జాతీయ వార్తలు

మీ ప్రచారానికి నిధులెక్కడివి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా, ఏప్రిల్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ రాహుల్ నిలదీశారు. ‘టీవీల్లో 30 సెకన్ల యాడ్(ప్రకటన)కు లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటివి మోదీ యాడ్‌లు టీవీల్లో ఎన్నో ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికీ మీకు సొమ్ములు ఎక్కడ నుంచి వస్తున్నాయి?’అని మోదీని ఆయన ప్రశ్నించారు. యూపీలోని ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాజ్‌బబ్బర్ తరఫున కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండోదశ కింద ఈనెల 18న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ‘ఎక్కడ చూసినా నరేంద్రమోదీ అడ్వర్‌టైజ్‌మెంట్లే. టీవీ లేదా పత్రికల్లో ప్రకటనలకు లక్షల్లో అవుతుంది. ప్రధానికి నిధులెక్కడ నుంచి వస్తున్నాయి?’అని రాహుల్ అడిగారు. యాడ్‌లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోదీ జేబులోంచి తెస్తున్నారా?అని కాంగ్రెస్ చీఫ్ మండిపడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రధాని ఆ సొమ్ములను నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ, లలిత్‌మోదీ, విజయమాల్యాకు దోచిపెట్టారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. హామీల అమలులో మోదీ ఘోరంగా విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. యువతకు ఇచ్చిన రెండకోట్ల ఉద్యోగాల హామీ, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల జమ హామీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆయన ధ్వజమెత్తారు. శుష్కవాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. ‘ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని నేను చెప్పను. ఉన్నవాస్తవానే్న నేను చెబుతున్నా. దేశంలోని పేద ప్రజల ఖాతాల్లో ఏడాదికి 72వేల రూపాయల జమ చేస్తామని మా పార్టీ కాంగ్రెస్ హామీ ఇస్తోంది’అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి నిధులెక్కడి నుంచి తెస్తారని మోదీ అడుగుతున్నారని పైగా మధ్యతరగతి వర్గంపై పన్నులు వేస్తారని ప్రచారం చేస్తున్నారని రాహుల్ విరుచుకుపడ్డారు. ‘మేం హామీ ఇచ్చిన కనీస ఆదాయ పథకానికి నీరవ్‌మోదీ, ఛోక్సీ, అనిల్ అంబానీ జేబుల్లోంచి సొమ్ములు తెస్తాం’అని కాంగ్రెస్ చీఫ్ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి పన్నుపోటు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. మోదీ 15 లక్షల రూపాయల జమ హామీ ఎవరికైనా అమలైందా?అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి అడిగారు. కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం సాలినా 72వేలు దేశంలోని నిరుపేదల్లో 20 శాతం మందికి లబ్ధి చేకూరుస్తుందని రాహుల్ అన్నారు. దేశంలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో ఉన్న నిరుద్యోగిత గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులు రాత్రనక పగలనక పనిచేస్తున్నా వట్టిచేతులతో మిగిలిపోతున్నారని, ఆదాయమంతా మరొకరు పొందుతున్నారని కాంగ్రెస్ చీఫ్ చెప్పారు. ధనికుల రుణాలు మాఫీ చేస్తున్న మోదీ సర్కార్ బకాయిల కోసం రైతులను పీడిస్తూ జైళ్లకు పంపుతోందని రాహుల్ అన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసిన చూపించామని ఆయన ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో అధికారం చేపట్టిన పదిరోజుల్లోనే రుణమాఫీ పథకం అమలు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రైతులకు ప్రత్యేకంగా బడ్జెట్ తీసుకొస్తామని వెల్లడించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పించి ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మోదీ పెద్ద అబద్ధాల కోరని, అచ్చేదిన్ నినాదంతో జనాన్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్లయినా అచ్చేదిన్ కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
చిత్రం... ఆగ్రాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభ సందర్భంగా
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక ముచ్చట