జాతీయ వార్తలు

ఓటర్ ఐడీ.. ఐఈడీకన్నా శక్తివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: ఓటరు ఐడెంటిటి కార్డు ఉగ్రవాదులు ఉపయోగించే పేలుడు పదార్థం ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) కన్నా ఎంతో శక్తివంతమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో మిగిలిన అన్ని దశల పోలింగ్‌ల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ అహ్మదాబాద్‌లోని రానిప్ ప్రాంతంలో గల నిషాన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి మంగళవారం ఉదయం ఒక ఓపెన్ జీపులో వచ్చి, ప్రజాస్వామికంగా తనకు సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి అహ్మదాబాద్ నగరం వస్తుంది. నిషాన్ హైస్కూల్ వెలుపల మోదీకి స్వాగతం పలికిన అమిత్ షా, తరువాత ఆయనతో కలిసి పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. జీపులో పోలింగ్ కేంద్రానికి వస్తున్న సమయంలో పోలింగ్ కేంద్రం వెలుపల రోడ్డుకు ఇరువైపుల ఉన్న వేలాది మంది ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి కొంతదూరం నడిచిన మోదీ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కొంతసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు ఉగ్రవాదుల చేతిలో ఆయుధంగా ఐఈడీ ఉండగా, మరోవైపు ప్రజాస్వామ్య ఆయుధంగా, శక్తిగా ఓటర్ల చేతిలో ఓటరు ఐడీ కార్డు ఉంది’ అని ఆయన అన్నారు. ‘ఓటరు ఐడీ కార్డు ఉగ్రవాదుల ఐఈడీ కన్నా ఎంతో ఎక్కువ శక్తివంతమయిందని నేను విశ్వసిస్తున్నాను. మనము ఓటరు ఐడీ కార్డు ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో బయటకు రావాలి’ అని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. తన స్వంత రాష్టమ్రయిన గుజరాత్‌లో ‘పెద్ద ప్రజాస్వామ్య పండుగ’లో పాల్గొంటున్నందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.
‘దేశంలో ఈ రోజు మూడో దశ పోలింగ్ జరుగుతోంది. నా స్వంత రాష్టమ్రయిన గుజరాత్‌లో ఓటు వేయడం ద్వారా నేను నా విధిని నిర్వర్తించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగలో క్రియాశీలకంగా పాల్గొనడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ‘ఎవరయినా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన తరువాత పునీతులు అవుతారు. నేను ఓటు వేయడం ద్వారా అదే రకంగా పునీతుడిని అయినట్టు భావిస్తున్నాను’ అని మోదీ మీడియా ప్రతినిధులతో అన్నారు.
చిత్రాలు.. అహ్మదాబాద్‌లోని ఓ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మనవరాలిని ఎత్తుకుని విజయ చిహ్నాన్ని చూపుతున్న దృశ్యం.
*అనంతరం తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆమె చేతి మిఠాయ తింటున్న ప్రధాని.