అక్షర

చీకట్లో ‘నారింజరంగు సాయంత్రాలు’ అన్వేషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారింజ రంగు సాయంత్రాలు
కవితా సంపుటి
డా.బండి సత్యనారాయణ
వెల: రూ.100/-
ప్రతులకు: విశాలాంధ్ర
బుక్ హౌస్ అన్ని శాఖల్లో

జీవితాన్ని అక్షర స్పర్శతో సంభాషించిన ప్రతిసారీ రాటుదేలిన భౌతిక వాస్తవాలు కఠోర సత్యాలుగా సాక్షాత్కరించి కాంతులీనుతాయి. వర్తమాన సామాజిక వ్యవస్థలో అనుక్షణం మొగ్గతొడుక్కున్న జీవన సంఘర్షణలకు ప్రతిబింబాలుగా ఇవి గాయాల రాపిడితో రాటుదేలుతు అనుభవాలుగా కలవరించి పలవరించడం మొదలుపెడతాయి. వీటికి ఆద్యంతాల మలుపుల జాడ తెలుసు. స్వీకరించిన సందర్భాల లోతుల కష్టనష్టాల తడి రుచులు తెలుసు. తెలియనిదల్లా భవిష్యత్తును బొమ్మకట్టించే జీవన అస్పష్ట వైఖరి ముఖచిత్రమొక్కటే! ఇలాంటి తడుములాటలోంచి మొదలైందే ఈ కవితానే్వషణ. ఈ దృక్పథానికి నిలువెత్తు అక్షరసాక్ష్యమే ఈ ‘నారింజ రంగు సాయంత్రాలు’ కవితా సంపుటి. దీని కవి డా.బండి సత్యనారాయణ. యాభై ఏళ్ల జీవన-సాహితీ ప్రస్థానాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంపుటి వెలుగుచూసింది! ఇందులో 52 కవితా శీర్షికలు ఉన్నాయి. వీటిలో సామాజిక స్థితిగతుల వెతల కథలను కాచి ఒడబోసిన సుదీర్ఘ నేపథ్య అనుభవాలు ఆకర్షీకరించబడ్డాయి.
‘‘ఇదిగో నా చేయి
ఇవిగో మరికొన్ని పిడికిళ్లు
ఎక్కుపెట్టు
నీలో దాగి ఉన్న ఆయుధాన్ని’’ అంటారు ‘అడవిలో’ అనే కవితలో. సమర శంఖారావాన్ని పూరించడానికి ఒక కవికి ఇంతకంటే స్ఫూర్తిదాయకమైన పిలుపు అక్కర్లేదు కవి చెయ్యి, మరికొన్ని పిడికిళ్లూ సమూహానికి చేరువగా నిలిచినప్పుడు మనలో ఉన్న ఆయుధాన్ని చైతన్య పతాకాలుగా ఎగరేయాలని ఈ కవితా పాదాల సారాంశం. వర్తమాన కాలానికి ఇలాంటి కవితాత్మక కలాల వాడి చూపే కావాలి. భవిష్యత్తు ప్రకాశవంతం కావాలంటే ఇమాత్రం దిశానిర్దేశనం అవసరమే. ఈ ఆవశ్యకతనే ఇక్కడ నొక్కి చెబుతారు కవి బండి సత్యనారాయణగారు.
‘ఎప్పుడిస్తావు’ కవితలో కవి నిరీక్షణ కొత్త సృష్టికి బాటలు పరుస్తుంది.
‘‘చూరు నుంచి రాలుతున్న/ చీకటి జలపాతం కింద
ఎన్ని శతాబ్దాల నుంచో
నేనిలా
నిరంతర నిరీక్షణలో’ అని చెబుతారు ఓ చోట. శతాబ్దాల కాలంనుంచి నిరీక్షించే ఓ సుదీర్ఘ సన్నివేశానికి అక్షర రూపమిచ్చే సందర్భాన్ని తేటతెల్లపరుస్తారు కవి. చూరుకింద రాలుతున్న చీకటి జలపాతాన్ని గతానికి ప్రతీకగా చేసుకుని భవిష్యత్తుకి దారులుపరిచే దూరదృష్టిని ఎదురుచూపుగా మలిచే ఫ్రయత్నం చేస్తారు. సందర్భం ఏదైనా సంఘర్షణ అంతర్ముఖ చిత్రమే ప్రధానమిక్కడ. దీనిని కవితామయం చెయ్యడానికి వర్తమానాన్ని వేదికగా ఎంచుకున్నారు కవి సత్యనారాయణ.
