపై ఇట్స్ నాట్ జస్ట్ లఘుచిత్రానికి ఉత్తమ దర్శకత్వం, నిర్మాతగా ఎంపిక చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అమాయక ప్రజలు ఎలా చనిపోతున్నారు, వాటిని నివారణ చర్యలపై నిర్మించిన లఘు చిత్రంకు అస్థిత్వ సాంస్కృతిక సంస్థ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక సంస్థ అవార్డు ప్రకటించింది. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేసేలా, సంపూర్ణ స్థాయిలో అమలు జరిగేలా స్ఫూర్తినిచ్చే స్వచ్ఛ భారత్ లఘు చిత్రాన్ని కూడ కలీం నిర్మించారు. అదే విధంగా మూఢ నమ్మకాలపై నిజం అనే లఘు చిత్రాన్ని కూడ నిర్మించారు. ఆయన నిర్మించిన పలు లఘు చిత్రాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. కలీంకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం ప్రకటించారు.
పెద్దగట్టు జాతరకు
సరిపడా ఏర్పాట్లు
* జాయంట్ కలెక్టర్ సంజీవరెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 24: దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం దురాజ్‌పల్లిలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సింహాద్వారం నుండి మొదలుకొని గుట్టపైన, గుట్ట కింద చుట్టూ ప్రాంతాలను కలియ తిరిగి చేపట్టిన ఏర్పాట్లు, స్టాళ్లు, వైద్య శిభిరాలు, కోనేరు, మంచినీటి నల్లాలు, మరుగుదోడ్లు, స్నానాలగదులను పరిశీలించారు. గుట్టకింద కోనేరులో నీటిని నింపేందుకు మోటార్‌ను ఆన్‌చేశారు. చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతరకు తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖలను సమన్వయపరిచి ఏర్పాట్లు చేపట్టామన్నారు. పారిశుద్యం, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యతనిచ్చి తగిన విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులు అధికారులు, పోలీసు సిబ్బంది ఆదేశాలు, సూచనలు పాటించి ప్రశాంతంగా జాతర జరిగేలా సహకరించాలని కోరారు.
ఆదివారం ఆటవిడుపే..
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 24: ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో తమ స్నేహితులతో గోళీలాట, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు బంద్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల చిన్నారులు క్రికెట్, వీల్ చైర్ తదితర ఆటపాటలతో గడిపారు. సాయంత్రం వేళల్లో చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి పార్కులకు వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. ఎండాకాలం అసలు సీజన్ కాకముందే ఎండలు దంచుతుండడంతో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు తమ చిన్నారులు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చూస్తున్నారు.