నమ్మండి! ఇది నిజం!!

పీడకల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరగబోయేది కలల్లో తెలుస్తుందా? చాలా మంది సమాధానం తెలీదనే. కాని ఓ వ్యక్తి తనకి వచ్చిన కలని బట్టి ఓ హత్యని ఎలా ఛేదించగలిగింది?
బ్రిటన్‌లోని హోల్‌స్టెడ్ గ్రామంలో విలియం, మేరియాలు ప్రేమించుకున్నారు. ఫలితంగా మేరియాకి ఓ బిడ్డ పుట్టి అంతు తెలీని విధంగా మరణించింది. వృద్ధుడైన మేరియా తండ్రి మేరియాని పెళ్లి చేసుకోమని విలియంని అర్థించాడు. విలియం అయిష్టంగా అందుకు ఒప్పుకున్నాడు. కాని తనకి గ్రామీణ జీవితం నచ్చలేదని, పెళ్లయ్యాక మేరియా తనతో లండన్‌కి రావాలని నియమాన్ని విధించాడు.
1 ఆగస్టు 1827న వారికి పెళ్లైంది. అదే రోజు వారు లండన్‌కి వలస వెళ్లారు. లండన్‌కి వెళ్లిన తర్వాత విలియం తమ యోగ క్షేమాలని రాయసాగాడు. సంవత్సరం తర్వాత అతని నించి ఉత్తరాలు రావడం ఆగిపోయింది. మేరియా తల్లిదండ్రులు ప్రమాదాన్ని శంకించారు. మేరియా తల్లి ఏన్ నిజానికి సవతి తల్లి. ఐనా ఆమెని స్వంత బిడ్డలా ప్రేమించేది. మేరియా స్వదస్తూరితో ఉత్తరం రాయించమని ఆమె విలియంకి ఉత్తరం రాసింది. సమాధానం రాకపోవడంతో వారు స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ రోజుల్లో హోల్‌స్టెడ్ గ్రామ పోలీసులు బడ్జెట్ సరిపోక వాళ్లు లండన్‌కి వెళ్లి పరిశోధించలేక పోయారు. హోల్‌స్టెడ్ పోలీసుల కోరిక మేరకు లండన్ పోలీసులు విలియంని ప్రశ్నిస్తే ఆమె కెనడాకి వెళ్తున్నట్లు ఉత్తరం రాసి పెట్టి వెళ్లిందని, కోపంతో దాన్ని చింపేసానని చెప్పాడు. అదే విషయం వారు హోల్‌స్టెడ్ పోలీసులకి ఉత్తరంలో తెలియజేసి తర్వాత ఇక దాన్ని పట్టించుకోలేదు.
ఆ తర్వాత విలియం సండే టైమ్స్‌లో మేట్రిమోనియల్ కాలంలోని ఓ ప్రకటన చూసి ఆ స్కూల్ టీచర్ని పెళ్లి చేసుకుని లండన్‌లోనే జీవించసాగాడు. ఇది తెలిసిన ఏన్ మేరియా గురించి తన భర్తకన్నా తీవ్ర ఆందోళనకి గురైంది. ఓ రాత్రి అకస్మాత్తుగా ఏన్ కేక పెడుతూ నిద్రలేచింది. భయంతో వణికిపోయే ఆమెకి భర్త మంచినీళ్లు ఇచ్చి ఏం జరిగిందని ప్రశ్నించాడు.
‘గునపం.. గొయ్యి.. శవం’ ఆమె భయంగా చెప్పింది.
‘నీకు అజీర్తి చేసి పీడకలలు వస్తున్నట్లున్నాయి. పడుకో’ ఆయన సూచించాడు.
కొద్ది రోజుల తర్వాత ఏన్ తనకి మళ్లీ వచ్చిన పీడకలకి భయపడుతూ నిద్ర లేచింది. ఈసారి ఆమెకి కల మరింత వివరంగా వచ్చింది. గోతిలోకి దింపే ఆ శవం కాళ్లు కనపడ్డాయి. బూట్లు ఆడవాళ్లవి. ఆమె కాని, ఆమె భర్త కాని ఆ కలని పెద్దగా పట్టించుకోలేదు. మూడోసారి వచ్చిన కలలో అది మేరియా శవం అని స్పష్టంగా తెలిసింది. ఈసారి ఆమె తన కల నిజమేనని, ఉత్త పీడకల కాదని, మేరియా మరణించిందని నమ్మింది. మేరియా తండ్రి మాత్రం దాన్ని నమ్మడానికి ఇష్టపడలేదు.
ఏన్ తన నగలని అమ్మి ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ని నియమించాలని అనుకుంది. కాని డిటెక్టివ్ కెనడాకి వెళ్లి రావడానికి చాలా ఖర్చవుతుందని తెలియడంతో దాన్ని వాయిదా వేసింది.
