నమ్మండి! ఇది నిజం!!

అతను ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరప్‌లోని ఏభై వేల జనాభా గల ఆ నగరంలో ఉదయం 8.32 కి భూకంపం వచ్చింది. రెండు నిమిషాల్లో నగరంలోని చాలా భవంతులు కూలిపోయాయి. అంతర్జాతీయ సహాయక బృందాలు ఆ నగరానికి చేరుకున్నాయి. పనె్నండు రోజుల తర్వాత నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా శిథిలాలని డైనమైట్లతో నేలమట్టం చేసి బుల్‌డోజర్లతో చదును చేయడాన్ని ఆరంభించారు. శిథిలాల్లో చిక్కుకున్న వాళ్లు నీళ్లు, ఆహారం లేకుండా అన్ని రోజులు బతక్కపోవచ్చని వాళ్లు అనుకున్నారు. ఇద్దరు సహాయకులు బుల్‌డోజర్ వచ్చే మార్గంలోని ఓ శిథిల భవంతిలో డైనమేట్ అమర్చి రెండుసార్లు ప్లంజర్ నొక్కినా అది పేలలేదు. వాళ్లు కొద్దిసేపు వేచి ఉండి వైర్‌ని సరిగ్గా అమర్చలేదేమోనని పారలతో అక్కడికి చేరుకున్నారు.
వాళ్లు లోపలికి వెళ్లగానే హెల్ప్ అనే మగ కంఠం వినిపించింది. భూమిలోకి కృంగిపోయిన కింది అంతస్థు రూఫ్‌ని పగలకొడితే అక్కడ భార్యాపిల్లలతో ఉన్న ఒకతను కనిపించాడు. సహాయకులు నిచ్చెన వేసుకుని కిందకి దిగారు.
‘నేను టీచర్ని. మీరు వస్తారని నాకు తెలుసు’ అతను చెప్పాడు.
‘ఎలా తెలుసు? దీన్ని పేల్చేయబోయాం’ వాళ్లు అడిగారు.
ఆ టీచర్ ఓ వైపు చూపిస్తే అక్కడో శవం కనిపించింది.
‘మీరు తవ్వడం ఆరంభించే దాకా అతను బతికే ఉన్నాడు. ఇప్పుడే పోయాడు. మీ ఇద్దరూ నిచ్చెనతో వచ్చి రక్షిస్తారని పనె్నండు రోజులుగా చెప్తున్నాడు.’
ఆ శిథిలాల్లో అన్ని రోజులుగా చిక్కుపడటంతో అతని మతిస్థిమితం కొద్దిగా తగ్గిందని ఆ సహాయకులు భావించారు. బలహీనంగా ఉన్న వాళ్లందర్నీ వాళ్లు పైకి మోసుకెళ్లారు. తర్వాత శవం జేబులు వెదికారు. అతని ఐడి కాగితాలు ఏమీ లేకపోవడంతో అతను ఎవరో తెలుసుకోవడానికి ఓ సహాయకుడు ఆ శవం వేలిముద్రలు తీసుకున్నాడు.
‘ భూకంపం ఆరంభం కాగానే అతను ఇక్కడికి వచ్చాడు. అంతకు మునుపు ఎన్నడూ అతన్ని చూడలేదు. ఏక్సెంట్‌ని బట్టి అమెరికన్ అని అనుకున్నాను. భోజనం లేకపోయినా అతను మమ్మల్ని ప్రోత్సహిస్తూ జోక్స్ చెప్తూ మేము నిరాశకి గురవకుండా చేసాడు’ తేరుకున్నాక టీచర్ చెప్పాడు.
* * *
ఆ వేలిముద్రలని అమెరికాలోని ఎఫ్‌బిఐ కి పంపారు. వాళ్లా వ్యక్తిని గుర్తించగలిగారు. 30 జూన్ 1935న అరెస్ట్ అయి మరణశిక్ష పడ్డ కోల్ అనే నేరస్థుడి వేలిముద్రలు అవి. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి అమెరికాలో మరణించిన వ్యక్తి వేలిముద్రలు, ఆరు వేల మైళ్ల దూరంలోని యూరప్‌లోని ఆ వ్యక్తి వేలిముద్రలు ఒకటే ఎలా అయ్యాయి? ఈ ప్రశ్నకి వాళ్లకి జవాబు తెలీలేదు.
కోల్‌కి సంబంధించిన ఫైల్ తీసి ఎఫ్‌బిఐ వారు సహాయక బృందంలో వెళ్లిన అమెరికన్స్‌కి అతని ఫొటో చూపిస్తే, అక్కడ మరణించిన వ్యక్తి అతనే అని చెప్పారు. కోల్‌కి కవల సోదరుడు లేడు. ఉన్నా వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఆ ఫైల్‌లో మరిన్ని వివరాలు ఉన్నాయి.
