నల్గొండ

వైభవంగా నిమజ్జనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 14: నవరాత్రుల పూజలందుకున్న ఆదిదేవుడు గణాధిపతి వినాయకుడి నిమజ్జనోత్సవం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ శోభాయాత్రలతో వైభవంగా సాగింది. భారీ శోభాయాత్రలు, ఊరేగింపులు, కోలాటలు, నృత్య ప్రదర్శనలు, భజనలు, వివిధ వేషధారణలతో భారీ శోభయాత్రలతో పార్వతిశంకరుల ముద్ధుల తనయుడైన వినాయకుడిని తల్లి గంగమ్మ ఒడికి చేర్చి ఘనంగా నిమజ్జనోత్సవం చేశారు. ఉదయం నుండే వినాయక విగ్రహాల తరలింపు ప్రారంభంకాగా అర్ధరాత్రి వరకు కూడా జిల్లాలో విగ్రహాల నిమజ్జనాలు కొనసాగాయి. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, హుజూర్‌నగర్, నకిరేకల్, చౌటుప్పల్‌లలో వినాయక శోభయాత్రలు, నిమజ్జనోత్సవాలు ఆధ్యంతం వైభవంగా ప్రశాంతంగా సాగాయి. రోజంతా ముసురు వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా భక్తీ పారివశ్యంతో వినాయక శోభాయాత్రలు, నిమజ్జనోత్సవాలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోలీసులు నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9,518వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. సాగర్ కాలువలు, మూసీ నది, వాగులు, చెరువులు, కుంటల్లో నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా క్రేన్‌లు, గజఈతగాళ్లను, బోట్‌లను, అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సూర్యాపేట విగ్రహాలను సద్ధెల చెరువులో, మిర్యాలగూడలో యాదగిరిచెరువు, సాగర్ కాలువల్లో, వేములపల్లి చెరువులో, దేవరకొండ విగ్రహాలను భీమనపల్లి, సాగర్ కాలువల్లో, భువనగిరి విగ్రహాలను తుక్కాపురం చెరువు, వలిగొండ తదితర చెరువుల్లో నిమజ్జనం జరిపించారు.
నల్లగొండ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం భారీ శోభాయాత్ర మధ్య ఘనంగా సాగింది. పాతబస్తీ హనుమన్ నగర్ ఒకటవ నెంబర్ వినాయక విగ్రహం వద్ధ ఉదయం 9-30కు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, టిడిపి నేత కంచర్ల భూపాల్‌రెడ్డి, ఉత్సవ కన్వీనర్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లు పూజలు నిర్వహించి ప్రారంభించారు. మొత్తం 1824వినాయక విగ్రహాల్లో ఐదుఫీట్లకు పైబడిన 400విగ్రహాలను నాగార్జున సాగర్ కాలువ 14వ మైలురాయి వద్ధకు నిమజ్జనోత్సవానికి తరలించి నిమజ్జనం చేశారు. మిగతా విగ్రహాలను నల్లగొండ బతుకమ్మ కుంటతో పాటు పరిసర మండలాల చెరువుల్లో నిమజ్జనానికి తరలించారు. హనుమాన్ నగర్, పాతబస్తీల నుండి ప్రారంభమైన గణేష్ శోభాయాత్రలో వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో భజనలు, సంస్కృతిక, నృత్య, కోలాట ప్రదర్శనలు, బ్యాండుమేళాలు, డప్పు నృత్యాలతో కోలహాలంగా సాగింది. శోభాయాత్రలో వివిధ రూపాల్లో కొలువై నిమజ్జనానికి సాగుతున్న గణపయ్యను చూసేందుకు ప్రజలు దారి పోడవున గంటల తరబడి నిరీక్షించి స్వామివారిని దర్శించుకుని మంగహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నిమజ్జనోత్సవానికి సాగనండి గణపయ్యకు ఘనమై వీడ్కోలు పలికారు. సాగర్ 14వ మైలురాయి వద్ధ భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌లు వినియోగించారు. శోభాయాత్ర సాగుతున్న దారుల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా మొత్తం 2,100మంది పోలీసులు, 70సిసి కెమెరాలను వినియోగించారు.
641 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి, సెప్టెంబర్ 14: జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 641 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం 640.5అడుగులకు చేరిన నీటిమట్టం బుధవారం 641 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి వెయ్యి కూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు పరిధిలోని చెర్వులను నింపేందుకు 170 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎఇ రమేష్ తెలిపారు. ఇదే నీటిప్రవాహాం కొనసాగితే మరో ఆరురోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిమట్టమైన 645అడుగులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
అఖిలపక్షం రాస్తారోకో

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 14: నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటుచేయాలని సాగర్‌లో కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగార్జునసాగర్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతోపాటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల వారధి అయిన కొత్తబ్రిడ్జి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పెద్దఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సుమారు 2గంటల సేపు రెండు రాష్ట్రాల వారధిపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ను పూర్తిస్థాయిలో మండల కేంద్రంగా చేసేదాక ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. అన్ని వసతులు ఉన్న నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా చేయాలని సుమారు 1000మంది ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
సాగర్ చుట్టుపక్కల తండాల నుండి వందల సంఖ్యలో గిరిజనులు, సమభావన సంఘాల మహిళలు మద్దతుగా రాస్తారోకో, ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నా సమయంలో స్తానిక ఎస్‌ఐ రజనీకర్ ధర్నా చేస్తున్న వారిని విరమింపచేయాలని ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసు బందోబస్తుతో ఆందోళన కారులను బలవంతంగా పోలీసు జీపులో స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొత్తబ్రిడ్జి వద్ద నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో 500మంది భోజనాలు చేశారు.
హైటెన్షన్ టవర్ ఎక్కిన
టిడిపి కార్యకర్త
సాగర్ కొత్త బ్రిడ్జి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కాగా టిడిపికి చెందిన నాయకుడు రామస్వామి కొత్తబ్రిడ్జి సమీపంలోని 220కెవి హైటెన్షన్ టవర్ ఎక్కి అధికారులు సాగర్‌కు వచ్చి సాగర్‌ను మండల కేంద్రం చేసే విషయంలో హామీ ఇచ్చేంతవరకు కిందకు దిగనని హల్‌చల్ సృష్టించాడు. ఇతనికి మద్దతుగా నందునాయక్ కూడా టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. స్థానిక ఎస్‌ఐ, పలువురు పార్టీల నాయకులు టవర్ వద్దకు చేరుకోని టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందకు దిగేటట్లు చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
అన్ని పోలీస్ స్టేషన్లలో
పండ్ల మొక్కలు నాటాలి: ఎఎస్పీ
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 14: అన్ని పోలీస్‌స్టేషన్‌లలో పండ్ల మొక్కలు నాటాలని జిల్లా అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆపరేషన్స్ వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో హరిత హారం కింద పండ్ల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించిందని, ఎస్‌పి కార్యాలయం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సుమారు 14 ఎకరాల మేర విస్తరించి ఉన్న స్టేడియం ఆవరణలో అంతటా హరిత హారం చేపడ్తామని, ఎక్కువగా పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా అనంతగిరి, నాగారం పోలీస్‌స్టేషన్‌లు, మునగాలలో సర్కిల్ కార్యాలయం, కోదాడలో సబ్‌డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు భవనాలను పరిశీలిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్‌లలో పండ్ల, ఔషధ మొక్కలు నాటాలని అధికారులను కోరినట్టు తెలిపారు. ఆయన వెంట డిఎస్పీ ఎస్.రాంగోపాలరావు, ఒన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లున్నారు.
నిమజ్జనంలో అపశృతి.. ఒకరు మృతి
మునుగోడు, సెప్టెంబర్ 14 : మండలంలో బుధవారం నిర్వహించిన వినాయక నిమజ్జన ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ముత్యాలమ్మ చెరువులో వినాయక నిమజ్జనానికి గ్రామస్తులతో పాటు వెళ్లిన సింగపంగ సురేష్(22) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే పనిలో ఉన్న మిగతా వారు సురేష్ మునిగిపోవడాన్ని గమనించకపోవడంతో అతడు నీట మునిగి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని రేకెత్తించింది. మృతుని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్ధానిక ఎస్ ఐ ఇఫ్తెకర్ అహ్మద్ తెలిపారు.
ఎడతెరిపి లేని వర్షాలు...
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 14: అల్పపీడన ప్రభావంతో మండలంలో ఆయా గ్రామాలలో ఎడాతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఆకాశం కారుమబ్బులతో కూడికొని చల్లని గాలులు వీస్తూ జల్లులు, ముసురు మాదిరిగా వర్షం కురిసింది. గత 10రోజుల నుండి ఈ వర్షాలు పడుతుండటంతో రైతన్నలు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తూ మరో వైపు వర్షాలు వరుపు ఇచ్చి రావాలంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ వానలతో చేలకు కొస ఊపిరిలో ప్రాణం పోసినట్లయింది. ఇదిలా ఉండగా వర్షాలతో మండలంలోని ఆయా గ్రామాలలో మిషన్ కాకతీయ చెరువుల్లోకి నీరు చేరింది.
ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించిన ఐజి
సూర్యాపేట, సెప్టెంబర్ 14: నూతన జిల్లాకేంద్రంగా మారనున్న సూర్యాపేట పట్టణంలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటు కోసం ఎంపిక చేసిన ఇండోర్ స్టేడియాన్ని పర్సనల్ ఐజీ బి.శివధర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలోని భవనాలు, మైదానాన్ని పరిశీలించి చేపట్టాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు. అనంతరం పట్టణంలోని విజయాకాలనీలో జిల్లా ఎస్పీ నివాసం కోసం ప్రతిపాదించిన భవనాన్ని పరిశీలించారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపధ్యంలో పోలీస్‌శాఖకు వౌలికంగా కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లా పరిధిలో కొత్తగా పోలీస్ సబ్‌డివిజన్, సర్కిళ్లు, పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త పోలీస్ స్టేషన్‌ల ఏర్పాటుకోసం భవనాల పరిశీలినను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, ఓఎస్డీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ వి.సునీతామోహన్, సిఐ వై.మొగిలయ్యలు ఉన్నారు.