నల్గొండ

దినదిన గండంగా హుజూర్‌నగర్ నీటి సరఫరా పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మార్చి 1: హుజూర్‌నగర్ పట్టణానికి మంచినీటి సరపరా ఇంకా వేసవి కాలం రాకముందే దిన దిన గండంగా మారింది. పట్టణానికి మంచినీరు అందించే మట్టపల్లి వద్ద గల కృష్ణా జలాల పథకం ద్వారా గత ఏడాది కాలంగా గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం వారు సరఫరా చేయటం లేదు. గతంలో హుజూర్‌నగర్ నుండి మట్టపల్లి వెళ్లే రహదారిలో కల్వర్టుల నిర్మాణం వల్ల పైప్‌లైన్ పగిలి నీరు సరఫరా చేయటం లేదని మున్సిపల్ విభాగం వారు చెప్పగా కల్వర్టుల నిర్మాణం పూర్తి జరిగి 6 నెలలు దాటినా నీరు సరఫరా నిలిపివేశారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖకు రూ.80 లక్షల వరకు బాకీ ఉండటంతో నీటి సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. దీనితో ఏడాది కాలంగా 1974లో చిలుకూరు మండలం బేతవోలు చెరువు కింద ఉన్న బావి నుండి హుజూర్‌నగర్ పంచాయతీ కార్యాలయం వరకు ఉన్న పైప్‌లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఇవి ప్రజలు తాగటానికి ఉపయోగపడే నీరు కాకపోవటంతో పట్టణ ప్రజలు 100 శాతం కూడా ఆటోల ద్వారా ఇంటి ముందుకు వచ్చి అమ్మకం చేసే మంచినీటి క్యాన్‌లనే కొనుగోలు చేస్తున్నారు. ఇక బేతవోలు చెరువు నీరు స్నానం చేయటానికి కూడా పనికి రానందున బట్టలు ఉతకటానికి, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎస్. జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరువురు హుజూర్‌నగర్‌కు మంచినీరు అందించే కృష్ణా జలాల పథకాన్ని రూ.50 కోట్లతో ప్రారంభించి దానిని విస్తరించటానికి రూ.250 కోట్ల పథకంగా రూపొందించి మఠంపల్లి మండలంలోని గ్రామాలకు, పులిచింతల ప్రాజెక్టు పునరావాస గ్రామాలకు, హుజూర్‌నగర్, పరిసర గ్రామాలకు ఏర్పాటు చేయించగా ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాలు ఏడాదిగా హుజూర్‌నగర్‌కు సరఫరా చేయకుండా గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు నిలిపివేశారు. మిషన్ భగీరథ పేరుతో పట్టణంలోని 20 వార్డులలో సీసీ, బీటీ రోడ్లు ధ్వంసం చేయటం మినహా ఇప్పట్లో మంచినీరు వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో నీరు ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో మిషన్ భగీరథ పథకానికి మాత్రం మంచినీరు ఎక్కడి నుండి వస్తాయని అధికారులే అంటున్నారు. గత నెల రోజులుగా బేతవోలు చెరువు నుండి హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలోని మంచినీటి ట్యాంకుకు వచ్చే నీరు కూడా పూర్తిగా మురికిగా వస్తోంది. బేతవోలు, బూరుగడ్డ గ్రామాల రైతులు పైప్‌లైన్‌లను పగులగొట్టి నీటిని తమ పొలాలకు మళ్లించటమే మురికినీరు సరఫరాకు కారణమని సిబ్బంది అంటున్నారు. గత 44 ఏళ్ల నుండి కూడా రైతులు మంచినీరు సరఫరా చేసే పైప్‌లైన్‌లను ధ్వంసం చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే హుజూర్‌నగర్ ప్రజలకు మురికి నీరు సరఫరా ఒక శాపంగా మారింది.

యాదాద్రిలో వైభవంగా నిత్యారాధనలు
యాదగిరిగుట్ట, మార్చి 1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలబోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అర్చించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. నిత్యకల్యాణోత్సవంతో పాటు బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవ నిర్వహించారు.