కోల్ దొంగతనం చేస్తూ ఓ మనిషిని చంపినందుకు మరణశిక్ష పడింది. అతను మరణానంతరం తన కళ్లని, ఇతర అవయవాలని దానం చేయాలని అనుకుని అందుకు అనుమతించే కాగితాల మీద సంతకం చేశాడు. అతని క్షమాపణ అభ్యర్థన గవర్నర్ ఆఫీస్‌లో ఉంది. అతని అవయవ దానం గురించి తెలిసాక ఇరవై వేల మంది అతని మరణశిక్షని రద్దు చేయాలని సంతకాలతో గవర్నర్‌కి అభ్యర్థన పత్రాన్ని పంపారు. మరణశిక్షకి గంట ముందు గవర్నర్ కోల్ శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడని ఉత్తర్వు అందింది.
అతని కార్నియాని స్వీకరించడానికి ఎంపిక చేయబడ్డ పదిహేనేళ్ల అమ్మాయి తల్లి చేత కోల్‌కి ఉత్తరం రాయించింది. అతని మరణశిక్ష రద్దైనందుకు, తనకి అతని కార్నియాని దానం చేయడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసే ఉత్తరం అది. ఇలా అభినందించే అనేక ఉత్తరాలు అతనికి అందాయి.
వాటిని చదివినప్పుడల్లా కోల్ బాధపడేవాడు. వాళ్లు పొగిడినట్లుగా తను దాతృత్వ బుద్ధితో కాక, చాలా యధాలాపంగా దానికి అంగీకరించాడు. మనస్సాక్షి అతన్ని బాధపెట్టసాగింది. ఓ రాత్రి గార్డ్ చూస్తే అతని సెల్ తలుపు తీసి ఉంది. అందరి కళ్లుకప్పి ఎలా పారిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. ఐతే అతను పారిపోయిన కొన్ని వారాల తర్వాత న్యూయార్క్ నించి బయలుదేరే ఓడలోకి ఎక్కబోతూండగా పోలీసులు వెంటాడి కాల్చి చంపారు. ఫారెస్ట్ గ్లెన్ సెమట్రీలో అతని శవాన్ని ఖననం చేశారు.
* * *
ఆ ఫైల్‌లో ఇంకా అనేక రిపోర్ట్‌లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం రోమ్‌లోని ఓ బీదలవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ గుడ్డిపిల్లని రక్షించి మరణించిన ఓ అమెరికన్ వేలిముద్రలని రోమ్ పోలీసులు ఎఫ్‌బిఐకి అందజేశారు. అవి కోల్ వేలిముద్రలే.
రెండేళ్ల క్రితం సెంట్రల్ మెక్సికోలోని ఓ దినపత్రికలో ఓ వార్త వెలువడింది. ఓ హంతకుడు పిల్లల స్కూల్లోకి తుపాకీతో ప్రవేశించి వాళ్లని చంపుతానని బెదిరిస్తూంటే, ఒకతను అతనికి ఎదురు వెళ్లి అతన్ని కాల్చి తనూ చంపబడ్డాడనే వార్త అది. అందులో ప్రచురితమైన ఫొటో కోల్‌దే. నల్ల జుట్టు, నీలంరంగు కళ్లు, ముప్పై ఐదేళ్ల వయసు మొదలైనవన్నీ కోల్‌కి సరిపోయాయి.
ఇంకా తమ దృష్టికి రాని ఎన్ని చోట్ల ఎందర్నో కాపాడిన వివరాలు ఆ ఫైల్లో ఉన్నాయి.
7 జులై 1907లో పుట్టి 14 జనవరి 1938లో మరణించిన జెరోమి కోల్ ఏమయ్యాడు? అతను మరణించిన తర్వాత తీసిన బొటనవేలి ముద్ర, 1961లో అక్కడికి ఆరు వేల మైళ్ల దూరంలోని భూకంపం వచ్చిన ఇంట్లో మరణించిన వ్యక్తి వేలిముద్రలు, ఒకటే. 3 మే 1955లో బ్రెజిల్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి వేలిముద్రలు, అర్జెంటీనాలో 9 ఏళ్ల క్రితం ఉరి తీయబడ్డ ఖైదీ వేలిముద్రలు ఒకేలా ఉన్నాయనే వార్త కూడా వెలువడింది.
హంతకుడు కోల్, అనేక చోట్ల అనేక మందిని కాపాడిన ఆ వ్యక్తి ఒకరేనా? లేక వేరువేరు వ్యక్తులా? ఐతే ప్రపంచంలోని ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి ఇదెలా సాధ్యం? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.