నమ్మండి! ఇది నిజం!!

ది టోర్మెంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగోలోని ఎడెలా తన భర్త జోతో ఓ మ్యూజియంకు వెళ్లినప్పుడు ది టోర్మెంటా (తుపాను) అనే ఓ ఆయిల్ పెయింటింగ్‌ని చూసింది. దాని మీది పెడ్రో కస్తేరా అనే చిత్రకారుడి సంతకం చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. అది పెడ్రో గీసిన చిత్రం కాదని, అతను మూడేళ్ల క్రితమే మరణించాడని ఎడెలా జోతో చెప్పింది.
‘అతని సంతకం నకిలీది అంటావా?’ జో అడిగాడు.
‘కాదు. కాని...’ ఆమె సందిగ్ధంగా ఆగింది.
వారి సంభాషణ వింటున్న ఒకతను వారి దగ్గరికి వచ్చి అడిగాడు.
‘నేనీ మ్యూజియానికి క్యురేటర్ని. ఈ చిత్రం నకిలీది అంటున్నారా?’
‘అవును. నేను, పెడ్రో చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో కలిసి చదివాం. ఈ చిత్రం గీయడానికి మునుపే అతను మరణించాడు’ ఎడెలా చెప్పింది.
‘కాని ఇది కస్తేరా గీసిన వాటిలో ఉత్తమమైనది’
‘ఐతే ఉత్తమమైన నకిలీ చిత్రం. పెడ్రో ఈ చిత్రం వాటర్ కలర్ స్కెచ్‌ని గీయడం నాకు తెలుసు. వెంటనే కొరియాకి వెళ్లిపోయాడు. అక్కడ నించి రాగానే మొదటగా ఈ చిత్రాన్ని గీస్తానని నాకు ఉత్తరం రాశాడు. ఆ మర్నాడే అతను యుద్ధరంగంలో మరణించాడు. ఆ ఉత్తరం ఇంకా నా దగ్గర ఉంది’
ఆమె మాటల్ని క్యురేటర్ నమ్మలేదు.
* * *
మర్నాడు తెల్లవారుఝామున రెండున్నరకి ఎడెలా తన భర్త జోని నిద్ర లేపి చెప్పింది.
‘ఆ చిత్రం ఇంకా నా మనసులోంచి పోవడం లేదు. దాన్ని ఎవరు గీసారో నేను తెలుసుకోవాలి’
‘దాన్ని పెడ్రోనే సమాధి నించి వచ్చి గీసి ఉండచ్చు. పొద్దున్న ఏడుకి లేవాలి. పడుకో’
‘కాదు. నేనిది తెలుసుకుని తీరాలి’
‘నీ తోటి ఆర్ట్ విద్యార్థుల్లో ఎవరైనా దాన్ని గీసి ఉండచ్చు. నీకెందుకు బాధ?’
‘మెక్సికోలోని రియో గ్రాండె అనే ఊరికి వంద మైళ్ల దూరంలో కడోరా అనే గ్రామం ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్లండి. అది కస్తేరా స్వగ్రామం.’
* * *
వాళ్లు కడోరాలోని ఓ హోటల్‌లో దిగారు.
‘మీకు కస్తేరా ఇల్లు తెలుసా?’ ఎడెలా హోటల్ మేనేజర్ని అడిగింది.
‘పెడ్రో కస్తేరా తల్లి మార్గరీటా ఇప్పుడా ఇంట్లో ఉంటోంది. తెలుసు. ఆవిడ తన కొడుకు చిత్రాలని అమ్మి ఆ డబ్బుతో ఇక్కడ చాలామంది బీదలకి సహాయం చేస్తోంది’ అతను జవాబు చెప్పాడు.
ఎడ్రస్ తీసుకుని అరగంట తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఆ ఇంటికి వెళ్లారు. తన కొడుకు అమెరికన్ మిత్రులని చూసిన ఆవిడ చాలా సంతోషించింది. జో అక్కడ గోడకి వేలాడే ది టోర్మెంటా చిత్రాన్ని భార్యకి చూపించాడు.
‘ఇది క్రితం సంవత్సరం పేరిస్‌లోని గ్రాండ్ ప్రిక్స్‌లో బహుమతిని పొందింది. దీన్ని ఎక్కువ ధర ఇచ్చి కొనడానికి చాలామంది వచ్చినా నేను అమ్మలేదు’ మార్గరీటా చెప్పింది.
‘1951లో పెడ్రో కొరియా నించి వచ్చాక దీన్ని ఆయిల్ పెయింటింగ్‌గా గీయాలనుకోవడం నాకు తెలుసు. కాని అతను అక్కడే మరణించాడు’ ఎడెలా చెప్పింది.
వెంటనే మార్గరీటా కోపంగా లేచి చెప్పింది.
‘నా అమర్యాదకి క్షమించండి. మీరు దయచేసి వెళ్లండి. మళ్లీ ఎన్నడూ ఇక్కడికి రాకండి’
నివ్వెరపోయిన ఆ దంపతులు బయటకి నడిచారు.
