జాతీయ వార్తలు

గోద్రా ‘శాంతి’ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోద్రా, ఏప్రిల్ 21: గుజరాత్ రాష్ట్ర చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన గోద్రా సంఘటనను తలచుకోవడానికి ఆ ప్రాంత ప్రజలు విముఖత చూపుతున్నారు. చిన్న పట్టణమైన గోద్రాలో 17ఏళ్ల క్రితం జరిగిన రైలు దగ్ధం, అనంతరం జరిగిన అల్లర్లు వంటి హేయమైన దుర్ఘటనల ఎన్నో వందల మంది జీవితాల్లో చిచ్చును రగిల్చాయి. ఈ సంఘటనలో బాధితులైన ముస్లింలు గత చేదు సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. శాంతి, అభివృద్ధి మంత్రమే ఈ స్థితికి కారణమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. గోద్రా అల్లర్లు జరిగిన 2002 తర్వాత ఇక్కడ పూర్తి ప్రశాంత వాతావరణం ఉందని ఇక్కడ నివసిస్తున్న వ్యాపారులు, చిన్నచిన్న దుకాణదారులు చెప్పారు. బీజేపీ పాలనలో ఇంతకాలం తాము ప్రశాంతంగా జీవించామని వారు తెలిపారు. ఆ ఘోర దుర్ఘటన తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులను తాము ఎదుర్కోలేదని, అందుకే తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని పలువురు తెలిపారు. బీజేపీ ఉన్నంత కాలం ఇక్కడ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం రాదని తాను నమ్ముతున్నట్టు హాజీ ఫరూక్ అనే ప్రముఖ వ్యాపారి తెలిపారు. 2005 నుంచి ఇక్కడి పోలాన్ బజార్‌లోని జాతీయ పతాకాన్ని స్థానిక ముస్లింలు రోజూ ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. శాంతి, అభివృద్ధి సమాజానికి చాలా అవసరమని, ఈ రెండూ కలిసే ఉండాలని, ఇక్కడ శాంతియుత పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తమ వ్యాపారాలు కూడా అభివృద్ధి పథంలో ఉన్నాయని, ఇదే పరిస్థితి కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, ఈ విషయంలో హిందూ, ముస్లింలందరిదీ ఒకే అభిప్రాయమని పలువురు తెలిపారు. తనకింద ఉండే ఉద్యోగులు, తన సంస్థకు వచ్చే వినియోగదారులు ఎక్కువ మంది హిందువులేనని, వారి సహకారంతోనే తన వ్యాపారం అభివృద్ధి చెందిందని హాజీ అనే ముస్లిం వ్యాపారి తెలిపారు.
పంచమహల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గోద్రాలో ఎన్నికలు గుజరాత్‌లోని 25 ఇతర లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 1.90 లక్షల జనాభా ఉన్న గోద్రాలో 40 శాతం ముస్లింలు ఉన్నారు. ఇక పంచమహల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 17 లక్షల ఓటర్లు ఉండగా, అందులో 2.18 లక్షల మంది ముస్లింలు. అయోధ్య నుంచి వస్తున్న శబరిమతి ఎక్స్‌ప్రెస్ ఎస్ 6 బోగీని 2002లో కొందరు దుండలు దహనం చేసిన ఘోర సంఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన తర్వాత జరిగిన అల్లర్లలో వెయ్యిమంది వరకు ఊచకోతకు గురయ్యారు. వీరిలో ముస్లింలే అధికులు. అయితే ఆ ఘోర సంఘటనల గురించి తలచుకోవడానికి ఇక్కడి ప్రజలెవ్వరూ ఇష్టపడరు. మాకు ఆ సంఘటనలతో ఎలాంటి సంబంధం లేనప్పుడు దాని గురించి ఎందుకు గుర్తు చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొంతమందికి ఆ సంఘటన గురించి తెలియనే తెలియదు కూడా. ఇక్కడి సిగ్నల్ బజార్, సాత్పూల్ బజార్, పోలాన్ బజార్‌కు చెందిన పలువురు ముస్లింలు సైతం తమ ప్రాంతంలో శాంతిభద్రతలు ఇలాగే కొనసాగాలంటే తిరిగి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. స్థానిక బీజేపీ ఎంపీ ప్రభాత్ సిన్హ్ చౌహాన్ నిత్యం తమకు అందుబాటులోనే ఉంటారని, తాము ఏ కార్యక్రమానికి పిలిచినా హాజరవుతుంటారని వారు చెప్పారు. తమ కనీస సమస్యల పరిష్కారానికి తమ నేత పాటుపడాలని తాము కోరుకుంటున్నామని, తమకు పెద్దపెద్ద డిమాండ్లేవీ లేవని, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, వైద్యం లాంటి సదుపాయాలు అందాలనే తాము ఎప్పుడూ నేతలను అడుగుతుంటామని వారు తెలిపారు. అయితే ఈసారి బీజేపీ ప్రభాత్ సిన్హ్ చౌహాన్‌కు కాకుండా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రత్నసిన్హ్ చౌహాన్‌ను ఇక్కడ నిలబెట్టింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ వీకే కాంత్ పోటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని, కాని బీజేపీ ఇక్కడ చేసిందేమిటి? ప్రజలు ఒరగబెట్టిందేమిటి? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీంతో పలువురు ముస్లింలు ఈసారి ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
‘బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. నాలాంటి నిరుద్యోగులు ఎంతోమందికి ఉద్యోగం కాని, ఉపాధి కాని దొరకలేదు. అలాంటప్పుడు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి’ అని సాత్పూర్‌బజార్‌కు చెందిన సల్మాన్ అనే యువకుడు ప్రశ్నించడం అక్కడ మారిన ఓటర్ల వైఖరిని ప్రతిబింబిస్తోంది.