స్ర్తిని కేంద్రబిందువుగా చేసి ఒక అందమైన ఉపమానలంకారాన్ని దృశ్యరూపంలో పరుస్తారు డా.బండి.
‘‘ఆకాశం కురుల పురివిప్పగానే
అన్ని గదుల్లోను దీపాలుపెట్టి
ఇంట్లో స్వర్గం నిర్మిస్తుంది’’అంటూ వర్ణించి చెబుతారు ఓచోట. ఆకాశం కురులపురి అనగానే స్ఫురించేది అంధకారానికి సంకేతమైన చీకటి రాత్రి. ఆవేళ అన్ని గదుల్లోను దీపాలను వెలిగించి ఇంటిని ప్రకాశవంతమైన కాంతులతో స్వర్గాన్ని తలపించేలా నిర్మిస్తుందని పోల్చిచెబుతారు కవి. ఇందులో సౌందర్యాత్మకమైన ధ్వని ఉట్టిపడుతుంది. కళాత్మకమైన ఊహ ఆకృతి దాల్చుతుంది. ఈ ఊహ సృజనాత్మక దృశ్యరూపానికి బలాన్ని చేకూరుస్తుంది.
‘పూలవాన’ కవితలో కవి భావుకత పరాకాష్ట దశకు చేరుకుంటుంది.
‘‘పారేసుకున్న చిరునవ్వు
తాళంవేసిన మీ ఇంటి గేటు లోపలుందేమో
ఒకసారి వెదికిచూడు’’అని అంటారు సత్యనారాయణ. ఈ కూర్పులో భావుకత నిండిన మెరపులాంటి విరుపు పాఠకుల్ని సమ్మోహనపరుస్తుంది. లోలోపటి భావోద్వేగాల్ని సున్నితమైన పలకరింపుతో సుతారంగా మనసుల్ని మెలిపెట్టి తియ్యటి అనుభూతికి గురిచేస్తుంది. అప్రయత్నంగా పారేసుకున్న చిర్నవ్వు ఇంటి గేటులోపలే తిరుగాడుతుందనే భావన ఇందులో ప్రతిధ్వనిస్తుంది. కవిలోని సృజనాత్మక ఆలోచనకు ఇది దర్పణం పడుతుంది.
‘దృశ్య బంధనం’ శీర్షికలో కవి లోచూపు ఇలా ఉంటుంది.
‘‘చూపు ఒక ఏంటీ వైరస్
వైరస్‌ను ఇట్టే పసికట్టాలి
చూపు చిట్లిపోతే
దృశ్యం ఛిద్రమవుతుంది’’అని చెప్పడంలో శక్తివంతమైన వైరస్ ప్రభావ తీవ్రతను పరిశీలనాత్మక దృష్టితో పసిగట్టాలని అభిప్రాయపడతాడు కవి. చూపుకీ దృశ్యానికీ మధ్య తొంగిచూసే అవినాభావ సంబంధాన్ని హెచ్చరిక రూపంలో వాస్తవీకరించే ప్రయత్నం చేస్తాడు కవి. అంతర్గతమైన భావ సంఘర్షణకి అక్షరరూపమే ఈ మేలుకొలుపు. ఈ ఒడుపును చాలా నేర్పుగా అందిపుచ్చుకున్నారు కవి బండి సత్యనారాయణ.
ఇలా బహుముఖ పార్శ్యాలను కవిత్వరూపంలో ప్రదర్శించడంలో అందెవేసిన చెయ్యి సత్యనారాయణది. ఈ కవితాక్షరాల విరుపులో హృదయాల్ని తట్టిలేపే కవితావాక్యాలు అనేకం ఈ సంపుటిలో ఉన్నాయి.