మాతృత్వానికి
మరో మార్గం దత్తత
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ రూరల్, మార్చి 1: మాతృత్వానికి మరో మార్గం దత్తత అని , దత్తత విధి విధానాలను తప్పక పాటించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులకు దత్తతకు సంబంధించిన విధి విధానాలు, పాటించిన నియమాలపైన ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ట్రైబల్ ప్రాంతాలలో ఎక్కువగా అక్రమ దత్తత, ఆడ శిశువుల అమ్మకాలు సమస్య ఎక్కువగా ఉందని వాటిని నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, అందులో భాగంగా ఆడ పిల్లల వివక్షను తొలగించేందుకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర దత్తత ప్రాధికారత సంస్థ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు గుండ్లపల్లి శ్రీను మాట్లాడుతూ జిల్లా బాలల పరిరక్షణ విభాగాలు సంబంధిత శాఖల ద్వారా దత్తత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, చట్టబద్దత లేని దత్తత వలన బాలలు బాలలు బాధితులు అవుతారని, వారి హక్కులు కోల్పోతారని తెలిపారు. శిశువులను అమ్మడం , కొనడం నేరమని, చంపకూడదని, ఆడ పిల్లలను సాధలేని యెడల శిశుగృహకు అప్పగించాలన్నారు. ఐసీడీఎస్ కో-ఆర్డినేటర్ శరణ్య రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని, బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాల కార్మిక వ్యవస్థపై చైతన్య సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సంగీత లక్ష్మి ఉమ్మడి జిల్లా బాలల పరిరక్షణ అధికారులు గణేష్, రవి, సైదులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధి పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌లో సిబ్బంది చేతి వాటం
విధులకు హాజరు కాని సిబ్బంది వేతనం స్వాహా
విషయం బయటకు పొక్కడంతో
గవర్నమెంట్ అకౌంట్‌లో చలాన్ తీసిన అధికారులు
దేవరకొండ, మార్చి 1: దేవరకొండ ఐసీడీఎస్ కార్యాలయంలో విధులకు హాజరు కాని సిబ్బంది పేరుతో వేతనాన్ని డ్రా చేసి అధికారులు స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విధులకు హాజరు కాని సిబ్బంది పేరుపై వేతనం డ్రా చేశారని మీడియా దృష్టికి రావడంతో అప్రమత్తమైన అధికారులు తమ అక్రమాలు బయటకు రాకుండా వేతనాలను డ్రా చేసిన 12 నెలల తర్వాత డ్రా చేసిన వేతనాన్ని ప్రభుత్వ ఖజానాకు తిరిగి చలాన్ రూపంలో కట్టి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళకుండా తంటాలు పడుతున్నారు. సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేవరకొండలోని షాలిబండ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న ఆయా 2017 అక్టోబర్ నుండి ఉన్నతాధికారులకు సమాచారం అందించకుండా, కనీసం సెలవు చీటీ కూడా పెట్టకుండా విధులకు హాజరుకాకుండా పోయింది. ఆయా విధులకు హాజరుకాకపోవడంతో కేంద్రంలో చిన్నారుల ఆలనాపాలనా చూసే వారు కరువయ్యారని చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆప్పట్లో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీంతో స్పందించిన అప్పటి సీడీపీవో సక్కుబాయి కేంద్రానికి వెళ్ళి తనిఖీ చేసి ఆయా విధులకు హాజరు కావడం లేదని నిర్ధారించి ఆమెకు అప్పట్లోనే పలు మార్లు మెమోలు జారీ చేసింది. అంగన్‌వాడి కేంద్రం లోని హాజరు రిజిస్ట్రర్‌లో కూడా ఆమెపై చర్యలు తీసుకుంటామని రాసి వచ్చింది. ఆయా విధులకు హాజరు