నాలుగోసారి వచ్చిన కలలో గునపంతో ఆ గోతిని తవ్వేది తన అల్లుడు విలియం అని ఆమెకి తెలిసింది. అదంతా ఆమె మానసిక బలహీనత అని మేరియా తండ్రి కొట్టిపారేశాడు. జరగబోయేది కలలో కనిపించచ్చేమో కాని జరిగింది కనిపించదని ఆయన నమ్మకం.
విలియం ఆ శవాన్ని పాతిపెట్టిన ప్రదేశం తనకి తెలిస్తే దాన్ని రుజువు చేయచ్చని ఏన్ భావించింది. ఆ కల మళ్లీ వస్తుందని ఎదురు చూసింది కాని కొన్ని నెలల దాకా మళ్లీ ఆ కల రాలేదు. ఆ దంపతులు ఇద్దరూ మట్లాడుకునేప్పుడు ఏదో రోజు మేరియా తిరిగి వస్తుందనుకున్నా ఏన్ మాత్రం అది జరగదు అనుకునేది.
ఓ రోజు ఏన్ వాళ్ల ఇంటి వెనక ఉన్న ఎర్రరంగు షెడ్‌లోకి పని మీద వెళ్లినప్పుడు అనుకోకుండా ఆమె దృష్టి అక్కడి గునపం, పారల మీద పడింది. వెంటనే గట్టిగా అరిచింది. పరిగెత్తుకు వచ్చిన భర్తకి ఆ పారని చూపించి వణికిపోతూ చెప్పింది.
‘కలలో కనపడ్డ పారకి ఓవైపు వంపుంది. ఈ పారకి కూడా వంపుంది. విలియం మేరీ శవాన్ని పూడ్చింది ఈ పారతోనే’
‘ఎక్కడ పూడ్చాడో కలలో తెలీలేదా?’ ఆయన అడిగాడు.
‘లేదు’
కొన్ని నెలల తర్వాత ఏన్ తన భర్తని లేపి చెప్పింది.
‘చంపేశాడు’
‘ఎవరు? ఎవర్ని?’
‘విలియం తన రెండో భార్యని చంపి మళ్లీ పాతిపెట్టాడు’
‘ఎక్కడ?’
‘ఇంటి వెనక షెడ్‌లో... నాకు కలలో ఇది స్పష్టంగా కనిపించింది. మనమ్మాయిని కూడా మన షెడ్లోనే పాతి ఉండచ్చు’
ఆయన వారిస్తున్నా ఆమె లేచి లాంతరు వెలిగించి దాంతో షెడ్లోకి పరిగెత్తి ఆవేశంగా షెడ్లోని మట్టి నేలని తవ్వసాగింది. రెండడుగులు తవ్వగానే ఆమెకి తన కల్లో కనిపించిన ఆడవారి కాలి బూటు కనిపించింది. వెంటనే మేరియా తండ్రి తవ్వితే చీలికలైన తన కూతురు దుస్తులు కనిపించాయి. మేరియా ఇల్లు వదిలి విలియంతో లండన్‌కి వెళ్లలేదు.
ఆయన వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వాళ్లు లండన్ పోలీసులకి ఉత్తరం రాశారు.
ఓ రోజు పోలీసుస్టేషన్ నించి పోలీసు కానిస్టేబుల్ ఏన్ ఇంటికి వచ్చి చెప్పాడు.
‘లండన్ పోలీసులు విలియం ఇంటి వెనక షెడ్లో తవ్వితే అతని భార్య శవం కనిపించింది. డబ్బు కోసమే ఆమెని పెళ్లి చేసుకుని హత్య చేసానని ఒప్పుకున్నాడు. మేరియాని మాత్రం తను చంపలేదని బుకాయించాడు. అతను వారం రోజుల క్రితం తన భార్యని పాతి పెట్టాడని మీకు తెలా తెలిసింది?’
‘కల’ ఏన్ చెప్పింది.
విలియంని 2 ఆగస్టు 1829న ఉరి తీశారు. అతనితో పని చేసేవారు విలియం చాలా మంచివాడని, అతన్ని ఉరి తీయకూడదని జైలు బయట నిరసన ప్రదర్శనలని కూడా నిర్వహించారు. ఆనాటి సండే టైమ్స్‌లో ఇది వార్తగా కూడా వచ్చింది.
ఏన్‌కి మేరియా హత్య గురించి ఎందుకు కల వచ్చింది? అన్ని వివరాలు ఒకేసారి కాక కొద్దికొద్దిగా ఎందుకు తెలిసాయి? ఆ కలల వెనక మేరియా ఆత్మ ప్రమేయం ఉందా? తనకి పేరు కూడా తెలీని విలియం రెండో భార్య మరణం గురించి ఏన్‌కి అది జరిగిన కొద్ది గంటలకే ఎలా కల వచ్చింది? ఈ ప్రశ్నలకి సమాధానం దేవుడికే తెలియాలి.