నల్గొండ

కొత్త జిల్లాల పాలనకు సంసిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 7 : కొత్త జిల్లాల పరిపాలన ప్రక్రియకు అధికారులు, సిబ్బంది సంసిద్ధం కావాలని, కార్యాలయాల విభాగాల వారీగా ఫైళ్ళ స్కానింగ్ మొదలు పెట్టాలని కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో కొత్త జిల్లాల పాలన సన్నాహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రజలు కార్యాలయాలకు ఏ అవసరానికి వచ్చినా వారికి సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా నుంచి ఏ జిల్లాకు ఏ ఫైలు పంపాలో సమగ్రంగా ఏర్పాట్లు చేసుకొని ఫైళ్ళను స్కాన్ చేసుకొని ప్రతి పేజీ నెంబర్ విధిగా నమోదు చేసి ఫైళ్లను నూతన జిల్లాలకు పంపాలని సూచించారు. నూతన జిల్లాల పరిధిలో వచ్చే మండలాల సమాచారాన్ని జిల్లా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినందున ప్రతి శాఖ ఆయా జిల్లాలకు వచ్చే మండలాలు, గ్రామాలను చూసుకొని ఫైళ్ళను సంబంధిత జిల్లాలకు పంపాలని తెలిపారు. నూతన జిల్లాలకు సంబంధించిన ప్రజలు, రైతులు వారి అవసరాలకు కార్యాలయాలకు వచ్చినప్పుడు కావల్సిన సమాచారాన్ని ఇచ్చే రీతిలో ప్రణాళిక బద్ధంగా ఫైళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా యొక్క రూరల్, అర్బన్ ఏరియాల విస్తీర్ణంపై అవగాహన కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి కూడా తెలుసుకొని ఉండాలని సూచించారు. కొత్త జిల్లాల సాగు విస్తీర్ణత దానికి కావల్సిన సిబ్బంది తదితర విషయాలపై అవగాహన చేసుకొని విధులు నిర్వహించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొత్త జిల్లాలకు మంచిపేరు తెచ్చే విధంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డి ఆర్ ఒ రవినాయక్, డి ఆర్ డి ఏ పిడి అంజయ్య, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పదిరోజుల్లో పోలీస్ సిబ్బంది నియామకం
* హైదరాబాద్ రేంజ్ డిఐజి అకుల్ సబర్వాల్
సూర్యాపేట, సెప్టెంబర్ 7: నూతన జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల్లో కొత్తగా ఏర్పాటుకానున్న సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించి అవసరమైన పోలీస్ సిబ్బంది నియామకం, విభజన ప్రక్రియను పదిరోజుల్లో పూర్తిచేయనున్నట్లు హైదరాబాద్ రేంజ్ డిఐజి అకుల్ సబర్వాల్ తెలిపారు. బుధవారం పట్టణంలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయ ఏర్పాటు కోసం ఎంపికచేసిన ఇండోర్ స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా పరిధిలోకి రానున్న సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సూర్యాపేట జిల్లాపరిధిలో ప్రస్తుతం ఉన్న సూర్యాపేట పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు నూతనంగా కోదాడలో సబ్‌డివిజన్‌ను ఏర్పాటుచేసే అంశంపై చర్చించారు. కోదాడతో పాటు మరో సబ్‌డివిజన్ ఏర్పాటుకు అనువైన ప్రాంతంపై సమీక్షించారు. జిల్లాపరిధిలో కొత్తగా ఏర్పాటుకానున్న నాగారం, అనంతగిరి మండలాల్లో నూతనంగా పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటుచేసే విషయంపై చర్చించారు. అంతే కాకుండా నూతన జిల్లాపరిధిలో కొత్తగా పోలీస్ సర్కిల్‌ల ఏర్పాటుపై సిబ్బంది నుండి ప్రతిపాదనలు స్వీకరించారు. సూర్యాపేటలో జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటుచేయనున్న ఇండోర్ స్టేడియాన్ని తక్షణమే ఆధీనంలోకి తీసుకొని తగు భద్రత ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో నూతన జిల్లాలకు ఎస్పీలను ప్రభుత్వం నియమించనుందని, సిబ్బంది విభజనను సైతం త్వరలోనే పూర్తిచేయడం జరుగుతుందన్నారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటుచేయనున్న జిల్లాల్లో శాంతి భద్రతల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలను మొదటగానే గుర్తించి అందుకు అనుగుణంగా అవసమైన చోట అదనం సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ గంగారామ్, సూర్యాపేట డిఎస్పీ సునీతామోహన్, డివిజన్ పరిధిలోని పలువురు సిఐలు పాల్గొన్నారు.

