నమ్మండి! ఇది నిజం!!

ఎమిలీ! ఐ లవ్ యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1943
రెండో ప్రపంచ యుద్ధ కాలం. లండన్ నగరం.
మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌లో వేచి ఉన్న ఎమిలీ దగ్గరకి యూనిఫాంలోని ఓ కల్నల్ వచ్చాడు.
‘ఆరు వేల మంది మరణించారు. మిలటరీ ఇంటలిజెన్స్‌కి తెలీని శత్రువులు మన సైన్యం మీద ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో మీకు ముందే ఎలా తెలుసు?’ ఎమిలీని ప్రశ్నించాడు.
‘నేను గూఢచారిని అనుకుంటున్నారా?’ ఆమె కోపంగా ప్రశ్నించింది.
‘లేదు. కాని మీకు ముందే తెలియడం మీరు చెప్పినట్లు భ్రమ కాదు. భ్రాంతి కాదు. మరెలా తెలిసింది?’
ఆమె ఏడవసాగింది. అతను గదిలోంచి బయటకి వచ్చాడు. చేతిలో నీళ్ల గ్లాస్‌తో తిరిగి వచ్చి దాన్ని ఆమెకి అందించి ఎదురుగా కూర్చుని ప్రశ్నించాడు.
‘జరిగింది మళ్లీ మొదటి నించి చెప్పండి’
* * *
మే 1939లో ఎమిలీ ఫ్రాన్స్ వెళ్లినపుడు సముద్రపు ఒడ్డున ఉన్న మిత్రురాలు ఏన్ ఇంట్లో బస చేసింది. ఓ అర్ధరాత్రి ఉరుములు, మెరుపులకి ఆమెకి మెలకువ వచ్చింది. భయంగా లేచి కిటికీ తలుపులు వేసి ఏన్‌ని పిలిచింది. జవాబు లేకపోవడంతో తలుపు తెరచుకుని మెట్ల మీదకి వచ్చింది. కింద బయట తలుపు తెరచుకుని యూనిఫాంలోని ఐదారుగురు సైనికులు ఓ స్ట్రెచర్‌తో రావడం చూసి నిర్ఘాంతపోయింది.
వారు దాన్ని నేల మీద ఉంచారు.
‘నన్ను వెంటనే డాక్టర్ చూడాలి’ గాయపడ్డ వ్యక్తి కోరాడు.
‘ఎవరు మీరు?’ అడిగింది.
వాళ్లు ఆమెని పట్టించుకోలేదు.
‘నాకో భార్య ఉంది. ఆమెని నేను ప్రేమిస్తున్నానని చెప్పు జార్జ్! ఆమె పేరు ఎమిలీ’
తన పేరు వినగానే మెట్ల మీది ఎమిలీ ఉలిక్కిపడింది. ఎమిలీ అతని దగ్గరికి చేరుకునే సరికే వాళ్లు బయటకి వెళ్లిపోయారు. అతను ఆమెని చూసి ఆనందంగా చెప్పాడు.
‘ఎమిలీ! ఐ లవ్ యు’
అవే అతని ఆఖరి మాటలు. తక్షణం అతను, స్ట్రెచర్ మాయం అయిపోయాయి.
‘ఏమిటి? పీడకల్లో ఇక్కడికి నడిచి వచ్చావా?’ అక్కడికి వచ్చిన ఏన్ ఏడుస్తున్న ఎమిలీని అడిగింది.
‘అవును.. బాగా గాయపడి మరణించే వ్యక్తి నా పేరు చెప్పి ‘ఐ లవ్ యూ’ అన్నాడు.’
‘నువ్వు రొమాంటిక్ నవలలు చదవడం ఆపేయ్. యుద్ధం నించి ఇలాంటి కబురు అందుకునే హీరోయిన్‌కి వచ్చినట్లుగా నీకా కల వచ్చి ఉంటుంది’
‘అది కలలా లేదు. నేను మెలకువతోనే మెట్లు దిగి ఇక్కడికి వచ్చి అతన్ని చూసినట్లుగా ఉంది’ ఎమిలీ చెప్పింది.
‘కలలు అలాగే అనిపిస్తాయి. కొద్ది రోజులు నువ్వు లైబ్రరీకి వెళ్లకు. నిద్రపో’ ఏన్ నవ్వుతూ చెప్పింది.
