జాతీయ వార్తలు

దేశభద్రత సమస్యే కాదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్భాంగ (బీహార్), ఏప్రిల్ 25: దేశభద్రత అన్నది సమస్యే కాదన్నట్టు విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం తరచూ దేశభద్రత గురించి ప్రస్తావించడం వారికి నచ్చడం లేదని, అందుకే వారు ఆ అంశంపై తరచూ విమర్శలు చేస్తున్నారని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకళించి వేస్తేనే దేశంలో పేదరికాన్ని పూర్తిగా తరిమివేయవచ్చునని ఆయన అన్నారు. బీహార్‌లోని దర్భాంగలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ‘మోదీ అస్తమానం ఉగ్రవాదం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది అసలు విషయమే కాదు అని వారు (విపక్షాలు) అంటున్నారు.. అయితే దేశభద్రత, ఉగ్రవాదం అన్నవి ప్రధాన సమస్యలన్న విషయం ప్రజలకు అర్థమైంది కాని ఆ స్వార్థ నేతలకు తెలియడం లేదు’ అని విమర్శించారు. ఈ వారంలో శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 350 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదులను తయారు చేసే కార్కానాలు మన పొరుగున ఉన్న దేశాల్లోనే ఉన్నాయని, ఇంత జరుగుతున్నా విపక్షాలకు ఉగ్రవాదం అన్నది పెద్ద సమస్యే కాదని తేలికచేసి మాట్లాడుతున్నారన్నారు. దేశభద్రత అన్నది చాలా ముఖ్యమైన విషయం. అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి నిధులు వెచ్చించడం వల్ల దేశంలో శాంతియుత పరిస్థితులు మెరుగై, తద్వారా పేదల జీవన స్థితిగతులు సైతం బాగుపడతాయని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము చేసిన వాగ్దానాల మేరకు రైతులకు రుణమాఫీ చేశామని, తాము అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాల్లో సైతం దానిని అమలు చేస్తామని ఇటీవల అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. అయితే ఈ రుణమాఫీ వల్ల దేశంలోని ఏ ఒక్క పేద దళితుడు, ఆదివాసి లబ్ధి పొందలేదన్న విషయం వారు గ్రహించాలని, ఆ పథకం ఫలాలు కేవలం వారి మిత్రులు కొందరికి మాత్రమే చేరుతున్నాయని మోదీ ఆరోపించారు. ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాల వల్ల మనదేశం భారీ మూల్యాన్ని చెల్లించిందని, గతంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గరుద్వారాల వల్ల ఇంత భారీ యెత్తున పోలీసుల మోహరింపు, తనిఖీలు ఉండేవి కావని, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో అంత భద్రత ఉండేది కాదని అన్నారు. కాని గత 40 సంవత్సరాలుగా భద్రతా వ్యవస్థ పటిష్టంతో పాటు పేదల కోసం ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణంపై దృష్టి సారించి నిధుల కేటాయింపు జరిగిందన్నారు. గతంలో సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు దిగువస్థాయి భద్రతా దళ సిబ్బంది రోజుల తరబడి కనీసం కంటిమీద కునుకు సైతం లేకుండా విధుల్లో నిమగ్నమై ఉండి దేశాన్ని రక్షించేవారని, విధి నిర్వహణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉద్యోగాలు కోల్పోయేవారని అన్నారు. అయితే తాము వచ్చాక పరిస్థితులు మెరుగయ్యాయని, రక్షణ రంగానికి మరిన్ని నిధులు వెచ్చించి వారికి నూతన ఆయుధాలను సమకూర్చామని తెలిపారు. అలా ఉగ్రవాదన్ని పెకళించడానికి తాము పటిష్ట చర్యలు తీసుకుంటుంటే ఈ మహాకూటమి గ్యాంగ్‌కు దేశభద్రత అన్నది పెద్ద అంశంగానే కన్పించడం లేదని మోదీ ధ్వజమెత్తారు. ఈ నూతన భారతదేశంలో తాము ఉగ్రవాదులను తరిమికొడతామని, వారు ఎక్కడ దాగి ఉన్నా బయటకు రప్పిస్తామని, వారి నెట్ వర్క్‌ను ధ్వంసం చేస్తామని ఆయన అన్నారు. ఈ చౌకీదార్ దేశంలో ఉన్నంత వరకు ఉగ్రవాదికి గాని, ఉగ్రవాద చర్యలకు గాని తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

విపక్షాల ఈవీఎంల రాగం
దేశంలో మూడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిసాయని, ఇప్పటివరకు బాలాకోట్‌లో సైనికులు జరిపిన మెరుపుదాడులపై ఆధారాలు చూపమని డిమాండ్ చేసిన విపక్షాలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాయని, ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని కొత్తగా విమర్శలు చేస్తున్నాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఈవీఎంల ద్వారా పలు అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు లేనిపోని విమర్శలకు దిగుతున్నాయన్నారు. ఓటమి భయంతోనే వారు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మరోసారి ఎన్నికల మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశం అంతా 2009 నాటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని 2004 నాటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని, అయితే దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పిస్తామని ఎర్రకోట సాక్షిగా వాగ్దానం చేయడమే కాక దానిని అమలుచేసి చూపించామని అన్నారు. దేశంలోని అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవిపై కొన్ని ప్రాంతీయ పార్టీలు కనే్నయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ 40, 20 సీట్లలో పోటీ చేసేవారు ఆఖరికి కర్నాటకలో కేవలం 8 సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ సైతం ఈ పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతోందని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు అధికారమిస్తే వారు ఉగ్రవాదంపై పోరాటం చేస్తారని నమ్మగలమా? అని ఆయన ప్రశ్నించారు. చౌకీదారు ఒకరే ప్రజలకు అవసరమైనవి కల్పించగలరని, అందుకే మీరు బీజేపీకి కాని, దాని మిత్రపక్షాలకు గాని ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.
చిత్రం...బిహార్‌లోని దర్భాంగలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో వేదికపై ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి నవ్వులు చిందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