కాకపోవడంతో అప్పటి సీడీపీవో సక్కుబాయి 2017లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించి ఆయాకు వేతనాలను నిలిపి వేశారు. విధులకు హాజరుకాని ఆయాపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకుండా కనీసం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా చేర వేయకుండా కార్యాలయ సిబ్బంది కుమ్మక్కై 2018 జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించిన వేతనాలను నెలకు 6 వేల రూపాయల చొప్పున మొత్తం 12 వేలను ఆయా అకౌంట్‌లో వేసి ఆమె ద్వారా డబ్బులను డ్రా చేయించి వాటిని కార్యాలయ సిబ్బంది పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సంవత్సరం తర్వాత ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బంది ఆయా విధులకు హాజరు కాకపోయినా ఆమెకు ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని మభ్య పెట్టి ఆమె పేరుతో వచ్చిన వేతనాన్ని స్వాహా చేయడంతో పాటు కార్యాలయం పరిధిలోని పలు మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులకు హాజరుకాని సిబ్బందితో కుమ్మక్కై వారి వేతనాల నుండి పెద్ద మొత్తంలో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా విధులకు హాజరు కావడం లేదని అప్పట్లో పని చేసిన సూపర్‌వైజర్ వేతనాల రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేసి ఇచ్చినా సిబ్బంది విధులకు హాజరు కాని ఆయా పేరు మీద వేతనాన్ని డ్రా చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అవాక్కైన ఐసీడీఎస్ అధికారులు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు బదిలీ అయి వెళ్ళిన అప్పటి సీడీపీవో సక్కుబాయికి విషయం చెప్పి ఆమె ద్వారా అప్పట్లో డ్రా చేసిన 12 వేల వేతనాన్ని ఫిబ్రవరి 28న చలాన్ నెంబర్ 0000003697 నెంబర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు తిరిగి చెల్లించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. అయితే విధులకు హాజరు కాని సిబ్బంది పేరుపై వేతనాలు డ్రా చేసుకోవడం కార్యాలయంలో రివాజుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై విచారణ జరిపి బాధ్యులైన సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడి ఆయా అండ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వేతనాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించింది వాస్తవమే: సీడీపీవో సువర్ణ
దేవరకొండలోని షాలిబండ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న రేణుక 2017 అక్టోబర్ నుండి సమాచారం అందించకుండా విధులకు హాజరు కాని మాట వాస్తవమేనని సీడీపీవో సువర్ణ అన్నారు. అయితే, 2018 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆమె పేరు మీద రూ.12 వేల వేతనాన్ని అప్పటి సీడీపీవో సక్కుబాయి హయాంలో డ్రా చేశారని అంగీకరించారు. అయితే ఆ డబ్బులను తిరిగి సంవత్సరం దాకా ప్రభుత్వ ఖజానాలో కట్టలేదని విషయాన్ని మీడియా తమ దృష్టికి తీసుకురావడంతో అప్పుడు డ్రా చేసిన 12 వేలను ఫిబ్రవరి 28న ప్రభుత్వ ఖజానాకు చలాన్ తీసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అక్రమాలకు బాధ్యులైన సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 16 నెలలుగా విధులకు హాజరు కాకుండా ఉన్న ఆయా రేణుకను విధుల నుండి తప్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.

గెలుపు వ్యూహాల్లో గూడూరు
ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మార్చి 1: తెలంగాణ శాసన మండలిలో ఖాళీయైన ఎమ్మెల్యేల కోటాలోని ఐదు స్థానాలకు టీఆర్‌ఎస్ నలుగురిని, మిత్రపక్షం ఎంఐఎం నుండి మరొకరిని బరిలోకి దించగా, కాంగ్రెస్ నుండి గూడూరు నారాయణరెడ్డిని పోటీకి దిగడంతో ఎమ్మెల్సీల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈనెల ఐదున టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు చెందిన ఐదుగురిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకోని పక్షంలో ఈనెల 12న పోలింగ్ నిర్వహణ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గూడూరు నారాయణరెడ్డి గెలువాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19మందితో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఓట్లు వేసిన పక్షంలో ఆయన ఎన్నిక సులభంగానే సాగుతుంది. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఐదో అభ్యర్థిని పోటీలో కొనసాగించిన పక్షంలో కాంగ్రెస్ నుండి ఎవరైన క్రాస్ ఓటింగ్ చేసినా, టీడీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, వేసిన ఓట్లు చెల్లకపోయినా గూడూరు ఓటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గెలుపు సాధనకు గూడూరు నారాయణరెడ్డి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయలకు సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పడిపోకుండా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు సమీకరించేందుకు గూడూరు క్యాంపు రాజకీయల వైపు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం హైద్రాబాద్‌లో గూడూరుతో పాటు ఆయన మద్ధతుదారులు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతో విస్తృత మంతనాలు సాగించారు. అలాగే టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు కూడా గూడూరు నేరుగా మాట్లాడి వారి ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వైపు వెళ్లకుండా చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఐదో ఎమ్మెల్యే స్థానాన్ని ఎలాగైన దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల వ్యూహంతో గట్టెక్కాలన్న వ్యూహాన్ని సైతం టీఆర్‌ఎస్ యోచిస్తుండటంతో ఈ ఎన్నికల్లో గెలుపుకు గూడూరుకు కత్తిమీద సాముల మారింది. రాజకీయ వ్యూహాల్లో సుదీర్ఘ అనుభవమున్న గూడూరు తమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు తమ చేజారిపోకుండా అనుసరించే వ్యూహాలపైన అలాగే ఈ నెల 12న జరిగే పోలింగ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి
ఎస్పీ వెంకటేశ్వర్లు
మేళ్లచెర్వు, మార్చి 1: ఈనెల 4వ తేదీ నుండి మేళ్లచెర్వులో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూర్యాపేట ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్‌కు చెందిన అధికారులు అందుబాటులో ఉండి తమ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జాతరలను ప్రోత్సాహించే విధంగా పలు చర్యలు చేపడుతుందని దానికి అనుగుణంగా సంప్రదాయబద్ధంగా ప్రజలు జాతర నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ దీపాల ప్రభల వద్ద, ఎద్దుల పందేల వద్ద రద్దీని తట్టుకునేందుకు బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతర ఏర్పాట్లకు ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 50 ఎస్‌ఐలు, 80 ఏఎస్‌ఐలు దాదాపు 800 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కిషోర్‌కుమార్, సీఐ రవి, తహశీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ ఇస్సాక్ హుస్సేన్, ఈవోపీఆర్డీ గ్యామా, సర్పంచ్ శంకర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బోగాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు
* కలెక్టర్ అనిత
భువనగిరి, మార్చి 1: మహా శివరాత్రి వేడుకలు, శ్రీయాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మో త్సవాలు ప్రశాంతంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయశాఖ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో డీసీపీ రాంచంద్రారెడ్డితో కలిసి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 4న జరిగె మహాశివరాత్రి ఉత్సవాలు, 8నుండి ప్రారంభమయ్యే యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించి ప్రశాంతవాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని 12 శివాలయాల వద్ద, బ్రహ్మోత్సవాలు జరిగే యాదాద్రిలో పారిశుద్ధ్య ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు మంచినీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు అధికసంఖ్యలో భక్తులు విచ్చేయనున్నందున ఆర్టీసీ అధికారులు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. డీజేలకు, అశ్లీల నృత్యాలు, మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలకు అనుమతిలేదని తెలిపారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ సుమతి, యాదగిరిగుట్ట తహశీల్దార్ గణేష్, పర్యవేక్షకులు నాగలక్ష్మి, యాదాద్రి దేవాలయ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి ఆలయ పనులను
పరిశీలించిన సీఎంవో కార్యదర్శి
యాదగిరిగుట్ట, మార్చి 1: యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. పనుల పురోగతిని ఆయన స్థపతి సుందర్‌రాజన్, వేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయం అన్ని వైపులా, లోపల పనులను పరిశీలించారు. ఇటీవల సీఎం కేసీఆర్ సూచించిన మార్పుల మేరకు చేపట్టిన పనులను సైతం పరిశీలించారు.
పేన్ల మందు తాగిన కస్తూర్బా విదార్థిని
గుండాల, మార్చి 1: మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఏడవ తరగతి విద్యార్థిని తేజస్వి శుక్రవారం పాఠశాలలో పేన్ల మందు తాగింది. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు వైద్యులకు చూపించారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రైవేటు వాహనంలో చికిత్స కోసం జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మిని వివరణ కోరగా తేజస్విని తన స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి గ్రామానికి బొడ్రాయి పండుగకు వెళ్ళి 20 రోజుల అనంతరం శుక్రవారం పాఠశాలకు వచ్చిందన్నారు. వచ్చిన 15 నిమిషాల్లోనే పేన్ల మందు తాగడంతో చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.
ద.మ రైల్వే బోర్డు సభ్యునిగా బెజవాడ శేఖర్
దేవరకొండ, మార్చి 1: బీజేపీ సీనియర్ నాయకుడు బెజవాడ శేఖర్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యునిగా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ శేఖర్‌కు అందజేశారు. ఈసందర్భంగా బెడవాడ శేఖర్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవను గుర్తించి పార్టీ తనకు పదవిని అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. రైల్వే అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి నామినేషన్లు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మార్చి 1: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్లు దాఖలైనట్లుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా పీఆర్‌టీయూ నేత, ఎమ్మెల్సీ పూల రవిందర్, సంగాని మల్లేశ్వర్, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఆయన వెల్లడించారు.

ఎమ్మెల్సీలంటే పైరవీకారులు కాదు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మార్చి 1: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం భారీ ఉపాధ్యాయ రాలీతో నామినేషన్ దాఖలు చేశారు. వామపక్ష, ప్రగతిశీల భావజాల ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాల మద్ధతుతో సాగిన ర్యాలీలో ఆయా జిల్లాల నుండి తరలివచ్చిన వందలాది మంది ఉపాధ్యాయులు అలుగుబెల్లికి మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో పాటు మద్దతునిస్తున్న సంఘాల నాయకులు ర్యాలీకి హాజరయ్యారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిసిన అలుగుబెల్లి నర్సిరెడ్డి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలకరాజు రాములు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథి చుక్కా రామయ్య మాట్లాడుతు సీపీఎస్ రద్దుకు, సర్వీస్‌రూల్స్ జారీకి, పీఈటీల అప్‌గ్రేడ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయ, తాత్కాలిక, ఒప్పంద ఉపాధ్యాయుల సమస్యల సాధనకు పోరాడే వ్యక్తిగా నర్సిరెడ్డిని ఉపాధ్యాయులు గెలిపించాలన్నారు. 8లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విద్య అందించకుండా కేవలం కొన్ని గురుకులాలు స్థాపించి విద్యాభివృద్ధి జరిగినట్లుగా ప్రభు త్వం చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఐదు రకాల ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామక పద్ధతితో విద్యారంగం అభివృద్ధి సమస్యల పాలవుతుందని, ఉపాధ్యాయ సమస్యల గొంతుకగా నిలబడే నర్సిరెడ్డిని గెలిపించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీలంటే పైరవీకారులు కాదని, ఉపాధ్యాయ సమస్యల సాధనకు నిబద్ధతో పోరాడే ప్రతినిధియని చాటిచెప్పేందుకే తాను పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. తన గెలుపు ద్వారా ఉపాధ్యాయులు తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, టీపీటీఎఫ్, టీఎస్‌పీటీఏ, ఎస్‌టీఎఫ్, సంగాల నాయకులు కొప్పిశెట్టి సురేశ్, శ్రీ్ధర్, సుందరయ్య, కృష్ణమూర్తి, దుర్గ్భావాని, శేఖర్, రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, సైదులు, అరుణ, శ్రీనివాసచారి, వెంకేశ్వర్లు, తిరుమలయ్య, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.