నూతన జిల్లాలపై రాజకీయాలొద్దు
* టిఆర్‌ఎస్ నేత నోముల
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాలు రాజకీయ రాద్ధంతం మాని ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూఛనలందించాలని టిఆర్‌ఎస్ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నరసింహయ్య అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు కొత్త జిల్లాల ముసాయిదా ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు తలోమాట చెబుతున్నాయని, నిర్ధిష్టమైన ప్రతిపాదనలు వారి వద్ధ నుండి ప్రభుత్వానికి అందడం లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు, పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుందన్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఏర్పాటు పట్ల జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. విపక్షాలు మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాలపై రగడ చేస్తున్నారన్నారు. సీఎం కెసిఆర్ ప్రభుత్వం శాంతిభధ్రతల పరిరక్షణలో చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. నరుూం కేసులో కోమటిరెడ్డి బ్రదర్స్ అవాస్తవాలు మాట్లాడుతు ప్రభుత్వంపై బురద చల్లెందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. నరుూంతో తమకున్న సంబంధాలు బయటపడుతాయన్న ఆందోళనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. వారితో పాటు ఏ పార్టీ వారున్న నరుూం కేసులో చట్టం వదలబోదని అందుకే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నేతలు మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నరుూం కేసులో కొనసాగుతున్న రిమాండ్లు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, సెప్టెంబర్ 7: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో అరెస్టులు, రిమాండ్‌ల పరంపర కొనసాగుతుండగా తాజాగా జిల్లాలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాత్రికేయులు ఆర్.సుదర్శన్, ఆఖిల్ పాషా, మరో వ్యక్తి కాశీమ్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రామన్నపేట కోర్టులో రిమాండ్ చేశారు. భువనగిరి, వలిగొండ, యాదగిరిగుట్ట, నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఎక్కువగా అనుచర గణం ఉండటంతో ఈ ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టులు, రిమాండ్లు ఎక్కువగా సాగుతున్నాయి. నరుూం గ్యాంగ్ బాధితుల ఫిర్యాదుల మేరకు అనుచరులను అదుపులోకి తీసుకుని విచారణ పిదప అరెస్టులు చూపుతు కోర్టుకు రిమాండ్ చేస్తు జైళ్లకు తరలిస్తున్నారు. కాగా నరుూం నేరాలతో సంబంధం ఉన్న వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సిట్ ఇప్పటికే గుర్తించగా త్వరలోనే వారిని అరెస్టు చేసి రిమాండ్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటిదాకా నరుూం కేసులో ఎనిమిది మందిని రిమాండ్ చేయగా మరో ఎనిమిది మంది పోలీసుల అదుపులో ఉన్నారు. భువనగిరిలో 11మందిని రిమాండ్ చేయగా మరో 10మంది పోలీసు అదుపులో ఉన్నారు. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13మందిని రిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురిని రిమాండ్ చేయగా మరో 15మందిని బైండోవర్ చేశారు. నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురిని రిమాండ్ చేశారు. సంస్థాన్ నారాయణపూర్ మండలానికి చెందిన నరుూం కీలక అనుచరులు నలుగురిని హైద్రాబాద్‌లో సిట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

జిల్లాల ఏర్పాట్లకు నిధులు విడుదల

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాల పరిపాలన దసరా నుండి ఆరంభించే దిశగా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం బుధవారం ఒక్కో కొత్త జిల్లాకు కోటి రూపాయలను విడుదల చేయడంతో ఈ నిధులతో కొత్త జిల్లాల కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుండి పరిపాలన ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ముందుగా ఇప్పటికే గుర్తించిన కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా జిల్లాలకు సంబంధించిన వివిధ శాఖల ఫైళ్లను, కంప్యూటర్లను తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత నల్లగొండ జిల్లాను మినహాయిస్తే కొత్తగా ఏర్పాటు చేసే సూర్యాపేట, యాదాద్రి(జిల్లా కేంద్రం భువనగిరి) జిల్లాల్లో కొత్తగా కలెక్టరేట్‌లు, వివిధ శాఖల కార్యాలయాలను సిద్ధం చేసేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో, యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలను ముస్తాబు ప్రక్రియ చేపట్టారు. అయితే కోటి నిధులు సరిపోవంటున్నప్పటికి దశల వారీగా నిధుల మంజూరు జరుగనుందున కార్యాలయాలు, ఫర్నిఛర్, ఫైల్స్, కంప్యూటర్ల తరలింపు ప్రయత్నాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకేసారి అటు జిల్లా కేంద్రం నుండి జిల్లా శాఖల పాలన, ఇటు కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుండి డివిజన్ కార్యాలయాలు, కొత్త మండలాల నుండి పలు శాఖల మండల కార్యాలయాల పాలన ప్రారంభించాల్సివుండటం అధికారుల పనితీరుకు సవాల్‌గా మారింది. యాదాద్రి జిల్లా కలెక్టరేట్ భవనం భువనగిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పగిడిపల్లి గ్రామంలో పాత పాఠశాల భవనాన్ని ఎంపిక చేసుకోవడం కొంత ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతుంది. ఆయా కలెక్టరేట్‌ల భవనాలకు చేరుకోవడం తమకు దూరభారం, అధిక సమయం పడుతుందంటు విమర్శలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది కేటాయింపులపై జోరుగా సమీక్షలు !
