నమ్మండి! ఇది నిజం!!

ది బర్నింగ్ గర్ల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో ఏటా ఎలాంటి కారణం లేకుండా డజను దాకా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతూంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లు వాటికి సరైన కారణాలని కనుక్కోలేరు.
1921లో ఇలాంటి అకారణ అగ్ని ప్రమాదాలు కొన్ని జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి ఓ షాప్‌లో జరిగింది. ఫైర్ చీఫ్‌కి దానికి కారణం వివరిస్తూ ఆ షాప్ యజమాని ఇలా చెప్పాడు.
‘కొందరు స్కూలు విద్యార్థులు ఇందాక షాప్‌కి వచ్చారు. ముగ్గురు మగ విద్యార్థులు ఓ అమ్మాయిని టీజ్ చేస్తూంటే ఆమె కోపంగా చూసింది. అకస్మాత్తుగా ఈ కార్టన్ దానంతట అదే అంటుకుంది’
‘పిల్లలు ఎవరైనా అగ్గిపుల్లని గీసి పడేసారేమో?’ ఫైర్ చీఫ్ అనుమానం వ్యక్తం చేశాడు.
‘పడేస్తే అంత త్వరగా అంటుకోదు. అకస్మాత్తుగా అందులోంచి మంటలు వచ్చాయి’ షాప్ అసిస్టెంట్ చెప్పాడు.
‘ఆ అమ్మాయి పేరేమిటి?’
‘ఆలిస్’
‘ఎక్కడ ఉంటుంది?’
‘ఈ సందు చివర’
ఆ ముగ్గురు విద్యార్థుల పేర్లు కూడా ఫైర్ చీఫ్ అడిగి రాసుకున్నాడు.
షాపులోంచి బయటకి వచ్చిన ఆలిస్ తన స్నేహితురాలిని అడిగింది.
‘విన్నావుగా. నేనేమైనా తప్పు చేసానా?’
‘ఏం తప్పు?’ మిత్రురాలు అడిగింది.
‘నిప్పు’
‘దానికి, నీకు సంబంధం ఉందని నేను అనలేదే? ఎందుకు దాన్ని అంతగా పట్టించుకుంటావు? మా ఇంటికి హాలోవిన్ పార్టీకి రావడం మాత్రం మానక’ మిత్రురాలు విడిపోయే ముందు చెప్పింది.
ఇంటికి ఆలస్యంగా వచ్చిన ఆలిస్‌ని ఆమె సవతి తల్లి కోప్పడింది. అంతా భోజనానికి కూర్చున్నారు. డోర్ బెల్ మోగితే తండ్రి లేచి వెళ్లాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చిన ఆయన ఆలిస్ మీద కోపంగా అరిచాడు.
‘ఇందాక జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆ షాపులో ఆ సమయంలో ఉన్న స్కూలు పిల్లలు అందరిళ్లకీ వెళ్లి విచారిస్తున్నారు. అందులో నీ ప్రమేయం లేదని చెప్పి పంపించాను. ఎన్నిసార్లు నేను నిన్ను రక్షించాలి? అబద్ధం చెప్పకు. ఆ అగ్గిపుల్లని నువ్వే గీసి పడేసావు. అవునా?’
‘లేదు. నేను విసరలేదు’ ఆలిస్ చెప్పింది.
‘మరా ప్రమాదాన్ని ఎలా సృష్టించావు? ఇది వరకు కూడా నువ్వు ఇలాంటి పనులే చేసావు. గత నాలుగేళ్లుగా నేను నిన్ను కాపాడుతూ వస్తున్నాను. నువ్వు మనందరికీ అవమానకరమైన ఇలాంటి పని మరోసారి చేస్తే నేను నిన్ను కాపాడను’
‘అది నా పని కాదు’ ఆలిస్ ఏడుస్తూ చెప్పింది.
* * *
తన స్నేహితురాలు ఇంట్లో జరిగే హేలోవిన్ పార్టీకి ఫేన్సీ డ్రస్ వేసుకుని వెళ్లే ఆలిస్‌ని ఆమె సవతి తల్లి ఆపింది. డ్రస్‌ని చూసి కోప్పడింది. ఆమె తండ్రి అలాంటి డ్రెస్‌లో పార్టీకి వెళ్లడానికి ఒప్పుకోడని, పార్టీకి వెళ్లద్దని శాసించింది.
‘మా నాన్నకి కాదు. నీకే ఇష్టం లేదు’ ఆలిస్ కోపంగా అరిచింది.
‘మీ అమ్మ మీ నాన్నతో పోట్లాడి వేధించినట్లుగా నువ్వు నాతో పోట్లాడి వేధించకు’
‘ఇందులోకి మా అమ్మని తీసుకురాకు’
‘మీ అమ్మ చాలా చెడ్డది. ఆ చెడ్డతనం నీకూ వచ్చింది.’
ఆలిస్ కోపంగా బయటకి వెళ్లిపోయింది. కోపంగా ఉన్న ఆమె పార్టీకి వెళ్లలేక దారిలోని ఓ షెడ్‌లోకి వెళ్లింది.
‘వెళ్లు. ఇక్కడ నీకేం పని?’ ఫైర్ ప్లేస్‌కి కట్టెపుల్లల్ని తీసుకోడానికి వచ్చిన దాని యజమాని కసిరాడు.
అసలే కోపంగా ఉన్న ఆమె కోపం రెట్టింపై తీక్షణంగా చూసింది. వెంటనే షెడ్‌లో మంటలు చెలరేగాయి. ఆమె ఏడుస్తూ బయటకి పరిగెత్తుకు వెళ్లిపోయింది.
