నమ్మండి! ఇది నిజం!!

అదృశ్య సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెన్రీ లండన్‌లోని మార్నింగ్ స్టార్ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు. ఓ ఉదయం అతను అలస్యంగా నిద్ర లేచాడు. చాలా అలసటగా అనిపించింది. అతనికి నాలుగుసార్లు ఏదో పేలుడు శబ్దాలు వినిపించాయి. అన్నిసార్లు అతని శరీరంలో బాధ కలిగి తూలి కింద పడ్డాడు. తర్వాత పెన్ను తీసుకుని కాగితం మీద ఏదో రాశాడు. 27 ఆగస్టు 1883 నాడు జరిగిన ఆ సంఘటన దినపత్రికల చరిత్రలో నేటికీ ప్రశ్నార్థకంగానే నిలిచిపోయింది.
హెన్రీ తను రాసిన రిపోర్ట్‌ని ప్రెస్‌కి పంపాడు. పదిహేను వేల మైళ్ల దూరంలోని మాల్టా దీవుల్లోని క్రెకటోవాలో అగ్నిపర్వతం బద్దలై 36,000 మంది మరణించారు అన్న ఆ వార్త మర్నాడు మార్నింగ్ స్టార్‌లో హెడ్‌లైన్స్ వార్తగా మొదటి పేజీలో ప్రచురించబడింది. అతను గీసిన సిస్మోగ్రాఫ్ తరంగాలు కూడా ప్రచురించబడింది. ఆ రోజు ఆఫీస్‌కి వెళ్లిన హెన్రీని అంతా ఆ వార్త గురించి అభినందిస్తూంటే అతను తెల్లబోయాడు. దినపత్రికలో ఆ వార్త కింద తన పేరుని చదివాక తను అది రాసాడా? అని అనిపించింది.
‘నేను దీన్ని రాయలేదు’ చెప్పాడు.
తన చేతిరాతలోని ఆ వార్త కాగితాన్ని చదివి మరింత ఆశ్చర్యపోయాడు.
మధ్యాహ్నం పేపర్ ఎడిటర్ హెన్రీని పిలిచి చెప్పాడు.
‘నువ్వు గొప్ప జర్నలిస్ట్‌వి. వైర్ ద్వారా అందని ఈ వార్తని ఎలా తెలుసుకో గలిగావు?’
‘నాకీ వార్త గురించి ఏ మాత్రం తెలీదు. నేను దీన్ని రాసి ఉండను’ హెన్రీ చెప్పాడు.
‘నువ్వా వార్తని ఎలా సేకరించావో ఆ రహస్యం చెప్పు’ ఆయన కోరాడు.
‘నిన్న ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. నేను నాలుగు పేలుళ్లు విన్నాను’
‘మన మార్నింగ్ స్టార్లో తప్ప ఈ వార్త న్యూయార్క్ వాషింగ్టన్ డిసి దినపత్రికల్లో కాని, యూరప్‌లోని ఇతర దినపత్రికల్లో కాని రాలేదు. ఇది నిజమా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే దేశంలోకి టెలిగ్రాంల ద్వారా కూడా నిన్న ఈ వార్త రాలేదని తెలుస్తోంది. కాబట్టి ఇది నిజమైన వార్తేనా అని తోటి పత్రికల వాళ్లు శంకిస్తున్నారు. పదిహేను వేల మైళ్ల దూరంలో జరిగిన నాలుగు పేలుళ్లని నువ్వు ఎలా వినగలిగావు?’
‘నా మనసుతో విన్నాను. అంతకు తప్ప నాకింకేం తెలీదు. ఆ సమయంలో నాకు చాలా భయం కూడా వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు.’
‘అంటే ఆధారం లేకుండా దీన్ని నువ్వు రాసావన్నమాట! సరే. నువ్వు జీవించి ఉన్నంతకాలం నీకు ఇంగ్లండ్‌లో ఇంకే దినపత్రికలో ఉద్యోగం రాకుండా చూస్తాను. నాదో సలహా. వెళ్లి అట్లాంటిక్ మహాసముద్రంలో దూకు’ ఎడిటర్ కోపంగా చెప్పాడు.