* * *
కొన్ని వారాల తర్వాత లండన్‌లో లైబ్రేరియన్‌గా పని చేసే ఎమిలీ బల్ల మీద ఓ యువకుడు తనకి కావాల్సిన పుస్తకాలని ఉంచాడు. వాటిని లెక్కపెట్టిన ఎమిలీ చెప్పింది.
‘సారీ! ఒకేసారి ఎనిమిది పుస్తకాలని ఇవ్వం. నాలుగు మాత్రమే ఇస్తాం’
‘కాని నాకు వీటన్నిటి అవసరం ఉంది’
‘ఐయాం సారీ’ చెప్తూ తలెత్తి అతని మొహాన్ని చూసిన ఎమిలీ నిశే్చష్టురాలైంది.
తనని అలా వింతగా చూసే ఆమెని అతను ప్రశ్నించాడు.
‘ఏమైంది?’
తన కల్లో చూసిన వ్యక్తి ఆ యువకుడే అని తెలీగానే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
* * *
ఆ రాత్రి ఆమె ఇంట్లో వంట చేసుకుంటూంటే తలుపు చప్పుడు వినిపించింది. తలుపు తెరచి చూస్తే అతనే.
‘మళ్లీ పడిపోకండి. పొద్దున్న మీకేమైంది? నా వల్ల ఏదైనా హాని జరిగితే అపాలజీ చెప్పడానికి వచ్చాను’ అతను నవ్వుతూ చెప్పాడు.
‘మీ వల్ల కాదు.’
‘సంతోషం. మీ టేబుల్ మీది నేమ్‌ప్లేట్‌లోని పేరుని చూసి టెలీఫోన్ డైరెక్టరీలో మీ అడ్రస్ చూసి వచ్చాను.’
‘నేను అయోమయంలో ఉన్నాను. మిమ్మల్ని ఇది వరకు ఎప్పుడో చూసాను’ ఎమిలీ చెప్పింది.
‘ఏమో మరి? నేను ఆర్నెల్ల క్రితం గ్లాస్కో నించి ఇక్కడికి వచ్చాను. నా ఆరో ఏట మా అక్క పెళ్లికి లివర్‌పూల్ వెళ్లాను. అక్కడ చూసారేమో?’
‘హాస్యం కాదు. నా కల్లో మిమ్మల్ని చూశాను.. అదీ పీడకల్లో.. మీరు నవ్వుతున్నారు’ ఎమిలీ కోపంగా చెప్పడం ఆపింది.
‘లేదు లేదు చెప్పండి. నన్ను అయోమయంలో పెట్టారు. మీరెప్పుడూ నా కల్లోకి రాలేదు. బహుశ నాలా కనపడే ఇంకెవరో మీ కల్లోకి వచ్చుంటారు. ఇంకోసారి వాడు వస్తే చంపేస్తానని చెప్పండి. నాకు అసూయ ఎక్కువ’ చెప్పి వెళ్లిపోయాడు.
కొన్ని క్షణాల తర్వాత తలుపు చప్పుడు విని దాన్ని తెరిస్తే అతనే.
‘మనం టివిలో ప్రేక్షకుల ముందు అయోమయంగా ఉన్న పాత్రల లాంటివాళ్లం. వాళ్లు మనల్ని చూసి నవ్వుతారు. కాని చివరికి అంతా ఆనందంగానే ముగుస్తుంది’ అతను చెప్పాడు.
‘మీరు టీ తాగుతారా?’ ఆమె నవ్వి అడిగింది.
‘తప్పకుండా’
‘కాని నాకు వచ్చిన కల అలాంటిది కాదు’
‘నేను కలల్ని నమ్మను. మీరు నాకు టీ బాకీ కాబట్టి దాని కోసం మళ్లీ కలుస్తాను’ చెప్పి అతను వెళ్లిపోయాడు.
* * *
‘నా కల్లో ఇవాళ కొంత భాగం నిజం అయింది. ఆ కల్లో నేను మీ భార్యని. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు’ ఎమిలీ చెప్పింది.
‘మనం పెళ్లి చేసుకోకపోతే మన విధి మారుతుందా?’ హేరీ అడిగాడు.
‘మారదనుకుంటాను’
‘సరే. మీరు చెప్పినట్లుగా నేను తీవ్రంగా గాయపడ్డాను’
‘గాయపడి మీరు మరణించారు’
‘మరణించానని నీకెలా తెలుసు? మీరు డాక్టరా?’
‘కాదు. కాని అనిపించింది.’
‘నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడ్ని. ఇంత దాకా ఒక్క రోగం కూడా రాలేదు. చిన్నప్పుడు వచ్చే మీజిల్స్ సహా. బహుశ నేను తొంభై ఏడవ ఏట ఆరు తరాలని చూసాకే మరణిస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటే మీకది రుజువు చేస్తాను. మన వైవాహిక జీవితం అందమైన కల్లా చేస్తాను. మీ కల్లో నేను ఎవరన్నారు?’
‘యుద్ధంలో గాయపడ్డ సైనికుడు’
దినపత్రికలోని ‘మ్యూనిక్ నించి తిరిగి వచ్చిన బ్రిటీష్ ప్రధానమంత్రి ఛాంబర్‌లైన్. హిట్లర్‌తో శాంతి ఒడంబడిక’ అనే వార్తని చూపించాడు.
ఆమె అతన్ని పెళ్లి చేసుకోడానికి అంగీకరించింది.
వారి పెళ్లైన కొద్ది కాలానికి ఆమెకి ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్లు వినిపించాయి. ఐతే ఆమె పక్కనే ఉన్న హేరీకి అది వినపడలేదు. భార్య చెప్పినా నమ్మలేదు.
* * *
రెండో ప్రపంచ యుద్ధం మొదలవగానే హేరీ సైన్యంలో చేరాడు. ప్రత్యేక శిక్షణకి వెళ్లే భర్తతో ఎమిలీ చెప్పింది.
‘జాగ్రత్త’.
‘నేను వెళ్లేది శిక్షణకే. యుద్ధ రంగానికి కాదు’
శిక్షణ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక అడిగాడు.
‘నీ కల్లో నేను కెప్టెన్ కదా?’
‘అవును. నీతో వచ్చిన వ్యక్తి. లెఫ్టినెంట్. ఎందుకు అడిగావు?’
తనకి కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చిన కాగితాన్ని చూపించి చెప్పాడు.
‘్భయపడకు. ఆ ఇల్లు ఎక్కడ ఉంది?’
‘ఫ్రాన్స్‌లో’
‘నేను ఫ్రాన్స్‌కే వెళ్తున్నాను’
‘ముందే ఎందుకు చెప్పలేదు?’ ఎమిలీ ఆందోళనగా అడిగింది.
‘అది రహస్య మిషన్. భార్యకి చెప్పినా నన్ను కోర్ట్‌మార్షల్ చేస్తారు’
‘ఇక నించి ఏ విషయం నా దగ్గర దాచద్దు. నేను మరణించేదాకా. మాటివ్వు’ ఆమె కోరింది.
* * *
వారం రోజుల తర్వాత ఆమెకి ఇంటి బయట యూనిఫాంలో కారు దిగే ఆకారం కనిపించింది.
ఆనందంగా హేరీ అని అరుస్తూ బయటకి పరిగెత్తింది. హేరీ కాదు. మరో వ్యక్తి.
‘మీరేం వార్త తెచ్చారో నాకు ఎప్పుడో తెలుసు. మీరు వస్తారని కూడా నాకు తెలుసు’ ఎమిలీ ఏడుస్తూ చెప్పింది.
* * *
మిలటరీ కల్నల్ ఆమెని మళ్లీ ప్రశ్నించాడు.
‘12 ఆగస్ట్. మంగళవారం. ఆ ఎయిర్‌రైడ్‌లో మీ భర్త హేరీ మరణిస్తారని మీకు కల ద్వారా తెలిసిందని నమ్మమంటారు. హేరీ మాటిమాటికీ ఆ సమయంలో ఆ రోజు అక్కడ శత్రువులు ఎయిర్ రెయిడ్ చేయడం వల్ల తను మరణించచ్చని అనేక మందితో పదేపదే చెప్పాడు. అది కూడా మీరు చెప్పారనే చెప్పాడు. సరిగ్గా అలాగే జరిగింది.’
మిలటరీ సైకాలజిస్ట్ కూడా ఆమెని ప్రశ్నించాడు కాని చాలా ప్రశ్నలకి అతనికీ జవాబులు దొరకలేదు.
ఎమిలీ మరోసారి తన జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే, మరో విధిని ఎన్నుకున్నా చివరకి అది ముందే నిర్దేశించబడ్డ నిధి వైపునకే మళ్లేదా? ఆమెకి ముందుగా తన కాబోయే భర్త గురించిన కల ఎందుకు వచ్చింది? తన పక్కనే ఉన్న భర్తకి వినపడని ఎయిర్ రెయిడ్ సైరన్స్ ఎందుకు వినిపించాయి? వాటి ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకి జవాబు దేవుడికే తెలియాలి.