‘‘నింగిలో నక్షత్రాల పూల తోట విరిసింది’’, ‘‘వెనె్నల్లో ఏడురంగులూ ఉంటాయి/ నువ్వే చిత్రించాలి ఇంధ్రధనస్సు’’, ‘‘దేశం క్షేత్రంలా తపిస్తుంది’’, ‘‘రాని కలకోసం/ ఒక జీవిత కాలం నిరీక్షణ’’, ‘‘లేని జీవితాన్ని కలగనడం/చీకట్లో/నీడని వెతకడం’’, ‘‘నిశ్శబ్దం వెలిగింది’’, ‘‘రెప్పల మధ్య కరకరలాడిన ఇసుక రాత్రులు’’, ‘‘ఒక పగలు/ఒకరేయి తప్ప/ఎక్కడుంది జీవితం’’, ‘‘ప్రతి దేహం విరగబూసిన/గాయాల పంటచేనే’’, ‘‘తెల్లారినా కూడా/చీకటినే ఈదుతూ/బతుకు తీరాన్ని వెతుక్కోవడం’’, ‘‘మూగబోయిన గొంతులో కాసిన్ని నీళ్లుపోసి/తీపి రాగాలు పలికించడం’’, ‘‘గడియారంలో ఇరుక్కుపోయిన కాలంలా/నా చుట్టూ నేను తిరుగుతుంటాను’’, ‘‘పాదాల్లేని పడవని/నది చేయి పట్టుకుని/అవతల ఒడ్డుకి చేరుస్తుంది’’, ‘‘తీరం తిప్పికొట్టినా/కెరటం తిరిగొచ్చి ముద్దిస్తుంది’’, ‘‘రెండు హృదయాల మధ్య చిన్న పూల వంతెన నిర్మించలేకపోతున్నాను’’, ‘‘దుఃఖం దావాలనంలా ఎగిసిపడింది’’, ‘‘గాలి పాడిన పాట/చెట్ల శిరస్సుల మీంచి ప్రవహించినట్టు’’, ‘‘వెలుతురు జలపాతం ఇంకిపోయి/చీకటి చెట్టు మొలిచింది’’, ‘‘ముఖాలమీది నెలవంక’’, ‘‘దేశం/కల్పిత చరిత్ర/బతుకు/ నమ్మలేని నిజం’’, ‘‘రాలుతూనే ఉంటాయి/ పూలూ ముళ్లు/పూలను ఏరుకోవడమే జీవితం’’, ‘‘అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్టు/కలలో జీవితాన్ని చూడాలని/పిసరంత ఆశ’’, ‘‘ఆకలి బతుకుల/రక్తపుటేరువాక’’, ‘‘అడుగులు ఆగిపోయినప్పుడు/కొత్తదారిని వెతుక్కోవడం’’, ‘‘బతకడం వ్యసనమైతే తప్ప/ఈ అడవిలో/నువ్వు బతికి బట్టకట్టలేవు’’, ‘‘మనసుకి/మల్లెపూలదండ వెయ్యి’’, ‘‘ప్రతి ఉదయం ఒక పుట్టుక/ప్రతిరాత్రి ఒక మరణం’’, ‘‘కాలువలోంచి నీళ్లు గలగలా దొర్లినట్టు/కిలకిలా నవ్వులు’’, ‘‘విరబూసిన పూలు/చెట్టు కళ్లల్లో మెరిసే కలలు’’, ‘‘వాన చినుకుల్లా రాలిపడే క్షణాలకు/తీపి రంగులు అద్దుతూ/ టీ కప్పుతో వేడివేడి ఊసులు’’ ‘‘రాత్రిని కంటిమీద కునుకేయనివ్వవు’’, ‘‘నిశ్శబ్దంగా/ చెట్ల ఆకులమీంచి జారుతున్న/ చిక్కని చీకటి’’, ‘‘రాళ్లను పూలుగా/మార్చుకునే రహస్యంకోసం’’, ‘‘నీకు తెలియదు/ఎదురుచూపులో/ఎగిసిపడే అగ్నికీలల నరక స్పర్శ’’, ‘‘మనిషికీమనిషికీ మధ్య/కరిగిపోతున్న మాటల మంచుపూలు’’, ‘‘తడిలేని క్షణాలు/గరుకుగా జారిపోతూనే ఉంటాయి, సంక్షుభిత సంధ్యల్లోకి’’, ‘‘పచ్చనాకుల మీద రాలే/ తొలి కిరణాల పుప్పొడి కోసం/చెట్టుగ మారి/నిత్యం తపస్సుచేయడం’’, ‘‘ శతాబ్దాల తడి దుఃఖంతో’’, ‘‘జీవితం ఎక్కడో ఉంటుంది/చెక్కని శిల్పంలా/నువ్వే శిల్పిగా మారాలి’’వంటి అపురూప వాక్యాలు వౌనంలో చూపునీ మనసునీ ఏకంచేస్తాయి. ఈ కవిత్వ ధారలోంచి ఆధునికత్వాన్ని పుణికి పుచ్చుకోవడం కవిగా డా.బండి సత్యనారాయణగారికే చెల్లింది.
కాబట్టే సత్యనారాయణగారి కవిత్వంలో విలక్షణత తొంగిచూస్తుంది. ఈ ఆవేశాన్ని బట్టబయలు చెయ్యడానికి అనుభూతిపరమైన ఆవేదన అంతర్లీన ప్రవాహంగా కరిగి అక్షరాలలో జ్వలిస్తుంది. బహుముఖ పార్శ్వాలతో మనసు లోతుల్ని తడిమి చూపిస్తుంది.

-మానాపురం రాజా చంద్రశేఖర్