అతన్ని ఉద్యోగం లోంచి తొలగించాడు.
హెన్రీ తన గదికి వచ్చి విచారంగా తన సూట్‌కేస్‌లో బట్టలని సర్దుకోసాగాడు.
* * *
మార్నింగ్ స్టార్ ఎడిటర్ గదిలోకి వచ్చిన వాతావరణ కేంద్ర అధికారి చెప్పాడు.
‘నిన్న రాత్రి మా సిస్మోగ్రాఫ్ యంత్రం బలహీనమైన తరంగాలని రికార్డ్ చేసింది. అది మీ పత్రికలో అచ్చైన తరంగాలనే పోలి ఉంది. ఈ సమాచారం మీకు ఎలా అందింది? అవి చాలా బలమైన పేలుళ్లు. ఎక్కడో జరిగింది చూసినట్లుగా రాశారు. శాస్ర్తియ కోణంలోంచి చూస్తే ఈ రిపోర్ట్‌లో రాసిందంతా కరెక్టే. పదమూడు వేల మైళ్ల దూరంలో ఇది జరిగింది. రెండు వేల మైళ్ల విషయంలో మాత్రం తేడా వచ్చింది. అగ్నిపర్వతం పేలాక నాలుగు వందల చదరపు కిలోమీటర్ల మేర బూడిద పడటమే కాక, ఎనిమిది మైళ్ల ఎత్తుకి అది ఎగిరిందన్న సమాచారం మాకు అందింది. ఇది నిన్న మీ దినపత్రికలో రాసారు’ ఆయన చెప్పాడు.
‘ఐతే ఈ సమాచారం మాకు రావడం అదృష్టం. మా రిపోర్టర్లలోని ఒకతను దీన్ని కనుగొన్నాడు. ఎలా అంటే చెప్పలేకపోయాడు’ ఎడిటర్ చెప్పాడు.
హెన్రీని మళ్లీ పత్రికాఫీస్‌కి పిలిపించారు. అతనికి ఈవెనింగ్ ఎడిషన్‌ని ఇస్తే అందులో న్యూస్ ఏజెన్సీ నించి టెలిగ్రాం ద్వారా వచ్చిన అగ్నిపర్వతం నాలుగుసార్లు పేలిన వార్తని చదివాడు.
‘నేను పొరబడ్డాను. నువ్వు ఇచ్చిన వార్తలో అబద్ధం లేదు. ముందుగా దీన్ని ఇచ్చిన నీకు కీర్తి వచ్చింది. మన యజమాని రేపు ఈస్ట్ ఇండియా షేర్లు అమ్మాలో, ఏ షేర్లు కొనాలో నిన్ను చెప్పమని కోరాడు’ ఎడిటర్ చెప్పాడు.
‘నాకు తెలీదు. నాలో మీరంతా ఊహించే ఎలాంటి అతీంద్రియ శక్తీ లేదు’ హెన్రీ చెప్పాడు.
‘కొనాలా? అమ్మాలా?’
‘ఏదో ఒకటి చెయ్యమని చెప్పండి’
‘ఐతే అమ్మమని చెప్తాను’ ఎడిటర్ చెప్పాడు.
హెన్రీని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు.
అతను బయటికి రాగానే ప్రెస్ రిపోర్టర్లంతా అతని చుట్టూ మూగారు. వారి ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పాడు.
‘నాలో ఎలాంటి అద్భుతాలు లేవు. నా నించి ఇలాంటివి మీరు ఆశించకండి. నేను యోగినో లేదా మానసిక వ్యాధిగ్రస్థుడ్నో కాదు’
అతని ఇంటికి కూడా అనేక మంది వచ్చి తమ సమస్యలని ఏకరువు పెట్టి వాటికి పరిష్కారాలు సూచించమని కోరసాగారు. హెన్రీ ఆ రాత్రే లండన్ వదిలి అమెరికాకి వలస వెళ్లిపోయి అక్కడ ఫిలడెల్ఫియా టైమ్స్ అనే దినపత్రికలో చేరాడు. అతని ఖ్యాతి గురించి తెలియడంతో అతనికి ఉద్యోగం తేలిగ్గా వచ్చింది.
* * *
1901.
పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఓ రోజు ఎడిటర్ టెలిప్రింటర్‌లో వచ్చిన సమాచారం చదివి ఉలిక్కిపడ్డాడు. తర్వాత కొద్ది క్షణాలు ఆలోచించి హెన్రీ టేబిల్ దగ్గరికి వెళ్లి అరిచాడు.
‘బఫెలో నగరంలోని పేస్ అమెరికన్ ఎక్స్‌పొజిషన్‌లో అధ్యక్షుడు విలియం మేక్‌కినే్ల కాల్చి చంపబడ్డాడు. ఈ విషయం టెలిప్రింటర్ ద్వారా ఇప్పుడే వచ్చింది. ఇది నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే మాల్టాలో అగ్ని పర్వత పేలుళ్ల వార్తలా అన్ని పేపర్ల కన్నా ముందే ప్రచురించే వాళ్లం కదా? ఇలాంటి అద్భుతాలు నీకు తెలుస్తాయనే కదా నిన్ను తీసుకుంది? నిన్ను తక్షణం తీసేస్తున్నాను’
హెన్రీ నిశ్శబ్దంగా లేచి తన వ్యక్తిగత సామానుని సొరుగులోంచి తీసుకుని బయటకి నడిచాడు. గుమ్మం పక్కన ఉన్న ఒక చెత్తబుట్ట దగ్గర ఆగి అతను ఓ కాగితాన్ని తీసి అందులో వేసి వెళ్లడం ఎడిటర్ చూశాడు. ఆయన ఆసక్తిగా అక్కడికి వెళ్లి ఆ ఉండ చుట్టిన కాగితాన్ని తీసి చదివాడు.
బఫెలో నగరంలో పేన్ అమెరికన్ ఎక్స్‌పొజిషిన్‌ని సందర్శించే అమెరికా అధ్యక్షుడు విలియం మేక్‌కినే్లని ఓ దుండగుడు టెంపుల్ ఆఫ్ మ్యూజిక్‌లో కాల్చి చంపాడని హెన్రీ చేతిరాతతో రాసిన వార్త అది. వెంటనే అతను హెన్రీ కోసం బయటికి పరుగెత్తాడు. అతను ఎక్కడా కనపడలేదు. ఆ సాయంత్రం హెన్రీ గదికి వెళ్తే అతను మధ్యాహ్నమే గది ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసింది. తర్వాత అమెరికాలోని చాలా దినపత్రికలు హెన్రీ కోసం అమెరికా అంతటి గాలించాయి. కాని అతని ఆచూకీ తెలియలేదు. అతను తిరిగి లండన్‌కి వెళ్లిపోయాడని కొందరు భావిస్తే, మరి కొందరు అతను మారుపేరుతో ఏదో దినపత్రికలో పని చేస్తూండి ఉంటాడని భావించారు. నిజంగా అమెరికా అధ్యక్షుడు కాల్చి చంపబడకపోతే? అనే సంశయంతో అతనా వార్తని చెప్పి ఉండడని కూడా కొందరు భావించారు.
ఓ సాధారణ వ్యక్తికి విశ్వంలో ఎక్కడో దూరంగా జరిగేది ముందుగా రెండుసార్లు ఎలా తెలిసింది? ఇంకా ఎక్కువసార్లు తెలిసిందా? ఇలాంటిది అతీంద్రియ శక్తి వల్ల జరిగిందా? లేక కాకతాళీయంగా జరిగిందా? హెన్రీ ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.