ఆలిస్ తండ్రి ఇంటికి రాగానే అంత దాకా ఆమె సవతి తల్లితో మాట్లాడిన ఫైర్ చీఫ్ ఆయన్ని ప్రశ్నించాడు.
‘మీ అమ్మాయి పదకొండో ఏట నించి అగ్ని ప్రమాదాలు సృష్టిస్తోందని నేను పోయినసారి వచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? ఆమె ప్రమాదకరమైన మనిషి. జైల్లో పెట్టాలి’
మర్నాడు ఆలిస్‌ని హిప్నాటిస్ట్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆలిస్ తండ్రి చెప్పింది విని ఆయన ఆమెని హిప్నటైజ్ చేసాక అడిగాడు.
‘నువ్వు అన్నిటినీ తగలపెడుతున్నావా?’
‘లేదు. అవెలా జరుగుతున్నాయో కూడా నాకు తెలీదు. నా సవతి తల్లి నా మీద పడి నా డ్రెస్‌ని చింపేసింది. పార్టీకి వెళ్లద్దని శాసించింది. మా అమ్మ చెడ్డది కాదు. ఆవిడ అలా మాట్లాడకూడదు. అలా మా అమ్మని తిట్టకూడదు’ ఆలిస్ ఆవేదనగా చెప్పింది.
‘ఆలిస్ ఎవరి గురించి చెప్తోంది?’ హిప్నటిస్ట్ అడిగాడు.
‘నాకూ అర్థం కావడంలేదు’
హిప్నాటిస్ట్ సలహా మీద సవతి తల్లి ఆలిస్‌తో మాట్లాడింది.
‘లే. ఆలిస్. లే. అలా మాట్లాడకు’
హిప్నాటిస్ట్ ఆమెని మళ్లీ ట్రాన్స్‌లోంచి బయటకి తీసుకువచ్చాక ఆలిస్ సవతి తల్లిని చూసి కోపంగా చెప్పింది.
‘వెళ్లిపో. నన్ను బాధ పెట్టడానికి నువ్వు మా అమ్మ గురించి కావాలని చెడ్డగా మాట్లాడావు. ఆమె చెడ్డది కాదు. అది జరగాలని కావాలని నాకు కోపం తెప్పించి బయటకి పంపావు. ప్రతీసారి కోపం తెప్పిస్తున్నావు’
‘ఏది జరగాలని?’ తండ్రి ప్రశ్నించాడు.
సవతి తల్లి ఆలిస్‌ని సముదాయించే మాటలు చెప్తున్నా, ‘నువ్వు చెడ్డదానివి. వీళ్ల ముందు ఇలా నటిస్తున్నావు’ అని ఆలిస్ ఉగ్రంగా, ఆవేదనగా చెప్పింది. అకస్మాత్తుగా ఆలిస్ పడుకున్న మంచం మీది పరుపు అంటుకుని మంటలు లేచాయి. ఆలిస్ అరుస్తూ మంచం మీంచి దిగింది. వెంటనే హిప్నాటిస్ట్, ఆలిస్ తండ్రి ఆ మంటలని ఆర్పేసారు.
‘చూసారుగా? నిప్పు దానంతట అదే రాజుకుంది’ తండ్రి ఆశ్చర్యంగా చెప్పాడు.
‘దానంతట అదే కాదు. ఆలిస్‌లో ఏదో దెయ్యం ఉంది. లేదా ఆలిస్ మంత్రగత్తె. అది తలచుకుంటే అగ్ని ప్రమాదాన్ని సృష్టించగలదు’ సవతి తల్లి క్రోధంగా చెప్పింది.
‘ఇది నీకు తెలుసా? ఇంత కాలం నాకు చెప్పలేదే?’ ఆలిస్ తండ్రి ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఆమె మంత్రగత్తె కాదు. అమాయకురాలు’ హిప్నటిస్ట్ చెప్పాడు.
‘కాని ఇక్కడ నిప్పు దానంతట అదే అంటుకోవడం చూసాను’ తండ్రి అయోమయంగా చెప్పాడు.
‘మనమంతా చూసాం’ హిప్నటిస్ట్ చెప్పాడు.
‘ఎలా అంటుకుంది?’ ఆయన అడిగాడు.
‘నాకు తెలీదు’ హిప్నటిస్ట్ చెప్పాడు.
నిజానికి ఎవరికీ తెలీదు. ఆలిస్‌కి మాత్రమే ఈ ప్రత్యేకత లేదు. తమలో తీవ్ర కోపం లేదా ఆవేదన కలిగిన వ్యక్తి అగ్ని ప్రమాదాన్ని తమకి తెలీకుండానే సృష్టించే సమర్థత ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది. బహుశ తనని తను కాపాడుకోవల్సిన స్థితికి చేరుకున్నప్పుడు కొందరిలో ఆ శక్తి బయట పడుతూంటుంది. ఇది థియరీ మాత్రమే. కొనే్నళ్ల తర్వాత ఆలిస్‌కి పెళ్లై ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమె ఆనందంగా, శాంతిగా జీవించింది. భద్రతా భావం కలిగాక ఆమెలోని ఆ శక్తి మళ్లీ ఎన్నడూ బయటకి రాలేదు. ఇలా కొందరికి ఎందుకు జరుగుతుందో దేవుడికే తెలియాలి.
(అకస్మాత్తుగా ఇసుక, రాళ్లు పడటం, దణ్ణెం మీది బట్టలు తగలబడటం లాంటి దయ్యపు చేష్టలని ఇండియాలో కొందరు చూసారని రికార్డైంది)