హోటల్‌కి చేరుకున్నాక వారితో మేనేజర్ చెప్పాడు.
‘సారీ సర్. ముందుగా రిజర్వ్ అయిన గదిని పొరపాట్ల మీకు ఇచ్చాను. వాళ్లు వచ్చారు. కాబట్టి మీరు తక్షణం ఖాళీ చేయాలి’
‘ఐతే ఇంకో గది ఇవ్వండి’
‘ఖాళీలు లేవు’ చెప్పి అక్కడ ఉన్న వారి సామానుని మేనేజర్ చూపించాడు.
జో అది అన్యాయమని వాదించబోతే యూనిఫాంలోని పోలీస్ ఆఫీసర్ కల్పించుకుని చెప్పాడు.
‘దయచేసి మీరు మా గ్రామాన్ని వెంటనే వదిలి వెళ్లండి. మీరీ గ్రామంలో ఉండటం మా గ్రామస్థులకి ఇష్టం లేదు’
మరోసారి వాళ్లు నిశే్చష్టులయ్యారు. ఇద్దరూ తమ సామానుతో కారు దగ్గరకి నడిచారు.
‘పెడ్రో తల్లి మార్గరీటా దగ్గరికి మనం వెళ్లక మునుపు అంతా మనతో బావున్నారు. కాని ఆమెకి ఎందుకంత అకస్మాత్తుగా కోపం వచ్చింది? పెడ్రో ఈ గ్రామంలో జీవించే ఉన్నాడా?’ ఎడెలా కారెక్కాక ఆలోచనగా అడిగింది.
‘మార్గరీటాకే తెలియాలి’ జో చెప్పాడు.
వారు కారు గేట్లోంచి బయటకు వెళ్తూండగా అడ్డొచ్చిన ఓ పదేళ్ల కుర్రాడు కారు ఆపమన్నట్లుగా సౌంజ్ఞ చేయడంతో జో కారుని ఆపాడు.
‘నాకు పెడ్రో గీసిన చిత్రం గురించి తెలుసు. నాతో రండి’ వాడు చెప్పాడు.
ఆ కుర్రాడ్ని కారెక్కించుకుని వాళ్లు ఆసక్తిగా వాడి వెంట ఓ బుట్టల దుకాణానికి వెళ్లారు. అందులో ఓ ముసలాయన బుట్ట అల్లుతున్నాడు. అక్కడ గోడకి ఉన్న ఇంకో ది టోర్నెంటా చిత్రాన్ని చూసి ఎడెలా చెప్పింది.
‘ఇది నకిలీది కాకపోతే పెడ్రో గీసిందే. అదే స్టైల్’
‘అవును. నేను పెడ్రో మేనమామ తమాస్‌ని. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం మీ ప్రశ్నలకి సమాధానాలు దొరక్కపోతే మీరు దినపత్రికలకి ఈ విషయం చెప్పచ్చు. అప్పుడు ఎటూ వాళ్లకి మేము సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. గ్రామస్థులంతా అతన్ని కాపాడాలని అనుకుంటున్నారు. మూడేళ్ల క్రితం పెడ్రో నాకు కలలో కనిపించి కేన్వాస్, కుంచె తీసుకుని చిత్రం గీయమని కోరాడు. కొన్ని రాత్రుళ్లు నేను గీసాక ది టోర్మెంటా చిత్రం తయారైంది. ఇది ఓ అద్భుతం. ఇది బయటి ప్రపంచానికి తెలీకూడదని మా గ్రామస్థులు అనుకున్నారు’ తమాస్ చెప్పాడు.
‘ఇది నేను నమ్మను. పెడ్రో ఎక్కడ?’ ఎడెలా అడిగింది.
‘స్వర్గంలో. నేను నా జీవితంలో ఎన్నడూ చిత్రాలు గీయలేదు. పెడ్రోనే నా చేత వీటిని గీయిస్తున్నాడు’
‘కాని పెడ్రో శైలిని పట్టుకుని మీరు గీసి ఉండచ్చు. ఇలా చాలా సార్లు చిత్ర ప్రపంచంలో జరిగింది.’
‘నేను చెప్పింది నిజం’ చెప్పి తమాస్ తన నల్లకళ్లజోడుని తీశాడు.
అతని రెండు కళ్లూ గుడ్డివి.
‘నేను పుట్టుగుడ్డిని’ అతను చెప్పాడు.
భౌతిక ప్రపంచానికి రుజువులు కావాలి. నమ్మదగ్గ రుజువులు దొరకనప్పుడు కూడా కొన్ని అతీంద్రియ శక్తులని ఎవరూ నమ్మలేరు. తమాస్ చెప్పింది నిజమా? ఐతే పెడ్రో అతని దేహాన్ని తన మీడియంగా చేసుకుని ఆ చిత్రాలు గీస్తున్నాడా? లేక తమాస్ ఆ దంపతులని మోసం చేశాడా? ఐతే ఎలా? ఎందుకు? వీటికి జవాబులు దేవుడికే తెలియాలి.