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిపాలనకు అవసరయ్యే రీతిలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపులు చేయడంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు దఫదఫాలుగా సమీక్షా సమావేశాలు సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా 30మండలాలతో కొనసాగనుండటం, సూర్యాపేట 20మండలాలు, యాదాద్రి గరిష్టంగా 17మండలాలతో కొనసాగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పాలన ప్రాధాన్యతనలను అనుసరించి ఇప్పటికే సీఎం కెసిఆర్ నిర్దేశించిన సూచనలను పాటిస్తు ప్రభుత్వ సిబ్బంది కేటాయింపు చేసేందుకు వారు తలమునకలేస్తున్నారు. నిర్దేశించుకున్న విధానం మేరకు 40:30:30శాతంలో మూడు జిల్లాల మధ్య సిబ్బంది పంపకాలు చేసే దిశగా నివేదికలు రూపొందిస్తున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ముసాయిదా ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులను అనుసరించి చివరకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సన్నద్ధమవుతున్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
* మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 7: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో బుధవారం జోనల్‌స్థాయి గురుకుల పాఠశాల విద్యార్థుల క్రీడాపోటీలను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఐదు జిల్లాల పరిధిలోని 13 పాఠశాలలకు చెందిన 325 మంది విద్యార్థులు మూడు రోజుల పాటు వివిధ క్రీడలలో పాల్గొంటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. పివీ సింధూ, సాక్షిమాలిక్‌ల వలె దేశానికి పేరుప్రఖ్యాతులు తేవాలని కోరారు. అందుకోసం ఇక్కడి నుంచే క్రీడల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గురుకుల పాఠశాలల కార్యదర్శి శేషుకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, సర్పంచ్ మానుపాటి సతీశ్‌కుమార్, ఎంపీటీసీలు కత్తుల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు సర్వేల్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి, మూడు సిసిరోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈకార్యక్రమాలలో టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా ప్రక్రియ షురూ!
* ఏర్పాట్లను వేగవంతం చేసిన యంత్రాంగం * కామాక్షిలో కలెక్టరేట్
సూర్యాపేట, సెప్టెంబర్ 7: సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ షురువైంది. ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేయడంతో పాటు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్రవేయడంతో దసరా నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తొంది. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసే వివిధ విభాగాల కార్యాలయాలకు సరిపడేలా అన్ని వసతులు ఉన్న భవనాలను తాత్కాలిక ప్రాతిపదికన అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అనే్వషణ చేస్తున్నారు. భవనాల సేకరణ, అధికారుల విభజన, రికార్డుల విభజన ముమ్మరంగా జరుగుతోంది. కొత్తగా ఏర్పాటుకానున్న సూర్యాపేట జిల్లాతో పాటు కోదాడ రెవెన్యూ డివిజన్, నూతన మండలాలుగా ఏర్పాటుకానున్న నాగారం, అనంతగిరిలలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేశారు. జిల్లాకేంద్రంగా మారనున్న సూర్యాపేట పట్టణంలో వివిధ విభాగాలకు సంబంధించిన కార్యాలయాల ఏర్పాటుకోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష ముపైవేల చదరపు గజాల విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపికచేయాల్సి ఉండగా ఆ మేరకు వసతులు ఉన్న భవనాలను గుర్తించేందుకు స్థానిక ఆర్డీవో సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అనే్వషణ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకోసం దాదాపు 60 ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండే విధంగా అనువైన భవనాలను పరిశీలన చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వసతులు ఉన్న భవనాలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ భవనాల్లో అద్దె ప్రాతిపదికన కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పట్టణ సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద గల కామాక్షి ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 12ఎకరాల స్థలంలో రెండు అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అన్ని విభాగాలతో ఏర్పాటు చేయనున్నారు. ఈభవనం సుమారు 65వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.