జాతీయ వార్తలు

అటు ఐక్యతా విగ్రహం.. ఇటు గిరిజన ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవాడియా/బోడెలి (గుజరాత్), ఏప్రిల్ 22: వారికి నాలుగు లైన్ల రోడ్డు ఉంది.. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం ఉంది.. హెలీపాడ్ సౌకర్యం సైతం ఉంది.. ఇవన్నీ చూస్తే ఆ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధి సాధించిందని ఎవరైనా చెబుతారు.. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. రెండో వైపు చూస్తే నిత్యం నీటికొరత, నిరుద్యోగం, వైద్యసౌకర్యాల లేమి, జీవనం కోసం ప్రతి రోజు పోరాడాల్సిన దుస్థితి.. ఇది 182 మీటర్ల ఎత్తున పటేల్ విగ్రహం నిర్మించిన నర్మదాడామ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల పరిస్థితి. చౌటా ఉదయ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ గిరిజన ప్రాంతాలు ఇంకా ప్రాథమిక సౌకర్యాల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితిలోనే ఉన్నాయి. వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం పట్ల వీరు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితి మంగళవారం ఇక్కడ జరిగే ఎన్నికలో కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. షెడ్యూల్డు ట్రైబ్‌లకు రిజర్వ్ చేసిన చోటా ఉదయ్‌పూర్‌లో ఓటర్ల సంఖ్య 16 లక్షలు. ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీకి అధిష్టానం సీటివ్వకుండా స్థానిక నేత గీత రథ్వాని రంగంలోకి దింపింది. ఆమెపై కాంగ్రెస్ తరఫున రంజిన్ రథ్వా రంగంలో ఉన్నారు.
భారతదేశ మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 182 మీటర్ల ఈ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తున్నా స్థానిక గిరిజనులను మాత్రం అసంతృప్తికి గురిచేస్తోంది. ఎందుకంటే విగ్రహం నిర్మాణం కోసం తమ భూములను ప్రభుత్వం లాక్కొందని ఇక్కడి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామని వాగ్దానం ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం తమకు మొండిచేయి చూపిందని, ఎవరో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ ఉద్యోగాలివ్వలేదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కొందరికి నెలకు ఏడు వేల నుంచి తొమ్మిది వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు మాత్రం వచ్చాయని వారు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31న ఐక్యతా విగ్రహాన్ని ప్రారంభించారని, ఆ సమయంలో నర్మదా జిల్లా పరిధిలోని కవాడియా గ్రామంలో హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేశారని స్థానికులు తెలిపారు. తమ గ్రామానికి హెలీప్యాడ్ ఉందని గొప్పగా చెప్పుకోవడానికేనని, అది వీఐపీలకు తప్ప తమకు ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూర్చలేదని కవాడియా గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి వల్ల తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని రంజిత్ తడ్వీ అనే గ్రామస్తుడు తెలిపాడు. ఇక్కడ సరైన ఉద్యోగం, ఉపాధి లేక చాలామంది యువకులు తరలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కెవాడియా గ్రామం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.. కాని మా గ్రామానికి కనీసం రోడ్లు కాని, తాగడానికి నీరు కాని లేని దుస్థితి నెలకొంది’ అని ఆయన వాపోయాడు. ఐక్యతా విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయరని సమీపంలోని గోరా గ్రామానికి చెందిన రామకృష్ణ తడ్వీ అన్నారు. ఇక్కడ సుమారు ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారని, ఈ విగ్రహం ప్రాజెక్టు వల్ల వీరంతా పూర్తి అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నాడు. చెంతనే నర్మదా డ్యామ్ ఉన్నా తమకు తాగడానికి కనీసం గుక్కెడు నీళ్లు సైతం లభించడం లేదని ఆయన వాపోయాడు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు నిరసనగా జరిపిన ఆందోళనకు నేతృత్వం వహించిన డాక్టర్ ప్రఫుల్ వాసవ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి చెందిన వారే కాక ఇతర ప్రాంత గిరిజనులు సైతం ఈసారి బీజేపీ పట్ల పూర్తి ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు.